7, అక్టోబర్ 2020, బుధవారం

మహాభారతము

 **దశిక రాము**


**** 


నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


104 - అరణ్యపర్వం.


సావిత్రీ సత్యవంతులగాధ వినిపించిన మార్కండేయమహర్షి, పాండవులను ఆశీర్వదించి, తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు.


ఆ విధంగా పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసాన్ని పూర్తి చేసుకున్నారు. కామ్యకవనం నుంచి, తమ నివాసాన్ని ద్వైతవనానికి మార్చారు. ఈ పన్నెండు సంవత్సరాలు యెన్నో, యెన్నెన్నో కష్టాలు అనుభవించి, మానసికంగా కృంగిపోయి వున్నారు. అర్జునుడు పాశుపతాస్త్రాన్ని సంపాదించుకొనడము, మహర్షుల సత్సంగము, వారి ఆశీర్వచనాలు కొంత వూరట కలిగించాయి పాండవులకు, ఈ అరణ్యవాసకాలంలో.  


ఇలా వుంటుండగా, ఒకనాడు, దగ్గరలో నివాసముంటున్న ఒక బ్రాహ్మణుడు, ' తన యజ్ఞ అంకురార్పణకు అగ్నిని తయారుచేయడానికి వుపయోగించే ఆరణిని చుట్టుప్రక్కల తిరుగుతున్న జంతువొకటి అపహరించుకుని వెళ్ళింది. తెచ్చిపెట్టమని' ధర్మరాజుని అభ్యర్ధించాడు. పాండవులందరూ, మృగానికి అరణితో పని యేమి వున్నది, ఇదేదో వింతజంతువులాగా వున్నది చూద్దామని, మృగాన్ని వెదుకుతూ బయలుదేరారు. కొద్ది దూరం వెళ్ళగానే, వీరిని చూసి, చెంగున గెంతుతూ ఆ మృగం వెళ్ళసాగింది. త్రేతాయుగంలో శ్రీరాముని బంగారులేడి తిప్పలు పెట్టినట్లు, యీమృగం కూడా పాండునందనులను, చాలా విసిగించి, అరణ్యమంతా వారిని తిప్పి, కనబడకుండా పారిపోయింది.  


ఈలోగా పాండవులందరూ, దప్పికతో, ఆకలితో అలిసిపోయారు. అక్కడే వున్న ఒక పెద్ద మర్రిచెట్టునీడలో సేదతీరుతున్నారు, వారందరూ. ఒకప్రక్క, దప్పిక, ఇంకొక ప్రక్క ఆకలి, వేరొకప్రక్క తాము ప్రస్తుతం వున్న పరిస్థితికి ఆవేదన. ఈమూడూ ముప్పిరి గొనగా, యెవరిధోరణిలోవారు, పాండవవీరులు తమ నిస్సహాయతకు కారణాలు వెదుకుకుని బాధపడుతూ వున్నారు.  


నిండుసభలో దుశ్శాసనుడు ద్రౌపదిని అవమానించిన నాడే, వాడిని చంపివుంటే, యీనాడు యీపరిస్థితి వుండేదికాదని భీముడు, కర్ణుని వాచాలత్వం గమనించిననాడే, అతడిని వధించి వుండాలని అర్జునుడు, శకునిని అప్పుడు శిక్షించి వుంటే బాగుండేదని సహదేవుడు అక్కసు వెళ్ళగ్రక్కుతున్నారు. నకులుడు మౌనంగా ధర్మరాజు ప్రక్కనే వున్నాడు.


' నకులా ! ప్రస్తుత మనకర్తవ్యం, జల సముపార్జన, మన దాహార్తి తీరడానికి. ఒక్కసారి, ప్రక్కనున్న చెట్టుయెక్కి దగ్గరలో యేదైనా సరస్సు వుందేమో చూడు ! ' అనిచెప్పాడు, ధర్మరాజు. నకులుడు చెట్టెక్కి చూసి, దిగివచ్చి, ' అగ్రజా ! దగ్గరలో, పచ్చని చెట్లు, పక్షుల శబ్దాలు వినబడుతున్నాయి. బహుశా జలాశయం వుండే వుంటుంది. నేను వెళ్లి చూసి జలం తీసుకువస్తాను. ' అని బయలుదేరాడు.  


నకులుడు వూహించినట్లే అక్కడ మంచిసరస్సు ఒకటి కనిపించింది. అందులో దిగి నీరు త్రాగబోతుండగా, యెక్కడినుంచో ' ఎవరునీవు ? నాసరస్సులో యెందుకుదిగావు ? నేను అడిగే ప్రశ్నలకు సమాధానమిస్తేనే, నీవు యీజలం వుపయోగించగలవు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. ' అని గద్దించినట్లు వినవడింది. నకులుడు దాహంతో వుండి, ఆపలుకులు పట్టించుకోకుండా, జలాన్ని పుక్కిటబట్టాడు. మరుక్షణం నేల కూలి అచేతనుడయ్యాడు.


నకులుడు యెంతకూ రాకుండేటప్పటికి, ఒకరి తరువాత ఒకరుగా, సహదేవుడు, భీముడు , అర్జునుడు వచ్చి, వారు కూడా అచేతనులై పడిపోయారు. ఏదో కీడు శంకిస్తూ, ధర్మరాజు కూడా అక్కడకు చేరుకున్నాడు. అచేతనులై పడివున్న తమ్ముళ్లను చూశాడు. బిగ్గరగా రోదించాడు. పేరుపేరునా వారి శరీరాలను పట్టుకుని విలపించాడు. తల్లికి యేమి సంధానం చెప్పగలనని ఆక్రోశించాడు. ' మహాపరాక్రమవంతులైన తన తమ్ములను మట్టుపెట్టగల వారు యీ చుట్టుప్రక్కల యెవరు వున్నారు ' అని ఆలోచించాడు. 


ఆలోచిస్తూనే, తనుకూడా సరస్సులో దిగుతుండగా, ' ధర్మజా ! నీ తమ్ములను సంహరించింది నేనే. నా ప్రశ్నలకు జవాబులు చెప్పకున్న నీకూ యిదే పరిస్థితి కలుగుతుంది. ' అనే మాటలు వినిపించాయి. ఇంతలో, భయంకరమైన నేత్రాలతో, పెద్ద దేహంతో, గంభీరమైన వాక్కుతో ఒక యక్షుడు, ధర్మరాజు ముందు ప్రత్యక్షమై, ' ధర్మరాజా ! ఇందులో నా తప్పేమీలేదు. నేను నీ తమ్ములను మాటమాటకీ హెచ్చరిస్తూనే వున్నాను, నాకు సమాధానాలు చెప్పి నీరు త్రాగమని. వారు నామాటలను లెక్కపెట్టలేదు. ఫలితం అనుభవించారు. ' అని చెప్పాడు.


' ఓయక్ష శ్రేష్టుడా ! నీవెవ్వరవు ? నీకు మా తమ్ముల యెడ యేమి శతృత్వము ? . మేము నీ సంపదను యేమీ కొల్లగొట్టలేదే ? కేవలం జలపానానికే ప్రాణాలుతీసే హక్కు నీకెవరిచ్చారు ? ఇంతకీ నీప్రశ్నలేమిటి ? నాకు తెలిసినంతలో నీకు సమాధానాలు యిస్తాను. నీప్రశ్నలు సంధించు. ' అని అంత అలసటతో వుండికూడా, యెంతో సంయమనంతో, ధర్మరాజు యక్షుడితో అన్నాడు.  


ఇక, యక్షుని ప్రశ్నలు, ధర్మరాజు సమాధానాలు కొన్నింటిని చూద్దాం : 

1 . దేని ప్రభావంతో సూర్యుడు ఉదయిస్తాడు ?

     బ్రహ్మ తత్వమూ వలన సూర్యుడు ఉదయిస్తాడు.

2 . మానవుడు తెలివిగలవాడిగా ఉండడానికి యేది కారణం ?

    పెద్దలను సేవించడం వలన మానవుని బుద్ధి వికసిస్తుంది.

3 . ఆకాశం నుంచి క్రింద పడేవానిలో యేది శ్రేష్టమైనది ? 

     వర్షపు నీరు. 


ఇలా నడుస్తున్నాయి, యక్షప్రశ్నలు, ధర్మరాజు సమాధానాలు....


స్వస్తి.

వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: