7, అక్టోబర్ 2020, బుధవారం

15-16-గీతా మకరందము


         పురుషోత్తమప్రాప్తియోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అవతారిక - క్షర, అక్షర పురుషులయొక్క స్వరూపమును వర్ణించుచున్నారు –


ద్వావిమౌ పురుషౌ లోకే 

క్షరశ్చాక్షర ఏవ చ | 

క్షరస్సర్వాణి భూతాని 

కూటస్థోఽక్షర ఉచ్యతే || 


తాత్పర్యము:- ప్రపంచమునందు క్షరుడనియు, అక్షరుడనియు ఇరువురు పురుషులు కలరు. అందు సమస్త ప్రాణులయొక్క దేహముల యొక్క అభిమాని క్షరుడనియు, కూటస్థుడగు జీవుడు (మనస్సు యొక్క అభిమాని) అక్షరుడనియు చెప్పబడుచున్నారు.


వ్యాఖ్య:- క్షరపురుషుడు, అక్షరపురుషుడు, పురుషోత్తముడు - అను మువ్వురు పురుషులను గూర్చి చెప్పబోవుచు మొట్టమొదట క్షరాక్షరులను గూర్చి భగవానుడీ శ్లోకమునందు తెలియజేయుచున్నాడు. నశించునట్టి దేహాదిదృశ్యపదార్థములన్నియు అనగా చరాచరజీవులయొక్క ఉపాధులన్నియు తాము అని అభిమానించువారు క్షరపురుషులనియు, ఆత్మచైతన్యము యొక్క ప్రతిబింబరూపులగు జీవులు (మనస్సులు తాము అని అభిమానించువారు) అక్షరపురుషులనియు ఇచట చెప్పబడిరి. క్షరమైన దేహములతో పోల్చిచూచినచో మోక్షపర్యంతము అనేక జన్మలకాలమువఱకు నశింపకుండ ఉండువా డగుటచే జీవుడు అక్షరుడనియు, కూటస్థుడనియు చెప్పబడెను. అయితే ఈ అక్షరుడు 8వ అధ్యాయమందు తెలుపబడిన అక్షరపరబ్రహ్మమనిగాని, కూటస్థుడనగా కూటస్థ చిదాత్మయనిగాని యెవరును తలంచరాదు. ఏలయనిన వారిరువురికిని "అకాశపాతాళ” భేదముకలదు. ఒకడు బింబము; మఱియొకడు ప్రతిబింబము. ఈ అధ్యాయమందు తెలుపబడిన అక్షరుడు ప్రతిబింబము - అనగా జీవుడు. ఈ క్షరాక్షరుల యిరువురి కంటెను వేఱైనట్టి, అనగా ఉపాధి అభిమానికంటెను, చిత్ప్రతిబింబమగు జీవుని (మనస్సు యొక్క అభిమాని) కంటెను వేఱుగానున్నట్టి ఉత్తమపురుషుని గూర్చి రాబోవు శ్లోకమున చెప్పబడును. ఆతడే పరమాత్మ.


ప్రశ్న:- ఈ ప్రపంచమున పురుషు లెందఱుకలరు? వారెవరు?

ఉత్తరము:- ఇరువురు కలరు - (1) క్షరుడు (2) అక్షరుడు - అని.

ప్రశ్న:- అందు క్షరపురుషు డెవడు?

ఉత్తరము:- సమస్తప్రాణులయొక్క దేహాద్యుపాధుల అభిమాని క్షరపురుషుడని చెప్పబడును.

ప్రశ్న:- అక్షరపురుషు డెవడు?

ఉత్తరము:- కూటస్థుడగు జీవుడు (మనస్సుయొక్క అభిమాని).

కామెంట్‌లు లేవు: