7, అక్టోబర్ 2020, బుధవారం

**సౌందర్య లహరి**

 **దశిక రాము**




**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


ఎనిమిదవ శ్లోక భాష్యం - మూడవ భాగం


కామేశ్వరుని పర్యంక నిలయయైన అంబికకు భగవత్పాదులవారు కామేశ్వరి అనో, రాజేశ్వరి అనో, రాజరాజేశ్వరి అనో శృంగార సుందరి అనో పిలవడం లేదు. జ్ఞానంలో పరాకాష్ట చేర్చుతూ ఆమెను *చిదానందలహరి* అన్న పేరుతో స్తుతిస్తున్నారు. ఆచార్యులవారి కవిత్వపటిమను ఈ సంబోధన తెలియజేస్తుంది. అంబిక అయ్యతో శృంగార మూర్తిగా ఉన్నా అది ఆత్మ శృంగారం. సత్యవస్తువుకు అభిన్నమైన స్పృహవలన జనించిన బ్రహ్మానందం కదా అది. సింహాసనం పైనో, మంచం పైనో, మేరుపర్వత శిఖరం పైన ఉన్న భవంతిలోనో, సుధాసాగర మధ్యస్తమైన మహాప్రాసాదంలోనో ఎక్కడుంటే ఏమి ఆమె ఆత్మస్పృహ వలన జనించిన చిదానంద ప్రవాహం. ఈ పదం ఉపయోగించడంలో ఆచార్యులవారి ఉద్దేశం ఇది.


అటువంటి చిదానంద ప్రవాహాన్ని - *భజంతి త్వాం ధన్యః కతిచన* అంటే అదృష్టవంతులైన కొందరు అటువంటి నిన్ను పూజిస్తున్నారు. కొద్దిమంది మాత్రమే ఏమి. ఎంతోమంది దేవీ పూజలు చేస్తున్నారు. రోజురోజుకూ సంఖ్య పెరుగుతూ ఉంది కూడా! కొన్ని పదాలు గొణగడం, కర్పూరం వెలిగించడం పూజ అవుతుందా ? నిజమైన పూజ అంటే ఏమిటి ?


క్రిందటి శ్లోకంలో అంబిక మూర్తిని గురించి వివరించబడింది కదా! ఆ మూర్తిని భావించి హృదయంలో ముద్రించుకోవాలి. మనం కూడా అంబిక నివసిస్తున్న శ్రీనగరంలో ఉన్నామని భావించుకోవాలి. ఆమె దయ అమృతసాగరమని, మనం కల్పవృక్షాల మధ్యలో మణిద్వీపంపై ఉన్నామని, మన పూజగది సర్వకాంక్షలను తీర్చగలిగే చింతామణులతో నిర్మించబడిందని ఊహించాలి. ఈ భావం స్థిరపడినప్పుడు సిద్ధించేది *సాలోక్య మోక్షమని* నా ఉద్దేశం. సాధారణంగా సాలోక్యముక్తి అంటే మన ఇష్టదేవతలకు సంబంధించిన లోకంలో ఆవాసం చేయడమన్న భావం ఉంది. అయితే మనమున్న ఈ ప్రదేశమే మన ఇష్టదేవత నివసించే లోకమనే భావనను దిటవు చేసుకోవడమే ఉత్తమం.


*సాలోక్యం* తరువాతది *సామీప్యం*. సుధాసాగరపు గట్టుమీద నుండి కల్ప వృక్షాల అరణ్యాన్ని, కడిమిచెట్ల ఉద్యానవనాలను దాటుకుని, చింతామణి గృహంలో ప్రవేశించి అంబిక శయనించే మంచం దగ్గరకు చేర్చడం *సామీప్యం*. ఇక *సారూప్యం*. తుమ్మెద గురించి నిరంతరం ఆలోచిస్తూ తుమ్మెద అయిపొయే రీతిలో నిరంతరం అంబిక దివ్య మోహన రూపాన్ని ఆలోచిస్తూ అదే మూర్తిని పొందవచ్చు. ముందు శ్లోకంలో వర్ణించిన అంబిక స్వరూపాన్ని ధారణచేసి, ధ్యానిస్తే కామేశ్వర పర్యంక నిలయగా ఆ తల్లిని భావనతో చూస్తూ కరిగిపోతే *సారూప్యం* సిద్ధిస్తుంది.


పరమమైన ముక్తి *సాయుజ్యం* ఇష్టదేవతతో ఐక్యమయిపోవడం. ఇంతకుముందు ముక్తిలో మనం అంబికను పోలిన రూపాన్ని పొందాం. ఇప్పుడు అంబికే అయిపోవడం. అదే సత్యం మనమయిపోవడం. ఆ సత్యాన్నే ఆచార్యులవారు *చిదానందలహరి* - అనంతమైన ఆనంద ప్రవాహమైన ఆత్మస్పృహ అంటున్నారు. ఆ ప్రవాహంలో మనం కరిగిపోవాలి. అదే *సాయుజ్యం*. దానితరువాత మరి ఇంకే పూజా అవసరం లేదు. పూజ చేయవలసిన స్థితిలో ఉన్నంతవరకూ ఆ చిదానందలహరిలో ఆ అద్వైత తత్త్వంతో కరిగిపోయే లక్షణం పెంపొందించుకోవాలి.


అంబిక లోకమైన శ్రీపురాన్ని చేరడం, ఆమె రూపాన్ని పొందడం, ఆమెలో ఐక్యమయిపోవడం అని క్రమంగా జరగనీయండి. ప్రస్తుతానికి మానసికంగా మనలను ఆ స్థితులకు (సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యాలకు) ఆయత్త పరుచుకోవాలి. పూజకు కూర్చున్నామా మన మనస్సు ఆమె పాదాలకు అటుఇటు కదలకూడదు. ఆఫీసుకు సమయం అయిపోతున్నదేమో, ఈ రోజు కాంటీనులో ఏ రకం వడ వేస్తాడన్న ఆలోచనలు మీ ఏకాగ్రతను భంగం చేయరాదు. మీ మనస్సు అమృత సముద్రపు అలలలో తడిసిపోవాలి. చివరకు చిదానంద సాగరమైన అంబిక సత్యరూపంతో కలిసిపోవాలి.


మనం ఆ రకమైన పూజ చేస్తున్నామా ? కొందరు మహాపురుషులు పూర్వజన్మ సుకృతం వలన అంబిక స్వరూపంలో చిదానంద రసాన్ని ఎఱుకలోనికి తెచ్చుకొనేంతటి ఏకాగ్రతతో పూజచేస్తారు. వారే ఆచార్యులవారు చెప్పిన *కతిచన ధన్యః* - కొందరు ధన్యులు.


(సశేషం)


కృతజ్ఞతలతో


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: