25, డిసెంబర్ 2021, శనివారం

సాధన -1

సాధన -1  

విమానంలో కిటికీ ప్రక్కన కూర్చున్న ప్రయాణకునికి విమానము కదలటం మొదలుకాగానే భూమి మీద వస్తువులు వెనుకకు వెళుతున్నట్లు కనపడి విమానం గాలిలో ఎగరటం మొదలు కాగానే అవి మొదట చిన్నగా తరువాత సుష్మముగ కనపడి తరువాత కనపడకుండా పోతాయి. కేవలం ఆకాశంలో మేఘాలు మాత్రమే కనపడుతుంటాయి. అంటే దీని అర్ధం విమానం క్రింద భూమి, భూమిమీది వస్తువులు లేకుండా పోయాయని కాదు.  కేవలం ప్రయాణికుడు అవి చూడలేని అంత ఎత్తుకు వెళ్లాడని మాత్రమే.  ఆ ఎత్తులో మేఘాలు ఉంటాయి కాబట్టి వాటిని మాత్రం స్పష్టంగా చూడగలడు. 

సంసారబంధనాలలో కొట్టు మిట్టాడుకునే మానవుడు ఎప్పుడైతే జిజ్ఞాసకుడిగా అయ్యి సాధన మొదలు పెడతాడో అప్పుడు తన సాధన క్రమంలో మొదట్లో బౌతికంగా వున్న భావ బంధాలు అంటే భార్య పిల్లలు, నా వారనే బంధాలు కొంత చిన్నవిగా కనపడతాయి అదే సాధనలో పరిపక్వత చెందుతున్న కొద్దీ ఆ బంధాలు సుష్మముగా తరువాత లేనట్లుగా గోచరిస్తూ కేవలం అద్వితీయమైన, అనంతమైన, శాశ్వితమైన, నిత్యమైన భగవంతునితో మాత్రమే అనుసందానం కలిగి ఉంటాడు. 

సంసార జీవనం గడిపే మనకు సాధన సాగదు, మనకు ఒక మంచి గురువు తనంతట తానె వెతుక్కుంటూ వస్తాడు, ఫలానా ప్రవచనాకారుడు చెప్పాడు విగ్రహారాధన ఒక్కటే మార్గం కేవలం సన్యాసం తీసుకున్న వారు మాత్రమే వారికి ఎలాంటి భాద్యతలు వుండవు కాబట్టి పూర్తిగా ఆధ్యాత్మిక జీవనం గడప  గలరు. ఈ జన్మకు నేను చేసే పూజలే  చాలు. కలియుగంలో నామ స్మరణే చాలు మోక్షానికి అని ఇలా పలుతెరుగుల వాదనలు, సమర్ధింపులు చేసుకునే వారిని పెక్కు మందిని మనకి తారస పడతారు.  కానీ నిజమైన సాధకుడు ఆ మాటలను ఏమాత్రం గణించక తన ఆధ్యాత్మిక జీవనం కోన సాగిస్తాడు. 

ఇలా వ్యర్ధ ప్రసంగాలను చేసి కాలాన్ని వృధా చేసుకునే వారిని ఆది శంకరాచార్యుల వారు " కాకికి దంతాలు వున్నాయి, దంతాలు లేవని వాదన చేసే (మూర్ఖులు ) గా అభివర్ణించారు.  

సాధకులారా ఇంకా కాలయాపన చేయకండి ఇప్పుడే మీ ఆధ్యాత్మిక జీవనానికి నంది పలకండి.  ఈ జన్మలోనే నేను మోక్షాన్ని పొందుతాను అని దృఢ సంకల్పులు కాండి. 

ఓం తత్సత్. 

ఓం శాంతి శాంతి శాంతిః. 

23, డిసెంబర్ 2021, గురువారం

పాపం-పుణ్యం

 పాపం-పుణ్యం 

(ఈ వ్యాసం వ్రాయటానికి ముందు నేను ఒకింత సందేహించాను ఎందుకంటె ఇంత చిన్న విషయాలు మాకు తెలియవా అని మనలో చాలామంది అనుకోవచ్చు.  కానీ ఇది కేవలం తెలియని వారిని దృష్టిలో ఉంచుకొని వ్రాసిందని గమనించగలరు)

మనం తరచుగా పాపం-పుణ్యం అనే ద్వంద పదాలను వింటుంటాము, అంటూవుంటాము. కానీ ఇదమిద్దంగా పాపం అంటే ఏమిటి, పుణ్యం అంటే ఏమిటి అంటే చాలామంది చెప్పలేని స్థితిలో వుంటారు.  కానీ ఒక్కటి మాత్రం ప్రతి వక్కరు చెప్పగలరు అదెమంతి పాపం అనేది చెడుకు సంబంధించింది, పుణ్యం అనేది మంచికి సంబంధించింది కాబట్టి మనం పుణ్యం చేయాలి అని మాత్రం అంటారు. ఎవరైనా ఏదయినా కానీ పని చేస్తే పోన్లే వాడి పాపాన వాడే పోతాడు అని మనం అనటం కూడా కద్దు. అంటే మనం ఏమిచేయనవసరం లేదు వాడి పాప ఫలితాన్ని వాడే పొందుతాడు అని కాబోలు ఆలా వాడుకలోకి వచ్చింది.  ఏది యెమీయేన ఒక్కటి మాత్రం నిజం పాపం కానీ లేక పుణ్యం కానీ మనం చేసే పనులకు ప్రతిగా వచ్చే ఫలితం అంటే మన కర్మలకు లభించే ఫలితం. అంటే పాప పుణ్యాలకు కారణం కర్మలు అంటే కొన్ని కర్మలు చేస్తే పాపం వస్తుంది అదే విధంగా కొన్ని కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది. 

ఒక చిన్న ఉదాహరణ చూద్దాం 

1) తల్లి తండ్రులను గౌరవించాలి 

2) తల్లి తండ్రులను హింసించాలి. 

ఇందులో మొదటి కర్మ చేస్తే పుణ్యం వస్తుందని రెండవ కర్మ చేస్తే పాపం వస్తుందని అందరము ముక్త కంట్టంగా చెపుతాము. కానీ ఎందుకు అంటే మాత్రం చెప్పలేము. 

మనం చేసే కర్మలు రెండు రకములు 1) విహిత కర్మలు 2) నిషిద్ధ కర్మలు అంటే మొదటిది చేయవలసిన పనులు లేక చెప్పిన పనులు రెండవది చేయకూడదని చెప్పిన పనులు అని స్థూలంగా అర్ధం. ఇంకా వివరంగా పరిశీలిస్తే విహిత కర్మలు అంటే వేదవిదిత కర్మలు అనగా వేదంలో చేయమని చెప్పిన కర్మలు అదే విధంగా నిషిద్ధ కర్మలు అంటే వేదనిషిద్ద కర్మలు అనగా వెడలు చేయవద్దని చెప్పిన కర్మలు. 

వేదాలు అంటేనే కర్మ కాండ అనగా మానవులు ఎలాంటి కర్మలు చేయాలి, ఎలాంటి కర్మలు చేయకూడదు అని వివరించేవి వేదాలు 

మనం అక్కడక్కడ ఇది యాంటీ కాన్స్టిట్యూషన్ అని రాజకీయ నాయకులూ పలుకుతూ ఉండటం చూస్తాం అంటే కాన్స్టిట్యూషన్కి విరుద్ధం అని కదా అర్ధం, అదే మాదిరి నిషిద్ధ కర్మలు కూడా ఇప్పుడు కొంతవరకు మీకు అర్ధం అయ్యిందని నేను అనుకుంటాను. 

ఇదంతా చాలా గజిబిజిగా వున్నది ఒక్క మాటలో పాప పుణ్యాలు అంటే ఏమిటో చెప్పలేవా అని మీరు అడగ వచ్చు. ఆలా చెప్పాలంటే 

ధర్మాన్ని ఆచరించటం పుణ్యం 

ధర్మాన్ని ఆచరించక పోవటం మరియు ధర్మ విరుద్ధంగా ప్రవర్తించటం పాపం. 

ఇప్పుడు ధర్మం అంటే ఏమిటన్న ప్రశ్న ఉదయిస్తుంది. ధర్మం అంటే ప్రతివారు తానూ ఆచరించవలసిన విధానం. ఇది ఒక్కొక్క వ్యక్తికీ ఒక్కొక్క రీతిగా వుంటూ అందరికి ఒకేరీతిగా ఉంటుంది. 

అదెలా అంటే నీ తల్లిదండ్రులను చూసుకొనేది నీ ధర్మం నీవు నీ తల్లిదండ్రులను సరిగా చూసుకోలేదనుకో అప్పుడు నేను నీ తల్లిదండ్రులను చూసుకోవటం నా ధర్మం కాదు మరి అది ఏమిటి అంటే దానికి శ్రీ కృష్ణ భగవానులు దానిని పరధర్మం అని స్పష్టం చేసారు. భగవానులు ఎల్లప్పుడూ ప్రతి వారు తన ధర్మాన్నే ఆచరించాలని పరధర్మాన్ని ఆచరించకూడదని పేర్కొన్నారు. 

 శ్రీమద్భగవద్గీత / Bhagavad-Gita – 142 🌹
. తృతీయ అధ్యాయము – కర్మ యోగము  – 35 
35. శ్రేయాన్ స్వధర్మో విగుణ: పరధర్మాత్ స్వనుష్టితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయ: పరధర్మో భయావహ: ||
🌷. తాత్పర్యం :
పరధర్మము చక్కగా నిర్వహించుట కన్నను గుణరహితమైనను స్వధర్మమును ఆచరించుట ఉత్తమము. పరధర్మపాలనము హానికరమైనది కావున దానిని పాటించుట కన్నను స్వధర్మపాలనము నందు నాశనము పొందుటయైనను ఉత్తమమైనదే!

ప్రతివారు వారి వారి ధర్మం ఏమిటో తెలుసుకొని దానిని మాత్రమే ఆచరించాలి. వారు ఆచరించాల్సిన ధర్మాన్ని విద్యుక్త ధర్మం అని అంటారు. 
ఒక పురుషునికి తన తల్లిదండ్రులను, తన భార్య పిల్లల యోగాక్ష్యేమాలు చూడాల్సిన ధర్మం ఉంటుంది. అదే విధంగా ఒక స్త్రీకి తన భర్త, అత్తా మామలు, పిల్లల యోగక్షేమాలు చూడాల్సిన ధర్మం ఉంటుంది. కాబట్టి, ధర్మం అనేది ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. అది తెలుసుకొని నడచుకోవటం తద్వారా పొందే ఫలమే పుణ్యం దానికి భిన్నంగా ప్రవర్తించటమే పాపం. 
ఓం శాంతి శాంతి శాంతిః 
బుధజన విధేయుడు 
భార్గవ శర్మ 






ఒక్క క్షణం.....

 🍁ఒక్క క్షణం.....🍁


ఒక ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పండితుడు ఒకాయన ఉండేవాడు. చాలా చక్కని వాక్పటిమ గలవాడు. ఆయన ఆలయం ఆవరణలో కూర్చొని ప్రవచనం చెబుతూ వుంటే వేలమంది జనం అలా కదలకుండా బొమ్మల్లా వింటూ ఉండిపోయేవాళ్ళు. ఆయన ప్రఖ్యాతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వ్యాపించింది.


ఒకసారి ఆయన ప్రవచనం నిమిత్తం పొరుగూరు వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊరు వెళ్ళే బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నాడు. అయితే పొరపాటున బస్సు కండక్టర్ పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. పండితుడు అది గమనించి తిరిగి ఇవ్వాలని యోచించాడు. కానీ బస్సు నిండా జనం కిక్కిరిసి ఉండటంతో, దిగేటప్పుడు ఇద్దాంలే అనుకుని కూర్చున్నాడు. 


కొద్ది సేపు తరువాత అతని మనసులొ ఆలోచనలు మారాయి. 'ఆ కండక్టరు కూడా ఎంతమంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు.. ఈ బస్సు కూడా ఒక సంస్థదే కదా.. ఎంత మంది తినటంలేదు.. నా పది రూపాయలకే నష్టపోతుందా ఏమిటి.. ఈ పది రూపాయలు ఏదైనా దైవ కార్యనికి ఉపయోగిస్తా...' అని అనుకుని మౌనంగా కూర్చున్నాడు.

 

అంతలో వూరు వచ్చింది... బస్సు ఆగింది... కానీ ఆయన దిగేటప్పుడు బస్సు కండక్టర్ దగ్గరికి రాగానే తన ప్రమేయం ఏమాత్రం లేకుండా అసంకల్పితంగా కండక్టరుకు ఇవ్వవలిసిన పది రూపాయలు ఇచ్చి... "మీరు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఈ పది రూపాయలు ఎక్కువగా ఇచ్చారు" అన్నాడు. 


దానికి ఆ కండక్టర్ "అయ్యా..! నేను మీ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటాను. మీరు చెప్పడంతోటే సరిపెట్టుకుంటారా లేక పాటిస్తారా అని చిన్న పరీక్ష చేశాను" అని అన్నాడు. 


పండితుడు చల్లటి చిరు చెమటలతో బస్సు దిగి.. 'పది రూపాయల కోసం తుచ్ఛమైన ఆశతో నా విలువలకే తిలోదకాలు ఇవ్వబోయాను... నా అదృష్టం బాగుంది. నా మనస్సాక్షి సరైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకొని నా విలువలను కాపాడింది' అనుకున్నాడు.


జీవిత కాలం పాటు సంపాదించుకున్న మంచితనం కూడా సర్వనాశనం కావడానికి క్షణం చాలు🍁

19, డిసెంబర్ 2021, ఆదివారం

దోసావకాయోత్పత్తి

 👉సరదాగా కాసేపు అంతే


*దోసావకాయోత్పత్తి వృత్తాంతము::*

పూర్వం 1822 వ సంవత్సరంలో, దెందులూరు గ్రామమునందు దర్భా ధనుంజయ చైనులు గారు అనెడి ఒక వేదపండితుడు వేదములతో పాటు, సాంప్రదాయ సద్వంటలను కూడా క్షుణ్ణముగా అభ్యసించినాడు!


ఆయన ఒక సాయంత్రము రాత్రి భోజనమునకు దోసకాయ పప్పు చేయవలెనని, ఒక పుల్లని, గట్టి దోసకాయను ముక్కలు గా చేసి ఒక తప్పాలా యందు వేసికొనినాడు! అటు పిమ్మట ఆయన కించిత్తు వేదపఠనమునందు నిమగ్నుడయినాడు! ఇంతలో ఆయన గారి సతీ మణి, దర్భా దాక్షాయనీ దేవమ్మ, ఆ ఉదయము కొత్త ఆవకాయ పెట్టుటకు వాడిన ఆవపిండి కాస్త ఒక పళ్ళెమునందు మిగిలియుండుట చేత, ఆ ఆవపిండి పళ్ళెమును ఆ దోసకాయ ముక్కల తప్పాలాయందు, దృష్టి లోపమువలన చూచుకొనక పడవైచినది! అటు పిమ్మట ఆమె ఇంకనూ రెండు దినములలో గల లక్ష వత్తుల నోముకు వత్తులు చేసికొనుటకు ఉపక్రమించినది!


అంతలో, వేదపఠనము ముగించుకొని, ఇక ఇంగువ తిరగమాత దోసకాయ పప్పు చేయుదమని వచ్చిన చయనులు గారు, ఆ దోసముక్కల మీద పడియున్న ఆవపిండిని చూచి, 'అకటా, ఇక ఈ రాత్రికి దోసకాయ పప్పు దుర్లభము కదా! ఏమి శాయవలె?' అని ఆలోచించి, 'సరియే, ఈ ఆవపిండి తో కలసిపోయిన దోస ముక్కలను ఎటులయిననూ సద్వినియోగము చేయుదు గాక ' అనుకొనుచూ, పాక దేవీ మాత పైనుండి దీవించుచుండగా, ఆ దోసముక్కలూ, ఆవపిండీ గల తప్పాలమునందు, కాస్త మచిలీపట్నపు రాళ్ళ ఉప్పూ, నారాకోడూరు ఎర్ర కారమూ కలిపి, ఆ పైనుండి ధారగా గానుగ నువ్వుల నూనె పోసినాడు! ఆ మిశ్రమమును ఒక బృహద్గరిటె తో బాగుగా కలియ బెట్టినాడు! 'ఇది ఏదియో చూచుటకు మాత్రము బహు ముచ్చటగానున్నదే' అనుకొనినాడు!


ఒక గంట పిమ్మట, ఆ దంపతులు ఇరువురూ, రాత్రి భోజనమున వేడి వేడి దంపుడు బియ్యపన్నము నందు ముద్దపప్పు కలిపి, అవనిగడ్డ ఆవునెయ్యి ధారాళముగా వేసికొని, ఆ ముద్దపప్పన్నము తో పాటు, ఈ తప్పాలమునందలి వింత పదార్ధమును నంచుకొనుచుండగా, వారికి ఆ ఘాటుకు నుదుటినుండి స్వేదము చిందుచూ, అనిర్వచనీయమగు అనుభూతీ, ఆనందమూ లభ్యమైనవి!


ఆ రాత్రి భోజనానంతరము , దర్భా ధనుంజయ చైనులు గారు, ఆ ఎర్రని, ఘాటగు వింత పదార్ధమునకు 'దోస ఆవకాయము ' అని నామకరణమొనర్చినాడు!


ఇతి దోసావకాయోత్పత్తి వృత్తాంతః


ఈ దోసావకాయ గురించి పాకపంచశతి మూడవ అధ్యాయం అయిన "ఉత్తర పీఠిక "లో ఫలశృతి చెప్పబడింది. అందులో జఠమహర్షి, ఉదరానందునకు చెప్పిన కొన్ని విషయాలు:


ఈ దోసావకాయ అపమృత్యువులను, అకాలమృత్యువులను కూడా పోగొట్టును. రోగాలను నివాఱించి దీర్ఘాయుర్దాయాన్ని ప్రసాదించును. దీనిని శ్రద్ధాసక్తులతో విధివిధానుసారం భుజించాలి. అన్ని రోగాలను హరించడానికి గట్టిగా ఉన్న ఒక్క ముక్క చాలును. ఆసక్తి గలవారు నిత్యం గాని, పుణ్యదినములయందుగాని ఈ దోసావకాయను తప్పక భుజించాలి. ఊరగాయలు, పచ్చళ్ళలో దోసావకాయ అసమానమైనది. జిహ్వసక్తి లేనివారికి దీనిని వడ్డించరాదు.


నిత్యకృత్యమునందు, పర్వదినములందు ఎవరీ దోసావకాయను యథాశక్తి విధిగా భుజిస్తారో, వారికి ధన్వాంతరీ అనుగ్రహముచే దీర్ఘాయువు, రథగజతురంగములతో సదా సుప్రసన్నమైన స్థిరసంపదలు సిద్ధించును...





పద్యం*

 *చదివే సమయంలో పెదవి మాత్రమే తగిలే పద్యం*


భూమీ భామాంబు భవా

వామాపా వైభవ భువి భావావాపా

వేమమ్మోముము భూభవ

భీమ భవాభావ భావ విభువామావిభా


*చదివే సమయంలో పెదవులు తగలనిది*


శ్రీశా సతత యశః కవి

తాశా ధాత్రీశ ఖండితాశా నిస్సం

కాశా నిరతారాధిత

కీశేశా హృష్ణ గగనకేశా యీశా


*ఒక అక్షరం పెదవికి తగలనిది తరువాతి అక్షరం తగిలేది*

*అంటే పెదవి తగలనిది, తగిలేది*


దేవా శ్రీమాధవ శివ

దా వేగాభిజ్ఞ మురభిదా మాధామా

జ్యావగ వంద్యా వాసవ

సేవితపద పగవిరామ శివ జపనామా


*కేవలం నాలుక కదిలేది*


సారసనేత్రా శ్రీధర

రారా నన్నేల నిందు రాక్షసనాశా

నారద సన్నుత చరణా

సారతరానందచిత్త సజ్జనరక్షా     


                                                                                                                                   

*నాలుక కదలని (తగలని) పద్యాలు*


కాయముగేహము వమ్మగు

మాయకు మోహింపబోకు మక్కువగ మహో

పాయం బూహింపుము వే

బాయగ పాపంబు మంకుభావమవేగా

భోగిపభుగ్వాహ మహా

భాగా విభవైకభోగ బావుకభావా

మేఘోపమాంగభూపా

బాగుగమముగావువేగ బాపాభావా


*నాలుక కదిలీ కదలని పద్యం*


ఓ తాపస పరిపాలా

పాతక సంహారా వీర భాసాహేశా

భూతపతిమిత్ర హరి ముర

ఘాతా కాలాంబుదవిధ గాత్రవరాహ్వా 


🙏ఈ పద్యాలు రచించిన మహా కవులకు తెలుగు జాతి ఋణపడి వుంటుంది. . 


🙏 *పద్య భాషాభిమానులకు జోహార్లు*.


🙏 

*అందుకే అన్నారు దేశభాషలందు తెలుగు లెస్స అని *

పిండిమ‌ర‌" కష్టాలు* 🤔

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

🤔 *చిన్న‌త‌నంలో "పిండిమ‌ర‌" కష్టాలు* 🤔


చిన్న‌త‌నంలో ఎంత‌ క‌ష్ట‌మైనా రావచ్చుగాని పిండి మ‌ర‌కెళ్ళాల్సిన క‌ష్టం మాత్రం ఎవ్వ‌రికీ రాకూడ‌దు.🤫

అంతా చ‌దివి... మీరే అవునో, కాదో చెప్పండి...🤔


నా బాల్యం అంతా చిన్న టౌన్ లో గ‌డిచింది.. 

అప్ప‌ట్లో *అన్న‌పూర్ణా* ఆటాలు, *ఆశీర్వాద్* ఆటా ఆశీర్వాదాలు మాకు దొర‌క‌ని క‌ష్ట‌కాల‌మాయే..


అంద‌రూ గోధుమ‌లు, ధాన్యం, ప‌ప్పులు మ‌ర ఆడించుకోవ‌ల్సిందే..


ఈ ప‌నికోసం అమ్మ‌లు, అమ్మ‌మ్మ‌లు మ‌మ్ముల్ని బాల కార్మికులుగా వినియోగించుకుని పిండిమ‌ర‌కుతోలేవాళ్ళు..

మాకు ఇప్ప‌టిపిల్ల‌లంత అవేర్‌నెస్ క‌పోవ‌డంతో..

కార్మిక శాఖ‌కు కంప్లైట్ చేయాల‌ని తెలియ‌దు..

మేము అలా పిండిమ‌ర దారిప‌ట్ట‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వ రాయితీ జ‌ల్లులా మ‌ర‌కు పోయి వ‌స్తే పావలానో..

ప‌దిపైస‌లో ఆక‌ర్ష్ ప‌థ‌కానికి ఆశ ప‌డి..

ఈ సాహ‌సానికి సిద్ద‌ప‌డితే మేము ప‌డ్డ క‌ష్టాలు ప‌గవాడికి కూడా వ‌ద్దు...


గోధుమ‌లో మ‌రొక‌టో నాలుగుమూడు కిలోలు క్యాన్‌లో పోసి ఆడించుకు ర‌మ్మ‌ని చెపుతూ.. 

అమ్మ‌లు మ‌ర‌వాడికి ఒక కేజీ త‌క్కువ చేసి చెప్ప‌మ‌ని చెప్పి పంపేవారు... 


మ‌ర‌కు పోయి.. అబ‌ద్దం చెప్ప‌డానికి పూర్తిగా సాహ‌సించ‌లేక పిండిమ‌ర చ‌క్రాలు క‌ర్‌క‌ర్ మ‌ని చేసే సౌండ్‌లో..

అశ్వ‌ద్దామ హ‌తఃకుంజ‌రః అన్న‌ట్లుగా మూడు కేజీల‌ని రెండ‌నో, నాలుగును మూడ‌నో అనేసేవాళ్ళం...


పిండిమ‌ర వాళ్ళు పొద్దున్నుంచి నాలాంటి వాళ్ళ‌ను ఎంతో మందిని చూసుంటారు కదా..

బాల‌య్య బాబులా* కంటి చూపుతో స‌రుకు తూకం క‌నిపెట్టేసి క‌రెక్ట్ గా వ‌సూలు చేసేవాళ్ళు...


ఇంట్లో మ‌ర‌కు పంపేముందు క‌ణ్వ‌మ‌హ‌ర్షి శ‌కుంత‌ల‌కు చేసే అప్ప‌గింత‌ల కంటె ఎక్కువే..

మాకూ బోధ జ‌రిగేది...


*”పిండి ఆడించేప్పుడు దిక్కులు చూడ‌కు, పిండికాజేస్తారు జాగ్ర‌త్త”* అని, బరకగా ప‌ట్టించ‌మ‌నో, మెత్త‌గా ప‌ట్టించ‌మ‌నో, ప‌సుపు త‌రువాత ఆడించ‌వ‌ద్ద‌నో, కారం త‌రువాత ఆడించ‌వ‌ద్ద‌నో..

ఆంక్ష‌లు చెప్పి పంపేవారు...


ఇన్ని జాగ్ర‌త్త‌లు చెప్పారు క‌దా అని మేము పిండిమ‌రలో అడుగు పెట్టిన ద‌గ్గ‌ర‌నుండి..

ముఖ్య‌మంత్రి గారి సెక్యూరిటీ వింగ్ వాళ్ళు డేగ క‌న్నుతో చూస్తున్న‌ట్లు చూస్తూ ఉండే వాళ్ళం... 


దీనికితోడు ప్ర‌తి పిండి మ‌ర‌లో ఒక స‌న్న గొట్టం.. 

దొంగ చాటుగా అందులోనుండి కొంత పిండి మ‌ర‌వాళ్ళు కాజేస్తార‌న్న బ‌ల‌మైన‌ రూమరు ప్రచారం లో ఉండేది...


పిండిమ‌ర‌కు చేరుకుని హై ఎల‌ర్ట్ లో వెయిటింగ్‌లో ఉంటే..

ఈ లోపు మ‌ర‌వాళ్ళు మేము పిల్ల‌లం గ‌నుక..

పెద్ద‌ల్ని, నోరుగ‌ల‌వాళ్ళ‌ని ప్ర‌యార్టీలో పెట్టేసేవారు..

ఆ రోజుల్లో క‌రెంట్ ఉన్న స‌మ‌యం కంటే..

క‌రెంట్ క‌ట్ స‌మ‌య‌మే ఎక్కువ కావ‌డంతో..

వెయిటింగ్ త‌ప్పేది కాదు...


ఈ వినోదాన్ని గ‌మ‌నిస్తూ కొంతసేపు వేచి ఉండేసరికి మ‌ర‌లో లేచిన పిండంతా.. 

త‌ల‌మీద ప‌డి మాకు బాల‌వృద్దుల గెట‌ప్ వ‌చ్చేసేది... 


కాసేప‌టికి ఆ గోల‌లోనే ఆప‌రేట‌ర్ మా చేతిలో క్యాన్ గుంజుకుని..

స్పెసిఫికేష‌న్స్ చెప్పేలోపే పైనున్న బ‌కెట్ లో పోసేసి..

పిండి వ‌చ్చే గొట్టానికి వేలాడుతున్న టార్ప‌లిన్ గుడ్డ‌ను మ‌డిచి..

గొట్టం మీద‌కు తోసి.. 

క‌ర్ క‌ర్ మ‌ని విష్టుమూర్తిలా రెండు చ‌క్రాలు తిప్పేవాడు...


పైన బ‌కెట్‌లో వేసిన గోధుమ‌లు గ్రైండ‌ర్‌లో న‌లిగి క్రింద ఉన్న టిన్‌లో ప‌డ‌టానికి రెండు,మూడు, నిముషాలు ప‌ట్టేది..

పిండి నలిగి కింద‌కు ప‌డే టైమ్ కు మ‌డ‌చి ఉంచిన టార్పాలిన్ గొట్టాన్ని క్రింద ఉన్న డ‌బ్బాలోకి సెట్ చేసేవాడు...


ఈ నాలుగైదు నిముషాల్లో పైన వేసినదంతా పిండిగా వ‌స్తుందో లేదో అన్న టెన్ష‌న్‌తో మా న‌రాలు చిట్లుతుండేవి... 

(ఇంట్లో పెట్టిన అప్ప‌గింత‌లు భ‌యాలు సామాన్యమైనవా!) 

మ‌న‌పిండి ఆడుతున్నంత సేపూ ఏ చ‌క్రం తిప్పినా ఎటువెళ్ళినా మ‌న పిండి పోతోంద‌న్న అనుమానంతో మాకు మ‌న‌శ్శాంతి ఉండేదికాదు...


కాసేప‌టికి డ‌బ్బాలో ప‌డ్డ‌పిండిని మ‌న క్యాన్‌లో వొంపి పొమ్మ‌నేవాడు..

మ‌న క‌ళ్ళ‌న్నీ వింబుల్డ‌న్ ఫైన‌ల్ మ్యాచ్‌లో బాల్ వైపే తిరుగుతున్న‌ట్లు ఆప‌రేట‌ర్ చుట్టూ తిరుగుతూ ఉండేవి...


ఈ అడ్వెంచ‌ర్ ముగించుకుని త‌ల, వొళ్ళు దులుపుకుని క్యాన్ భుజానికో, సైకిల్‌కో త‌గిలించుకుని..

మ‌న‌కు ఇవ్వ‌బోయే పావాలాకు బ‌డ్జెట్ ప్లానింగ్ డ్రీమ్స్ వేసుకుంటూ..

ఇల్లు చేరేవాళ్ళం... 


ఇంటికి రాగానే క్యాన్ లో వ‌చ్చిన పిండిని తూనిక‌లు కొల‌త‌ల శాఖ‌ల వ‌లె హోమ్ శాఖ‌వారు కొలిచేవారు...


 ఇహ‌మొద‌లు ”ఎటు దిక్కులు చూశావ్‌! 

 మోసం చేసి పిండి కాజేశాడు..

మేము ఎన్ని చెప్పిపంపితే ఏం ప్ర‌యోజ‌నం, అర‌కేజి త‌క్కువొచ్చింది...


మెత్త‌గా ప‌ట్ట‌మంటే బ‌ర‌గ్గా ప‌ట్టాడు. నీకు ఇన్నేళ్ళొచ్చాయి. ఒక్క ప‌నీ వివ‌రంగా చేసుకురాలేవు” అంటూ..

 కేంద్ర్రప్ర‌భుత్వం జి.ఎస్‌.టీ కాంపెన్సేష‌న్ ఎగొట్టిన‌ట్లో, త‌గ్గించిన‌ట్లో వారి ద‌యాదాక్షిణ్యాల‌తో కొంత‌ కోత విధించి ప‌దిపైస‌లే ఇవ్వ‌డ‌మో..

మ‌రీమూడ్ బాగాలేక పోతే మొత్తానికే మొండి చెయ్యి చూపేవారు... 


ఇలాంటి చేదు అనుభ‌వ‌మైన త‌రువాత మ‌ళ్ళీ మ‌ర‌కు పోకూడ‌దు అనుకునే వాడిని..

కాని ప్ర‌తీసారీ కొత్త రాయితీల‌తో న‌మ్మ‌బ‌లికి పంపేవారు...

క్లైమాక్స్ మాత్రం ఒక్క‌టే, ‘పిండి త‌క్కువ వచ్చింది మోసం జ‌రిగిపోయింది. మీ వ‌ల్ల ఏమీ కాదు’...


ఆ రోజుల్లో పిండిమ‌ర స్వానుభ‌వం అయిన సాటి కామ్రేడ్స్ అంద‌రికీ ఒక్క విష‌యం అర్థ‌మై ఉంటుంది...


యూనివ‌ర్సిటీ వీ.సీ.గా ప‌నిచేసి విద్యార్థుల‌తో తిట్టించుకోకుండా ఉండొచ్చేమో..

ఎమ్మేల్యేగా నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌లంద‌రితో మంచి అనిపించుకోవ‌చ్చేమో కానీ..


పిండిమ‌ర‌కెళ్ళొచ్చి మంచి ప‌నిమంతుడ‌నిపించుకోవ‌డం మాత్రం దుర్ల‌భం...

🤔😄

18, డిసెంబర్ 2021, శనివారం

 పదాల పరమార్థాలు పెరుమాళ్లకెరుక...

 

     ‘‘మీ అక్షరాలు ముత్యాలు మాస్టారూ’’ అన్నాడో శిష్యుడు గురువుగారిని కాకాపట్టడానికి. ‘‘నా నీళ్లు ముత్యాలా? ఇదెక్కడి దిక్కుమాలిన పోలికరా శుంఠ...!’’ అంటూ వెంటనే వాతపెట్టారు ఆ మాస్టారు. చేతిరాత గురించి చెబుతుంటే గురువుగారు నీళ్లంటున్నారేంటని కుర్రాడు తెల్లముఖమేశాడు. మాస్టారి మాటల్లోని మర్మమేంటో పాపం అతనికి ‘అర్థం’ కాలేదు. 

‘అక్షరం’ అంటే సాధారణంగా అకారాది వరుసలోని వర్ణమే అనుకుంటాం. నిజానికి ‘పరబ్రహ్మ, ఆకాశం, కాలమానం, ఓంకారం, నీరు, ప్రకృతి, తపస్సు, యజ్ఞం’... ఇన్ని అర్థాలు ఉన్నాయి ఆ పదానికి. క్షరం (నాశనం) లేనిది ఏదైనా అక్షరమే. ఆ విషయాన్ని మరచిపోయి దాన్ని వర్ణానికి పరిమితం చేసేశాం. 

      పలుకుబడి, అవసరం, ప్రాధాన్యాలను బట్టి కొన్ని పదాల వాడుక ఎక్కువగా ఉంటుంది. ప్రజల అవగాహన, పదప్రయోగ అవసరం, భావ స్పష్టత, ప్రాచుర్యాన్ని బట్టి ఆ పదాల వినిమయం జరుగుతుంటుంది. వినియోగించకపోతే ఎంత గొప్ప వస్తువైనా మూలన పడిపోతుంది. పదాల పరిస్థితీ అంతే. ఏదో సందర్భంలో, ఏదో అవసరార్థం ఏర్పడ్డ పదం... దాని అవసరం తీరిపోయాక మరుగున పడుతుంది. అలాంటి స్థితిలో ఆ స్థానాన్ని మరొక అర్థం ఆక్రమిస్తుంది. అలా ఆక్రమించిన భావాలు కొన్ని సందర్భాల్లో స్థిరపడిపోతాయి. అలా స్థిరపడటాన్ని భాషలో ‘నిపాత’లు అంటారు. నిపతించడం అంటే పాతిపెట్టడం, స్థిరపరచడం. అంటే ఓ పదానికి వాడుకలో ఉన్న అర్థంతోపాటు ఇతర అర్థాలు ఇంకెన్ని ఉన్నా, వినియోగంలో లేకపోవడంతో మరుగున పడిపోతాయన్న మాట. ‘అక్షరం’ విషయంలోనూ అదే జరిగింది. అన్నట్టు, తెలుగులో ఇలాంటి పదాలు చాలా ఉన్నాయి. వాటిలో చాలా వరకూ సంస్కృతం నుంచి వచ్చినవే. 

      భద్రాచలం, పట్టిసాచలం, శేషాచలం... లాంటి పదాల్లో అచలమంటే ఏంటి? పర్వతం. అదొక్కటేనా దానికి అర్థం? దానికి ఇంకా ‘లోకం, వస్త్రపుటంచు, మేకు’ తదితర అర్థాలున్నాయి. అలాగే, చలనరహిత స్థితిలో ఉన్నది ఏదైనా అచలమే అవుతుంది. సరే, ‘ఉదధి’ దగ్గరికి వద్దాం. ‘మేఘం’ పర్యాయపదాల జాబితాలో ఇది ఉంటుందా? అబ్బే... ఎందుకుంటుందండీ, ‘ఉదధి’ అంటే సముద్రం కదా అంటారా! అదే పొరపాటు. కడలితో పాటు మేఘమూ ఉదధే. ఎందుకంటే... ఉదకాన్ని ధరించేది ఉదధి. మరి మేఘానికీ ఆ మురిపెం ఉంది కదా! 

భలే శిరోజాలు

‘మీ శిరోజాల సంరక్షణకు మా కొబ్బరి తైలాన్నే వాడండి’ అంటూ గతంలో ప్రకటనలు హోరెత్తేవి గుర్తుందా? వాటిని చూసిన పెద్దలు కొందరు... ‘వీళ్లేంటి పేలు పెంచుకోమని చెబుతున్నార’ని ముక్కున వేలేసుకునేవారట! విషయం ఏంటంటే... ‘శిరస్సులో పుట్టింది’ శిరోజం. అంటే, జట్టుతోపాటు పేను, చుండ్రు లాంటివి కూడా శిరోజాలే. కానీ, వ్యవహారంలో జుట్టు అనే అర్థమే స్థిరపడిపోయింది. ‘తైలం’ కూడా అంతే. తిలలు అంటే నువ్వులు. వీటి నుంచి తీసిన పదార్థమే ‘తైలం’. ‘నువ్వుల నూనె’ అని మాత్రమే దీనికి అర్థం. కానీ వేరుశనగ, ఆముదం, కొబ్బరి, ఆవ, అవిశ, విప్ప... తదితరాల నుంచి తీసే నూనెలనూ తైలాల కిందే జమకడుతున్నాం. మొత్తంగా తైలాన్ని నూనెకు పర్యాయపదం చేశాం. 

      ఉమ్మెత్త, సంపెంగ, నల్లచందనం, మోదుగ, బంగారం- వీటన్నింటి మధ్య ఓ సంబంధం ఉంది గుర్తుపట్టారా? ఏంటంటే... ‘కనకం’! ఈ పదానికి పైవన్నీ అర్థాలే. కానీ, మనం ఒక్క బంగారాన్నే వాడుతున్నాం. ‘రావణ కాష్ఠం’ అని మనకో జాతీయం ఉంది. ఆ లంకాధీశుడి చితి ఎప్పటికీ మండుతూనే ఉంటుందన్న నమ్మకంలోంచి ఇది పుట్టింది. అదలా ఉంచితే, అసలు ఈ కాష్ఠమంటే ఏంటి? కర్ర. దాంతో పాటు ‘పద్దెనిమిది రెప్పపాట్ల కాలం’ అని కూడా బ్రౌణ్య నిఘంటువు చెబుతోంది. కానీ, ఈ పదం ‘చితి’ అన్న అర్థంలోనే వాడుకలో ఉంది. పార్థివదేహాన్ని కట్టెలతోనే దహనం చేస్తారు కాబట్టీ, అదీకాక అశరీర సంస్కారాలన్నింటికి ఉపయోగించేవి కర్రలే కాబట్టి ఈ అర్థమొక్కటే జనం నోళ్లలో నానుతోంది. 

అదే పక్షి... అదే గాలి

ఖగమంటే పక్షి మాత్రమేనా? గ్రహం, బాణం, గాలి... ఇవేవీ ఖగాలు కావా? అవీ అవుతాయి. ఎందుకంటే... పద వ్యుత్పత్తి ప్రకారం ఆకాశంలో సంచారం చేసేది ఏదైనా ఖగమే. కానీ ఏం లాభం? మనం ‘పక్షి’తోనే సరిపెట్టుకుంటున్నాం. మరి ‘గోత్రం’ సంగతేంటి? వంశం పేరు, పేరు, గొడుగు, అడవి, బలం, వరిచేను కోసిన పొలం అనే అర్థాలున్నాయి. అయితే, అవి నిఘంటువులకే పరిమితమయ్యాయి. వాడుకలో మాత్రం గోత్రమంటే వంశం చిరునామానే! 

      తిరుమల వెంకన్న బంగారు చీరలు కట్టుకునేవాడట! నమ్మకపోతే అన్నమయ్యను అడగండి... ‘పసిడిచీరవాడు...’ అంటూ తన్మయత్వంతో పాడేస్తాడు. వాస్తవానికి ‘చీర’ అంటే వస్త్రం. పురుషులు ధరించేదైనా, స్త్రీలు ధరించేదైనా సరే. కానీ, ఇప్పుడది స్త్రీలకే సొంతమైంది. పాపం... ‘జలజం, పంకజం’ కూడా ఇలాంటివే. ‘జలమందు, బురదయుందు పుట్టేవి’ ఏవైనా జలజాలు, పంకజాలే! చేప, నత్తగుల్ల, జలగ, ముత్యం, పద్మం, కలువ లాంటివేవైనా కావచ్చు. అయితే, అదేం విచిత్రమో కానీ పై రెండు పదాలకీ ‘తామర/ పద్మం’ అనే అర్థాన్నే స్థిరం చేశారు. 

      పళ్లని ఆహారంగా స్వీకరించడమే ‘ఫలహారం’ కదా. పళ్లు కాకుండా ఇతర ఉపాహారాలు (అల్పాహారం) తీసుకున్నా ‘ఫలహారం చేశాం’ అంటున్నామెందుకు? అదే మరి నిపతించడమంటే! ఇక ‘శిల్పం’ అంటే ‘శిలతో తయారైంది’ అని అర్థం. అంటే ఒక ఆకృతి, లేదా బొమ్మ అని భావం. కాలక్రమేణా ఏ పదార్థంతో తయారు చేసిన బొమ్మలనైనా శిల్పాలు అనడం ఆనవాయితీ అయింది. మొత్తమ్మీద శిల్పం అంటే ‘బొమ్మ’ అనే అర్థం ఖాయమైంది. 

ఆదర్శాలూ... అవరోధాలూ...

కాలప్రవాహంలో కొన్ని పదాలకు ఏమాత్రం చుట్టరికం లేని అర్థాలు స్థిరపడిపోతాయి. ఆ పదం అసలు అర్థానికీ, వ్యవహారంలో ఉన్న అర్థానికి నక్కకూ నాకలోకానికి ఉన్నంత తేడా ఉన్నా మనం పట్టించుకోం. ఇలాంటి వాటికి ‘వివక్ష’ చక్కటి ఉదాహరణ. ‘వేరు చేసి చూడటం’ అనే అర్థంలో స్థిరపడింది కానీ, నిజానికి వివక్ష అంటే ‘మాట్లాడాలి అనే కోరిక’. ‘వక్తం ఇచ్ఛా వివక్షా’... ఇది వ్యుత్పత్తి. దీనికి, ‘మా మీద వివక్ష ప్రదర్శిస్తున్నారు’ అనే మన సాధారణ ప్రయోగానికి ఏమన్నా సంబంధముందా? చెప్పుకుంటూ వెళ్తే భాషలోని చిత్రాలు అన్నా ఇన్నా!! 

      ‘లక్ష్యసాధనలో అవరోధాలను అధిగమించడానికి పట్టుదల ముఖ్యం’ అంటూ పాఠాలు చెప్పేస్తాం కదా. దేనికి పట్టుదల కావాలి? అంతఃపురంలో అడుగుపెట్టడానికా? నిజానికి అవరోధ మంటే ‘అంతఃపురం’. ‘రాణివాసపు స్త్రీలు ఉన్నందున ఇతరుల ప్రవేశాన్ని నిషేధించిన ప్రదేశం’ అని అసలు అర్థం. కానీ, ఇది మనకు ‘అడ్డంకి’గానే తెలుసు! అలాగే, ‘ఆకాంక్ష’ను ‘కోరిక’ అనే అర్థంలో స్థిరపరిచేశారు. కానీ క్రియను బట్టి కర్త, కర్మలను తెలుసుకోవడం, విశేష్యాన్ని బట్టి విశేషణాన్ని తెలుసుకోవాలనే కోరిక కలిగి ఉండటం మాత్రమే ‘ఆకాంక్ష’ అవుతుంది. వ్యాకరణం చదివిన వారికి ఇది తెలిసిందే. 

      మనకు తెలిసినంత వరకూ ఆదర్శానికీ, అద్దానికీ ఏమైనా సంబంధం ఉందా? లేదు. నిజానికైతే ఉంది. ‘నీడ కనబడేందుకు ఉపయోగపడేది’ (అద్దం) అని ‘ఆదర్శం’ అసలు అర్థం. కానీ, ‘అనుసరించదగినది’ అనే అర్థంలోనే వ్యవహారంలోకి వచ్చేసింది. ఇక ‘ఆహుతి’ అంటే దేవతా ప్రీత్యర్థం అగ్నిహోత్రంలో హవిస్సును వేయడం. అలా వేసి సాదరంగా ఆహ్వానిస్తే దేవతలు వస్తారని నమ్మకం. అలా వచ్చేవారే ‘ఆహూతులు’! ఈ అర్థం పక్కకెళ్లి, ఏ సందర్భంలోనైనా ‘పిలిస్తే వచ్చేవారు’ అందరూ ఆహూతులవుతున్నారు ఇప్పుడు! దట్టమైన, భయంకరమైన అడవిని ‘కికారణ్యం’ అనడం రివాజు. ఈ పదం పంజాబీ భాషలోంచి వచ్చింది. ‘కికార్‌’ అంటే ‘నల్లతుమ్మ’ అని ఆ భాషలో అర్థం. ఆ చెట్లు అధికంగా ఉండే అరణ్యమే ‘కికారణ్యం’. అంటే నల్లతుమ్మ చెట్లున్న అడవి. ఈ విషయం తెలిసో తెలియకో మనం కాకులు దూరని కారడవులన్నింటినీ ‘కికారణ్యాలు’ అనేస్తున్నాం. 

      ఇలా పదం వేరు, పరమార్థం వేరైన పదాలు ఎన్నో కనిపిస్తాయి. కానీ, ‘పదుగురాడు మాట పాటియై ధరచెల్లు’ కాబట్టి వాడుకలో ఉన్న అర్థాలతోనే సర్దుకుపోవాలి. అయితే... మాటకట్లు తయారు చేసేవారు, చిత్ర రచనలు చేసేవారికి మాత్రం ఇలాంటి పదాలు బాగా ఉపయోగపడతాయి. ఆ సంగతి అలా ఉంచితే... మనం యథాలాపంగా వాడేసే పదాల వెనుక ఎంతటి కథ ఉందో తెలుసుకోవడం మాత్రం ఆసక్తికరం. భాషను పూర్తిగా ‘అర్థం’ చేసుకోవడానికి ఆ ప్రయత్నం అవసరం కూడా.

(అయ్యగారి శ్రీనివాసరావు -

 విజయనగరం)

*కర్మ కర్మణా నశ్యతి కర్మ!*

 *✍️...నేటి చిట్టికథ*


*గంగలో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషి కి ఒక సందేహం వచ్చింది!*


*వెంటనే గంగానదినే అడిగాడట!*


*అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావు? తల్లీ! అని.*


*అందుకా తల్లి "నాయనా నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను" అని బదులిచ్చిందట.* 


*అయ్యో అన్ని పుణ్య నదులు ఇంతేకదా! పాపా లన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో?అనుకొని!*


*సముద్రాన్నే అడిగాడు!*


*ఎలా మోస్తున్నావు? ఈ పాపభారాన్ని!?! అని!*


*దానికా సముద్రుడు!* 


*నేనెక్కడ భరిస్తున్నాను?! ఆ పాపాలను వెంట వెంటనే ఆవిరిగా మార్చి, పైకి మేఘాల లోనికి పంపిస్తున్నాను' అని బదులిచ్చాడట.* 


*అరే!!! ఎంతో తేలికగా కదిలి పోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది! అని అనుకుంటూ!* 


*ఓ మేఘ మాలికల్లారా ఎలా భరిస్తున్నారు? ఈ పాప భారాన్ని! అని అడగగా!!!*


*అవి పకపకా నవ్వి!  మేమెక్కడ భరిస్తున్నాం? ఎప్పటి కప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణా'! అని బదులివ్వగా...*


*ఓహో!!!* 

*ఆ పాపాలన్నీ మన మీద పడి మనమే అనుభవిస్తున్నా మన్నమాట!*


*అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా! ఎవరూ కూడా! కర్మ ఫలితాలు వదిలించు కోలేమని!!!! గ్రహించాడు అక్కడ స్నాన మాచరిస్తున్న ఋషి!*

                 

*ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః ఆత్మతీర్ధం నజానన్తి కధం మోక్షః శృణు ప్రియే.*


*పరమశివుడు పార్వతీ దేవికి ఉపదేశించిన శ్లోకమిది!.*


*ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును! ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగును!* 

*అని... తీర్ధ స్నానమునకై పరుగు లెత్తెడు మానవులు "భ్రమకు లోబడిన వారు"!*


*ఆత్మ జ్ఞాన తీర్ధంలో స్నాన మాచరించని వారికి మోక్ష మెటుల కలుగును?!? అని ఈ శ్లోకం అర్థం.*


*కర్మ కర్మణా నశ్యతి కర్మ!*


*అంటే ..*

*కర్మ అనేది కర్మతోనే* *నశిస్తుంది.*

🔹🔸🔹🔸🔷🔷🔸🔹🔸🔹

ప్రసవించిన స్త్రీకి చేయవలసిన ఉపచారములు -

 ప్రసవించిన స్త్రీకి చేయవలసిన ఉపచారములు  - 


 

 *  బాలింతలకు ప్రసవించిన 8 వ దినము నుండి క్రమక్రమంగా శరీరమునకు బలము చేకూర్చు ఔషధములు , ఆహారములు వాడుట మంచిది. బాలింతలకు 12 దినములు గడుచునంత వరకు మాంసం పెట్టకూడదు. 


 *  గర్భం నందు శిశువు తల్లి ఆహారం పంచుకొని పెరుగుట చేత ప్రసవవేదన అనుభవించుట చేత , ప్రసవకాలమున అధిక రక్తస్రావం జరుగుటవలన బాగా అలిసిపోవడం వలన బాలింతరాలుకు  వ్యాధులు తొందరగా వచ్చును.అందుకొరకు తొందరగా బలం చేకూర్చుటకు ప్రత్యేక ఔషదాలు ఇవ్వవలెను. దశమూలారిష్టం టానిక్ గాని ద్రాక్షరిష్టం టానిక్ గాని , సౌభాగ్యశొంటి అను లేహ్యం కాని భోజనమును తరువాత వాడవలెను. దీనివలన మంచి జీర్ణశక్తి కలుగును. 


 *  బాలింతలకు పథ్యమైన ఆహారాన్ని మాత్రమే ఇవ్వవలెను . దేహశ్రమ , పురుషసంపర్కం , కోపం చల్లనిపదార్ధాలు వీటిని విడిచిపెట్టవలెను. అన్నివిధముల పరిశుభ్రముగా ఉండవలెను . నెయ్యి వంటి పదార్థం కలిసిన పథ్యమైన ఆహారం మితముగా భుజించవలెను. ప్రతిదినము తలంటుస్నానం చేయవలెను . ఈ నియమాలు బాలింత శ్రద్దగా ఒక నెలరోజుల పాటు అనుసరించవలెను. 


 *  బాలింతరాలు తలంటు స్నానం నందు మూడుమాసముల వరకు బలాధన్వంతర తైలం వాడుట మంచిది. దీనివలన నరములకు బలం కలుగును. 


 *  స్త్రీకి గర్భధారణ నిల్చిపోయి 6 సంవత్సరములు అయిన పిదప మరలా గర్భదారణ జరిగి ప్రసవం ఏర్పడినట్లైతే ఆ శిశువుకు ఆయుర్ధాయం తక్కువ ఉండునని శుశ్రుతుడు చెప్పెను. 


 *  బాగా పాతబడిన బియ్యాన్నే ఆహారముగా ఇవ్వవలెను. 


 *  కందికట్టు , ధనియాలపొడి , శొంఠిపొడి , వెల్లుల్లి పాయ కారం , నువ్వులనూనె , నువ్వులపొడి , ఇంగువ , పాతబెల్లం , తాంబూలం పాత ఉశిరిక పచ్చడి , పాతనిమ్మ పచ్చడి , పొట్లకాయ , మునగకూర , బీరకాయ , కందకూర 

ఆవుపాలు , వేడినీటి స్నానం , ఎక్కువ విశ్రాంతి ఇవన్ని తప్పకుండా ఆచరించాలి . 


 *  ప్రసవించిన 15 రోజుల వరకు ఒంటిపూట భొజనం చేయాలి . బొప్పాయిపండు తినవచ్చు. రొట్టె , కాఫీ పుచ్చుకోవచ్చు. కాచి గోరువెచ్చగా ఉన్న చల్లార్చిన నీటిని తాగవచ్చు . 


 *  మాంసాహారం తీసుకునేవారు ఎండుచేపలు , కాల్చిన మాంసం , ఆవునెయ్యిలొ వేయించిన మాంసం , ఎండబెట్టిన మేకమాంసం , మేకమాంసానికి అల్లం , ఉప్పు , కొద్దిగా గరం మసాలా రాసి ఎండించి చిన్నచిన్న ముక్కలుగా తరిగి ఆవునెయ్యిలొ వేయించి తినవచ్చు . 


  బాలింతలు తినకూడని ఆహార పదార్దాలు  -


 

 *  ఎట్టి పరిస్థితులలో కొత్తబియ్యం అన్నం తినకూడదు. 


 *  చద్దిఅన్నం , పలుకుగా ఉన్న అన్నం తినరాదు.


 *  పచ్చి చేపలు , కొత్త చింతపండు , పులుసుకూరలు , మజ్జిగ , పెరుగు ముట్టుకోకూడదు. 


 *  చల్లటి పదార్దాలు ముట్టరాదు. 


    పైన చెప్పిన నియమాలు పాటించని బాలింతలకు సూతికా వ్యాధులు సంభవిస్తాయి. ఒక్కోసారి ఈ చిన్న వ్యాధులు 13 రకాల సన్నిపాత జబ్బులుగా మారి ప్రాణాలు హరిస్తాయి 

  

 గమనిక  - 


      అతి త్వరలో నా మూడొవ గ్రంథం మీ ముందుకు రాబోతుంది. ఈ గ్రంధము నందు మనకి తెలిసిన మొక్కల యొక్క రహస్య యోగాలు ఎన్నింటినో మీ ముందుకు తీసుకువస్తున్నాను . 


              కాళహస్తి వేంకటేశ్వరరావు 


                అనువంశిక ఆయుర్వేదం 


                    9885030034

BIO-CLOCK

 *😁 BIO-CLOCK 😁*


మనం ఉదయం ఎక్కడికన్నా ప్రయాణం చేయ్యల్సి వస్తే తెల్లవారుజామున 4:00 గంటలకు అలారం సెట్ చేసి నిద్రపోతాము. 

కానీ కొన్నిసార్లు మనం అలారం లేకపోయినా అనుకున్న టైంకి నిద్ర లేస్తాము. 

ఇదే *బయో-గడియారం*. 


చాలామంది 80-90 సంవత్సరాల వయస్సులో చనిపోతారని సాధారణంగా నమ్ముతారు. 


50-60 సంవత్సరాల వయస్సులో అన్ని రోగాలు వస్తాయని మనసులో గాఢంగా నమ్మబల్కోని చాలామంది తమ సొంత బయోక్లాక్‌ ను ఏర్పాటు చేసుకున్నారు. అందుకే సాధారణంగా 50-60 వద్ద ప్రజలు అనారోగ్యం పాలవుతారు  *మనం మనకు తెలియకుండానే బయోక్లాక్‌* ను మానసికంగా తప్పుగా సెటప్ చేస్తాము. 


చైనాలో చాలా మంది ప్రజలు 120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవిస్తారని నమ్మి అలా మానసికంగా సంసిద్దులై వారి బయోక్లాక్ ను అలా ఏర్పాటు చేసుకున్నారు.


*కాబట్టి ..!*


1. మనము మన బయో-గడియారాన్ని మానసికంగా పాజిటివ్ ఆలోచనలతో సర్దుబాటు చేసి, రోజు క్రమం తప్పకుండా *ధ్యానం* చేస్తే తద్వారా మనం *కనీసం* 120 సంవత్సరాల వరకు ఆరోగ్యంగా జీవించవచ్చు.


2. 40 నుండి 90 సంవత్సరాల వయస్సులో ఎటువంటి వ్యాధి వచ్చే అవకాశం లేదని మనం నమ్మాలి. వృద్దాప్యం అనేది 120 సంవత్సరాలకు మొదలు అవుతుందని బలంగా నమ్మాలి.


3. వెంట్రుకులకు సహజ సిద్ధమైన రంగు ( తెల్లజుట్టు ఉంటే) వెయ్యండి, యవ్వనంగా కనిపించే ప్రయత్నం చేయండి. *ముఖ్యంగా డ్రెస్ విషయంలో కూడ యువతి, యువకుల మాదిరి డ్రెస్ వేసుకునే ప్రయత్నం సాధ్యమైనంత వరకు చేయండి. తద్వారా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. యెట్టి పరిస్థితులలో వృద్ధాప్యంగా కనిపించడానికి మన మనసుని అనుమతించవద్దు*.


4. మనం తీసుకునే భోజనం కల్తీ అనీ, కలుషితం, అనుకుంటూ నెగటివ్ థాట్స్ తో తీసుకోవద్దు. *ధ్యాన శక్తి వల్ల నేను తీసుకునే ఆహారం పరమ పవిత్రమైనది గా మారింది, ఇది నాకు నిత్య యవ్వనాన్ని, సంపూర్ణ ఆరోగ్యాన్ని నిండు 120 ఏళ్ల జీవితాన్ని ఇస్తుంది అని పరిపూర్ణంగా నమ్మండి.* లేదంటే ఋణాత్మక ఆలోచనల వల్ల మన శరీరంలో నెగటివ్ ఎంజైములు విడుదలై మన జీర్ణ వ్యవస్థను, మన శరీర నిర్మాణాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది.


5. ఎప్పుడూ చురుకుగా ఉండండి. నడవడానికి బదులుగా వీలైతే జాగింగ్ చేయండి. 


5. *వయసు పెరిగే కొద్దీ ఆరోగ్యం పెరుగుతుందని నమ్మండి*. (ఇది నిజం కూడ).


6.ఆనందానికి, వ్యాధికి పడదు. ఒకటి ఉన్నచోట ఇంకొకటి ఉండదు. కనుక ఆనందంగా ఉండండి తద్వారా ఆరోగ్యంగా ఉండండి. *(ప్రతిరోజు హాస్య భరిత సినిమాలు చూడండి మనసులో కాకుండా పైకి నవ్వండి*).


7. ప్రతి సమస్యకు కారణం మన మనస్సు. మన ఆలోచనా విధానం. ముఖ్యంగా మన మాట, సరదాకు కూడ నాకు Old age వస్తుంది అనే మాటను అనకండి. 


*ధర్మరాజుకు యువరాజుగా పట్టాభిషేకం జరిగింది కూడా 105 సంవత్సరాల వయసులోనే అని గ్రహించండి.*


కాబట్టి మీ మానసిక బయో క్లాక్ ని 

మీ తక్కవ ఆయుర్దాయం కోసం సెట్ చేసుకోమాకండి. ఇకనైనా మీ ఆలోచనా దృక్పధాన్ని మార్చుకోండి.


          👍👍👍👍👍👍