7, అక్టోబర్ 2020, బుధవారం

గురువు

 **



ఎవరి గురువు వారికి ఉన్నారు. మనకు, మానవులకు మాత్రం *ప్రకృతి, పంచభూతాలు, సృష్టి సర్వం గురువులే.* అది మన అదృష్టం. *ప్రతి జీవి, ప్రతి అణువు ఏదో ఒక విద్యను నేర్పిస్తాయి. ఏదో ఒక మెలకువను తెలియజేస్తాయి. మనం నేర్చుకోవటమే తరువాయి. ఈ నిరంతర అధ్యయనం మనషికెంతో రాణింపును తెస్తుంది. ఆహార సంపాదన, ఐకమత్యం, ప్రేమ, త్యాగం, సేవ, వైరాగ్యం, నిరంతర శ్రమ, స్వయం కృషి, ఇతరుల మీద ఆధారపడకపోవటం, పంచుకుని అనుభవించటం...నిశితంగా పరిశీలిస్తే ప్రతి ఒక్క గుణమూ మనిషి నేర్చుకోదగ్గదే.* 


ఇప్పుడు ప్రపంచమంతా ఆదరిస్తున్న, ఆచరిస్తున్న ‘యోగ’ ఆసనాలు పక్షుల్ని, జంతువుల్ని చూసి రూపకల్పన చేసినవే. అలాంటప్పుడు ఈ సమస్త లోకాన్ని గురువుగా అంగీకరించటంలో దోషమేమీ లేదనిపిస్తుంది.


*నిజానికి- లోకమే ఒక పాఠశాల.* మనం విద్యను అభ్యసించడానికి పాఠశాలకు వెళ్ళే చాలా ముందుగానే దాదాపు పురిటిగది నుంచి మనకు విద్యాభ్యాసం మొదలవుతుంది. *జీవితాన్ని జీవించటం, అంటే కేవలం ఆహార నిద్రా మైథునాలు కావు.* 


*జీవితం అంటే ప్రతి క్షణం ఒక అనుభవం. ప్రతి అనుభవం ఒక పాఠం. ఔను. అనుభవమే. అనుభవాల సమాహారమే జీవితం అంటే.* 


అది గుడ్డెద్దు చేలో పడ్డట్లు కాకుండా ఆ *ప్రతి క్షణ అనుభవం ప్రతి క్షణ అధ్యయనం కావాలి. అనుభవం, అధ్యయనం ఏకకాలంలో జరగాలి.* కాడెద్దుల్లా రెండూ ఏకకాలంలో కదలాలి. సంయమనంతో నడవాలి. అప్పుడు జీవితం పంటచేనులా పచ్చనిపంటతో నిండుగా శోభిస్తుంది.


పూర్వం ప్రతి ఇంట్లో పూలమొక్కలుండేవి. పండ్లవృక్షాలుండేవి. ఎన్నో కొన్ని పక్షులు, పెంపుడు జంతువులు ఉండేవి. గమనిస్తే, వాటి *జీవన విధానంలోనే మనకు పాఠాలు వ్యక్తమయ్యేవి. ప్రేమ, పంచుకు జీవించటం, త్యాగం, ఐకమత్యం, ఆపదల్లో ఒకదాన్నొకటి కాపాడుకునే తత్వం... ఎన్నో. సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు, చెట్టూ, పుట్ట... అందరికీ, అన్నింటికీ వారి వారికి, వాటి వాటికి తెలీకుండానే ఇవ్వటమే పరమావధి.* మనిషికి తప్ప మరొకరికి దోచుకు తినటం తెలీదు- ఆహార సంపాదన కోసం వేట లాంటివి తప్ప.


మనిషికి *జీవితం ఎంత అనిశ్చితమో తెలుసు. ఎంత సంపాదించినా ఏదీ వెంట రాదనీ తెలుసు. జీవితం అత్యంత అమూల్యమని, జన్మోద్దేశం మనం అనుసరిస్తున్నది కాదని, వేరే ఉందని తెలుసు. అయినా అమాయకత్వం, అజ్ఞానం, అవిద్య... ఇది చాలా శోచనీయం.* 


మనకు మరో ఉత్తమోత్తమమైన మానవ రూప గురువు లభించకపోయినా ఖేదపడవలసిన అవసరం లేదు. *భగవంతుడున్నట్లే ప్రతి అణువులో గురుస్వరూపం ఉంది. దాన్ని గ్రహిస్తే చాలు. స్వీకరిస్తే చాలు. అధ్యయనం చేస్తే చాలు. ఆచరిస్తే చాలు.* 


మనం నిశితంగా పరిశీలిస్తే మనిషిని చూసి ప్రకృతిలోని ఏ జీవీ నేర్చుకోవలసిందేమీ లేదు. *ప్రకృతిలోని ప్రతి జీవి, చెట్టు, పుట్ట, చీమ, చిలుక... ఏదైనా తన సహజ జీవన విధానంతోనే మనకు ఉత్తమ విద్యను, విధానాన్ని బోధిస్తాయి.* ఉన్నత విలువలను అందిస్తాయి. 


*మన చూపు కేవలం ఆస్వాదనకు కాదు. అధ్యయనానికి కూడా.* 

ఆ తరవాత ఆచరణకు. మనకు మహోన్నత గురుపీఠం, ఉద్గ్రంథాలు, సాధనా శిబిరాలు.. అవసరం లేదు. ప్రకృతి చాలు. 


ప్రపంచం చాలు. అమాయక జీవజాలం చాలు. *అన్నింటినీ పాల కళ్లతో అత్యంత ఆసక్తితో చూసే అమాయక శిశువుల్లాంటి పసిమనసు చాలు!*


〰〰〰➿〰〰〰

కామెంట్‌లు లేవు: