7, అక్టోబర్ 2020, బుధవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..

కుమార్తె కాదు..కుమారుడు!


శ్రీ మీరాశెట్టి గారికి మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మీద విపరీతమైన భక్తి విశ్వాసాలు ఉండేవి..తాను నిర్మించిన ఆశ్రమం లోనే శ్రీ స్వామివారు వుంటున్నారనే భావన ఆయన మనసులో ఉండేది కాదు..అందరిలాగానే తాను కూడా శ్రీ స్వామివారి భక్తులలో ఒకడిగా ఉండడానికి ఇష్టపడేవారు..ఎవరికి ఏ సమస్య వచ్చినా..మొగలిచెర్ల వెళ్లి, శ్రీ స్వామివారి సమాధి వద్ద మొర పెట్టుకోమని చెపుతూ వుండేవారు..ధనవంతుడిగా వున్నా..అత్యంత సాధారణ జీవనం గడిపేవారు శ్రీ మీరాశెట్టి గారు..అందిరితోనూ కలుపుగోలు గా వుండేవారు..


ఒకసారి శ్రీ మీరాశెట్టి గారు వింజమూరు వెళ్లారు..అప్పటికి శ్రీ స్వామివారు సిద్ధిపొంది పన్నెండేళ్ళ పైనే అవుతోంది..తనకు తెలిసిన వారింటివద్ద కూర్చుని లౌకిక వ్యవహారాలు మాట్లాడుకోసాగారు..సుమారు ఐదారుగురు కూర్చుని వున్నారు..అందులో ఉన్న నారాయణ అనే వ్యక్తి ని చూసి.."ఏరా..నీ భార్య కు ఇప్పుడు ఎన్నో నెల?..కాన్పు కు ఈ వూరిలోనే ఉంచుతున్నావా?..నెల్లూరు తీసుకెళుతున్నావా?.." అన్నారు..


నారాయణ నిస్పృహతో చూసాడు..


"ఎన్నో నెల అయితే ఏమిటీ మామా?..ఆరోనెల నిండింది..ఈసారి కూడా ఆడపిల్లే పుడుతుందని డాక్టర్ గారు చెప్పారు..ఇప్పటికి ముగ్గురు ఆడపిల్లలు వున్నారు..మొగపిల్లవాడు పుట్టాలని కోరుకున్నాము..మా దురదృష్టం..ఈసారీ కూతురే..ఈ కాన్పు తర్వాత, పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయిస్తాను...ఈ నలుగురిని పెంచి..పెళ్లిళ్లు చేసి పంపిస్తే చాలు.."అన్నాడు..


మీరాశెట్టి గారు ఒక్కక్షణం ఆగి.."నారాయణా..నువ్వూ నీ భార్యా కలిసి..రేప్పొద్దున్నే మొగలిచెర్ల వెళ్లి, శ్రీ దత్తాత్రేయ స్వామి వారి వద్ద మొగపిల్లవాడు పుట్టాలని మొక్కుకోండి.. ఆ స్వామిని వేడుకోండి.. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది.." అన్నారు..


"మామా!..డాక్టరు గారు ఆడపిల్లే పుడుతుందని తేల్చి చెప్పారు..ఇప్పుడు మనం మొక్కుకుంటే మాత్రం కడుపులో ఉన్న బిడ్డ మారుతుందా?..నువ్వు చాదస్తం గా చెప్పొద్దు..నా తలరాత ఇంతే..నన్ను సతాయించవద్దు..మామా..నట్టింట్లో ఆడపిల్ల తిరుగుతుంటే సంతోషంగా ఉంటుంది..కాదనను..కానీ పుట్టిన ముగ్గురూ ఆడపిల్లలే కదా..మొగపిల్లవాడు పుట్టాలని కోరుకోవడం లో తప్పులేదు కదా?..కానీ చేసేదేముంది?..డాక్టర్ గారు ఖచ్చితంగా చెప్పేసాక కూడా.. దేవుళ్లను మొక్కుకోవడం..ఆపైన ఆశపడటం..ఇవన్నీ శుద్ధ దండగ.." అన్నాడు నిరాశతో!..


"అది కాదురా..నా మాట విని రేపు మొగలిచెర్ల వెళ్లి ఆ స్వామి దగ్గర మొక్కుకోండి..నేను ఖచ్చితంగా చెపుతున్నాను..నీకు మొగపిల్లవాడు పుడితే..మొగలిచెర్ల లోని దత్తాత్రేయ స్వామి వారి మందిరం వద్ద శని, ఆది వారాల్లో అన్నదానం చేయిస్తానని చెప్పు..పెద్దవాడిని.. చెపుతున్న మాట ఆలకించు.." అన్నారు..


"మామా..నీ మాటే వింటాను..కానీ నేను, నా భార్యా ఇద్దరమూ కూడా మా ఇంట్లోనే ఆ దత్తాత్రేయుడి పటం పెట్టుకొని..ఇక్కడే మొక్కుకుంటాము..నీ మాట ప్రకారం ఆ స్వామి దయవల్ల మాకు మొగ సంతానం కలిగితే..ఒక వారం కాదు మామా..మూడు వారాలు వరుసగా నేనే అన్నదానం చేస్తాను..ఎంతమందికైనా అన్నం పెడతాను..సరేనా?.." అన్నాడు నారాయణ..


మీరాశెట్టి గారు అలాగే చేయండి అని నారాయణ తో చెప్పి, శ్రీ స్వామివారి పటం తెప్పించి..వాళ్ళింట్లో పెట్టించారు..నారాయణ దంపతులు శుచిగా స్నానం చేసి, ఆ పటాన్ని తమ పూజాపీఠం లో పెట్టుకొని..మొగ సంతానం కలగాలని మనస్ఫూర్తిగా మొక్కుకున్నారు..


ఆ దంపతులు శ్రీ స్వామివారి పటానికి రోజూ భక్తిగా నమస్కారం చేసుకుంటూ వున్నారు..మరో మూడు నెలలు గడిచాయి..నారాయణ భార్య కు ప్రసవం జరిగి..మొగపిల్లవాడు పుట్టాడు..నారాయణ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి..ఉన్న ఫళంగా మీరాశెట్టి గారు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని..అక్కడికి వెళ్ళిపోయాడు..నేరుగా మీరాశెట్టి గారి కాళ్లకు నమస్కారం పెట్టి.."మామా..నువ్వు చెప్పినట్లే మాకు మొగపిల్లవాడు పుట్టాడు..అంతా ఆ స్వామి దయ.." అన్నాడు..


మీరాశెట్టి గారు నవ్వి.."ఆ దత్తాత్రేయ స్వామిని నమ్ముకుంటే న్యాయం చేస్తాడని నేను ముందే చెప్పాను కదరా!..నువ్వు స్థిమితం పొంది..వీలున్నంత తొందరలో మొగలిచెర్ల వెళ్లి, దత్తాత్రేయ స్వామిని దర్శించుకొని.. అక్కడ అన్నదానం చేయించు.." అన్నారు..


మరో నెల తర్వాత నారాయణ భార్యా సమేతంగా మొగలిచెర్ల వచ్చి, శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకున్నాడు.. తాను చెప్పిన విధంగానే..మూడు వారాల పాటు, ప్రతి శని ఆదివారాల్లో అన్నదానం చేసాడు..


మీరాశెట్టి గారికి శ్రీ స్వామివారి మీద ఉన్న భక్తీ విశ్వాసాలు రెట్టింపు అయ్యాయి..మీరాశెట్టి గారి ద్వారా తెలుసుకున్న మరో అనుభవం రేపు చదువుకుందాము..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: