18-40-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అ || సత్త్వాది త్రిగుణములతో గూడియుండని వస్తువు ఈ ముల్లోకములందును ఏదియులేదని వచించుచున్నారు -
న తదస్తి పృథివ్యాం వా
దివి దేవేషు వా పునః |
సత్త్వం ప్రకృతిజైర్ముక్తం యదేభిస్స్యాత్త్రిభిర్గుణైః ||
తా:- ప్రకృతి (మాయ) నుండి పుట్టినవగు ఈ మూడుగుణములతో గూడియుండని వస్తు వీభూలోకమునగాని, స్వర్గమందుగాని, దేవతలయందుగాని ఎచటనులేదు.
వ్యాఖ్య:- ముల్లోకములందలి ప్రతివస్తువున్ను సత్త్వరజస్తమస్సులను ఈ మూడు గుణములతో గూడియుండుననియు, ఆ గుణములతో గూడియుండని వస్తువు (జీవన్ముక్తుడు తప్ప) ఏదియు ఈ ప్రపంచమున లేదనియు చెప్పుచున్నారు. జీవన్ముక్తులగు మహనీయులు తప్ప తక్కినవారందఱు ఏదియో యొక గుణముతో కాని, గుణములతో గాని గూడియున్నవారే. స్వర్గలోకములో నున్నవారున్ను త్రిగుణములతో గూడినవారేయనియు, వానినుండి విడుదలపొందినవారు కాదనియు ఈ శ్లోకమున భగవానుడు చెప్పిరి. కాబట్టి వారున్ను బంధముననున్నవారే. వారున్ను ఎప్పటికైనను జ్ఞానాదులను బడసి గుణరహితులు, ముక్తులు కావలసియున్నారు.
“ప్రకృతిజైః” - అని చెప్పినందువలన ఈ మూడు గుణములకు ఉత్పత్తిస్థానము ప్రకృతి, లేక మాయ (అజ్ఞానము) అని స్పష్టమగుచున్నది. ఈ మూడు గుణములలో ఏది యున్నను వారింకను ప్రకృతితో గూడియున్నవారేయని తాత్పర్యము. కావున రజస్తమస్సులను ప్రయత్నాతిశయముచేతను, అభ్యాసప్రాబల్యముచేతను దాటి సత్త్వగుణముయొద్దకు వచ్చి, క్రమముగ గుణాతీత ఆత్మస్థితిని బడయవలెను. అదియే మోక్షము.
ప్ర:- సత్త్వాది త్రిగుణములు దేనినుండి పుట్టినవి?
ఉ :- ప్రకృతినుండి (మాయనుండి, అజ్ఞానమునుండి).
ప్ర:- ఈ గుణములతో గూడని వస్తువేదైన ఈ ప్రపంచమున గలదా?
ఉ:- లేదు (జీవన్ముక్తుడు తప్ప).
ప్ర:- ఇట్టిస్థితి ఈ లోకమందేనా? లేక తదితర లోకములందుగూడనా?
ఉ:- స్వర్గాది ఇతర లోకములందును, దేవతలందును ఇదియే పరిస్థితి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి