8, జులై 2025, మంగళవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శల్య పర్వము ద్వితీయాశ్వాసము*


*431 వ రోజు*

ఇంకాచెప్తాను విను. ద్రుపదుడు భీష్మ, ద్రోణులను పడగొట్టాలని చేసిన యజ్ఞంలో నుండి జన్మించిన శిఖండి, ధృష్టద్యుమ్నుడు భీష్మ, ద్రోణ మరణాలకు నిమిత్తమాతృలే కాని అసలు వారు పతనం కావడానికి కారణం నువ్వే. నీవే ఈ అకారణ యుద్ధానికి కారణం. యుద్ధములో డస్సిఉన్న సాత్యకిని భూశ్రవసుడు చంపడానికి కత్తి దూసే సమయంలో అతడిని చంపడం అధర్మమా ! బంధువుల మరణిస్తుంటే వీరులెవరైనా చూస్తూ ఊరుకుంటాడా. బాలుడైన అభిమన్యుని అనేకులు చుట్టు ముట్టి చంపడం నీకు అధర్మంగా కనిపించ లేదుకాని. చెల్లెలి వరుస అని చూడక అడవులలో ద్రౌపదిని చెరపట్టిన జయధ్రధుని యుద్ధభూమిలో చంపక వదలడానికి అర్జునుడు వెర్రి వాడా ! ఘోషయాత్ర పేరుతో పాండవులను అవమానించడానికివెళ్ళి గంధర్వుల చేత చిక్కిన నిన్ను అర్జునుడు కాపాడిన విషయం మరచుట నీకు ధర్మమా ! గోగ్రహణ సమయంలో సమ్మోహనాస్త్రం ప్రభావితుడవైన నిన్ను అర్జునుడు ప్రాణములతో విడుచుట మరవడం ధర్మమా ! నీవు చేసిన అకృత్యములకు మూల పురుషుడైన కర్ణుడు యుద్ధ భూమిలో చిక్కిన కర్ణుడిని అర్జునుడు ఊరక విడుస్తాడా ! అర్జునుడు విడిచిన బ్రాహ్మణ శాపగ్రస్తుడైన కర్ణుడి రథం పైకి లేవగలదా ! యుధిష్టరుడు శల్యుడిని చంపడం అధర్మమం అననందుకు పరమ సంతోషం. సుయోధనా ! నీవు బాల్యం నుడి నీ అన్నదమ్ములైన పాండవులను ద్వేషించావు. కాని పాండవులు నిన్ను ఎన్నడూ ద్వేషించలేదు. కురువంశానిని కూకటి వేళ్ళతో పెకలించడానికి మాయాజూదం అనే గునపం పట్టింది నీవే. నీతొడలు విరుగకొడతానని చెప్పిన భీముడు నిన్ను పిడి గుద్దులు గుద్ది వదులుతాడా ! కనుక వృధా మాటలు కట్టిపెట్టు " అన్నాడు. ఆ మాటలు విన్న సుయోధనుడు " కృష్ణా ! నేను అనేక యజ్ఞ యాగాదులు చేసాను, వేద వేదాంగములను చదివాను. ఎందరో మహారాజులతో నీరాజనాలు అందుకున్నాను. నా శత్రువుల మదం అణచి బంధుమిత్రుల సహితంగా స్వర్గసుఖములను అనుభవించడానికి వెళుతున్నాను. మీ దృష్టిలో నేను దుర్మార్గుడనే అయినా మీరంతా మీ శేష జీవితం పశ్చాత్తాపంతో గడపవలసిందే " అన్నాడు.


*పాండవులను కృష్ణుడు ఒదార్చుట*


పాండవులు సుయోధనుడి మాటలు విని భీష్మ, ద్రోణ, కర్ణులను అధర్మంగా పడగొట్టామా అని తలలు దించుకున్నారు. వారిని చూసిన కృష్ణుడు " మీరు భీష్మ, ద్రోణ, కర్ణులను అధర్మంగా చంపామని బాధ పడవలదు. మహా యోధులైన వారిని ధర్మయుద్ధంలో చంపుట కష్టం కనుక అనేక ఉపాయములతో వారిని పడగొట్టవలసి వచ్చింది. ఆ మహాయోధులు మామూలుగా మరణించరు. అదియును కాక వారి పూర్వజన్మ సుకృతం వారికి మరణం సంభవించేలా చేసింది. దైవ సంకల్పం తప్పించడం మీ తరమా ! ఈ సంతోషసమయాన మీరిలా చింతించ తగదు " అన్నాడు. అప్పటికి పొద్దు వాలింది. కృష్ణుడు పాంచజన్యము, ధర్మరాజు అనంత విజయము, భీముడు పౌండ్రకము, అర్జునుడు దేవదత్తము, నకుల సహదేవులు సుఘోష అనే శంఖములను పూరించారు. భేరీ మృదంగ నాదములు మిన్నంటాయి. అక్కడి వారు ధర్మరాజు విజయుడు అయినందుకు వేనోళ్ళ కొనియాడారు. పాండవులు కౌరవ శిబిరాలకు వెళ్ళారు. సాత్యకి కూడా వారితో వెళ్ళాడు. ధృష్టద్యుమ్నుడు, ద్రుపదుని దాయాదులు, ద్రౌపదీ సుతులు, మిగిలిన మహారాజులంతా ధర్మజుని అనుమతి తీసుకొని ససైన్యంగా తమ శిబిరాలకు వెళ్ళారు. మరునాడు హస్థినాపురం వళ్ళాలని అనుకున్నారు. పాండవులు కౌరవ శిబిరాలకు వెళ్ళారు. నీ కుమారుడి శిబిరం, నాటకం ముగిసిన రంగస్థలం వలె నిశ్శబ్ధంగా ఉంది. అక్కడి పరిచారికలు ధర్మరాజును సత్కరించి గంధపుష్పాక్షితలు సమర్పించారు.



*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: