24, సెప్టెంబర్ 2020, గురువారం

శ్రీ భాగవతం దశమ స్కంధం

 శ్రీ గురుభ్యో నమః శుభమస్తు 

        ........................... 


              ............ 


కంసుడికి తనను సంహరించే 

శక్తిమంతుడు పుట్టి, పెరుగుతున్నాడని, వానిని సంహరింపమని ఆనతి ఇచ్చాడు 


విష్ణువును సంహరించాలంటే, ఆతని దేహము దొరకాలి. ఆతను, ధర్మములో నిలిచి యుండేవాడు. 

అది ఒకచోట దొరకదు. ఆతనికి ఎన్నో శరీరములు ఉంటాయి. 

గోవులు, బ్రాహ్మణులూ, వేదములు, తపస్సులు, యాగాలు , శాంతి ఇవన్నీ ఆయన వుండే ప్రదేశాలే. వాటిని అంతంచేస్తే , ఆతనికి నిలువ నీడ యుండదు. కంసుడి ఆలోచనలు ఇలా సాగాయి. సాధు జనాలను, 

హింసించడానికి, ఆదేశాలు ఇచ్చాడు. ఇక రాక్షసుల అకృత్యాలకు అంతే లేకపోయింది. 

ధర్మ ఆచరించే, సజ్జనుల హింసించసాగారు. సమయా సమయాలు లేకుండా పాపాల్ని మూటగట్టుకున్నారు. పూజ్యులను హింసించితే, కీర్తి, ఐశ్వర్యము , ఆయుష్షు తగ్గిపోతాయని వారికి 

తెలియదు. 


ఇలాటి పాపులలో, పూతన అనే రక్కసి ఒకటి యుంది. 

శిశువులను చంపడంలో ఆరితేరింది. కామరూపిణి. మాయ వేషాల్లో పల్లెలలో తిరుగుతూ పసి పిల్లలను చంపసాగింది 

ఆకాశ మార్గాన వ్రేపల్లె చేరింది. 

నందుడి ఇంట్లో, ఒక బాలుడి ఏడుపు వింది. సంతోష పడింది 

మోహనాకారిణి గా మారింది వ్రేపల్లె వీధుల్లో తిరగ సాగింది. 

ఆమె సౌందర్యానికి గోపికలు ముగ్ధులయ్యారు 

"అమం శతాంభోజక రేణ రూపిణీం 

 గోష్య:శ్రియం ద్రష్టుమివాగతాం పతిం "


శ్రీకృషుని దర్సించుటకు అరుదెంచిన లక్ష్మి అని అనుకున్నారు.    

ప్రకాశించే కండ్లు, ఎత్తైన వక్షోజాలు, చంద్రుడిని బోలుముఖము, సన్నని నడుము, 

అల నాటి మోహిని అవతార రూపంతో నందుడి ఇంట అడుగు పెట్టింది. 

పూతన ఊయల వైపుకు నడిచింది. ఊయలలో బాల కృషుని రూపాన్ని చూసింది. మాములుగా అయితే స్వామి పూతనను తేరి పార చూసేవాడు. 

ఇది శిశు ఘాతి అని ముందే అర్ధం అయింది. ఏమి తెలియనట్లు కండ్లు మూసుకున్నాడు. 

స్వామికి రత్నమాల గుర్తుకు వచ్చింది. రత్నమాల ఎవ్వరో కాదు. బలిచక్రవర్తి, వింధ్యావళీ ల 

కూతురు. తన తండ్రి చేస్తున్న యాగ సమయం లొ దానము తీసుకొనడానికి వచ్చిన వామనుడి ని చూసింది. ఆతని బ్రహ్మ వర్చ్చస్సు, ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. అలాటి పుత్రుడు, ఒకడు తనకంటే బాగుణ్ణు అనుకొంది. కానీ తరువాత అదే వామనుడు తన తండ్రిని పాతాళానికి త్రొక్కెయ్యడం చూసి, క్రౌర్యం పెంచుకుంది. పుత్రభావం తో ఇవ్వాలనుకున్న తన చను బాలను, శత్రుభావంతో విష పూరితం చేసి, వామనుణ్ణి చంపితే బాగుణ్ణు అనుకొంది. ఆ సంకల్పం 

అప్పుడు నెరవేరలేదు. మంచి మనసుతో భగవంతుడిని కాసేపు ఆరాధన భావంతో స్మరించిన పుణ్యానికి, ఈ రోజు రత్నమాల పూతన రూపంలో తీర్చుకుంటున్నదని అంటారు.

దేవకి కి లభ్య పడని అదృష్టం, ఇప్పుడు పూతనకు లభ్యం కావడానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి కదా !

భగవంతుడు ఎవరిని, ఎప్పుడు అనుగ్రహిస్తాడో, ఎందుకు అనుగ్రహిస్తాడో, మనకు అవగతం కాదు. 

పూతన వేసే ప్రతి అడుగు మృత్యువు వైపుకి అనుకోవాలా లేక మోక్షం వైపు వైపుకు అనుకోవాలో! ఆ పాప పుణ్యాలు ఆయనకే ఎరుక. 


ఉయ్యాల లోని బిడ్డను పూతన ఎత్తుకొని తన వడి లొ ఉంచుకొంది. 

"అనన్త మారోప యదజ్ఞ మస్తకం 

యథోరగం సుప్తమబుద్ధి రజ్జు ధీ "

సర్పమును త్రాడుగా భావించి, అజ్ఞానంతో, మానవుడు ఆ పామును వొడిలో వుంచు కున్నట్లు, తనను వధించడానికి ఆయత్త మవుతున్న శ్రీకృషుని, పూతన తన వడిలో వుంచు కొన్నది. 

విషం కక్కే తన చనుబాలు, నల్లనయ్యకు, ఇస్తే, ఇంక నల్లగా మారి, మాడి, నశిస్తాడని పూతన ఉద్దేశ్యము. పైట తొలగించింది, స్తనాన్ని, స్వామి ఆధరాలకు అందించింది. సూర్యుడిని మబ్బుకమ్మినట్లు, తన పైట చెంగు కృష్ణయ్య మొహానికి కప్పింది. 

పూతన ఎంత అదృష్టవంతురాలైన స్త్రీయో !

స్వామి ప్రతి అంగము పూజనీయమే !నాడు పాదాలు తండ్రి బలిని పాతాళానికి పంపితే. ఈ రోజు స్వామి అధరాలు కుమార్తె కు మోక్షాన్ని ఇస్తున్నాయి. 

వేదాలు వల్లించిన అధరాలు. 

తల్లి కి తత్వమును నేర్పిన ఆధరాలు. 

మోహన మురళి గానం తో జగత్తును పరవశింప చేయనున్న 

అధరాలు. 

శ్రీమహాలక్ష్మి కే స్వంతమైన అధరాలు 

సుకుమారంగా సున్నితంగా, మధుర సంభాషణలతో, శ్రీ లక్ష్మి 

 చెక్కిళ్ళు చుంబించే ఆధరాలు. ఇపుడు పూతన కు మారణాయుధాలు కాబోతున్నాయి 


కళ్ళుమూసినస్వామిపరమశివుడిని ప్రార్ధించాడని అంటారు. పూతన గరళం ను ఆస్వాదించడం గరళ కంఠుడి కే తెలుసునని, ఆయనను ఆ సమయంలో సాయం అర్ధించ దానికి ధ్యానం లోకి వెళ్లడంటారు.


పూతన అందించిన కుచ మొనను  

స్వామి పెదవులు అందుకున్నాయి. ఈ దృశ్యం చూస్తున్న దేవత లందరు అసూయపడ్డారు. గోవులు గోవు పొదుగులు దీనంగా చూశాయట. 

పూతన అనిర్వచనీయ అనందం, పారవశ్యం తొలి క్షణాలవరకే. మొదట ఆనందంతో మెలికలు తిరిగిన పూతనకు, భరించరాని భాధ ప్రారంభం అయింది. ప్రాణాలను ఎవరో గుంజుకుంటున్న భాధ !గిల గిల కొట్టుక సాగింది. విడు, విడు అని కేకలు పెట్టింది. నలుగురు చేరకముందే, ప్రాణాలు వదిలింది సహజమైన వికృత రూపం మహాపర్వతం లా పడిపోయింది. 

ప్రకృతి అతలా కుతలం అయింది.  


"పత మానో పి తద్దేహ స్త్రీగవ్యూ త్య స్త రుద్రమాన్ 

చూర్ణాయామాస రాజేంద్ర మహాదాసీత్త దద్భుతం 


ఆరు క్రోసుల లోని వృక్షాలు అన్ని నుగ్గు నుగ్గు అయ్యాయట. 

ఆ వికృతకారాన్ని చూడడానికి అందరు భయపడ్డారు 

ఆరురోజుల క్రితం జనియించిన 

శ్రీకృష్ణుడు ఆరక్కసి కుచముల దగ్గర ఆడుకుంటూ కనిపించాడట. 

యశోద బిడ్డను అందుకొని . బిడ్డకు దిష్టి తీసి రక్షరేఖలు కట్టింది. 


ఇంటికి వచ్చిన నందుడు విషయం తెలుసుకొని, వసుదేవుడు తనకు చెప్పిన జాగ్రత్త్తలు గుర్తు చేసుకొని , బాల కృష్ణుడు పట్ల 

జాగ్రత్త వహించడం మొదలు పెట్టాడు 


పూతన శరీరము దగ్ధం చెయ్యడానికి వ్రేపల్లె వాసులు బహుకష్టపడ్డారు. పూతన శరీరం 

కాలుతుంటే అగరు సువాసనలు 

వచ్చాయట. 

"హరి దనమీదం బదములు, కరములు నిడి చన్ను గుడిచి కదిసిన మాత్రన్ 


హరిజనని పగిది బరగతి, కరిగెను 

దురితముల బాసి యసురాంగనయున్ 


కృష్ణుడు కాళ్ళు చేతులు వేసి చనుబాలు తాగినంత మాత్రము న

రక్కసి పూతన పాపాలు పటా పంచలు అయి పోయాయి. 

బాలకృష్ణుని ఒకసారి స్మరించి, 

ధ్యానం చేయడం మంచిదంటారు 


        శుభమస్తు

కామెంట్‌లు లేవు: