🌹🌷🪷🐚🛕🐚🪷🌷🌹
*శుక్రవారం 3 ఏప్రిల్ 2026*
*శ్రీ మహావిష్ణు పురాణం*
`` *46వ భాగం*``
*నరసింహావతార కథ- హిరణ్య కశిపుడు ప్రహ్లాదుని నారాయణ నామ స్మరణ సహించలేక చంప డానికి చేసిన ప్రయత్నాలు విఫలం అవుట*```
హిరణ్యకశిపుడు ‘గురుకులంలో చేరిన ప్రహ్లాదుడు దైత్యగురువుల బోధనకు మారిపోయి శ్రీహరినామ స్మరణ వదలివేస్తాడు’ అని భావించాడు.
కానీ ప్రహ్లాదుడు గురుకులంలో తోటి విద్యార్థులను హరిభక్తులుగా మార్చసాగాడు. ‘శ్రీమహావిష్ణువు సకల చరాచర జగత్తుని పరిరక్షించే వాడు. శ్రీహరినామస్మరణ, భజనయే అసలైన విద్య’ అని అందరి చేత నారాయణ నామ భజనచేయించ సాగాడు.
దైత్య గురువులు అనేకవిధాల నచ్చచెప్పి, భయపెట్టి ప్రహ్లాదుని మార్చే ప్రయత్నం చేసారు.
కానీ ప్రహ్లాదుని చేత హరినామస్మరణ మాన్పించలేకపోయారు. హిరణ్యకశిపుడికి తెలిస్తే తమప్రాణాలకు ముప్పువస్తుందని భయపడసాగారు. వారి భయం నిజంచేస్ తూహిరణ్య కశిపుడు తమ కుమారుడి విద్యాభ్యాసం ఎలాఉందో తెలుసు కోవాలని దైత్యగురువులను ప్రహ్లాదుని తీసుకుని తన దగ్గరకు రమ్మని సందేశం పంపాడు.
దైత్యగురువులు భయపడుతూ నిల్చుంటే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని దగ్గరకు పిలిచి ‘గురుకులం లో చదువుకున్నది వివరించి చెప్పమ’ని అడిగాడు.
ప్రహ్లాదుడు తండ్రి పాదాలకు నమస్కరించి "తండ్రీ!ఆచార్యులు సకలవిద్యలు చక్కగా అర్ధం అయ్యేటట్టు నేర్పిస్తున్నారు. అన్ని విద్యల ద్వారా నాకు తెలిసింది, అర్ధమైంది ఒకటే విషయం తండ్రీ! ఈ జగత్తులోని అందరికి తల్లి తండ్రి కర్త భర్త దైవం ఒక్కడే. వైకుంఠ వాసుడైన శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీహరి అనుగ్రహంకోసం నారాయణ నామస్మరణయే సరైన మార్గము" అని ప్రసన్నవదనంతో చెప్పాడు.
హిరణ్యకశిపుడు ఉలిక్కిపడ్డాడు. దైత్య గురువుల వంక కోపంగా చూశాడు. దైత్యగురువులు భయంతో వణికిపోతూ "తాము నారాయణ స్మరణ
మాన్పించడానికి అనేక విధాలుగా ప్రయత్నించామని, కానీ ప్రహ్లాదుడు మొండివాడై తను మారకుండా గురుకుల ఇతర విద్యార్థులచేత కూడా నారాయణ నామస్మరణ చేయిస్తున్నాడని" చెప్పారు.
హిరణ్యకశిపుడు ఆగ్రహంతో "ప్రహ్లాదా! శ్రీహరి దైత్యవంశానికి శత్రువు. మన దానవ చక్రవర్తులెందరినో శ్రీహరి సంహరించాడు. దేవతల పక్షపాతి అయిన నారాయణుడు అందరికి భగవంతుడు ఎలా అవుతాడు?హరినామస్మరణ నిషేధం అని నీకు తెలియదా!" అని అడిగాడు.
ప్రహ్లాదుడు ప్రశాంత వదనంతో "నారాయణుడు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాడు. కారణం లేకుండా ఎవరినీ శిక్షించడు. ప్రపంచమంతా నారాయణుడు ఉంటాడు.
నారాయణునిలో ప్రపంచమంతా ఉంటుంది. మీరు అహంకారం, గర్వంతో ఆవరించిన అజ్ఞానపు పొరలు తొలగించి జ్ఞాన నేత్రాలతో చూస్తే నారాయణపాదపద్మ యుగళ దర్శనం కలుగుతుంది. నారాయణుడే నిత్యుడు,శాశ్వతుడని తెలుసుకుంటారు" అని తండ్రికి నారాయణుని మహిమ గురించి వివరించి చెప్పాడు.
విన్న హిరణ్యకశిపుడికి మతి పోయింది. "చిన్న బాలునిలో ఇంత నారాయణ భక్తా! సందేహం లేదు! తన శత్రువు శ్రీహరి తనను జయించలేక తన కుమారుని విష్ణు మాయలతో మార్చి వేసి తనకు శత్రువుగా చేసాడు" అనుకున్నాడు. కుమారుడు అని జాలి చూపకుండా కఠినంగా శిక్షించాలని అనుకుని భటుల వంక చూసి "వీడు బాలకుడు కాదు. బాలుని రూపంలో ఉన్న నా శత్రువు నారాయణుడు. దానవ వంశంలో ఉండదగినవాడు కాదు. మదమెక్కిన ఏనుగులతో తొక్కించి చంపేయండి" అని ఆదేశించాడు.
ప్రహ్లాదుడు భయపడకుండా నారాయణ నామం జపిస్తూ భటుల వెంట వెళ్ళాడు. సైనికులు మదగజాల ముందు ప్రహ్లాదుని పడవేసి మావటివాళ్ళను ఏనుగులను ప్రేరేపించి తొక్కించి చంపమని చెప్పారు. తమ పాదాలతో ప్రహ్లాదుని తొక్కబోయిన ఏనుగులకు అక్కడ గజేంద్ర రక్షకుడైన నారాయణుడు కనిపించాడు. ఏనుగులు ప్రహ్లాదుని తొక్కకుండా ఘీంకా రాలు చేస్తూ తొండాలతో నమస్కారం చేసాయి.
ప్రహ్లాదుని తొక్కమన్న రాక్షస భటులను, ప్రేరేపించిన మావటివాళ్ళను తొక్కి చంపేసి అడవిలోకి వెళ్లి పోయాయి.
మిగిలిన సైనికులు ప్రహ్లాదుని హిరణ్యకశిపుడి వద్దకు తీసుకెళ్లి జరిగినది చెప్పారు. హిరణ్యకశిపుడి సంశయం తొలగిపోయింది. నారాయణుడు సహాయం
చేస్తున్నాడంటే తప్పకుండా ప్రహ్లాదుడు తన శత్రువే. సైనికులను చూసి "ప్రహ్లాదుని నాగపాశాలతో కాళ్ళు చేతులు కట్ఠివేచి పర్వతము
పై నుండి సముద్రంలోకి విసిరి
వేయండి" అని ఆజ్ఞాపించాడు.
ప్రహ్లాదుడు "తండ్రీ! మీ ఆజ్ఞను తప్పక పాటిస్తాను" అని నమస్కరించాడు.
సైనికులు ప్రహ్లాదుని కాళ్లు చేతులు నాగపాశాలతో కట్టివేసి కొండ పై నుండి సముద్రంలోకి విసిరివేసారు. ప్రహ్లాదుడు నారాయణ నామ స్మరణ వదలకుండా..
"ఓం నమో నారాయణాయ" అని జపిస్తూనే ఉన్నాడు.
సముద్రం అడుగున చేరిన ప్రహ్లాదునికి శ్రీహరి మత్స్యావతారనారాయణుడుగా చతుర్భుజాలలో గదా శంఖ చక్ర పద్మాలు కలిగి దర్శనమిచ్చాడు. స్వహస్తాలతో బంధనాలు తెంపి ప్రహ్లా దుని చేతులలోకి తీసుకుని సముద్రం బయటకు తీసుకు వచ్చి తీరాన దింపాడు. ప్రహ్లాదుడు శ్రీహరికి నమస్కరించి “జగన్నాథా! నీ దర్శనంతో నాజన్మ తరించింది. అజ్ఞానంతో మా తండ్రి చేసే తప్పు లను, నీ పైగల శత్రుత్వాన్ని క్షమించుము. అతనికి ముక్తి
ప్రసాదించుము" అని ప్రార్ధించాడు.
మహావిష్ణువు ప్రహ్లాదుని భక్తికి, సంస్కారానికి సంతోషించి "ప్రహ్లాదా! నీ తండ్రి విరోధంతో నైనా నా నామాన్ని విడవకుండా స్మరిస్తున్నాడు. తప్పక నీ కోరిక మన్నించి తగిన సమయంలో అతనికి మోక్షాన్ని ఇస్తాను" అని పలికి ఆశీర్వదించి
అదృశ్యమయ్యాడు.
రాక్షస భటులు సముద్రం నుంచి క్షేమంగా బయటపడిన ప్రహ్లాదుని చూసి దివ్యమహిమకల బాలుడని భయపడి "రాజకుమారా మీతండ్రి గారి ఆజ్ఞ పాటించి సముద్రంలో పడవేసాము. మాకు నీపై ఎటు వంటి ద్వేషము లేదు. మమ్మల్ని క్షమించుము" అనివేడుకున్నారు.
ప్రహ్లాదుడు వారికి అభయమిస్తూ "నాకు అందరిలో నారాయణుడే కన్పిస్తాడు. మీరు నాకు పూజ
నీయులే" అని నమస్కరించాడు.
రాక్షసభటులు ప్రహ్లాదుని తీసుకుని హిరణ్యకశిపుడి వద్దకు వెళ్లి జరిగింది చెప్పారు. హిరణ్య కశిపుడు ఈసారి చితి పేర్చి ప్రహ్లాదుని మంటల్లో కాల్చివేయమని ఆదేశించాడు.
అగ్ని చేతదహించబడని వరం పొందిన హిరణ్య కశిపుడి చెల్లెలు హోలిక ప్రహ్లాదుని ఒడిలో కూర్చోబెట్టుకుని చితిపై కూర్చుంది. సైనికులు అగ్ని రాజేసారు. ప్రహ్లాదుడు శ్రీహరి నామం జపిస్తున్నాడు. ప్రహ్లాదుని నారాయణ నామస్మరణతో పునీతమైన మంటలు ప్రహ్లాదుని వదలి హోలికను దహనం చేసాయి.
చూస్తున్న జనం, సైనికులు ఆశ్చర్యం, భయం చెందారు. ప్రహ్లాదునికి నమస్కరించారు. యధాప్రకారంగా ప్రహ్లాదుని హిరణ్యకశిపుడి వద్దకు తీసుకెళ్లి జరిగినది చెప్పారు. తనకు తెలియకుండా ఏదో జరుగుతోంది అని అనుకున్న హిరణ్యకశిపుడు ఈసారి తన భార్య లీలావతిని కాలకూట విషము కలిపిన పాయసాన్ని తన కన్నుల ఎదుటే ప్రహ్లాదునికి తినిపించమని ఆదేశించాడు. రాజభటులు కాలకూట విషము తీసుకురావడానికి వెళ్లారు.
*తరువాత కధ రేపటి భాగంలో చదువుదాం*
*శ్రీకాంత్ గంజికుంట కరణంగారి సౌజన్యంతో*
*ఆధ్యాత్మిక బృందం* నుండి వచ్చింది
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి