5, సెప్టెంబర్ 2020, శనివారం

*భాగవతామృతం*


శానకాదుల ప్రశ్నలు

1-40-క.కంద పద్యము

ఆ తాపసు లిట్లనిరి, వి
నీతున్, విజ్ఞాన ఫణిత నిఖిల పురాణ
వ్రాతున్, నుత హరి గుణ సం
ఘాతున్, సూతున్, నితాంత కరుణోపేతున్.
ఆ = ఆ; తాపసులు = ఋషులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = అనిరి; వినీతున్ = విశిష్టమైన నీతిగల వానిని; విజ్ఞాన = విజ్ఞాన మయ; ఫణిత = విధానంలో; నిఖిల = అన్ని; పురాణ = పురాణాల; వ్రాతున్ = సమూహము గలవానిని; నుత = స్త్రోత్రము చేయబడిన; హరి = విష్ణుని; గుణ = గుణముల; సంఘాతున్ = సమూహాలున్న వానిని; సూతున్ = సూతుని; నితాంత = ఎల్లప్పుడు; కరుణ = దయతో; ఉపేతున్ = కూడినవాని.
ఆ శౌనకాది మునీంద్రులు వినయశీలుడు, విజ్ఞాన విశేషంచేత వేదాలను, పురాణాలను పండించుకున్నవాడు, అసంఖ్యాకమైన శ్రీమన్నారాయణుని సద్గుణాలను సంకీర్తించేవాడు, సదా కారుణ్యంతో నిండి ఉండేవాడు ఐన సూతుణ్ణి చూసి ఈ విధంగా అన్నారు
1-41-మ.మత్తేభ విక్రీడితము

"సమతం దొల్లి పురాణపంక్తు లితిహాసశ్రేణులున్ ధర్మ శా
స్త్రములుం నీవ యుపన్యసింపుదువు వేదవ్యాసముఖ్యుల్మునుల్
సుమతుల్ సూచిన వెన్ని యన్నియును దోఁచున్ నీమదిం దత్ప్రసా
దమునం జేసి యెఱుంగనేర్తువు సమస్తంబున్ బుధేంద్రోత్తమా!
సమతన్ = సమబుద్ధితో; తొల్లి = ఇంతకు ముందు; పురాణ = పురాణముల; పంక్తులు = సమూహాలు; ఇతిహాస = ఇతిహాసాల; శ్రేణులున్ = సమూహాలను; ధర్మశాస్త్రములున్ = ధర్మశాస్త్రములను; నీవ = నీవు; ఉపన్యసింపుదువు = వివరించి చెప్పుదువు; వేదవ్యాస = వేదవ్యాసుడు; ముఖ్యుల్ = మొదలైన ముఖ్యమైనవారు; మునుల్ = మునులు; సుమతుల్ = మంచి మనసు గలవారు; సూచినవి = చూచినవి; ఎన్ని = ఎన్నున్నాయో; అన్నియును = అన్నీ; తోఁచున్ = స్పురించును; నీ = నీయొక్క; మదిన్ = మనసుకు; తత్ = వారియొక్క; ప్రసాదమునన్ = అనుగ్రహము; చేసి = వలన; ఎఱుంగనేర్తువు = గ్రహించగలవు; సమస్తంబున్ = సమస్తమును; బుధ = జ్ఞాన; ఇంద్ర = శ్రేష్ఠులలో; ఉత్తమ = ఉత్తముడా.
“సుధీమణులలో ప్రథమగణ్యుడ వైన సూతమునీంద్రా ! నీవు బ్రహ్మాండాది పురాణాలు, మహాభారతం మొదలైన ఇతిహాసాలు, ఇంకా ఎన్నో ధర్మశాస్ర్తాలు మీ గురువుల సన్నిధిలో చక్కగా చదువుకున్నావు. అవన్నీ మాకు వివరించి చెప్పావు. ధీమంతులైన వేదవ్యాసాది మహర్షులు దర్శించిన విశేషాలన్నీ నీ మనసునకు స్ఫురిస్తాయి. ఆ మహానుభావుల అనుగ్రహంవల్ల నీ బుద్ధికి అందని దంటూ ఏదీ లేదు. నీవు సర్వజ్ఞుడవు.
1-42-క.కంద పద్యము

గురువులు ప్రియశిష్యులకుం
బరమ రహస్యములు దెలియఁ బలుకుదు రచల
స్థిర కల్యాణం బెయ్యది
పురుషులకును నిశ్చయించి బోధింపు తగన్.
గురువులు = గురువులు; ప్రియ = ప్రియమైన; శిష్యుల = శిష్యుల; కున్ = కు; పరమ = ఉత్కృష్టమైన; రహస్యములు = రహస్య జ్ఞానములను; తెలియన్ = తెలియునట్లు; పలుకుదురు = వివరిస్తారు; అచల = చాంచల్యము లేనిది; స్థిర = స్థిరత్వము కలిగించేది; కల్యాణంబు = శుభకరమైనది; ఎయ్యది = ఏదో; పురుషుల = మానవుల; కును = కు; నిశ్చయించి = నిర్ణయించి; బోధింపు = భోధింపుము (మాకు); తగన్ = తగినట్లుగా.
గురువులైనవారు ప్రీతిపాత్రులైన శిష్యులకు అత్యంత రహస్యాలైన సంగతులెన్నో బోధిస్తారు కదా. ఈ లోకంలోని మానవులకు శాశ్వతమైనట్టి కల్యాణాన్ని కలిగించే విషయమేదో బాగా ఆలోచించి దాన్ని దయతో మాకు ఉపదేశించు.
1-43-క.కంద పద్యము

మన్నాఁడవు చిరకాలము
గన్నాఁడవు పెక్కులైన గ్రంథార్థంబుల్
విన్నాఁడవు వినఁదగినవి
యున్నాఁడవు పెద్దలొద్ద నుత్తమగోష్ఠిన్.
మన్నాఁడవు = బ్రతికితివి; చిర = చాలా; కాలము = కాలము; కన్నాఁడవు = దర్శించితివి; పెక్కులైన = అనేకమైన; గ్రంథ = గ్రంథముల; అర్థంబుల్ = సారములను; విన్నాఁడవు = విన్నావు; వినఁదగినవి = వినదగినవి; ఉన్నాఁడవు = ఉన్నావు; పెద్దలొద్దన్ = పెద్దల దగ్గర; ఉత్తమ = మంచి; గోష్ఠిన్ = చర్చలలో.
చక్కటి గోష్ఠులలో, మహానుభావుల సాన్నిధ్యంలో బహుకాలం ఉన్నావు. ఎన్నో మహాగ్రంథాలలోని పరమార్థాలను కన్నావు. పెద్దల వద్ద వినదగిన విశేషాలెన్నో విన్నావు.
1-44-చ.చంపకమాల

అలసులు, మందబుద్ధియుతు, లల్పతరాయువు, లుగ్రరోగసం
కలితులు, మందభాగ్యులు సుకర్మము లెవ్వియుఁ జేయఁజాల రీ
కలియుగమందు మానవులు గావున నెయ్యది సర్వసౌఖ్యమై
యలవడు? నేమిటం బొడము నాత్మకు? శాంతి మునీంద్ర! చెప్పవే.
అలసులు = సోమరి పోతులు; మంద = మందగించిన; బుద్ధి = బుద్ధి; యుతులు = కలిగినవారు; అల్పతర = చాలా తక్కువ {అల్ప - అల్పతర - అల్పతమ}; ఆయువులు = ఆయుష్షు కలవారు; ఉగ్ర = భయంకరమైన; రోగ = రోగములతో; సంకలితులు = కూడిన ఉన్న వారు; మంద = మందగించిన; భాగ్యులు = భాగ్యము కలవారు; సుకర్మములు = మంచిపనులు; ఎవ్వియున్ = ఏవియును; చేయఁజాలరు = చేయలేరు; ఈ = ఈ; కలియుగము = కలియుగము; అందున్ = లో; మానవులు = మనుషులు; కావునన్ = అందువలన; ఎయ్యది = ఏదైతే; సర్వ = అన్ని; సౌఖ్యము = సుఖములను కలుగజేయునది; ఐ = అయి; అలవడున్ = సిద్ధించునో; ఏమిటన్ = దేనివలన; పొడమున్ = కలుగుతుందో; ఆత్మకు = ఆత్మకు; శాంతి = శాంతి; ముని = మునులలో; ఇంద్రా = శ్రేష్ఠుడా; చెప్పవే = చెప్పుము.
మునీంద్రా! సూతా! ఈ కలియుగంలోని మానవులందరు సోమరి పోతులు, మందబుద్ధులు, మందభాగ్యులు, అల్పాయుష్కులు. రకరకాల భయంకర వ్యాధులతో పీడింపబడుతున్నవారు. వారు సత్కార్యాలు చేయటానికి అసమర్థులు. అందువల్ల వారి ఆత్మలకు ఏది శాంతిని ప్రసాదిస్తుందో అట్టి మార్గాన్ని అనుగ్రహించు.
1-45-సీ.సీస పద్యము

ఎవ్వని యవతార మెల్ల భూతములకు;
సుఖమును వృద్ధియు సొరిదిఁజేయు;
నెవ్వని శుభనామ మేప్రొద్దు నుడువంగ;
సంసార బంధంబు సమసిపోవు;
నెవ్వని చరితంబుఁ హృదయంబుఁ జేర్పంగ;
భయమొంది మృత్యువు పరువువెట్టు;
నెవ్వని పదనది నేపాఱు జలముల;
సేవింప నైర్మల్యసిద్ధి గలుగుఁ;
1-45.1-తే.
దపసులెవ్వాని పాదంబు దగిలి శాంతి
తెరువుఁగాంచిరి; వసుదేవదేవకులకు
నెవ్వఁ డుదయించెఁ దత్కథలెల్ల వినఁగ
నిచ్చ పుట్టెడు నెఱిఁగింపు మిద్ధచరిత!
ఎవ్వని = ఎవని; అవతారము = జన్మ, అవతరించుట వలన; ఎల్ల = అన్ని; భూతముల = జీవుల; కున్ = కు; సుఖమును = సుఖమును; వృద్ధియు = అభ్యుదయము; సొరిదిన్ = క్రమముగ; చేయున్ = కలుగునో; ఎవ్వని = ఎవని; శుభ = శుభకరమైన; నామము = పేరు; ఏప్రొద్దున్ = ఎల్లప్పుడును; నుడువంగ = ఉచ్చరింపగా; సంసార = సంసారము యొక్క; బంధంబు = బంధములు; సమసి = నాశనము; పోవున్ = అగునో; ఎవ్వని = ఎవని; చరితంబున్ = కథలను; హృదయంబున్ = హృదయంలో; చేర్పంగ = పెట్టుకొంటే; భయము = భయము; ఒంది = పొంది; మృత్యువు = మృత్యువు; పరువున్ = పరుగును; పెట్టున్ = పెట్టునో; ఎవ్వని = ఎవని; పద = పాదముల వద్ద పుట్టిన; నదిన్ = నది లోని (గంగానది); ఏపాఱు = అతిశయించిన; జలములన్ = నీటిని; సేవింపన్ = సేవించగా; నైర్మల్య = నిర్మలత్వము; సిద్ధి = సమకూరుట; కలుగున్ = కలుగుతుందో; తపసులు = తాపసులు; ఎవ్వాని = ఎవని;
పాదంబున్ = పాదమును; తగిలి = భక్తితో తగులుకొని; శాంతి = ప్రశాంతతకు; తెరువున్ = మార్గమును; కాంచిరి = దర్శించిరో; వసుదేవ = వసుదేవుడు; దేవకులు = దేవకీదేవిలు; కున్ = కు; ఎవ్వఁడు = ఎవడు; ఉదయించెన్ = జన్మించాడో; తత్ = ఆ; కథలు = కథలు; ఎల్ల = అన్నీ; వినఁగన్ = వినవలెనని; ఇచ్చ = కోరిక; పుట్టెడున్ = పుట్టినది; ఎఱిఁగింపుము = తెలియ చెప్పుము; ఇద్ధ = ప్రశస్తమైన; చరిత = నడవడిక కలవాడా.
ఏ మహానుభావుడు అవతారించడం ఈ జగత్తులోని సమస్త జీవులకు ఆనందాన్నీ, అభివృద్ధినీ అందిస్తుందో, ఏ మహానుభావుడి దివ్యనామాన్ని ఎల్లప్పుడు ఉచ్చరించటం వల్ల భవబంధాలన్నీ పటాపంచలు అయిపోతాయో, ఏ మహానుభావుడి పవిత్ర చరిత్రని భావించిన మాత్రంచేతనే మృత్యుదేవత భయపడి పారిపోతుందో, ఏ మహానుభావుడి పాదాల నుంచి ఉద్భవించిన నదీజలాలను సేవించినంత మాత్రాన సమస్త కల్మషాలు సమస్తం నశించి పావనత్వం ప్రాప్తిస్తుందో, ఏ మహానుభావుడి చరణాలను సమాశ్రయించి సంయమీంద్రులు శాంతి మార్గాన్ని సాధించారో, ఏ మహానుభావుడు దేవకీ వసుదేవులకు ముద్దుల బిడ్డడుగా జన్మించాడో, ఆ మహానుభావుడైన వాసుదేవుని కథలన్నీ వినాలని ఎంతో ముచ్చట పడుతున్నామయ్యా. ఓ సచ్చరిత్రుడా! సూతా! అవన్నీ మాకు వినిపించు.
1-46-క.కంద పద్యము

భూషణములు వాణికి నఘ
శోషణములు మృత్యుచిత్త భీషణములు హృ
త్తోషణములు కల్యాణ వి
శేషణములు హరి గుణోపచితభాషణముల్.
భూషణములు = అలంకారములు; వాణి = సరస్వతి / వాక్కు; కిన్ = కి; అఘ = పాపములను; శోషణములు = ఎండగొట్టునవి, పోగొట్టునవి; మృత్యు = మృత్యువు యొక్క; చిత్త = మనసునకు; భీషణములు = భయం కలిగించేవి; హృత్ = హృదయమునకు; తోషణములు = తుష్టి కలిగించేవి; కల్యాణవిశేషణములు = శుభకరమైన; విశేషణములు = విశిష్టతలను ఇచ్చునవి; హరి = హరియొక్క; గుణ = గుణములతో; ఉపచిత = కూడిన; భాషణముల్ = పలుకులు.
శ్రీమహావిష్ణువు యొక్క గుణకీర్తనములతో కూడిన పలుకులు, వాక్కులకు అధిదేవత యైన సరస్వతీ దేవికి అలంకారాలు. మృత్య దేవతకు భయం కలిగించేవి. భక్తుల హృదయాలకు సంతోషాలు కలిగించేవి. సకల పాపాలను ఎండగొట్టునవి. నిత్యకల్యాణములను సమకూర్చేవి.

1-47-క.కంద పద్యము

కలిదోషనివారకమై
యలఘుయశుల్ వొగడునట్టి హరికథనము ని
ర్మలగతిఁ గోరెడు పురుషుఁడు
వెలయఁగ నెవ్వాఁడు దగిలి వినఁడు? మహాత్మా!
కలి = కలికాలములోని; దోష = దోషములను; నివారకము = నివారించునది; ఐ = అయి; అలఘు = తక్కువగాని (ఏవిధంగాను) / గొప్ప; యశుల్ = కీర్తి గలవారు; పొగడునట్టి = స్తోత్రము చేయునట్టి; హరి = హరియొక్క; కథనమున్ = కథలు; నిర్మల = నిర్మలమైన; గతిన్ = మార్గమును; కోరెడు = కోరుకొనే; పురుషుఁడు = మనిషి; వెలయఁగన్ = ప్రసన్నమైతే; ఎవ్వాఁడున్ = ఎవడు మాత్రం; తగిలి = కుతూహలముతో; వినఁడు = వినడు; మహా = గొప్ప; ఆత్మా = ఆత్మకలవాడా / సూతా.
మహాత్మా! సూత! కలికాల దోషాలను పారద్రోలుతు, ప్రసిద్ధులైన సత్పురుషుల ప్రశంస లందుకొన్న గోవిందుని కథలను, పుణ్యలోకాలు కోరేవాడు ఎవడు ఆసక్తితో వినకుండా ఉంటాడు.
1-48-ఆ.ఆటవెలది

అనఘ! విను రసజ్ఞులై వినువారికి
మాటమాట కధిక మధురమైన
యట్టి కృష్ణు కథన మాకర్ణనము సేయఁ
దలఁపు గలదు మాకుఁ దనివి లేదు.
అనఘ = పాపము లేనివాడా; విను = వినుము; రసజ్ఞులు = రస జ్ఞానము కలవారు; ఐ = అయి; విను = వినే; వారి = వారి; కి = కి; మాటమాటకు =ప్రతిమాటలోను; అధిక = మిక్కిలి; మధురము = తీయనిది; ఐన = అయినది; అట్టి = అగు; కృష్ణు = కృష్ణుని గూర్చిన; కథనము = విషయములు; ఆకర్ణనము = వినుట; సేయన్ = చేయాలని; తలఁపు = కోరిక; కలదు = కలదు; మాకున్ = మాకు; తనివి = తృప్తి (ఎంతవిన్నా); లేదు = తీరదు.
పుణ్యాత్మా! సూతా! శ్రీకృష్ణుని కథలు ఆసక్తితో ఆలకించే రసజ్ఞుల హృదయాలకు పదే పదే మధురాతి మధురాలై ఆనందాన్ని కలిగిస్తాయి. వాటిని ఆలకించాలని మాకు ఎంతో కుతూహలంగా ఉంది. ఎన్ని విన్నా మాకు తనివి తీరటం లేదు.
1-49-మ.మత్తేభ విక్రీడితము

వర గోవింద కథా సుధారస మహావర్షోరు ధారా పరం
పరలం గాక బుధేంద్రచంద్ర! యితరోపాయానురక్తిం బ్రవి
స్తర దుర్దాంత దురంత దుస్సహ జనుస్సంభావితానేక దు
స్తర గంభీర కఠోర కల్మష కనద్దావానలం బాఱునే?
వర = శ్రేష్ఠుడైన; గోవింద = కృష్ణుని {గోవింద - గోవులకు ఒడయుడు}; కథా = కథలు అను; సుధారస = అమృతపు; మహావర్ష = గొప్ప వర్షము యొక్క; ఉరుధారా = పెద్ద ధారాపాతపు; పరంపరలన్ = తెరలు వలన; కాక = కాకుండా; బుధేంద్ర = జ్ఞానశ్రేష్ఠులలో; చంద్ర = చంద్రుని వంటివాడా; ఇతర = ఇతరమైన; ఉపాయ = ఉపాయాల మీది; అనురక్తిన్ = అనురాగం వలన; ప్రవిస్తర = మిక్కిలి విస్తరించిన; దుర్దాంత = అణచుటకురాని; దురంత = అంతము చేయుటకు రాని; దుస్సహ = సహింపరాని; జనుస్ = జన్మముల యందు; సంభావిత = సంభవించుచున్న; అనేక = అనేకమైన; దుస్తర = తరింపరాని; గంభీర = లోతైన; కఠోర = కఠినమైన; కల్మష = పాపములు అను; కనత్ = మండుచున్న; దావానలంబు = కారుచిచ్చు; ఆఱునే = చల్లారుతుందా.
సూతా! బుధేంద్రచంద్ర! అత్యంత విస్తరమైనది, దాటరానిది, అణచుట సాధ్యం కానిది, అంతులేనిది, సహింపశక్యముకానిది అయి, అనేక జన్మల నుంచి పేరుకుపోయి, చుట్టుకుపోయినది అయి, దాటశక్యంగానిదై, గంభీరము, కఠోరమునైన కల్మషమనే కారుచిచ్చు మహాభయంకరంగా ఉన్నది. దీన్ని ఆర్పివేయాలంటే శ్రేష్ఠమైన ఆ నందనందనుని కథాసుధారసంతో నిండిన బ్రహ్మాండమైన వర్షధారాపరంపరలు తప్ప వేరే ఉపాయం లేదు కదా.
1-50-సీ.సీస పద్యము

హరినామ కథన దావానలజ్వాలచేఁ;
గాలవే ఘోరాఘ కాననములు;
వైకుంఠదర్శన వాయు సంఘంబుచేఁ;
దొలఁగవే భవదుఃఖ తోయదములు;
కమలనాభధ్యాన కంఠీరవంబుచేఁ;
గూలవే సంతాప కుంజరములు;
నారాయణస్మరణప్రభాకరదీప్తిఁ;
దీఱవే షడ్వర్గ తిమిర తతులు;
1-50.1-ఆ.
నలిన నయన భక్తినావచేఁ గాక సం
సారజలధి దాఁటి చనఁగ రాదు;
వేయునేల; మాకు విష్ణుప్రభావంబుఁ
దెలుపవయ్య సూత! ధీసమేత!
హరి = హరియొక్క; నామ = పేరు; కథన = ఉచ్చరించుటనే; దావానల = కారుచిచ్చు; జ్వాలచేన్ = మంటలచేత; కాలవే = కాలిపోవా; ఘోర = ఘోరమైన; అఘ = పాపములు అను; కాననములు = అడవులు; వైకుంఠ = వైకుంఠలోక {వైకుంఠుడు - వైకుంఠమున ఉండువాడు}; దర్శన = దర్శనమనే; వాయు = గాలుల; సంఘంబు = సమూహము; చేన్ = చేత; తొలఁగవే = తొలగిపోవా; భవ = సంసార; దుఃఖ = దుఃఖములు అను; తోయదములు = మేఘములు; కమలనాభ = విష్ణువుమీది {కమలనాభ - పద్మము నాభియందు కలవాని}; ధ్యాన = ధ్యానము అను; కంఠీరవంబు = సింహము; చేన్ = చేత; కూలవే = కూలిపోవా; సంతాప = దిగుళ్ళు అను; కుంజరములు = ఏనుగులు; నారాయణ = హరిని; స్మరణ = స్మరించుట అను; ప్రభాకర = సూర్య; దీప్తిన్ = కాంతులచేత; తీఱవే = తీరిపోవా; షడ్వర్గ = అరిషడ్వర్గములు అను {అరిషడ్వర్గములు - కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్య, మోహములు.}; తిమిర = చీకటుల; తతులు = సమూహాలు;
నలిన = పద్మాల వంటి; నయన = కళ్ళు కలవాడు / భగవంతుని పై; భక్తి = భక్తియనే; నావ = తెప్ప; చేన్ = తో; కాక = కాకుండా; సంసార = సంసారమనే; జలధి = సాగరము; దాఁటి = దాటి; చనఁగ = వెళ్ళటకు; రాదు = వీలు లేదు; వేయు = వేయి విషయములు; ఏల = ఎందుకు; మాకు = మాకు; విష్ణు = హరి; ప్రభావంబున్ = శక్తిని; తెలుపవయ్య = తెలుపుము; సూత = సూతా; ధీ = జ్ఞానము; సమేత = కలిగి ఉన్నవాడా.
సూతా! బుధేంద్రచంద్ర! అత్యంత విస్తరమైనది, దాటరానిది, అణచుట సాధ్యం కానిది, అంతులేనిది, సహింపశక్యముకానిది అయి, అనేక జన్మల నుంచి పేరుకుపోయి, చుట్టుకుపోయినది అయి, దాటశక్యంగానిదై, గంభీరము, కఠోరమునైన కల్మషమనే కారుచిచ్చు మహాభయంకరంగా ఉన్నది. దీన్ని ఆర్పివేయాలంటే శ్రేష్ఠమైన ఆ నందనందనుని కథాసుధారసంతో నిండిన బ్రహ్మాండమైన వర్షధారాపరంపరలు తప్ప వేరే ఉపాయం లేదు కదా.
1-50-సీ.సీస పద్యము

హరినామ కథన దావానలజ్వాలచేఁ;
గాలవే ఘోరాఘ కాననములు;
వైకుంఠదర్శన వాయు సంఘంబుచేఁ;
దొలఁగవే భవదుఃఖ తోయదములు;
కమలనాభధ్యాన కంఠీరవంబుచేఁ;
గూలవే సంతాప కుంజరములు;
నారాయణస్మరణప్రభాకరదీప్తిఁ;
దీఱవే షడ్వర్గ తిమిర తతులు;
1-50.1-ఆ.
నలిన నయన భక్తినావచేఁ గాక సం
సారజలధి దాఁటి చనఁగ రాదు;
వేయునేల; మాకు విష్ణుప్రభావంబుఁ
దెలుపవయ్య సూత! ధీసమేత!
హరి = హరియొక్క; నామ = పేరు; కథన = ఉచ్చరించుటనే; దావానల = కారుచిచ్చు; జ్వాలచేన్ = మంటలచేత; కాలవే = కాలిపోవా; ఘోర = ఘోరమైన; అఘ = పాపములు అను; కాననములు = అడవులు; వైకుంఠ = వైకుంఠలోక {వైకుంఠుడు - వైకుంఠమున ఉండువాడు}; దర్శన = దర్శనమనే; వాయు = గాలుల; సంఘంబు = సమూహము; చేన్ = చేత; తొలఁగవే = తొలగిపోవా; భవ = సంసార; దుఃఖ = దుఃఖములు అను; తోయదములు = మేఘములు; కమలనాభ = విష్ణువుమీది {కమలనాభ - పద్మము నాభియందు కలవాని}; ధ్యాన = ధ్యానము అను; కంఠీరవంబు = సింహము; చేన్ = చేత; కూలవే = కూలిపోవా; సంతాప = దిగుళ్ళు అను; కుంజరములు = ఏనుగులు; నారాయణ = హరిని; స్మరణ = స్మరించుట అను; ప్రభాకర = సూర్య; దీప్తిన్ = కాంతులచేత; తీఱవే = తీరిపోవా; షడ్వర్గ = అరిషడ్వర్గములు అను {అరిషడ్వర్గములు - కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్య, మోహములు.}; తిమిర = చీకటుల; తతులు = సమూహాలు;
నలిన = పద్మాల వంటి; నయన = కళ్ళు కలవాడు / భగవంతుని పై; భక్తి = భక్తియనే; నావ = తెప్ప; చేన్ = తో; కాక = కాకుండా; సంసార = సంసారమనే; జలధి = సాగరము; దాఁటి = దాటి; చనఁగ = వెళ్ళటకు; రాదు = వీలు లేదు; వేయు = వేయి విషయములు; ఏల = ఎందుకు; మాకు = మాకు; విష్ణు = హరి; ప్రభావంబున్ = శక్తిని; తెలుపవయ్య = తెలుపుము; సూత = సూతా; ధీ = జ్ఞానము; సమేత = కలిగి ఉన్నవాడా.
పరమ ధీమంతుడ వైన సూతమహర్షీ! భయంకర పాపాలనే అరణ్యాలను కాల్చివేయాలి అంటే, శ్రీహరి నామ సంకీర్తనలు అనే దావాగ్ని జ్వాలలే కావాలి; సంసార దుఃఖాలనే మేఘాలను పారద్రోలాలంటే, వాసుదేవ సందర్శనము అనే వాయువుల సమూహమే కావాలి; పరితాపాలు అనే ఏనుగుల సమూహాన్ని చంపాలంటే, శ్రీమన్నారాయణ ధ్యానము అనే సింహమే కావాలి; అరిషడ్వర్గము అనే అంధకార సమూహాన్ని తొలగించా లంటే, హరి స్మరణమనే సూర్యకాంతి కావాలి; సంసార సముద్రాన్ని దాటి గట్టెక్కాలంటే, విష్ణుదేవుని భక్తి అనే నావనే ఎక్కాలి; వేలకొద్దీ మాట లెందుకు గాని, మాకు శ్రీహరి మాహాత్మ్యాన్ని వినిపించండి మహానుభావా!
1-51-వ.వచనము
మఱియుఁ గపటమానవుండును గూఢుండు నైన మాధవుండు రామ సహితుం డై యతిమానుషంబు లైన పరాక్రమంబులు సేసె నఁట; వాని వివరింపుము; కలియుగంబు రాఁగల దని వైష్ణవక్షేత్రంబున దీర్ఘసత్ర నిమిత్తంబున హరికథలు విన నెడగలిగి నిలిచితిమి, దైవయోగంబున.
మఱియు = ఇంకనూ; కపట = మాయవలన; మానవుండును = మానవ రూపం ధరించినవాడు; గూఢుండును = మాయవలన తెలియరానివాడు; ఐన = అయిన; మాధవుండు = లక్ష్మీదేవి భర్త; రామ = బలరామునితో; సహితుండు = కూడినవాడు; ఐ = అయి; అతి = అతీతమైనవి; మానుషంబులు = మానవులు చేయుటకు; ఐన = అయినట్టి; పరాక్రమంబులు = సాహసములు; సేసెన్ = చేసెను; అట = అట; వాని = వాటిని; వివరింపుము = వివరముగా చెప్పుము; కలియుగంబు = కలియుగము; రాఁగలదని = రాబోవుచున్నదని; వైష్ణవ = విష్ణువునకు సంబంధించిన; క్షేత్రంబున = సిద్ధస్థలమున / నైమిశారణ్యమున; దీర్ఘ = పెద్దదైన; సత్ర = సత్రయను పేరుగల యాగము; నిమిత్తంబున = కారణముగా; హరి = విష్ణుని; కథలు = కథలు; వినన్ = వినుట; ఎడ = పట్ల; కలిగి = కలిగినందు వలన; నిలిచితిమి = ఉంటిమి; దైవ = దైవము; యోగంబున = కలిసివచ్చుటచేత.
అంతేకాదు, అప్రమేయుడైన గోవిందుడు మాయామానుష శరీరం ధరించి బలరామునితో గూడి మానవాతీతాలైన మహా వీరకృత్యాలు ఎన్నో చేశాడని వింటాము. అవన్నీ మాకు వివరంగా సెలవీయండి. దైవానుగ్రహం సమకూరింది. కలియుగం రాబోతున్నదని విని ముందుగానే విష్ణు క్షేత్రమైన ఈ నైమిశారణ్యంలోదీర్ఘసత్ర" మనే యజ్ఞం ప్రారంభించాము. అలా హరికథలు ఆలకించే అవకాశం కలిగింది.
1-52-క.కంద పద్యము

జలరాశి దాఁటఁ గోరెడి
కలము జనుల్ కర్ణధారుఁ గాంచిన భంగిం
గలి దోష హరణ వాంఛా
కలితులమగు మేము నిన్నుఁ గంటిమి, సూతా!
జలరాశిన్ = సముద్రము; దాఁటన్ = దాటుటను; కోరెడి = కోరే; కలము = ఓడలోని; జనుల్ = జనము; కర్ణధారున్ = చుక్కాని పట్టి నడిపే వానిని {కర్ణధారుడు - పడవ నడుపువాడు - తరింప సమర్థుడు}; కాంచిన = చూచిన; భంగిన్ = విదంగా; కలి = కలికాలపు; దోష = పాపాలు; హరణ = నాశనము చేసే; వాంఛా = కోరికతో; కలితులము = కూడిన వారము; అగు = అయినటువంటి; మేము = మేము; నిన్నున్ = నిన్ను {నిన్ను – కలిదోష నివారక సమర్థుడైన వాని}; కంటిమి = కనుగొన గలిగితిమి; సూతా = సూతా.
ఓ సూతమహర్షీ! మహాసముద్రాన్ని దాటాలని ప్రయత్నించే ప్రయాణికులకు ఓడ నడిపే నావికుడు లభించినట్లుగా, కలికాల పాపాలను పోగొట్టుకొని తరించాలని కోరుతున్న మాకు నీవు కన్పించావు.
1-53-క.కంద పద్యము

చారుతర ధర్మరాశికి
భారకుఁడగు కృష్ణుఁ డాత్మపదమున కేఁగన్
భారకుఁడు లేక యెవ్వనిఁ
జేరును ధర్మంబు బలుపు సెడి, మునినాథా!
చారుతర = అతి మనోహరమైన {చారు - చారుతర - చారుతమ}; ధర్మ = ధర్మముల; రాశి = సమూహము; కిన్ = నకు; భారకుఁడు = భరించు వాడు; అగు = అయినటువంటి; కృష్ణుఁడు = కృష్ణుడు; ఆత్మ = తన; పదమునకు = లోకమునకు; ఏఁగన్ = వెళ్ళగా; భారకుఁడు = భర్త; లేక = లేకపోవుటచే; ఎవ్వనిన్ = ఎవనిని; చేరును = చేరును; ధర్మంబు = ధర్మము; బలుపు = పుష్టిని; సెడి = కోల్పోయి; ముని = ముని అయిన; నాథా = ప్రభువా.
ఓ సూతమహర్షీ! ఉత్తమ ధర్మాలకు ఆధారంగా ఉండే శ్రీకృష్ణుడు పరమపదం చేరుకున్న తరువాత, ఆధారంలేని ధర్మం దిక్కుమాలి, చిక్కి జీర్ణించి ఎవరిని ఆశ్రయిస్తుందో వివరించు.”

సత్యనారాయణ స్వామి దేవాలయ

అన్నవరం...

అన్నవరం సత్యనారాయణ స్వామి గుడి చాలా ప్రసిద్ధమైంది. ఈ ఆలయం తూర్పు గోదావరి జిల్లా, అన్నవరంలో రత్నగిరి కొండమీద ఉంది.

రత్నగిరి సత్రం, దేవస్థానం వారి ఫలహార శాల దాటగానే ప్రవేశద్వారం కనిపిస్తుంది. అందులోంచి కొంతదూరం నడిస్తే సత్యనారాయణ స్వామి దేవాలయం దర్శనమిస్తుంది.

సత్యనారాయణ స్వామి దేవాలయ ముఖద్వారం దగ్గర గోడ మీద

''హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మక స్వరూప''

అంటూ సాగిన శ్లోకాన్ని భక్తులందరూ తప్పక పఠిస్తారు.

అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి కుడివైపున రామాలయం, విశ్రాంతి మందిరం, ఎడమవైపున కళ్యాణ మండపం ఉన్నాయి. రామాలయం పక్కనే వ్రతాల మండపాలు, భోజనశాల ఉన్నాయి. అధిక సంఖ్యలో భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారు కనుక, గుడి చుట్టూ అనేక వ్రత మండపాలు ఉన్నాయి. అలాగే గుడి వెనుక గుట్టమీద అనేక కాటేజ్ లు ఉన్నాయి.

కొత్తగా పెళ్ళయిన జంటలు తప్పక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం హిందూ ఆచారం. ఇళ్ళలో వ్రతం చేసుకోవడం సంగతి అలా ఉంచి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవాలయంలో వ్రతం చేసుకోవడం మరీ శ్రేష్టమని భావిస్తారు. కొందరు అలా చేసుకోవాలని మొక్కుకుంటారు కూడా.

అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రవేశించగానే ప్రశాంతత చేకూరుతుంది అనేది భక్తుల అనుభవం. ఆలయ ముఖద్వారం, స్వామివారి విగ్రహం, గాలి గోపురం దేనికదే మహా సుందరంగా ఉంటుంది.

స్థల పురాణాన్ని అనుసరించి-

పూర్వం అనరాజు రాజ్యాన్ని ఓ బలవంతుడైన రాజు ఆక్రమించుకున్నాడు. దాంతో అనరాజు రాజ్యాన్ని కోల్పోయిన దుఃఖంతో అడవికి వెళ్ళిపోయాడు. అలా తిరుగుతూ రత్నగిరి కొండను చేరాడు. అక్కడే ఉంటూ సత్యనారాయణ స్వామిని ఆరాధించసాగాడు. అనరాజు భక్తి భావనకు స్వామి సంతోషించాడు. రాజుకు కలలో కనిపించి ''బాధ పడకు, నీ రాజ్యం నీకు దక్కుతుంది..'' అని చెప్పి, సత్యనారాయణ స్వామి రత్నగిరి పర్వతారణ్యాల్లోకి వెళ్ళిపోయాడు.

కొంతకాలానికి ఉండూరు సంస్థాన అధిపతి ఒక కల కన్నాడు. ''రత్నగిరి కొండపై సత్యనారాయణ స్వామి ఆలయం కట్టించమని, దానివల్ల మేలు జరుగుతుందని'' కల సారాంశం. ఆ అధికారి తనకు ఆ కల రావడంలో ఆంతర్యం ఏమిటా అనుకుని, వెంటనే ప్రయాణమై రత్నగిరి కొండ మీదికి వెళ్ళాడు. ఆశ్చర్యకరంగా కొండమీద అంకుడు చెట్టు కింద సత్యనారాయణ స్వామి వారి విగ్రహం దర్సనమిచ్చింది.

ఇక ఉండూరు సంస్థాన అధిపతి తాత్సారం చేయలేదు. వెంటనే రత్నగిరి కొండమీద ఆలయం కట్టించాడు. తనకు లభించిన విగ్రహాన్ని గుడిలో ప్రతిష్టించాడు. అదే అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం.

అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకున్న వారి కోరికలు, వెంటనే నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు.

గురువులు


అది సంగీతం కావచ్చు, చదువు కావచ్చు.. పాఠం చెప్పే సమయంలో గురువులు విద్యార్థులచేత ఒకే వరుస వచ్చేవరకూ అనిపించటం జరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఒకపట్టాన పాఠం విద్యార్థికి పట్టుపడదు. అప్పుడు నిర్దాక్షిణ్యంగా ఎన్నిమార్లైనా అనిపిస్తూ ఉంటారు గురువులు. ఒక్కోసారి అప్పటికీ పాఠం రాదు. అయినా గురువులు వదలరు. ఆ విద్యార్థికి కొంతసేపటికి తన అసహాయ స్థితిపై తనకే అసహనం, ఉక్రోషం, కోపం..కలిపి దుఃఖంగా పెల్లుబుకుతాయి.
ఈ అనుభవం మన అందరం చిన్నతనంలో ఒక్కసారైనా ఖచ్చితంగా ఎదుర్కొనే ఉంటాం. నాదగ్గర సంగీతం నేర్చుకోనే విద్యార్థులకు ఈ పరిస్థితి వచ్చిప్పుడు, నాకు కూడా నా బాల్యం గుర్తు వస్తూ ఉంటుంది. అయితే, ఇందుకు భిన్నంగా కొన్ని జరుగుతూ ఉంటాయి. హైదరాబాద్ లో ఒక గాత్ర సంగీత శిక్షకురాలు ప్రభుత్వ కళాశాలలో పాఠం చెప్తున్నారు. ఆవిడ చాలా నిబద్ధత కలిగిన గురువు. విద్యార్థులందరికీ కలిపి కొత్త పాఠం చెప్పి, ఊరుకోక, విడివిడిగా అందరూ పాఠం సరిగా పాడుతున్నారా లేదా అని పరీక్షించేవారు. అలా పాడిస్తున్న క్రమంలో ఒక విద్యార్థినికి పాఠం రాలేదు. నిజానికి ఆ విద్యార్థిని చక్కగా గ్రహించి, పాడుతుంది. అయితే,ఆరోజు ఎందుకో పాఠం రాలేదు. తక్కిన విద్యార్థులను పంపించేసి, ఆ విద్యార్థినికి మాత్రమే పాఠం తిరిగి చెప్పటం ఆరంభించారావిడ. ఎన్ని సార్లు పాడించినా అదే పరిస్థితి. పోనీ మరో విధంగా, ఇంకో రకంగా, శత విధాల ప్రయత్నించినా ఆ విద్యార్థినికి పాఠం కొరుకుడు పడట్లేదు.
ఎక్కడో ఒకచోట తప్పు వస్తూనే ఉంది. గురువుగారు అశక్తురాలైంది. 'పాడుతూ ఉండమని' చెప్పి,లేచి తరగతి గది బయటకు నడిచారావిడ.
ఆ విద్యార్థి మళ్లీ మళ్లీ పాడుతూనే ఉంది. సమయం గడుస్తోంది, అయిదు, పది నిమిషాలు గడిచిపోయాయి. గురువుగారు ఇంకా రాలేదు. కొంత సేపటికి ఆవిడ ఎక్కడకు వెళ్లారో చూద్దామని ఆ విద్యార్థిని గది బయటకు వచ్చింది. తలుపు ప్రక్కనే నిల్చొని,గురువుగారు కనబడ్డారు. ఆవిడ చీర కొంగు అడ్డుపెట్టుకొని, కన్నీళ్ళు పెట్టుకుంటోంది. విద్యార్థిని అవాక్కయింది. తను గురువును ఎంత బాధ పెట్టిందో అర్థమయింది. గురువుగారి సున్నిత మనస్తత్వం ఆమెను కలచివేసింది. బిగ్గరగా ఏడుస్తూ, క్షమించమంటూ గురువుగారి పాదాలపై వ్రాలిపోయింది. ఇద్దరూ తిరిగి గదిలోకి నడిచారు. గురువుగారు చివరి ప్రయత్నంగా మళ్లీ పాఠం చెప్పారు. ఈసారి ఏకాగ్రత కుదిరింది. విద్యార్థిని ఒకేసారి సరిగ్గా పాడేసింది. ఆ గురువుగారి ముఖం ఆనందంతో వెలిగిపోయింది. 
ఆరోజు నుండి ఆ విద్యార్థిని సంగీత పాఠంలో ఏనాడూ ఏకాగ్రత కోల్పోలేదు. పట్టుదలతో విద్య నేర్చుకొని, కొంతకాలానికి సంగీత రంగంలో ఉన్నత స్థాయికి చేరుకొని, తన గురువుల పేరు నిలబెట్టింది. తన ఈ అనుభవాన్ని ఆ విద్యార్థిని స్వయంగా నాతో పంచుకుంది. 

*గురువులు వారే..కల్ప తరువులు వారే* ...🙏

 *మోదుమూడి సుధాకర్*
 (Modumudi Sudhakar)
ఎందరో ఇలాంటి గురువులు. వారందరికీ వందనములు.

సర్వేపల్లిరాధాకృష్ణగారిజయన్తి


ఉపాధ్యాయదినోత్సవ శుభాకాంక్షలతో నమస్సులు.
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
కం; విధ్యాశీర్బలయుతులగు
         నధ్యాపకలోక బాధ్యతార్ఘ్యులఘనుడౌ
         సుధ్యున్నతు రాధాకృ
         ష్ణాధ్యాపక సాధుమూర్తి కంజలిశతముల్.

శా; సాధూత్తంసుడు సద్గురుండును గురుస్స్వాంతుండు శాస్త్రాదులే
      ప్రాధేయం బడి జేరు సన్మతియు విద్వ చ్ఛేషుడై భూతలిన్
       మేథో వర్గ నుతిస్థుడై దశదిశల్ మేల్కీర్తి సంవ్యాప్తమౌ
       రాధాకృష్ణ జయన్తి సద్గురు జనార్ఘ్యా రాధనోత్సాహమౌ.

సీ; పరిపాలనారంగ పరిమితుల్ చాటించు
            పదవులే పెక్కులు ప్రాప్తమైన
        పలురాజకీయ బాధల పరిష్కారమే
             చూపించు యశమద్ది చూరగొన్న
         దూతగా పరదేశ భూతలాధీశులే
              మన్నించునుద్యోగ మాన్యుడైన
          అత్యున్నతంబగు స్థిత్యాఢ్య రాష్ట్రప
               త్యధికారపదవి లభ్యమ్మునైన

   గీ; మనసుతత్వంబుబోధించు మహితుడైన
                గురువుగా శిష్యలోకాల గుండెగుడుల
                పొలుచు గురుదేవు కీర్తినే వలచునట్టి
                ఘనుడుగాదె సర్వేపల్లి జనితబుధుడు.

       రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.


: సీ; తలపాగయొకొయద్ది తలగల్గుజ్ఞానంపు
              దీధితే యమరిన తీరుగాని
        నొసలటే అయ్యది కుసుమించుశాస్త్రాల
              కడలినే తీర్చిన ఘనతగాని
         నాసికమ్మేయద్ది వాసిగాశిష్యులన్
              గుణధాటి నడిపించు కొలువుగాని
          దృక్కులే యయ్యవి దీపించుతేజాన
               సంఘమ్ము దిద్దెడు చవులుగాని

గీ; మందహాసమేగాని ప్రమత్తమయిన
            బుద్ధిమాంద్యపుజాడలే పొడమునట్టి
            విరగబాటు లేనట్టి ధీవెలుగుతోచు
             బుధజనార్ఘ్యు రాధాకృష్ణు మూర్తిగనిన.

         రాయప్రోలు సీతారామశర్మ భీమవరం.

*సిరియన చదువొకటే యిల*
*నరయగ గురు వొసగు నద్ది యమలిన మతియై*
*మురిపెమున భావి తరముల*
*మెరుగులు దిద్దెడి గురువుల మించరి గలడే?*

🙏🙏🙇‍♀️🙏🙏
ఉపాధ్యాయదినోత్సవ శుభప్రభాత ప్రణామములతో.......

*సింహశ్రీ*

విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం
పశ్యన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యథానిద్రయా |
యస్సాక్షాత్కురుతే ప్రభోధసమయే స్వాత్మానమే వాద్వయం
తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే || 1 ||

గురువులందరి పాదపద్మములకు ప్రణామములు🙏🙏

38వ పద్యం


మ.
పదునా ల్గేలె మహాయుంగంబు లొక భూపాలుండు; చెల్లించె న
య్యుదయాస్తాచలసంధి నాజ్ఞ నొక డాయుష్మంతు డై, వీరి య
భ్యుదయం బెవ్వరు చెప్పగా వినరొ, యల్పుల్ మత్తులై యేల చ
చ్చెదరో రాజుల మంచు నక్కట కటా! శ్రీకాళహస్తీశ్వరా!

మనస్తత్వం


ఒక పెద్ద మనిషి ఓ బ్యాంకులోంచి డబ్బులు తీసుకుని డబ్బుల పెట్టెను భుజాన వేసుకుని ద్విచక్రవాహనంలో వెళ్తున్నాడు. ఆ పెట్టెలో వంద రూపాయల కట్టలు దాదాపు వంద ఉన్నాయి. అయితే మార్గమధ్యంలో గతుకుల రోడ్డుపై వెళ్తుండడంతో పెట్టె మూత కొద్దిగా తెరచుకుంది. అందులోంచి ఓ వంద రూపాయల కట్ట కింద పడిపోయింది. అది చూసుకోకుండానే అతను వేగంగా వెళ్ళిపోతున్నాడు.
కిందపడిన నోట్ల కట్టలోంచి ఒక్క నోటు మాత్రం బయటికొచ్చి గాల్లో ఎగిరెళ్ళి కాస్తంత దూరంగా పడిపోయింది.

ఆ నోటు పడిన పక్కగా ఒకతను నడుచుకుంటూ వచ్చాడు. అతను ఆ ఒక్క నోటూ తీసుకుని దగ్గర్లో ఉన్న ఇరానీ కేఫ్‌కి వెళ్ళాడు. ప్లేటు దోసె, ప్లేటు ఇడ్లీ తిని, ఒక కాఫీ తాగాడు. ఆ తర్వాత అక్కడికి దగ్గర్లో ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళాడు. అక్కడి హుండీలో ఓ పదిరూపాయల నోటు వేసి, దేవుడికి కృతజ్ఞతగా దణ్ణం పెట్టుకున్నాడు. సంతోషంతో ఇంటికి చేరాడు. పడిపోయిన నోట్ల కట్టలో 99 అక్కడే ఉన్నాయి. ఆ దార్లో కాస్సేపటికి ఒకడు వచ్చాడు. అతను ఆ నోట్ల కట్ట తీసుకున్నాడు. వెంటనే లెక్కపెట్టాడు. వంద రూపాయల నోట్లు 99 ఉన్నాయి. మళ్ళీ మళ్ళీ లెక్కించాడు. ఎన్నిసార్లు లెక్కించినా 99 ఉన్నాయి.
బ్యాంకులో 99 నోట్లున్న కట్ట ఇవ్వరు. కనుక మిగిలిన నోటు ఆ పక్కనే ఎక్కడో పడి ఉండవచ్చని అనుకుని వెతకడం మొదలుపెట్టాడు. చాలాసేపు వెతికాడు. కానీ ఫలితం లేకపోయింది. అయినా వెతుకులాట మానలేదు.

ఈ కథను చెప్పి గురువు ఫకాలున నవ్వాడు. ఒక్కనోటు దొరికిన వ్యక్తి దర్జాగా హోటల్‌ కు వెళ్ళి ఇడ్లీ తిన్నాడు. కాఫీ తాగాడు. కానీ 99 నోట్లు దొరికిన వ్యక్తి వాటిని ఖర్చు పెట్టుకోక మరో నోటు కోసం వెతకడం మొదలుపెట్డాడు. మనలో చాలా మంది ఈ తరహానే. లభించిన దానినో ఉన్నదానినో అనుభవించరు. దాంతో తృప్తిపడరు. లేని దానికోసం బుర్రలు పాడుచేసుకుంటారు. ఉన్నదాని పట్ల శ్రద్ధ ఉండదు. దేహం ఓ వైపు లాగుతుంటే మనసు మరోవైపు పోతుంటుంది. ఈ రెండింటి మధ్య సమన్వయం లేకుంటే ఎంతున్నా అసంతృప్తి తప్పదు.
           *🌷 స్వస్తి! 🌷*

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*




*అష్టమ స్కంధము - ఇరువది రెండఅధ్యాయము*

*బలిచక్రవర్తి భగవంతుని స్తుతించుట - భగవంతుడు ఆయనయెడ ప్రసన్నుడగుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*22.6 (ఆరవ శ్లోకము)*

*యస్మిన్ వైరానుబంధేన వ్యూఢేన విబుధేతరాః|*

*బహవో లేభిరే సిద్ధిం యాము హైకాంతయోగినః॥7134॥*

నీవు మాకు ఒనర్చిన ఉపకారము వర్ణింపనలవి కానిది. యోగులు అనన్యభావముతో యోగసాధస చేసి సిద్ధిని పొందగలరు. కాని, లోగడ పెక్కుమంది అసురులు నీ పట్ల దృఢమైన శత్రుభావమును వహించి యోగులకు ప్రాప్తించు సిద్ధినే పొందిరి.

*22.7 (ఏడవ శ్లోకము)*

*తేనాహం నిగృహీతోఽస్మి భవతా భూరికర్మణా|*

*బద్ధశ్చ వారుణైః పాశైర్నాతివ్రీడే న చ వ్యథే॥7135॥*

నీ లీలలు, మహిమలు, అనంతములు, నన్ను శిక్షించుటకుగాని, వరుణపాశముచే బంధించుటకుగాని నీ లీలలలోని భాగములే. దీనివలన నేను ఏ మాత్రము సిగ్గుపడను. ఎట్టి వ్యథకును లోనుగాను.

*22.8 (ఎనిమిదవ శ్లోకము)*

*పితామహో మే భవదీయసమ్మతః ప్రహ్లాద ఆవిష్కృతసాధువాదః|*

*భవద్విపక్షేణ విచిత్రవైశసం సంప్రాపితస్త్వత్పరమః స్వపిత్రా॥7136॥*

ప్రభూ! నా పితామహుడైన ప్రహ్లాదుని కీర్తి జగత్ప్రసిద్ధము. అతడు నీ భక్తులలో మిగుల ఉత్తముడని పరిగణింపబడెను. అతని తండ్రియైన హిరణ్యకశిపుడు నీపై గల వైరభావ కారణముగా ప్రహ్లాదుని పెక్కువిధముల బాధించెను. కాని, అతడు నిరంతరము నిన్నే స్మరించుచు తన జీవితమును నీకే అంకితమొనర్చెను.

*22.9 (తొమ్మిదవ శ్లోకము)*

*కిమాత్మనానేన జహాతి యోఽన్తతః కిం రిక్థహారైః స్వజనాఖ్యదస్యుభిః|*

*కిం జాయయా సంసృతిహేతుభూతయా మర్త్యస్య గేహైః కిమిహాయుషో వ్యయః॥7137॥*

మరణధర్మము గలిగిన మనిషికి ఈ దేహముతో పనియేమి? చివరకు ఏదో ఒకనాడు ఆ దేహమును విడిచిపెట్టవలసినదేకదా! నా వారు అనుకొనే స్వజనులు కూడా ఆస్తిపాస్తులను అనుభవించెడు దోపిడీదొంగలు సుమా! అట్టి వారితో గల ప్రయోజనమేమి? ఇక సంసారసాగరములో ముంచివేయునట్టి భార్యతో పని యేమి? గృహాదులయందు మోహపడుట వలన ఆయుక్షీణమేగాని, వేరొకలాభమే లేదు కదా! అందువలన మరణధర్మము గలిగిన శరీరముద్వారా శాశ్వతుడైన ఆ పరమాత్మను పొందుటయే అన్నింటికంటె మీదు మిక్కిలి లాభము.

*పోతనా మాత్యుల వారి పద్యము*

*సీస పద్యము*

చుట్టాలు దొంగలు సుతులు ఋణస్థులు;
కాంతలు సంసార కారణములు;
ధనము లస్థిరములు; దను వతి చంచల;
గార్యార్థు లన్యులు; గడచుఁగాల
మాయువు; సత్వర మైశ్వర్య మతి శీఘ్ర;
మని కాదె తమ తండ్రి నతకరించి
మా తాత సాధుసమ్మతుఁడు ప్రహ్లాదుండు;
నీ పాదకమలంబు నియతిఁ జేరె

*తేటగీతము*

భద్రుఁ డతనికి మృతి లేని బ్రతుకుఁ గలిగె
వైరులై కాని తొల్లి మా వారుఁ గాన
రర్థివై వచ్చి నీవు న న్నడుగు టెల్ల
బద్మలోచన! నా పుణ్య ఫలము గాదె?

*తాత్పర్యము*

పురాణపురుషా! “చుట్టాలు దొంగలు కొడుకులు అప్పులవాళ్ళు. భార్యలు ముక్తిని దూరంచేసేవారు. సంపదలు నిలకడ లేనివి. శరీరం స్థిరం కాదు. ఇతరులు తమప్రయోజనాన్నే కోరుతారు. కాలం నిలువదు. ఆయుష్షు త్వరగా గడుస్తుంది. ఐశ్వర్యం తొందరగా వెళ్ళిపోతుంది” అనుకున్నాడు పుణ్యాత్ముడైన మా తాత ప్రహ్లాదుడు. ఆయన తన తండ్రిని విడనాడి నీపాదాలను సేవించాడు. అదృష్టవంతుడైన అతనికి మరణంలేని మనుగడ దొరికింది. పూర్వం మావారు శత్రువులుగా మారితే తప్ప నిన్ను దర్శించలేకపోయారు. నీవు బిచ్చగాడు వలె వచ్చి నన్ను దేహి అనడం మా పూర్వ పుణ్య ఫలమే కదా స్వామీ!”

*22.10 (పదియవ శ్లోకము)*

*ఇత్థం స నిశ్చిత్య పితామహో మహానగాధబోధో భవతః పాదపద్మమ్|*

*ధ్రువం ప్రపేదే హ్యకుతోభయం జనాద్భీతః స్వపక్షక్షపణస్య సత్తమ॥7138॥*

అని ఇట్లు నిశ్చయించుకొనిన మహాత్ముడగు మా తాతగారైన ప్రహ్లాదుడు సమస్త భయముల నుండి నిత్యము రక్షణ కల్పించు నట్టి నీ పాదపద్మములను శరణు పొందెను కదా! ఎందుకనగా, నీవు తన సోదరుడైన హిరణ్యాక్షుని వధించుటచే, తన పక్షమువారైన ఇతర రాక్షసులను మట్టుబెట్టుటచే, నిన్ను తన శత్రువుగా లెక్కించిన తన తండ్రిని, తన బంధుమిత్రులను సంహరించిన నిన్ను శత్రుభావముతో చూడక, శాశ్వతమైన భయమును పారద్రోలెడు నీ చరణకమలములనే ఆశ్రయించెను. నిజమునకు ఆయన ఉదారహృదయుడు. అగాధ జ్ఞానసంపన్నుడు, సాధుసత్తముడు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*శ్రీమాత్రేనమః*

*శ్రీమాత్రేనమః*

*శ్రీలలితా సహస్రనామ భాష్యము*

*85వ నామ మంత్రము*

*ఓం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజాయై నమః*

పంచదదశీ విద్యలో తొలి ఐదక్షరము *(క ఏ ఈ ల హ్రీం)*  లను వాగ్భవకూటమని అందురు. అట్టి వాగ్భవకూటమే తన ముఖపద్మముగా తేజరిల్లు జగదీశ్వరికి నమస్కారము.

అమ్మవారి ముఖపద్మము స్థూల స్వరూపము కాగా, వాగ్భవకూటము సూక్ష్మస్వరూపము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజా* అను పదహారక్షరముల (షోడశాక్షరీ) నామ మంత్రమును *ఓం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజాయై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగదీశ్వరిని ఉపాసించు సాధకుడు ఆ జగన్మాత కరుణచే ఆతల్లి స్థూల, సూక్ష్మ స్వరూపములను తన మనోనేత్రములందు భావించుచూ ఆత్మానందముననుభవించును. మరియు భౌతిక జీవనమందు ఆనందమయమైన మార్గముననుభవించును.

మన జగన్మాతకు స్థూలము, సూక్ష్మము,సూక్ష్మతరము, సూక్ష్మతమము అను నాలుగుస్వరూపములుగలవు. మన విగ్రహములు, చిత్రములు, అమ్మవారి కాళ్ళుచేతులు, ఇంతకు ముందు నామ మంత్రాలలో జగన్మాత కేశములు, కిరీటము, ముఖకమలము,లలాటము, కనుబొమలు, నాసాదండము, చెక్కిలి, పెదవులు, చుబుకము, కపోలము, దంత పంక్తులు ఇలాంటి వర్ణనలు చేసినదంతా *స్థూలస్వరూపము*. పంచదశీ మంత్రాక్షరములు (క, ఏ, ఈ, ల, హ్రీం, హ, స, క, హ,ల, హ్రీం, స, క, ల హ్రీం) జగన్మాత *సూక్ష్మస్వరూపము*. దీనినే మంత్రాత్మకమందురు. కామకళాక్షరము *సూక్ష్మతర శరీరము* కుండలినీ రూపము *సూక్ష్మతమ శరీరము*.

పంచదశీ విద్యలో మొదటి ఐదక్షరముల (క, ఏ, ఈ, ల, హ్రీం)  సముదాయమునకు *వాగ్భవకూటము* అని అందురు. ఈ కూటము వలన సకలవిద్యలు సంభవించును. జ్ఞానము మొదలగు  మహిమలు గలది. అట్టి వాగ్భవకూటమే జగన్మాత ముఖపద్మము. సూక్ష్మశరీరములోని మంత్రాక్షరములే స్థూలములోని ముఖపద్మమును వర్ణించుటచే స్థూల, సూక్ష్మములకు అభేదము గ్రహించదగును. జగన్మాత శరీరమంతయు మంత్రమయము. అందుకే ఆ తల్లిని *మూలమంత్రాత్మికా* అనికూడా స్తుతిస్తున్నాము

ఇక ఈ పంచదశీవిద్యలోని పదిహేను మంత్రాక్షరములలో మొదటి ఐదక్షరములు (క, ఏ, ఈ, ల, హ్రీం) వాగ్భవకూటము కాగా తరువాత పది అక్షరములు జగన్మాత స్థూల శరీరములోని ఏయే  అవయవములో తరువాత రాబోయే నామ మంత్రములలో తెలుసుకుంటాము.

జగన్మాత్ర వాగ్భవకూటమను సూక్ష్మశరీరమే ఆ తల్లి ముఖపద్మమను స్థూలశరీరము. అటువంటి తల్లికి నమస్కరించు నపుడు *ఓం శ్రీమద్వాగ్భవ కూటైక స్వరూప ముఖపంకజాయై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము  శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో,  వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము  మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🔱నేడు శని (స్థిర) వారము🔱🔱🔱ఆ తిరుమలగిరి వాసుడైన శ్రీనివాసుని స్మరించు శుభదినము🌹🌹🌹శ్రీనివాసుని కరుణ అందరిపై ప్రసరించి అందరికీ శుభములు కలగుగాక🌻🌻🌻 ఓం నమో వేంకటేశాయ.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి  7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*662వ నామ మంత్రము*

*ఓం అష్టమూర్త్యై నమః*

అష్టలక్ష్మీ స్వరూపిణిగా, జీవాత్మ మున్నగు అష్టాత్మల స్వరూపిణిగా, పంచభూతములు, సూర్యచంద్రులు మరియు సోమయాజి స్వరూపిణిగా, పంచభూతములు, సూర్యచంద్రులు మరియు స్వర్గముల స్వరూపిణిగా, అష్టప్రకృతుల స్వరూపిణిగా, సమయాచారమందలి కులాష్టక స్వరూపిణిగా, బ్రాహ్మి మున్నగు మాత్రుకాష్టక స్వరూపిణిగా, వసిన్యాది వాగ్దేవతాాస్వరూపిణిగా, తన భక్తులకు వారివారి జన్మసంస్కారములు, కుల సంస్కారముల కనుగుణంగా కనిపించు సర్వేశ్వరికి నమస్కారము.

శ్రీలలితా సహస్ర నామావళి యందలి *అష్టమూర్తిః* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం అష్టమూర్త్యై నమః* అని ఉచ్చరించుచూ ఆ జగన్మాతను అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపాసించు సాధకునకు ఆ జగన్మాత ఆయా అష్టమూర్తి స్వరూపాలతో అష్టైశ్వర్యములు అనుగ్రహించు, సర్వాభీష్టములు సిద్ధింపజేయును.

1) *లక్ష్మీ మొదలగు అష్టమూర్తి స్వరూపిణి*

*లక్ష్మీ ర్మేధా ధరా పుష్టి ర్గౌరీ తుష్టిః ప్రభా ధృతిః|*

*ఏతాభిః పాహి తనుభి రష్టాభి ర్మాం సరస్వతి!*

మత్స్య పురాణములో ఇలా ఉన్నది:

*1) లక్ష్మి, 2) మేధ, 3) ధర, 4) పుష్టి, 5) గౌరి, 6| తుష్టి, 7) ప్రభ, 8) ధృతి అనెడు ఎనిమిది స్వరూపములలో నున్న సరస్వతీ!* నీవు నన్ను రక్షింపుము. అటువంటి ఎనిమిదిమూర్తుల స్వరూపముగా గలది జగన్మాత.

*2) జీవాత్మ మున్నగు అష్టాత్మల స్వరూపిణి పరమేశ్వరి*

*జీవాత్మా చాంతరాత్మా చ పరమాత్మా చ నిర్మలః*

*శుద్ధాత్మా జ్ఞానరూపాత్మా మహాత్మా సప్తమఃస్మృతః|*

*అష్టమ స్తే షు భూతాత్మే త్యష్టాత్మానః ప్రకీర్తితాః॥*

యోగశాస్త్రమందు గుణములను బట్టి ఆత్మ ఎనిమిది విధములయినట్లు చెప్పారు.

1) జీవాత్మ, 2) అంతరాత్ళ, 3) పరమాత్మ, 4) నిర్మలాత్మ, 5) శుద్ధాత్మ, 6) జ్ఞానాత్మ, 7) మహాత్మ, 8) భూతాత్మ - ఈ ఆత్మాష్టక మూర్తి స్వరూపిణి.

3) పంచభూతములు, సూర్యచంద్రులు, సోమయాజి స్వరూపిణి జగన్మాత:

*పంచభూతాని చంద్రార్కా వాత్మేతి మునిపుంగవ|*

*మూర్తి రష్టౌ శివ స్యాహు ర్దేవదేవస్య ధీమతః|*

*ఆత్మా తస్యాఽష్టమీ మూర్తి ర్యజమానాహ్వయా పరా॥*

*పంచ మహాభూతములు (భూమి, జలము, అగ్ని, ఆగ్ని, వాయువు, ఆకాశము), సూర్యచంద్రులు మరియు జీవాత్మ*

శక్తి రహస్యము ప్రకారము దేవ్యష్టమూర్తులు వీరు *పంచ మహాభూతములు (భూమి, జలము, అగ్ని, ఆగ్ని, వాయువు, ఆకాశము), సూర్యచంద్రులు మరియు స్వర్గము*

4) పంచభూతములు, సూర్యచంద్రులు, సోమయాజి స్వరూపిణి జగన్మాత:

విష్ణు పురాణము ప్రకారము *పంచ మహాభూతములు ( భూమి, జలము, అగ్ని, ఆగ్ని, వాయువు, ఆకాశము), సూర్యచంద్రులు మరియు సోమయాజి*

 ఈ అష్టమూర్తుల స్వరూపము ఆ పరాత్పరిది.

అలాగే అష్టమూర్తుల పత్నులు 1) సువర్చల, 2) ఉమ, 3) సుకేశి, 4) అపరశివ, 5) స్వాహా, 6| దితి, 7) దీక్షా, 8) రోహిణి అని అష్టపత్నులు. అట్టి అష్టపత్నుల స్వరూపిణి ఆ పరాశక్తి.

ఇక వీరి కుమారులు 1) శనైశ్చరుడు, 2) శుక్రుడు, 3) లోహితాంగుడు, 4) మనోజవుడు, 5) స్కందుడు, 6) స్వర్గుడు, 7) సంతానుడు, 8) బుధుడు - వీరు ఎనమండుగురు అష్టమూర్తుల కుమారులు అనిగలదు - ఈ అష్టమూర్తుల స్వరూపిణి ఆ పరమేశ్వరి.

5) అష్టప్రకృతుల స్వరూపిణి ఆ అమ్మ వారు.

అష్టప్రకృతులు 1) మాయ, 2) మహత్తు, 3) అహంకారము, 4) శబ్ద, 5) స్పర్శ, 6) రూప, 7) రస, 8) గంధాలు సృష్టిలోగల ఈ అష్టప్రకృతుల స్వరూపిణి ఆ శ్రీమాత.

ఇక మిగిలిన వికృతులన్నియు ఆ జగదీశ్వరి విభూతులే

6) సమయాచారమందలి కులాష్టక స్వరూపిణి.

కులాష్టక స్వరూపములు 1) గణిక, వేశ్య, 2) శౌండిక (కల్లు అమ్మునది), 3) కైవర్తి (పడవ నడుపునది), 4) రజకి (చాకిత) 5) తస్త్రకారి (గొల్లది), 6) చర్మకారి (చెప్పులు కుట్టునది), 7) మాతంగి (చండాలస్త్రీ), 8) పుంశ్చలి (రంకులాడి) వీరికి కులాష్టకమని పేరు లేదా రుద్రయామళమందు *అవయవములు స్వల్పములైయుండి పొడుగైన జుత్తుగలది గణికయగును* అని ఈ విధముగా ఎనిమిదుగురికి లక్షణములను చెప్పెను. ఈ లక్షణములు తృతీయావరణమునందు ప్రసిద్ధముగా ఉన్నవి.అట్టి కులాష్టక స్వరూపురాలు లేదా బ్రాహ్మి మొదలగు అష్టమాతృకా స్వరూపురాలు. (భాస్కరరాయలు వారు సౌభాగ్య భాస్కరమందు చెప్పారు)

7) మాతృకాష్ట స్వరూపిణి

మనకి సంప్రదాయంలో *అష్టమాతృకలు* అని ఉన్నారు. వాళ్ళని మనం ఎనిమిది పేర్లతో పిలుస్తూ ఉంటాము. 1) బ్రాహ్మి, 2) మహేశ్వరి, 3) వైష్ణవి, 4) మహేంద్రి, 5) చాముండ, 6) కౌమారి, 7) వారాహి, 8) మహాలక్ష్మి

ఇలా ఎనమండుగురు దేవతలు ఉన్నారు. వీరిని *అష్టమాతృకలు* అని పిలుస్తారు. ఈ అష్టమాతృకలు శ్రీచక్రంలో దేవతలుగా ఉంటారు. వీరు నిరంతరము అమ్మవారిని లోపల కొలుస్తూ, అమ్మవారి వలన శక్తిని పొంది మనని ఉద్ధరిస్తూ ఉంటారు. ఈ ఎనమండుగురునే మనం కొలుస్తూ వుంటాము.

8) వసిన్యాది వాగ్దేవతా స్వరూపిణి

1) వశిని, 2) కామేశ్వరి, 3) మోదిని, 4) విమల, 5) అరుణ, 6) జయిని, 7) సర్వేశ్వరి, 8) కాళిని - వీరు ఎనిమిది మంది వాగ్దేవతలు.

9) భక్తులకనేక విధములుగా కనిపించు కరుణామయి. ఇంట్లో పిల్లలకు పొంగుజల్లితే, మశూచి వస్తే చద్ది తినే దేవతగా, కల్లుత్రాగే దేవతగా, బిడ్డపుట్టిన పదకొండవరోజున కొలవబడే కొత్తెమ్మ, కొర్రెమ్మగా, ఎన్నెమ్మగా, ఊరారా గ్రామదేవతగా అనేక రూపాలలో కొలువబడే సర్వేశ్వరి లలితాంబిక.

జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం అష్టమూర్త్యై నమః* అని అనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు *పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి* ఆశీర్వచనములతో, వివిధ గ్రంథములు, ముఖ్యముగా భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము మరియు పలువురు విజ్ఞులు వ్రాసిన గ్రంథములు పరిశీలించి వారందరికీ పాదాభివందనమాచరించుచూ, కృతజ్ఞతతో వివరించడమైనది.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🔱నేడు శని (స్థిర) వారము🔱🔱🔱ఆ తిరుమలగిరి వాసుడైన శ్రీనివాసుని స్మరించు శుభదినము🌹🌹🌹శ్రీనివాసుని కరుణ అందరిపై ప్రసరించి అందరికీ శుభములు కలగుగాక🌻🌻🌻 ఓం నమో వేంకటేశాయ.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* చరవాణి 7702090319🕉🕉🕉🕉🕉🕉🕉🕉

వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - ఇరువది రెండఅధ్యాయము*

*బలిచక్రవర్తి భగవంతుని స్తుతించుట - భగవంతుడు ఆయనయెడ ప్రసన్నుడగుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*శ్రీశుక ఉవాచ*

*22.1 (ప్రథమ శ్లోకము)*

*ఏవం విప్రకృతో రాజన్ బలిర్భగవతాసురః|*

*భిద్యమానోఽప్యభిన్నాత్మా ప్రత్యాహావిక్లవం వచః॥7129॥*

*శ్రీశుకుడు నుడివెను* పరీక్షిన్మహారాజా! భగవంతుడు దైత్యరాజైన బలిచక్రవర్తిని ఈ విధముగా తిరస్కరించి, అతని ధైర్యమును సడలింపజేయుటకు ప్రయత్నించెను. కాని, బలి ఏమాత్రమూ చలింపక ధైర్యముగా ఇట్లు పలికెను-

*బలిరువాచ*

*22.2 (రెండవ శ్లోకము)*

*యద్యుత్తమశ్లోక భవాన్ మమేరితం వచో వ్యలీకం సురవర్య మన్యతే|*

*కరోమ్యృతం తన్న భవేత్ప్రలంభనం పదం తృతీయం కురు శీర్ష్ణి మే నిజమ్॥7130॥*

*బలిచక్రవర్తి పలికెను* దేవాదిదేవా! నీ కీర్తి మిగుల పవిత్రమైనది. నా మాటలు అసత్యములని భావించుచున్నావా? కాని, అట్లు కాదు. వాటిని నేను సత్యము చేసి, చూపెదను. నిన్ను నేను మోసగింపను. పుణ్యకీర్తీ! *నన్ను నేను* నీకు సమర్పించుకొంటిని. కనుక, దయచేసి నీ మూడవపాదమును నా తలపై ఉంచుము.

*22.3 (మూడవ శ్లోకము)*

*బిభేమి నాహం నిరయాత్పదచ్యుతో న పాశబంధాద్వ్యసనాద్దురత్యయాత్|* .

*నైవార్థకృచ్ఛ్రాద్భవతో వినిగ్రహాదసాధువాదాద్భృశముద్విజే యథా ॥7131॥*

నేను నరకయాతనకుగాని, నా రాజ్య పదవి నష్టమగుట వలనగాని భయపడను. పాశములచే బంధింపబడినను, ఆర్థిక సంకటము ఏర్పడినను నాకు భయము లేదు. అంతకంటె గొప్ప శిక్ష విధించినను నేను భయపడను. నేను కేవలము అపకీర్తికి మాత్రమే భయపడుదును.

*22.4 (నాలుగవ శ్లోకము)*

*పుంసాం శ్లాఘ్యతమం మన్యే దండమర్హత్తమార్పితమ్|*

*యం న మాతా పితా భ్రాతా సుహృదశ్చాదిశంతి హి॥7132॥*

మీవంటి పూజ్యులైన గురుజనుల ద్వారా విధింపబడిన శిక్ష, జీవమాత్రులందరికి కీర్తిని పెంపొందించును. అట్టి శిక్షను తల్లిదండ్రులు, సోదరులు, ఆత్మీయులగువారు మోహవశమున కూడ విధింపజాలరు.

*22.5 (ఐదవ శ్లోకము)*

*త్వం నూనమసురాణాం నః పారోక్ష్యః పరమో గురుః|*

*యో నోఽనేకమదాంధానాం విభ్రంశం చక్షురాదిశత్॥7133॥*

నీవు అసురులకు పరోక్షముగ శ్రేష్ఠమైన శిక్షణను ఇచ్చెదవు. కనుక, నీవు మాకు పరమగురుడవు. మేము ధనము, వంశము, బలము మొదలగు వాటిచే గర్వాంధులము ఐనప్పుడు, నీవు వాటిని మా నుండి లాగికొని, మాకు కనువిప్పు కలిగింతువు. ఈ విధముగా నీవు మమ్ములను సన్మార్గమున నడిపింతువు.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని ఇరువది రెండవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319

దసరా మహోత్సవాలు....విజయవాడ



అక్టోబర్ 17 నుంచి ఇంద్రకీలాద్రి పై శ్రీ శార్వరి నామ సంవత్సర దసరా మహోత్సవాలు

9 రోజుల పాటు పది అలంకారాలలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ

అక్టోబర్ 17 వ తేదీన తొలిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి గా దర్శనమివ్వనున్న దుర్గమ్మ

18 న శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి గా...
19న శ్రీ గాయత్రీ దేవిగా,
 20 న శ్రీ అన్నపూర్ణాదేవిగా ,
21 మూలానక్షత్రం రోజున శ్రీ సరస్వతీ దేవిగా దర్శనమివ్వనున్న దుర్గమ్మ

22 న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా,
23 న శ్రీ మహాలక్ష్మీ దేవిగా,
24న శ్రీ దుర్గాదేవి, శ్రీ మహిషా సుర మర్ధనీ దేవిగా రెండు అలంకారాలలో దర్శనమివ్వనున్న దుర్గమ్మ

25 న శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం...అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల తెప్పోత్సవం

కోవిడ్ దృష్ట్యా టైం స్లాట్ బుక్ చేసుకున్న వారికి మాత్రమే దసరా లో అమ్మవారి దర్శనానికి అనుమతించే అవకాశం

రోజుకు 9 వేలా లేక సంఖ్య పెంచాలా అన్న దానిపై అధికారుల తర్జనబర్జన

గత ఏడాది దసరాలో రోజుకు లక్షపైనే అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు

ఈ ఏడాది కోవిడ్ దృష్ట్యా ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్న దుర్గగుడి అధికారులు