7, అక్టోబర్ 2020, బుధవారం

పంచమాధ్యాయం - భక్తి మహిమ

 ప్రసాద్ భరద్వాజ 




*పరమార్థ దృష్టికి భక్తి అనేది ఏకరూపమే. కాని వ్యవహార దశలో అది 11 రూపాలుగా కనబడుతుంది.*


1) భగవత్కళ్యాణ గుణాభివర్ణన

2) భగద్దివ్య మంగళ విగ్రహానురాగం

3) భగవత్పూజనం

4) భగవత్స్మరణం

5) భగవత్సేవ

6) భగవంతుని పట్ల సఖ్యభావ ప్రేమ

7) భగవంతుని పుత్రుడుగా భావించి ప్రేమించడం

8) భగవంతుని భర్తగా ప్రేమించడం

9) భగవంతునికి సర్వ సమర్పణ చేయడం

10) భగవన్మయుడై ఉండడం

11) భగవంతుని ఎడబాసి ఉండలేకపోవడం


ఈ విధాలైన భక్తి వారి వారి పూర్వ జన్మల సంస్కారాల ననుసరించి కలుగు తుంటాయి. ఇవి ఏకాదశ రూపాలే కాదు. ఇంకా అనేక రూపాలుగా కూడా ఉండవచ్చును.


నారదుడు, వ్యాసులవారు మొదలైనవారు భగవంతుని కళ్యాణ గుణాభి వర్ణన చేసేవారు. 


బృందావన స్త్రీలు భగవానుని దివ్య మంగళ విగ్రహంపై అనురాగం కలిగినవారు. అంబరీషుడు భగవత్పూజలో ఆసక్తి కలవాడు. ప్రహ్లాదుడు నిరంతర హరినామ స్మరణను విడువనివాడు. హనుమంతుడు శ్రీరాముని సేవకే అంకితమయ్యాడు. ఉద్ధవార్జునులు సఖ్య భక్తిగలవారు. 


దేవకీ, కౌసల్యలు పుత్ర వాత్సల్యంతో కూడిన ప్రేమ గలవారు. రుక్మిణీ సత్యభామలు భగవంతుని భర్త రూపంలో ప్రేమించేవారు. బలి చక్రవర్తి, విభీషణుడు భగవంతునికి సర్వ సమర్పణ అయినవారు. సనత్కుమార యాజ్ఞవల్క్యులు భగవన్మయులుగా ఉన్నారు. 


గోపికలు భగవంతుడిని విడచి ఉండలేని ప్రేమికులు. వీరి ప్రేమ సాధారణం కాదు. మానవ ప్రేమ వంటిది కూడా కాదు. వీరంతా ఆయా అవతారాలను భగవత్స్వరూపంగా గుర్తెరిగి ప్రేమించినవారే. అందువల్లనే వారు ఉదాహరణీయులు. 


వీరు ఒక్కోసారి భ్రాంతిలోపడి, నా పుత్రుడు, నా స్నేహితుడు, నా భర్త అని అనుకున్నప్పటికీ వారిలో సహజంగా ఉన్న నానా విధ ప్రేమ వ్యక్తీకరణాలలో భక్తి భావం ఏకరూపం గానే నిరంతరం ఉన్నది. వీరు భ్రాంతి లేని సమయంలో తన్మయత్వం చెంది ఉంటారు.

కామెంట్‌లు లేవు: