24, సెప్టెంబర్ 2020, గురువారం

*శ్రీమాత్రేనమః*



*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*101వ నామ మంత్రము*


*ఓం మణిపూరాంతరుదితాయై నమః*


బ్రహ్మగ్రంథి భేదన మనంతరము, మూలాధారస్వాధిష్ఠానములకు ప్రతీకయై దశదళములుగలిగి జలతత్త్వాత్మకముతో నాభిస్థానము నందుండు మణిపూరక చక్రమునందు వివిధ రకముల మణులతో సమయాచారులచే పూజలందుకొనుచూ తేజరిల్లుచున్న జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *మణిపూరాంత రుదితా* అను ఎనిమిదక్షరముల (అష్టాక్షరీ) నామ మంత్రమును *ఓం మణిపూరాంతరుదితాయై నమః* అని ఉచ్చరించుచూ అత్యంత భక్తప్రపత్తులతో ఆ జగన్మాతను ఉపాసించు సాధకుడు సర్వాభీష్టసిద్ధిని పొంది ధన్యుడగును.


మూలాధారమునందు నిద్రావస్థలో ఉన్న కుండలినీ శక్తిని సాధకుడు తన యోగదీక్షతో జాగృతమొనర్చగా, సుషుమ్నా మార్గములో ఊర్ధ్వముఖముగా పయనించుచూ స్వాధిష్ఠానము దాటి బ్రహ్మగ్రంథిని భేదించి మణిపూరక చక్రమునందు కుండలినీ శక్తిని ప్రవేశింపజేయును.

మూలాధార చక్రము నాలుగు దళముల పద్మము. స్వాధిష్ఠాన చక్రము ఆరుదళముల పద్మము. మణిపూరకచక్రము మూలాధారస్వాధిష్ఠాన చక్రములకు ప్రతీకగా పదిదళములుండును. మణిపూరక చక్రం నాభిస్థానము నందుండును. నాభిస్థానము అంటే తల్లీ బిడ్డల భౌతిక బంధమునకు ప్రతీక. అందుచేత పిండోత్పత్తి, గర్భస్థ శిశువు అభివృద్ధిచెందు గర్భాశయముకూడా ఇచ్చటనే ఉండును. గర్భస్థ శిశువు తొమ్మిదినెలల ఎదుగుదల మణిపూరక చక్రము వల్లనే జరుగుతుంది. ఇచ్చట కుండలినీ శక్తిరూపిణియైన శ్రీమాత సమయాచారులనుండి వివిధ రకముల మణులచే పూజలందు కొనును. మణిపూరక చక్రము పంచభూతాత్మక తత్త్వములలో అగ్నితత్ప్వమా లేక జలతత్త్వమా అన్నది రెండు విభన్న వాదనలు ఉన్నమాట వాస్తవమే. కాని ఇక్కడ ఆది శంకరుల ఈ క్రింది సౌందర్యలహరిలో 9శ్లోకం తీసుకుంటే జలతత్త్వముగానే భావించవలెను. కాని మణిపూరక చక్రము పదిదళములతో మూలాధార(4)+ స్వాధిష్ఠానముల (6) సంకేతముగా ఉన్నది గనుక స్వాధిష్ఠానము యొక్క అగ్నితత్త్వం కూడా కొందరు జోడించి మణిపూరక చక్రమునకు అగ్ని మరియు జలతత్త్వములను చెపుతారు.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

సౌందర్యలహరి 9వ శ్లోకము.


*మహీం మూలాధారే - కమపి మణిపూరే హుతవహం*


*స్థితం స్వధిష్టానే - హృది మరుత మాకాశ ముపరి |*


*మనో‌உపి భ్రూమధ్యే - సకలమపి భిత్వా కులపథం*


*సహస్రారే పద్మే - స హరహసి పత్యా విహరసే ||*

 

అమ్మా..మూలాధార చక్రమందలి భూతత్వాన్ని దాటి , *మణిపూరక చక్రం లోని జలతత్వాన్ని దాటి*, *స్వాదిష్ఠాన చక్రంలోని అగ్నితత్వాన్ని* అధిగమించి,అనాహత చక్రంలోని వాయుతత్వాన్ని దాటి,విశుద్ద చక్రంలోని ఆకాశతత్వాన్ని దాటి, ఆజ్ఞాచక్రంలోని మనస్తత్వాన్ని దాటి,సుషుమ్నా మార్గమును ఛేదించి అలా పైకి ప్రయాణించి,సహస్రార పద్మచక్రంలో నీ భర్త అయిన పరమశివునితో కలసి సదా విహరించుచున్నావు.

(పంచభూతముల వరుస *పృధివ్యాపస్తేజోవాయురాకాశాత్* అన్న ఆధారంతో ఆ తత్వముల వరుసతో ఇచట చక్రములను చూపుట జరిగినది. అసలు *మూలాధార,స్వాధిష్ఠాన,మణిపూరక,అనాహత,విశుద్ధ, ఆజ్ఞా* చక్రముల వరుసక్రమంలో అమ్మ మన శరీరంలో గుద లింగ,మధ్యస్థానాల్లో 3 చక్రాలు,హృదయ,కంఠ,భ్రూమధ్య స్థానాల్లో 3 చక్రాలు మొత్తం 6 చక్రముల పైన,బ్రహ్మరంధ్ర ప్రదేశములో ఉన్న సహస్రారచక్రంలో అమ్మ శివునితో కలసి విహరించుచుండును.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మణిపూరక చక్రము సోమసూర్యాగ్నుల గుణం గలిగి ఉండడం చేత మణిలాగ ప్రకాశిస్తుంది గనకు మణిపూరక చక్రమని పేరు గలదని భావించవచ్చు.


పంచభూతాలలో మొదటిది పృథివీ తత్త్వము. ఇది మూలాధారము, పృథివీ తత్త్వాత్మకమైనది. రెండవది జలతత్త్వము, మణిపూరక చక్రము జలతత్త్వము గలది. అందుచే పంచభూతాల వరుసలో రెండవది మణిపూరక చక్రము అగుతుంది కాని షట్చక్రముల వరుసలో (సుషుమ్నా మార్గము వరుసలో) మూడవది.


సమయాచారులు చతుర్విధైక్యసంధానము చేసినవారికి జగన్మాత చతుర్భుజగాను, షడ్విధైక్య సంధానము చేసినవారికి దశభుజగాను దర్శనమిస్తుంది.


చతుర్విధైక్యము, షడ్విధౌక్యముల వివరణకు *సమయాచార తత్పరా*(98వ నామ మంత్రము చూడగలరు).


జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం మూలాధారైక నిలయాయై నమః* అని అనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెల్లమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: