8, జులై 2025, మంగళవారం

అమ్మ@న్యాయమూర్తి

 అమ్మ@న్యాయమూర్తి


"మీరు విడాకులు ఎందుకు కావాలనుకుంటున్నారు?" అని ప్రశ్నించింది జడ్జి రాజ్యలక్ష్మి, కోర్టు బోనులో నిలుచున్న ఊర్మిళ అనే యువతిని.


ఊర్మిళ దగ్గర నుండి సమాధానం రాకపోవడంతో, మరో ప్రశ్నలు వరుసగా వెల్లువెత్తాయి.


"మీ భర్త మిమ్మల్ని బాధిస్తున్నారా? ప్రేమగా చూడడంలేదా? పెళ్లి అయి ఎంతకాలమైంది?"


అన్ని ప్రశ్నలకు ఒకే సమాధానం —


"మా పెళ్లయి ఎనిమిది నెలలైంది."


జడ్జి రాజ్యలక్ష్మి ఒక్కసారి ఉలిక్కిపడింది. "ఎనిమిది నెలల కాపురానికే విడాకులా?"


"మీది పెద్దలు కుదిర్చిన పెళ్లి లేదా ప్రేమ వివాహమా?"


"పెద్దలే చూశారు మేడం," అని నెమ్మదిగా చెప్పింది ఊర్మిళ.


"అయితే పెళ్లి చూపుల్లో మాట్లాడుకోలేదా? తిరగలేదా కలసి?"


"తిరిగాం మేడం... పెళ్లి ముందు కలిసి సినిమాలు, షికార్లు చేశాం. పెళ్లి ఘనంగా జరిగింది."


"అయితే సమస్య ఏమిటి?"


"హనీమూన్‌కి తీసుకెళ్లమన్నాను. ముందు ఒప్పుకున్నారు


పెళ్లయ్యాక ఎన్నో మినహాయింపులు చెప్పాడు. ప్రతిరోజూ అదే గొడవ. మాట తప్పితే నాకు కోపం ఎక్కువ.


అది నాకు తెలుసు మేడం. పుట్టినరోజుకి ప్రామిస్‌ చేసిన పార్టీ కూడ మరిచిపోయాడు. ఇవన్నీ నా మనసు కలతపరిచాయి."


"సరే, మీరు వెళ్లొచ్చు," అన్న జడ్జి రాజ్యలక్ష్మి మాటలకు


ఊర్మిళ బోను దిగింది.


తర్వాత రామారావును పిలిపించారు.


"మీ భార్య చెప్పింది నిజమేనా?"


"నిజమే మేడం," అన్నాడు రామారావు.


"అయితే ఎందుకు మాట తప్పారు?"


"మేడం, పెళ్లైన వెంటనే ఉద్యోగం పోయింది. ఈ విషయం ఆమెకు తెలుసు. నూతన ఉద్యోగంలో స్థిరపడాక హనీమూన్‌కి తీసుకెళ్లాలని అనుకున్నాను. ఇది హృదయపూర్వకమైన విషయంలో మాట తప్పింది అనిపించలేదు.


కానీ ఆమె కోపంగా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయింది


వారు కూడా విడాకులకు ప్రోత్సహించారు."


జడ్జికి ఆశ్చర్యంగా అనిపించింది. సమస్య పెద్దదేమీ కాదు. మామూలు గొడవే. కానీ ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాలకే బ్రేకప్ అనుకోవడం, విడాకులు అనుకోవడం యువతలో పెరిగిపోతోంది అన్న ఆలోచన మదిలో మెదలింది.


ఆ కేసు వాయిదా వేసిన జడ్జి, ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మంచంపై వాలింది.


అప్పుడే కాలింగ్ బెల్‌ మోగింది


తలుపు తీయగా, తలుపు దగ్గర నిలుచుంది


తన కూతురు వనజ.


"ఏమ్మా అల్లుడుగారు రాలేదా?"


"లేదు.. నేనే వచ్చేసా."


"ఏంటి అంటే?"


"అతను టూర్‌ వాయిదా వేశాడు.


ఆ విషయం మీద గొడవ.


కోపంగా వచ్చేశా."


ఒక్కసారిగా రాజ్యలక్ష్మికి షాక్‌. అదే మాటలు... అదే కోపం... మళ్లీ ఇదే సమస్య.


"అవును... వనజ మాటల్లో ఊర్మిళ ప్రతిబింబమైంది."


రాత్రి అల్లుడికి ఫోన్ చేసింది రాజ్యలక్ష్మి.


"టూర్‌ పూర్తిగా రద్దా? లేక ఇంకా ప్లాన్‌ ఉన్నదా?"


"పదిహేను రోజుల్లో వెళ్లాలని చూస్తున్నాం అత్తయ్య గారు " అన్నాడు అల్లుడు.


ఆ సమాధానంతో రాజ్యలక్ష్మి తృప్తి పడింది .ఆ పదిహేను రోజులు కూతురు వనజ తల్లి రాజ్యలక్ష్మి ఇంట్లోనే ఉంది. ఈ మధ్య కాలంలో తన తల్లి మాటల్లో కనిపించిన బాధను, ఆలోచనలను, గమనించింది వనజ. అల్లుడు రోజూ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉండడం వల్ల ఒరిగిపోయిన అనుబంధాలు మళ్లీ తడిగా మారాయి.


పదిహేను రోజులు గడిచేసరికి, వెళ్ళడానికి రెడీ అయిన


వనజ తో "ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోమ్మా... జీవితంలో ప్రతి ప్రణయం, ప్రతి పెళ్లి ఫొటోలా అందంగా ఉండదు. కానీ ఆ ఫొటో వెనుకున్న కష్టాలు, ఒప్పందాలు, ఓర్పులే జీవితాన్ని నిలబెడతాయి. మొగుడంటే షికార్లు తీసుకు వెళ్లే వాడే కాదు. అతని బాధను కూడా పంచుకుని అర్థం చేసుకునే నిశ్శబ్దమే అసలైన ప్రేమ." అని చెప్పింది రాజ్యలక్ష్మి..


ఇది వివాహ బంధం. ఇవాళ మొగుడు మీద ఉన్న కోపం రేపు ఉండదు. రేపటికి దాని తీవ్రత బాగా తగ్గిపోతుంది. అలా రోజులు గడిచే కొద్దీ మనలో ఆలోచనలు ప్రారంభమవుతాయి


మన తప్పు ఎంతవరకు ఉంది ఇందులో అని లెక్క చూసుకుంటాము.


ఈ రోజుల్లో విడాకులు తీసుకోవడం పెద్ద సమస్య కాదు. ఒక్కసారి విడాకులు తీసుకున్న తర్వాత ఇప్పుడు నిన్ను ప్రోత్సహించిన కుటుంబ సభ్యులు ఎవరు ఉండరు. అప్పుడు నువ్వు ఒంటరిగా నిలబడిన రోజు తప్పు చేశామని భావన నీలో కలుగుతుంది. అప్పటికి వయసు అయిపోతుంది. జీవితం ముగిసిపోతుంది. ఆఖరి రోజుల్లో ఏ తోడు లేకుండా ఉన్నప్పుడు నీలో బాధ కలుగుతుంది అని చెప్పిన తల్లి మాటలకి కన్నీళ్లు కార్చి తలదించుకుంది వనజ.


మీ తరం వాళ్లకి ఆలోచన తక్కువ ఆవేశం ఎక్కువ. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు జీవితాలు పాడు చేసుకుంటున్నారు అని చెప్పవలసిన రెండు మాటలు చెప్పి మౌనంగా ఊరుకుంది రాజ్యలక్ష్మి


అదే సమయంలో ఊర్మిళ కూడా కోర్టులో వచ్చిన కేసును వెనక్కి తీసుకుంది. కారణం రాజ్యలక్ష్మి జడ్జిగా కాదు, ఊర్మిళ విషయంలో కూడా ఒక తల్లిలా ఆలోచించి ఇరుపక్షాల లాయర్లను రామారావు ఊర్మిళ దంపతులను , వాళ్ళిద్దరి తల్లిదండ్రులను కూడా పిలిపించి ఆ దంపతులు ఇద్దరి మధ్య గొడవకి కారణమైన హనీమూన్ వెళ్లడానికి ఏర్పాట్లు చేయించింది జడ్జి రాజ్యలక్ష్మి కాదు కాదు ఒక బాధ్యత గల తల్లి రాజ్యలక్ష్మి. ఆ హనీమూన్ కి అయ్యే ఖర్చుని రామారావు ఊర్మిళ దంపతుల తల్లిదండ్రులు భరించే విధంగా ఏర్పాటు చేసింది.


ఇదంతా కోర్టు ఆవరణలో కాదు. కోర్టు గోడలు దాటి తను చేయగలిగిన సహాయం చేసింది జడ్జి రాజ్యలక్ష్మి. అంతేకాదు ఇరుపక్షాల లాయర్లని కూడా ఒక బాధ్యత గల పౌరురాలిగా సున్నితంగా మందలించింది. మీ దగ్గరికి కేసు రాగానే గబగబా కోర్టులో ఫైల్ చేయడం కాదు. సాధ్యమైనంత వరకు ఇద్దరికీ నచ్చ చెప్పడానికి ప్రయత్నించాలి. ఇలా పెళ్లయిన వెంటనే విడాకులు తీసుకునే జంటలను మనం ప్రోత్సహిస్తే మన సమాజంలో కుటుంబ వ్యవస్థ మిగలదు.


అలా విడాకులు తీసుకున్న యువత మనసు విరిగిపోయి చెడు అలవాట్లకు బానిస అయిపోతారు. అంతే కాదు సమాజానికి చీడపురుగులుగా తయారవుతారు. నేను చెప్పేది కేవలం చిన్న చిన్న తగాదాలతో కాపురాలు విడిపోవడానికి మన దగ్గరకు వచ్చే వాళ్ల విషయం మాత్రమే. హనీమూన్ అన్నది మన సంస్కృతి కాదు. మన సంస్కృతి కానీ విషయాలన్నీ మన భారతీయ వివాహ వ్యవస్థలోకి తీసుకుని వచ్చి చివరికి కాపురాలు కూలిపోయే పరిస్థితిలు ఏర్పడుతున్నాయి. నలుగురికి మన దాంపత్య బంధం లోని విషయాలు ఫోటోల ద్వారా చూపించుకోవాలనే తాపత్రయం తప్పితే వేరే ఆనందం ఏమీ లేదు ఇందులో. నాకోసం మరొక మనిషి ఎదురు చూస్తున్నాడు అనే విషయంలోనే ఎంతో ఆనందం ఉంది. అనుబంధం ఉంది .ఆత్మీయత ఉంది. సినిమాలు చూసి వాతలు పెట్టుకోకూడదు అని చెప్పిన రాజ్యలక్ష్మి మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ తలలు దించుకున్నారు


ఎవరో అన్నట్లు—


"కాపురం అనేది ఓ ప్రయాణం... స్టేషన్‌కి కాకుండా గమ్యం కి చేరాలంటే ఓర్పే టికెట్!" ఓర్చినమ్మకు తేటనీరు అనే సామెత కూడా ఉంది మనకి. భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా ప్రాముఖ్యత ఉన్నది. దీనిని సవ్యంగా నడిపించే బాధ్యత ఈనాటి యువతరం మీద ఎంతైనా ఉంది.


ఇది కథ ,కానీ నిజజీవితంలో ఇది జరిగే పని కాదు. ఇటువంటి చిలిపి తగాదాలను కోర్టు వరకు రానివ్వకుండా తల్లితండ్రులే న్యాయమూర్తులుగా వ్యవహరించి కాపురాలు చక్కదిద్దాలి. ఇప్పటికే లక్షల కేసులు కోర్టులో ఉన్నాయి. మానవత్వంతో జడ్జి రాజ్యలక్ష్మి చేసిన అరుదైన తీర్పును అన్ని పత్రికలు


ప్రశంసించే యి . అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు రాజ్యలక్ష్మిని సన్మానించాయి.


రాజ్యలక్ష్మి తన బాధను మాటల్లో చెప్పకపోయినా, వనజ, ఊర్మిళ వంటి యువతులను తప్పుదోవనుండి రక్షించడం ద్వారా ఒంటరిగా మిగిలిపోయిన తనలాంటి వాళ్ళు పడే బాధ నుండి తప్పించింది.


రచన మధునాపంతుల చిట్టి వెంకట సుబ్బారావు


కాకినాడ 9491792279

కామెంట్‌లు లేవు: