*తిరుమల సర్వస్వం -294*
చరిత్రపుటల్లో శ్రీనివాసుడు-9
ఆర్కాటు నవాబులు
➖➖➖➖➖➖
తరువాత మొఘలు చక్రవర్తి ఔరంగజేబు దక్షిణభారతం వైపు దృష్టి సారించడంతో - తిరుమల క్షేత్రం పై ఆధిపత్యం ఆర్కాటు నవాబులకు సంక్రమించింది. వారు హుండీ ఆదాయాన్ని హస్తగతం చేసుకున్నారు కానీ; ఆలయ పరిపాలన వ్యవహారాలలో జోక్యం చేసుకోలేదు. ఆగమ కైంకర్యాలన్నీ యథావిధిగా కొనసాగాయి.
1713 వ సం. లో ఆర్కాటు నవాబుగా సింహాసనాన్ని అధిష్టించిన సాదతుల్లాఖాన్ కు తోడరుమల్లు అనే హైందవ మంత్రి - సేనాధిపతి, ఆప్తుడు కుడిభుజంగా వ్యవహరించేవాడు. ఆయన శ్రీవారికి పరమభక్తుడు కూడా! తిరుమల క్షేత్రాన్ని ముస్లిం మతఛాందస వాదుల దండయాత్రల నుంచి రక్షించడంలో ఆయన సలిపిన విశేష కృషికి గుర్తుగా - ఆలయం యొక్క సంపంగి ప్రాకారంలో ప్రతిష్ఠించబడిన మాతా, సతీ సమేతుడైన తోడరుమల్లు కాంశ్యవిగ్రహాన్ని నేడు కూడా దర్శించుకోవచ్చు.
అమల్దారీ వ్యవస్థ
➖➖➖➖➖➖➖
తిరుమల క్షేత్రాన్ని ఓ ముఖ్య ఆదాయవనరుగా పరిగణించిన ఆర్కాటు నవాబులు అమల్దారీ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. క్షేత్రం మొత్తం ఆర్థిక వ్యవహారాల బాధ్యతను అమల్దారు అనే ఒక శ్రీవైష్ణవ బ్రాహ్మణునికి వార్షిక ప్రాతిపదికన గుత్తకు ఇచ్చేవారు. కొంతకాలం ఈ నిబంధన సడలించి కేవలం హైందవుడైతే చాలనే వెసులుబాటు కల్పించారు. దాదాపుగా ఈనాడు ఆలయ పేష్కారు, కార్యనిర్వహణాధికారి నిర్వహించే విధులన్నీ అమల్దారు నిర్వర్తించే వాడు. అన్ని మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం ఆ అమల్దారు హక్కుభుక్తం. అలాగే, క్షేత్ర నిర్వహణకు - నిత్యకైంకర్యాలు, ప్రసాదాల తయారీతో సహా - అయ్యే ఖర్చంతా అమల్దారే భరించాలి. లాభనష్టాలతో సంబంధం లేకుండా, అమల్దారు ఆర్కాటు నవాబులకు ముందుగా నిర్ణయించ బడిన వార్షిక రుసుము చెల్లించాలి. ప్రతిగా - నవాబులు ఆలయానికి, అమల్దారుకి, భక్తులకు రక్షణ కల్పించేవారు. ఈ ఏర్పాటు ద్వారా నవాబులకు ఆలయ ఆర్థిక నిర్వహణా భారం నుంచి ఉపశమనం లభించడమే కాకుండా, స్థిరాదాయం ఒనగూడేది. ఆలయ నిర్వహణ హైందవావలంబుల ఆధ్వర్యం లోనే నడిచేది. తరువాతి కాలంలో ఆర్కాటు నవాబులు సంధి షరతుల్లో భాగంగా - అమల్దారీ వ్యవస్థ ద్వారా తమకు సంక్రమించబోయే వార్షికాదాయాన్ని ఈస్టిండియా కంపెనీకి శాశ్వతంగా బదిలీ చేయడం వల్ల, వారి హయాంలో కూడా అమల్దారీ వ్వవస్థ కొనసాగింది. ఉదాహరణకు - 1749 లో సాలీనా 47,000 పగోడాలు చెల్లించే షరతు మీద వాసుదేవాచాచారి అనే శ్రీవైష్ణవుణ్ణి అమల్దారుగా నియమించారు.
పగోడాలంటే?
➖➖➖➖➖
పగోడాలు అంటే ఆరోజుల్లో కొన్ని రాజవంశాలు ముద్రించిన, విస్తృత చలామణీ కలిగిన స్వర్ణనాణేలు. విజయనగర రాజుల కాలంలో ప్రారంభమైన పగోడాల ముద్రణ ఈస్టిండియా కంపెనీ పాలన వరకూ కొనసాగింది. సుమారు మూడు గ్రాముల బరువు కలిగిన ఒక సాధారణ స్వర్ణ పగోడా మూడు రూపాయల విలువకు సమానం. నక్షత్ర పగోడా అంటే మరి కొంచెం విలువ గలిగిన నాణెం. ఆరోజుల్లో - వివిధ రాజ్యాలు, సంస్థానాల్లో వేర్వేరు కరెన్సీలు చెలామణీ లో ఉండటం వల్ల, వేంకటేశునికి కానుకలు దాదాపు దేశవ్యాప్తంగా చెల్లుబాటులో ఉన్న పగోడాల రూపంలో కూడా విరివిగా వచ్చేవి.
ఆధారాలు లభించినంతలో - 1700 సం. లో ప్రారంభమై శతాబ్దకాలం పాటు కొనసాగిన అమల్దారీ వ్తవస్థలో భాగంగా 28 మంది అమల్దార్లు నియమించ బడ్డారు.
వేంకటెశుని సేవలో ఒడయార్లు (మైసూరు మహారాజులు)
➖➖➖➖➖➖➖
తిరుమల క్షేత్రం మైసూరు మహారాజుల ప్రత్యక్ష పాలనలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు లేవు. కానీ, ఆలయాభివృద్ధికి వారు చేసిన కృషి, వేంకటేశునికి వారు చేసిన భూరి విరాళాలు, దానాలు చిరస్మరణీయం. వాస్తవానికి, పది - పధ్నాలుగవ శతాబ్దాల మధ్య నేటి కర్నాటక లోని సువిశాల ప్రదేశాన్ని పరిపాలించిన హోయసల రాజుల ప్రతినిధులుగా అప్పటి ఒడయార్లు ఆలయానికి చేసిన సేవలతో - మైసూరు మహారాజులకు తిరుమలేశునితో అనుబంధం మొదలైంది. అత్యద్భుత శిల్పకళా కృతులతో అలరారే బేలూరు, హళేబీడు వంటి చారిత్రాత్మక కట్టడాలు హోయసల రాజులు సృష్టించినవే!
మైసూరు ఒడయార్లు స్వతంత్ర పాలన లోనికి వచ్చిన తరువాత ఆలయానికి అనేక దానాలు చేసినప్పటికీ - వారు శ్రీనివాసునికి సమర్పించుకున్న అఖండదీపం చరిత్ర ప్రసిద్ధి కెక్కింది. ఈ దీపం మైసూరు అఖండంగా ఖ్యాతి గాంచి, ఈనాటికీ శ్రీవారి గర్భాలయంలో దేదీప్యమానంగా వేలుగుతోంది. అలాగే, వారు ఆలయానికి చేసిన సేవలకు గుర్తుగా, అలిపిరి మెట్ల మార్గం లోని ఒక గోపురం మైసూరు గోపురం గా పిలువ బడుతోంది. మైసూరు మహారాజావారు బహూకరించిన మకరకంఠి అనే ఐదున్నర కిలోల మూడుపేటల హారం ఎప్పుడూ మూలమూర్తిని అలంకరించే ఉంటుంది. ఆ మహారాజుల ఔదార్యాన్ని, వేంకటేశుని పట్ల ప్రగాఢ భక్తిని తరతరాలుగా కొనసాగిస్తూ - వారి వారసుల భాగస్వామ్యం, ప్రేరణలతో ఏర్పాటైన మైసూర్ చారిటీస్ అనే ధార్మికసంస్థ 1965 వ సం. లో 32 కిలోల బరువున్న సహస్రనామహారాన్ని శ్రీవారికి సమర్పించుకుంది. అది కూడా నిత్యం శ్రీవారికి అలంకరింపబడే ఉంటుంది.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి