4, ఏప్రిల్ 2026, శనివారం

శ్రీ మహా విష్ణు పురాణము

 🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹

*శనివారం 4 ఏప్రిల్ 2026*


       *శ్రీమహా విష్ణు  పురాణము 

`` *47వ భాగం*``


*నరసింహావతారం హిరణ్యకశిపుడి సంహారం*```


లీలావతి ప్రహ్లాదునికి కాలకూట విషము కలిపిన పాయసము పట్టలేక కన్నీళ్ళు కారుస్తూ ప్రహ్లాదునితో “నాయనా! ఎందుకు శ్రీహరి నామ స్మరణ పై పట్టుదల నీకు. దానవ వైరి నారాయణుడు అని మీ తండ్రి చెప్పిన మాట వినుము. హరినామ స్మరణ మానివేయుము. నీకు విషం పెట్టలేను. పుత్రశోకం పొంద

లేను” అని బ్రతిమాలింది.


ప్రహ్లాదుడు తల్లిని ఓదారుస్తూ.. “అమ్మా! సకల జగత్తుకు ప్రభువైన నారాయణుడు తన భక్తులను సదా కాపాడుతాడు. శ్రీహరి అండ ఉంది కనుక తండ్రి గారు ఎన్ని మరణ దండనలు వేసినా నాకు ఏమియు కాలేదు. కర్మ ఫలం పరిపక్వం కానిదే ఏ జీవికి మృత్యువు రాదు. మృత్యు సమయం వస్తే ఏంచేసినా ఆగదు. శ్రీహరిని నమ్మి తండ్రిగారు ఆజ్ఞాపించి నట్లు చేయుము” అని ధైర్యం కలిగించాడు.


మనస్సులో నారాయణుని స్మరించి లీలావతి కాలకూట విషము కలిపిన పాయసపు పాత్ర ప్రహ్లాదునికి ఇచ్చింది. 

నారాయణ నామం జపిస్తూ ప్రహ్లాదుడు ఆ పాయసం సేవించాడు. నారాయణ నామ స్మరణ ఆ కాలకూట విషాన్ని అమృతంగా మార్చివేసింది. నీలపు రంగుకి మారుతుంది అనుకున్న ప్రహ్లాదుడి శరీరం బంగారు తేజస్సుతో ప్రకాశ మానమైంది.


చూస్తున్న హిరణ్యకశిపుడు ఆశ్చర్యపడ్డాడు. తన కుమారుని చెంత అదృశ్యరూపంలో శ్రీహరి ఉండి సహాయం చేస్తున్నాడని తలచాడు. ప్రహ్లాదుని తీసుకుని రాజసభకు వెళ్లాడు. సభాసదులందరి ముందు దగ్గరకు పిలిచి “ప్రహ్లాదా! నాకు భయపడి వైకుంఠం వదలి పారిపోయిన శ్రీహరి అదృశ్యంగా నీ వెంట ఉండి నిన్ను రక్షిస్తున్నాడు అని తెలుసుకున్నాను. నాకు కనపడని నారాయణుడు నీకు కనపడతున్నాడా? కనపడుతున్నట్టైతే ఎక్కడ ఉన్నాడో చెప్పుము. అతనిని హతమార్చి నా పగ తీర్చుకుంటాను. నీకూ నీ తండ్రి బల పరాక్రమాలు తెలుస్తాయి" అని అడిగాడు. 


ప్రహ్లాదుడు తండ్రికి నమస్కరించి “తండ్రీ! నారాయణుడు జగత్తు అంతటా ఉన్నాడు. ఇందుగలడు అందులేడని సందేహం వద్దు తండ్రీ! భక్తితో ఎక్కడ వెతికినా అక్కడ శ్రీహరి కనపడతాడు. నారాయణ నామం జపిస్తూ ఎక్కడైనా వెతుకుము. తప్పక శ్రీహరి కనిపిస్తాడు” అని భక్తిభావంతో చెప్పాడు.


హిరణ్యకశిపుడికి నచ్చక హేళన చేస్తూ “ప్రహ్లాదా! నీవన్నది నిజమే అయితే మరి ఈ స్థంభంలో ఉంటాడా నీ శ్రీహరి! పగలకొడితే వస్తాడా!”అని గట్టిగా నవ్వాడు. 


సభాసదులు నవ్వారు. ప్రహ్లాదుడు మాత్రం “ఉన్నాడు తండ్రీ! తప్పక బయటకు వస్తాడు” అనడంతో హిరణ్యకశిపుడు తన గదతో గట్టిగా ఆ స్థంభాన్ని కొట్టాడు.


సభలోని వారందరూ భయపడేలా భీకర ధ్వనితో స్థంభ మధ్యభాగం పగిలింది. స్థంభంలో నుండి భీకర సింహ గర్జనలు చేస్తూ ఉగ్రరూప నరసింహావతారంలో శ్రీహరి బయటకు వచ్చాడు. దేహమంతా మానవరూపం కలిగి శిరస్సు మాత్రం సింహపు శిరస్సు ఉంది. చతుర్భుజాలు కలిగి శిరస్సు నుండి వేలాడుతున్న సింహపు జూలును చేతికున్న పొడవైన సింహపు వ్రేళ్ళతో పక్కకు తీసుకుంటూ స్థంభం నుండి బయటకు దూకి వచ్చాడు.


ఉగ్రనరసింహుని చూసి సభలోని వారు భయపడి పారిపోసాగారు. ప్రహ్లాదుడు భక్తితో నమస్కరించి పక్కకు నిలుచున్నాడు. తన ఎదుటకు గర్జిస్తూ వస్తున్న నరసింహుని చూసి “నారాయణా! ఎన్నాళ్లకు కనిపించావు. నీకోసం వెతకని చోటు లేదు. వైకుంఠం వచ్చినా పారిపోయి దాక్కున్నావు. నా సోదరుడు హిరణ్యాక్షుడిని వరాహ రూపంలో చంపినట్టు, నన్ను ఈ సింహరూపంతో భయపెట్టి చంపాలనుకుంటున్నావు నేను బ్రహ్మవర ప్రసాదిని. నాకు ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాగైనా మరణం లేని వరం పొందాను. నిన్నే హతమార్చి నా పగ తీర్చు కుంటాను" అని ఆగ్రహంతో ముందుకు వచ్చి గదతో నరసింహుని వక్షస్థలంపై బలంగా కొట్టాడు. నరసింహుని వజ్ర శరీరానికి ఆ గదే ముక్కలై పోయింది.


హిరణ్యకశిపుడు భయభ్రాంతుడయ్యాడు. నరసింహుడు కోపంగా సింహగర్జనలు చేస్తూ హిరణ్యకశిపుని ఒడిసి పట్టుకుని బరబరా ఈడ్చుకుని రాజభవనపు సింహ ద్వారము వద్దకు వెళ్లాడు. అక్కడ సింహద్వారము మీద తాను కూర్చుని హిరణ్యకశిపుని లాగి తన తొడలపై పడుకోబెట్టాడు. సభాసదులు భయంతో వణికి పోతుంటే హిరణ్యకశిపుడు నిశ్చేష్టుడై చూస్తున్నాడు.


సూర్యాస్తమయం జరిగే సాయం సంధ్యా సమయం అది. ఇటు పగలు కాదు అటూ రాత్రి కాదు. వెలుగు తగ్గుతుంటే చీకట్లు కమ్ముతున్నాయి. నరసింహుడు భీకర గర్జన చేసి “హిరణ్యకశిపా! ఇది పగలు కాదు రాత్రి కాదు. సంధ్యా సమయం. నీవు ఇంటిలో లేవు. బయటా లేవు. ఆకాశంలో లేవు. భూమి మీద లేవు. నా అంకపీఠం (తొడలపై) మీద ఉన్నావు. నేల-నీరు-ఆకాశము కాకుండా నేను నీ రాజభవన సింహద్వారము పై కూర్చుని ఉన్నాను.


నేను పూర్తి మానవుడను కాను, పూర్తి జంతువుని కాను. నరుడు, సింహము కలసి ఉద్భవించిన ఉగ్రనరసింహుడను. ఆయుధా

లేవీ ఉపయోగించకుండా నేను నా సింహపు చేతి గోళ్ళతో నిన్ను చీల్చి సంహరిస్తాను.మృత్యువుకి బ్రహ్మదేవుడి వరం అడ్డం కాదు, రాదు” అంటూ చేతిగోళ్ళతో హిరణ్యకశిపుడి గుండెలు చీల్చి వేశాడు. రక్తం బయటకు చిమ్మి నరసింహునికి రక్తాభిషేకం చేసింది.


చనిపోయే ఆఖరి క్షణాల్లో హిరణ్యకశిపుడికి తన గత జన్మ, జయవిజయులైన తమకు సనక

సనందనాదుల శాపం గుర్తుకు వచ్చాయి. “నారాయణా! శాపం వలన నీకు శత్రువులుగా జన్మించిన మా మొదటి జన్మ సమాప్త మవుతోంది. మరో రెండు జన్మలు కూడా తొందరగా ముగించి నీసన్నిధికి చేరే భాగ్యం ప్రసాదించు" అని ప్రాణాలు వదిలేశాడు. 


హిరణ్యకశిపుడి ఆత్మజ్యోతి దేహము నుండి వెలువడి నరసింహ స్వామిలో లీనమైంది.


బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమై నరసింహ స్వామిని స్తుతిస్తూ స్తోత్రాలు చేసారు. ప్రహ్లాదుడు ఉగ్ర నరసింహుని శాంతింప చేస్తూ నరసింహ స్తోత్రమ్ పఠించి కర్పూర నీరాజనాలు అర్పించాడు. శాంతించిన నరసింహుడు ప్రహ్లాదుని దగ్గరకు తీసుకుని మనోభీష్టం చెప్పమన్నాడు.


ప్రహ్లాదుడు నమస్కరించి "పరమాత్మా! నరసింహ రూపంలో దర్శన భాగ్యం కలిగించావు. ఈ రూపంలో భూమి పై వెలసి నీ భక్తుల కోరికలు తీర్చి మరణానంతరం నీ సన్నిధి పొందే భాగ్యం కలిగించుము" అని కోరాడు. నరసింహుడు తథాస్తు అని ఆశీర్వదించిఅదృశ్యమయ్యాడు. ఆనాటి నుండి భూమి పై లక్ష్మీ నరసింహ క్షేత్రాలు వెలసి భక్తుల అభీష్టాలు నెరవేరుస్తున్నాయి.


*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*

*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*


*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: