11, మార్చి 2025, మంగళవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము తృతీయాశ్వాసము*


*313 వ రోజు*


*యుద్ధారంభం*


ద్రోణుడు రణరంగమున ప్రవేశించి శంఖం పూరించి సైంధవునితో ఇలా అన్నాడు. నీవు, భూరిశ్రవసుడు, కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ, వృషసేనుడు, కృపాచార్యుడు అందరూ కలసి ఉండండి. మన బలములో పదునాలుగు వేల ఏనుగులు, అరవై వేల రథములు, ఒక లక్ష గుర్రములు, పది లక్షల పదాతి దళము మీ వెంట ఉంటుంది. నేను పన్ను యుద్ధ వ్యూహముకు మీరంతా మూడు యోజనముల దూరములో ఉండండి. అప్పుడు పాండవులు మీ వంక చూడ లేరు. ఆ తరువాత ద్రోణుడు పన్నెండు యోజనముల పొడవు అయిదు యోజనముల వెడల్పు కలిగిన శకట వ్యూహమును రచించాడు. ఆ శకట వ్యూహముకు పడమటగా ఉన్న అర్ధభాగం లోపల పద్మవ్యూహం పన్నాడు. ఆ పద్మవ్యూహం మధ్యభాగం నుండి శకటవ్యూహం మొదలు వరకు ఒక సూచీవ్యూహము నిర్మించాడు. ఆ సూచీవ్యూహ ముఖభాగమున కృతవర్మ, అతడి వెనుక కాంభోజరాజు, వారి వెనుక ఒక లక్షమంది యోధులు. సుయోధనుడు వారందరికి మూల స్థానమున సైంధవుని నిలిపాడు. దుర్మర్షణుడు అనే వాడు ఈ వ్యూహములో నేను నిలుచుట ఏమిటి అని నేను ఒక్కడినే అర్జునుడిని చంపగలను అని వ్యూహముకు దూరంగా తన సేనలతో నిలిచాడు. ద్రోణుడు పన్నిన వ్యూహముకు పదిహేను వందల ధనస్సుల దూరంలో దుశ్శాసనుడు, వికర్ణుడు సైంధవుని రక్షించుటకు సిద్ధంగా ఉన్నారు. ద్రోణా చార్యుడు శకట వ్యూహముకు ముందు భాగంలో ఉన్నాడు. ఈ వ్యూహము చూసి సుయోధనుడు సంతోషించాడు.


*అర్జునుడి యుద్ధరంగ ప్రవేశం*


పాండవ సైన్యాధ్యక్షుడు ధృష్టద్యుమ్నుడు వ్యూహానికి ప్రతి వ్యూహం పన్నాడు. కపిధ్వజము రెపరెపలాడగా అర్జునుడు యుద్ధరంగ ప్రవేశం చేసాడు. ఇరు పక్షాలలో యుద్ధభేరీలు మ్రోగాయి. ముందుగా దుర్మర్షణుడు విజృంభించాడు. అది చూసి అర్జునుడు " కృష్ణా! మన రధము దుర్మషణుడి వైపు పోనిమ్ము. ముందు వాడిని చంపి ఈ రోజు యుద్ధంలో వాడిని మొదటి కబళంగా భక్షిస్తాను " అన్నాడు. కృష్ణుడు రథమును దుర్మర్షణుడి వైపు పోనివ్వగానే దుర్మర్షణుడి గజసైన్యం అర్జునుడు ఒంటరివాడని తలచి చుట్టుముట్టి శరములు గుప్పించారు. మరుక్షణంలో రణభూమి ఏనుగు కళేబరాలతో సైనికుల తలలతో నిండి పోయింది. కౌరవులు కూడా అర్జునుడి మీద తమ శరములు గుప్పించారు. అర్జునుడు వాటిని మధ్యలోనే త్రుంచి వేస్తూనే దుర్మర్షణుడి గజబలమును, అశ్విక బలమును, రథికులను ముక్కలు ముక్కలు చేసాడు. దుర్మర్షణుడి ధనస్సులు, రథములు, కేతనములు విరిగాయి. అర్జునుడి ధాటికి ఆగలేక దుర్మర్షణుడు పారి పోయాడు. అతడి వెంట అతడి సేనలు పారి పోయాయి.


*దుశ్శాసనుడితో యుద్ధం*-


ఇంతలో దుశ్శాసనుడు అర్జునుడిని ఎదుర్కొన్నాడు. దుశ్శాసనుడిని చూడగానే అర్జునుడు ఆగ్రహోదగ్రుడై గాండీవం సంధించి ధారాపాతగా అమ్ములు గుప్పించాడు. నిలబడిన ఏనుగులు నిలబడినట్లే ఉండగా వాటి మీద ఉన్న సైనికుల తలలు మాత్రం తాటి పండ్ల మాదిరి ఎగిరి పడుతున్నాయి. సైనికుల కాళ్ళు చేతులు తెగి నేల మీద దొర్లుతున్నాయి. తన సైన్యంతో పారిపోతున్న దుశ్శాసనుడిని చూసి అర్జునుడు " దుశ్శాసనా ! ఆగు ఎక్కడికి పారిపోతావు పారిపోతే చావు తప్పదు. అనాడు కురు సభలోమాటాడిన దానికి ఫలితం అనుభవించవా ! " అంటూ దుశ్శాసనుడిపై బాణములు వేసాడు. దుశ్శాసనుడు తిరిగి చూడకుండా ద్రోణుడి వద్దకు పోయాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: