శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 28)
(పరశురాముడు - 5)
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏
సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
----
(6-4-'26 పోష్టు తరువాయి భాగము)
పరశురాముడు తాను జయించిన భూమండలాన్నంతా "కశ్యప మహర్షి" కి దానం ఇచ్చి మహేంద్ర పర్వతంపై తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.
అప్పటి నుండి భూమికి "కాశ్యపి" అన్న పేరు ఏర్పడింది.
అయితే భూమండలం అంతా పరిపాలకులు లేనందున "అరాచకం". అయింది.
చాతుర్వర్ణ్యాలు కట్టుబాట్లు తప్పినవి.
పరస్పర దోపిడీలతో భూమి అల్లకల్లోలం అయింది.
ప్రజల పాపకృత్యాలు భరించలేక భూదేవి "అతల లోకంలో" తలదాచుకున్నది.
కశ్యప మహర్షి అది గమనించి తన ఊరుతలంతో ధరిత్రిని ఉద్ధరించి జనులందరికి అమందానందం కలిగించాడు.
అందువల్ల ఆ నాటి నుండీ భూదేవికి " ఉర్వీ " అన్న పేరు వచ్చింది.
భూమాత కశ్యప మహర్షికి అంజలి ఘటించి వినయంతో ఇలా అన్నది.
" మహామునీ! నన్ను ధర్మంగా పరిపాలించే బాధ్యత క్షత్రియులదే.
హైహయుల అకృత్యాల వల్ల వారందరూ భగవంతుడైన పరశురాముని చేత సంహరింప బడ్డారు.
అయితే నా కరుణా దృష్టివల్ల కొంతమంది క్షత్రియులు ఇంకా అక్కడక్కడ శేషించి ఉన్నారు.
కొంతమంది "హైహయ వంశీయులు" ఇంకా బ్రతికి ఉన్నారు.
మరియు పౌరవాన్వయంలో జన్మించిన "విధూరధుని" కుమారుడు,
"సౌదాస"వంశీయులు కొంతమంది,
"శిబి చక్రవర్తి" పౌత్రుడు "గోపతి",
ప్రతర్దనుని కుమారుడు "వత్సుడు",
దధివాహనుని కుమారుడు, బృహద్రథుని వంశీయుడైన " భూరి",
మరుత్త నృపతి వంశీయులైన మువ్వురు రాకుమారులు,
ఈ మొదలుగాగల సుక్షత్రియ వంశ సంజాతులు
కొంతమంది నా చేత,
కొంతమంది "ఎలుగుబంట్ల"చేత,
కొంతమంది మహర్షులచేత,
కొంతమంది ధేనువులచేత,
కొందరు కొండముచ్చుల చేత,
కొంతమంది "మత్స్యముల"చేత,
మరికొందరు సముద్రని చేత,
రక్షింపబడి జీవిస్తున్నారు.
వారందరినీ రావించి పరిపాలనా బాధ్యతలు అప్పగించి, ఈ అరాచకం నుండి నన్ను కాపాడ వలసినది",
అని ప్రార్థించింది.
కశ్యప మౌని ఆ ప్రార్థన మన్నించి,ఆ యా క్షత్రియ వంశాంకురాలను రావించి, వారికి ఆ యా ధరణీ భాగాలు అర్పించి, యథావిధిగా పట్టాభిషేక మహోత్సవాలు ఆచరించాడు.
వారి వంశాలలో తిరిగి అసంఖ్యాకమైన నృపాలురు ఆవిర్భవించారు.
అయినా దెబ్బతిన్న పాలకవ్యవస్థ పూర్తిగా కోలుకోలేదు.
దానిని చక్కదిద్ది, ధర్మమును సుస్థిరంగా స్థాపించటానికి "శ్రీరామావతారం" వచ్చింది.
సకలక్షత్రియ సంహారం చేసి, మహేంద్ర పర్వతంపై తపస్సు చేసుకుంటున్న పరశురామునకు దశరథరాముడు చేసిన శివధనుర్భంగం విషయం తెలిసింది.
ఎంత గొప్ప తపస్సంపన్నుడైనా, తన తండ్రి హత్యకు కారణమైన క్షత్రియజాతిపై ద్వేషము ఆయనకు పూర్తిగా ఉపశమించలేదు.
అందువల్ల ఆయన జ్ఞానం మరుగున పడి రాముని యదార్ధ స్వరూపము తెలుసుకోలేక పోయాడు.
ఒక క్షత్రియుడైన రాముడు చేసిన
"శివ ధనుర్భంగం" ఆయన సహించలేక పోయాడు.
తీవ్రమైన క్రోధంతో భూమి అంతా కంపిస్తుండగా వైష్ణవ ధనస్సు తీసుకొని రాముని ముందు ప్రత్యక్షమైనాడు.
ఈ ధనుస్సు ఎక్కుపెడితే నీతో ద్వంద యుద్ధం చేస్తానన్నాడు రామునితో.
నిజానికి పరశురాముని అవతార ప్రయోజనము నెరవేరినది.
తపస్సు వల్ల వచ్చిన నిగ్రహానుగ్రహ శక్తులు,
ముందు ముందు భోగానుభవమునకు ఏర్పడిన పుణ్యలోకాలు,
ఆయన బ్రహ్మజ్ఞాని అవటానికి అవరోధములుగా ఉన్నాయి.
ఆయన దేహము ఋచీకమహర్షి క్షత్రమంత్రాలతో తయారు చేసిన చరువు వల్ల ఏర్పడింది.
అందువల్ల ఆ ఉపాధి దోషం కూడా ఇంకా ఉంది.
పరశురాముడు చేసిన క్షత్రియ సంహారం వల్ల పాలకులు అధికార గర్వంతో చేసిన అకృత్యాలకు తెరపడింది.
అయితే ధర్మంగా ప్రజలను పరిపాలించడం క్షత్రియజాతి వల్లే జరగాలి.
బ్రాహ్మణజాతి దాని కోసం సృజింపబడ లేదు.
ప్రజా పాలన,ధర్మ రక్షణ, క్షత్రియుల సహజ స్వభావం.
" చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణ,కర్మ, విభాగశః" మొదలైన శ్లోకాలలో ఈ విషయం భగవద్గీతలో విశదీకరింపబడింది.
దెబ్బతిన్న పాలకవ్యవస్థను ఉద్ధరించి, ధర్మసంస్థాపన చేయడానికి రామావతారం వచ్చింది.
శ్లో// రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః /
చాతుర్వర్ణ్యం చ లోకే ౽ స్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి //
(ఈ లోకమునందు రాముడు వందలాది క్షత్రియ వంశములను స్థాపించును. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులను యథావిధిగా వారి వారి ధర్మముల నాచరించుట యందు, నియమించును)
(బాలకాండ - 1 - 96)
(సశేషం)
శుభమస్తు.
తూములూరి మధుసూదనరావు.
7-4-'26.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి