శ్రీరామ ( వాల్మీకి రామాయణం - 25)
(పరశురాముడు- 2)
🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏
సర్వే జనాః సుఖినో భవన్తు 🙏
----
(3-4-'26 పోష్టు తరువాయి భాగము)
ఇంతకు ముందు పోష్టులో శ్రీ పరశురాముని జననం గురించి చెప్పుకున్నాము
శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారములలో ఆరవవాడైన పరశురాముడు, వైశాఖ శుద్ధ తదియ నాడు అవతరించాడని స్కాంద పురాణం, బ్రహ్మాండ పురాణం తెలియజేస్తున్నాయి.
పరశురాముడు శివుని వద్ద విద్యాభ్యాసం చేశాడు.
ఆయన ధరించిన గండ్రగొడ్డలి శివుడు అనుగ్రహించి ఇచ్చినది.
శ్లో// వైశాఖస్య సితే పక్షే
తృతీయాయాం పునర్వసౌ!
నిశాయాః ప్రథమయామే తు
రామాఖ్యః సమయే హరిః!!
స్వోచ్ఛగైః షడ్గ్రహైర్యుక్తే
మిథునే రాహు సంస్థితే!
రేణుకాయాస్తు యోగర్భాత్
అవతీర్ణో హరిఃస్వయమ్!!
(వైశాఖ శుద్ధ తృతీయనాడు, (అక్షతదియ)
రాత్రి మొదటి జామున, పునర్వసు
నక్షత్రంలో, ఆరుగ్రహాలు ఉచ్ఛస్థితి
లోనుండగా, రాహువు
మిథునమునందుండగా, రేణుకా
గర్భంనుండి హరి పరశురామునిగా
అవతరించెను)
అని స్కాంద,భవిష్య పురాణములలో చెప్పబడింది.
పరశురామ జయంతి చాలా పవిత్రమైనదని,
ఆరోజు అందరూ ఉపవసించి, పరశురాముని షోడశోపచారములతో పూజించి, "జమదగ్నిసుత! వీర! క్షత్రియాంతక ప్రభో! గృహాణార్ఘ్యం మయా దత్తం కృపయా పరమేశ్వర!" అని అర్ఘ్యప్రదానం చేయవలెనని శాస్త్ర గ్రంథములు ఉపదేశిస్తున్నవి.
శ్లో// జామదగ్న్య మహావీర
క్షత్రియాంతకర ప్రభో
గృహాణార్ఘ్యం మయాదత్తం
కృపయా పరమేశ్వర ॥
(క్షత్రియుల నంతము చేసిన,
మహావీరుడవైన ఓ పరశురామా !
నేనిచ్చిన అర్ఘ్యమును దయతో
స్వీకరించుము)
విలక్షణమైన ఈ పరశురామావతారంలో,
అధర్మవర్తనులై, భూమికి భారంగా పరిణమించిన క్షత్రియులను సంహరించడానికి,
పరశురాముడు,
ఒక్క భటుడి సహాయం కూడా లేకుండా,
దేశమంతా ఇరవైయొక్క మార్లు తిరిగి తిరిగి, అనేకమంది రాజులను, లక్షలాది వారి చతురంగ బలాలను, కేవలం గండ్రగొడ్డలే ఆయుధంగా, ఒంటరిగా సంహరించాడు.
చిరంజీవిగా ఇప్పటికీ మహేంద్ర పర్వతంపై నివసిస్తున్నాడు.
ప్రస్తుత కథావిషయానికి వద్దాం.
"పాలకులు" ధర్మమార్గంలో ఉంటే దేశం సుభిక్షంగా వుంటుంది.
వారు అధర్మమార్గాన్ని అనుసరిస్తే దేశం అల్లకల్లోలం అవుతుంది.
ధర్మపరుడైన రాజు కలియుగాన్ని "కృతయుగం" లాగా చేయగలడు.
అధర్మపరుడైన రాజువల్ల కృతయుగం కూడా "కలియుగం" అవుతుంది.
మహాభారతంలో కుంతీదేవి కూడా యుద్ధం చెయ్యమని
శ్రీ కృష్ణుని ద్వారా, ధర్మరాజుకు సందేశం పంపిస్తూ,
"రాజా కాలస్య కాలః" ( రాజు కాలానికి కూడా కాలుడు) అనగా,
రాజు దేశ, కాలాలను కూడా శాసించి ప్రజలను
ధర్మమార్గంలో నడపగలడు,అన్నది.
శ్లో//కాలోవా కారణం రాజ్ఞః రాజావా కాలకారణమ్/
ఇతి తే సంశయో మాభూత్ "రాజా కాలస్య కారణమ్"//
(ఓ ధర్మరాజా! రాజు కాలానికి కారణమా! కాలం రాజుకు కారణమా అనే సందేహం వద్దు.రాజే కాలానికి కారణం).
కృతయుగాన్ని, త్రేతాయుగాన్ని, ద్వాపరయుగాన్ని,కలియుగాన్ని,సృష్టించగలవాడు రాజే.
అంతా ప్రారబ్ధం అని చేతులు ముడుచుకుని కూర్చోకుండా క్షత్రియ ధర్మమైన యుద్ధం చెయ్యి" అన్నది.
(పరమాచార్యస్వామివారి భక్తుడు, మాజీ ఎన్నికల అధికారి అయిన "శ్రీశేషన్ గారు" దీనికి చక్కని ఉదాహరణ)
అయితే అత్యంత శక్తివంతమైన అటువంటి పాలకవ్యవస్థ, పరశురాముడి కాలంలో గాడి తప్పింది.
పాలకులైన క్షత్రియజాతికి
అధికార దర్పం తలకెక్కి ధర్మం పట్ల అంధులయ్యారు.
వారిలో కొందరు కొన్ని ఉపాసనలు కూడా చేసి, శక్తులు సంపాదించి గర్వంతో విర్రవీగేవారు.
శాంతమును ఆశ్రయించి, తపస్సు,స్వాధ్యాయములతో నిత్యము కాలం గడిపే బ్రాహ్మణులను కూడా, వారు అవమానించసాగారు.
భూమండలమంతా పాలకుల అకృత్యాలతో నిండిపోయింది.
భూభారం అధికమైంది.
ఆ భూభారం తగ్గించడానికి
భగవంతుడైన శ్రీ మహావిష్ణువు "రాముడు" (పరశురాముడు) అనే పేరుతో భృగువంశములో, జమదగ్ని మహర్షికి కుమారుడుగా అవతరించాడు.
ఆ కాలంలో శ్రీ దత్తాత్రేయ మహాస్వామిని ఆరాధించి "కార్తవీర్యార్జునుడు" అనే హైహయ వంశ క్షత్రియుడు అనేక అతీంద్రియ శక్తులు సంపాదించాడు.
వేయి చేతులు కలవాడయ్యాడు.
ఎవరినైనా జయించగలిగే శక్తి సంపాదించాడు.
అష్టసిద్ధులు స్వాధీనం చేసుకున్నాడు.
శ్లో//యోగేశ్వరత్వ మైశ్వర్యం గుణా యత్రాణిమాదయః/
చచారావ్యాహతగతి ర్లొకేషు పవనో యథా//
(అణిమాది అష్ట సిద్ధులతో కూడిన ఐశ్వర్యము,వాయువు వలె అడ్డులేని గమన శక్తులతో కూడి ఆ కార్తవీర్యుడు లోక సంచారం చేశాడు)
ఒక రోజు సైన్యముతో సహా అడవిలో మృగములను వేటాడుతూ, కార్తవీర్యుడు జమదగ్ని మహర్షి ఆశ్రమంలో ప్రవేశించాడు.
మహర్షి ఆయనకు అతిధి సత్కారాలు చేసి, తన దగ్గర ఉన్న కామధేనువు సహాయంతో, రాజుకు,మంత్రులకు, సైన్యానికి దివ్యమైన భోజనముతో ఆతిధ్యం ఇచ్చాడు.
ఒక బడుగు బ్రాహ్మణుడు అన్ని వేలమందికి,
మహారాజులు కూడా ఇవ్వలేని ఆతిధ్యం ఇవ్వడం
అహంకారపూరితుడైన కార్తవీర్యార్జునుడు సహించలేక పోయాడు.
సద్గుణములు లేని వానికి తపశ్శక్తులు అనర్ధాన్ని తెచ్చి పెడతాయి.
జమదగ్నిమహర్షి ఆతిధ్యాన్ని అభినందించే బదులు, అహంకారంతో,అసూయతో, కార్తవీర్యార్జునుడు
ఆయనను తృణీకరించాడు.
జమదగ్ని ఐశ్వర్యమునకు కారణమని తాను భావించిన కామధేనువును,దూడను బలాత్కారముగా తన పట్టణమైన మాహిష్మతీ పురానికి తరలించాడు.
ఆ విషయం తెలుసుకున్న పరశురాముడు అగ్రహోదగ్రుడై, ధనుర్బాణములను,
గండ్రగొడ్డలిని ధరించి ఒంటరిగా మాహిష్మతికి వెళ్ళాడు.
(సశేషం)
శుభమస్తు,
తూములూరి మధుసూదనరావు,
4-4-'26.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి