పితృ ఋణం అంటే ఏమిటి?
మాతా చ పితా చ పితరౌ..అని.
జీవుడు ఏ పని చేయాలన్నా ముందు దేహం ఉండాలి. ఆ దేహం తల్లిదండ్రులు అనుగ్రహించినందువల్ల వాళ్ళకు జీవితాంతం ఋణపడ్తాము.
ఇది కాక, ఊహ తెలియని పసి ప్రాయం నుండి శరీర రక్షణ, పోషణ చేసి , చదువు చెప్పించి, ప్రయోజకుణ్ణి చేస్తూన్నందువల్ల ఈ ఋణ భారం ఇంకా పెరుగుతూన్నది. ఇంకా తాను కష్టపడి దాచిపెట్టిన సంపదలకు వారసుణ్ణి చేస్తూన్నందువల్ల ఈ ఋణం త్రిగుణితం ఔతున్నది.
ఈ ఋణభారం తొలగించుకోక విముక్తి లేదు. ఇంత ఉపకారం చేస్తూన్న పితరులకు తన జీవితాంతం , సేవ చేయడం, విధేయుడై ఉండడం, వాళ్ళ మాటను ఆజ్ఞగా భావించి నెరవేర్చడం ఋణ విముక్తికి ప్రధమ సోపానం.
పితరులు అంటే తన కన్న తల్లిదండ్రులే కాదు. వాళ్ల పూర్వీకులున్నూ. వాళ్లు పితృ లోకంలో ఉండి , తమ వంశ శ్రేయస్సూ, అభివృద్ధీ కాంక్షిస్తూ ఉంటారు. వాళ్లకు సద్గతి కలిగే సత్కార్యాలు, దైవ కార్యాలు చేయడం మరొక బాధ్యత.
తిలోదకాలు ఇచ్చే వంశాంకురం లేకుండా పోతున్నదే ! అని విలపించే పితరుల వృత్తాంతం జరత్కారుడనే బ్రహ్మచారి కథలో కనిపిస్తుంది. వంశాంకురం లేకపోబట్టే ఊర్ధ్వ లోకాల నుంచి పతనమౌతున్న పితరుల కథ అది. భారత ఆది పర్వంలో వస్తుంది .
గృహస్థ ధర్మం స్వీకరించి సత్పుత్రులను పొందడం అత్యంత ముఖ్యమైన బాధ్యత —అనీ, ప్రజా తంతుం మా వ్యవచ్చేత్సీః అనీ అంటుంది వేదం. ఇక్కడ జన్మ స్వీకరించగోరే పితరుల ఆశ నెరవేర్చడంలో భాగం ఇది.
*పుత్రేణ లోకాన్ జయతి*— అని చెప్పారు గాబట్టి తన పితరులకు ఉన్నతి కలిగించే పనులే చేయాలి. పాండురాజుకు ఉత్తమ లోకాలు కలిగించడం పుత్రుడుగా తన ధర్మం అని ధర్మరాజు భావించినందువల్లనే రాజసూయ యాగం చేశాడు. దాని కారణంగా ఘోర యుద్ధం 13 సంవత్సరాల తర్వాత జరుగుతుంది— అని హెచ్చరించి , నారదుడు చెప్పి మరీ చేయించాడు ఆ యాగం.
రామాయణం పితృ ఋణ విమోచన కోసం ఆరంభమైనదే . ఇదొక అనిందంపూర్వ కార్యం. ఉన్న పితరుల మాటే పట్టించుకోని లోకం లో ఎపుడో తన పుటకకు ముందు మొగమాటానికి ఒకతెకు ఇచ్చిన మాటను తర్వాత ఎప్పుడో నేలమీద బడిన నిసుగు నెరవేర్చడానికి బద్ధకంకణుడు కావడం , ఏ ఉపదేశాలూ, ఆక్రందనలూ ఆ నిష్ఠ ముందు బలాదూర్ కావడం ఇక్కడే చూస్తాం.
తన తండ్రి మాట సత్యమై ఆయనకు సత్య లోక శాశ్వత నివాస స్థితి కలగడానికి పుత్రుడుగా ఆ దైవ స్వరూపుడు అంత కర్తవ్య నిష్ఠ చూపాడు. ఇదీ జీవితం అంటే —అని మానవ లోకానికి ఆదర్శమై నిలిచాడు. తండ్రి మోహంతో వెళ్లవద్దు. నన్ను బంధించి పదవి చేపట్టు అని మాటగా చెప్పినా, తల్లి నా మాట గూడా వినవలె, పోవద్దు ఆగు —అని వాత్సల్యంతో ముందు అడ్డుపడ్డా , ధర్మం! రామో విగ్రహవాన్ ధర్మః! —అని మనకు ఎరుక అయ్యేట్టు నడిచాడు.
తండ్రి తనతో అనే మాట కాదు . ఒకరికి చేసిన వాగ్దానం! అది నెరవేర్చే బాధ్యత తాను.. వద్దు అంటూన్నా నెత్తికెత్తుకొని, నెరవేర్చి ,ఇదీ పుత్రలక్షణం అని విడమరచి ఎరుక పరచాడు.
" జనకున్ స్వామిత్వము తనయోద్దేశమున ఉనికి" ని చాటిచెప్పి , తండ్రి హృదయం ఎరిగి ఏ చర్చా చేయకుండా శాశ్వత బ్రహ్మచర్యం లో నిలిచి లోకాదర్శమైన భీష్ముడు మనకందరికీ పితామహ స్థానంలో నిల్చి నేటికీ తిలోదకాలు అందుకోవడం మరో ఎత్తు. ఆయనకు సంతు లేకపోతే ఏమి? ఈ కులము వివర్ధింపగ నాక భిమతము అంటూ తాను బ్రహ్మచర్య నిష్ఠలో ఉండీ, కురువంశ గౌరవం విస్తృతీ చేయడానికే జీవితం అంకితం చేసిన మన పితామహుడు ఆయన.
తీర్థ యాత్రలు చేసి పితరులు చేసిన/ చేయవలసి వచ్చి చేసిన అహిత కర్మలకు ప్రక్షాళన చేసి ఉన్నతి కలిగించడం ఇంకా గొప్ప విషయం. వాళ్లు ఎలాంటి వాళ్లయినా మనకు పితరులు. వాళ్ల ఉన్నతి తర్వాతే మనకు. నీ (వంటి యోగ్యుడి) పుట్టుకకూ వాళ్లే గదా కారణం.! పితృ దేవతల అనుగ్రహం లేక ఇక్కడ జన్మే దొరకదే! శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం! ఎంత అమూల్య వస్తువిచ్చారు వాళ్లు —అనే కృతజ్ఞత ఉండాలి.
భగీరథుడు ఎంత పని చేశాడు! . ఊహకే అందదు ఆ దీక్ష. కొన్ని తరాలుగా శాప గ్రస్తులై భస్మీపటలమైన ఎందరెందరు తాతలను ఉట్టే ఎక్కలేని పతితులను ఒక్కసారిగా—- పైకి , పై పైకి ..ఉత్ ధరించి ,, ఆ ఆనందంలో.. ఆ పరమానందంలో నిశ్చలుడై నిలిచి,—- మనిషి ప్రయత్నం అంటే ఇట్లా ఉండాలి !అని నిరూపిస్తూ వియద్గంగను రసాతలానికి తెచ్చి సొంత పితరులే కాదు,. అందరి పితరులనూ ఉద్ధరించే గంగమ్మను అనుగ్రహించిన ఆ భగీరథ స్వామి కంటే పితృభక్తులెవరు?
కాశ్యాంతు మరణాత్ ముక్తిః.
పితరులను బుజాల మీద మోసి, తనకు అదే పని అని అనుకొని అన్ని తీర్థాలూ తిప్పిన ఆ శ్రావణుణ్ణి ఈ నాటికీ మరవం.
గయా శ్రాద్ధం చేసి విష్ణు పదం కలిగించడమూ పుత్రుల విధి. ఏ పుణ్య కర్మ చేసినా, వాళ్ల పేర చేయడమూ పితృ ఋణ విదూరులయ్యే ఉపాయం.
ప్రతి నిత్యమూ మాతృభ్యోనమః ,పితృభ్యో నమః , గురుభ్యో నమః —అంటూ ఋణం జ్ఞప్తిలో ఉంచుకొని విముక్తి మార్గం అన్వేషించుకోవడం వల్లనే జన్మ సార్ధకం అవుతుంది.
*_🌻శుభమస్తు🌻
ఇట్లు
మీ
అబ్బరాజు శ్రీనివాస మూర్తి
🕉️
🙏 సర్వే జనాః సుఖినోభవంతు
🙏 లోకాస్సమస్తా సుఖినోభవంతు
🙏సమస్త లోకా సుఖినోభవంతు 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి