24, సెప్టెంబర్ 2020, గురువారం

**శ్రీమద్భాగవతము**

 **దశిక రాము**




 తృతీయ స్కంధం -28


హిరణ్యాక్షవధ  


మెడమీద జూలుతో, శత్రువుల గొప్ప వక్షస్థలాన్ని బద్దలు కొట్టే కోరలతో, వాడియైన గిట్టల నైపుణ్యంతో, బ్రహ్మాండము అను గంట కట్టబడిన మొలతో ఉన్న ఆ యజ్ఞవరాహానికి పటుత్వం కోల్పోయిన ఆ హిరణ్యాక్షుడు లొంగిపోయాడు.ఆ విధంగా లొంగిపోగా...ఆకాశంనుండి చూస్తున్న ఇంద్రాది దేవతలు సంతోషించే విధంగా విష్ణువు వజ్రంలాగా కఠోరమైన చేతితో హిరణ్యాక్షుని గూబమీద కొట్టాడు. ఆ దెబ్బతో రాక్షసరాజు కన్నులనుండి రక్తం చిందగా గాలిదెబ్బకు కూకటివేళ్ళతో కూలిన వృక్షంలాగా నేలపై కూలిపోయాడు. అప్పుడా రాక్షసవీరుడు బుడబుడమని నెత్తురు కక్కుతూ, వికారమైన ఆకారంతో, కన్నులు బయటికి పొడుచుకురాగా, పండ్లు కొరుకుతూ నేలమీద పడి ప్రాణాలు విడిచాడు.అట్లా పడిన హిరణ్యాక్షుని చూచి బ్రహ్మ మొదలైన దేవతలు ఆశ్చర్యపడి తమ మనస్సులలో ‘ఇతడు ఈ అవస్థను ఎట్లా పొందాడా’ అని తలుస్తూ ఇంకా ఇలా అనుకున్నారు. "లింగశరీరాలను భంగం చేసికొనడానికి మహా యోగిపుంగవులు యోగమార్గాల ద్వారా ఏ మహానుభావుని తమ హృదయాలలో పదిల పరచుకుంటారో ఆ మహావిష్ణువు చేతిదెబ్బ తిని, అతని ముఖపద్మాన్ని చూస్తూ చచ్చిన ఈ రాక్షసుడు ఎంత అదృష్టవంతుడో, ఎంత ఉత్తముడో? వీళ్ళు శ్రీహరి యొక్క ద్వారపాలకులే కదా! మునీశ్వరుల శాపం వల్ల ఈ నీచ రాక్షసజన్మను పొంది ఈరోజు విష్ణువు చేతనే చావడం వల్ల వచ్చే జన్మలో వైకుంఠంలో శాశ్వతంగా నివసిస్తారు. వీళ్ళకు ఇక చావు పుట్టుకలు ఉండవు.”

అని అనుకొంటూ ఆశ్చర్యపడి పరమ పవిత్రమైన శరీరాన్ని ధరించినవాడూ, వికసించిన కమలాల వంటి కన్నులు కలవాడూ, దేవతలనూ మునులనూ రక్షించడంలో సమర్థుడూ, రాక్షసులనే ఏనుగులకు సింహం వంటివాడూ అయిన విష్ణువును (చూచారు).


దేవతలు శ్రీహరినినుతించుట 


దేవతలు ఆ మహావిష్ణువును చూచి...“ఓ కమలాక్షా! ఈ లోకంలోని అందరి రహస్యాలను తెలిసికొని, అసూయతో పగబట్టిన ఈ దేవతల శత్రువైన హిరణ్యాక్షుని చంపావు. కాబట్టి ఇక అందరికీ శుభం కలుగుతుంది” అంటూ నుదుట చేతులు చేర్చి వినమ్రులై వివేకవంతుడూ, పుణ్యాత్ముడూ అయిన విష్ణువును స్తుతించారు.


 వరహావతార విసర్జనంబు 


అప్పుడు...దేవతల శత్రువైన హిరణ్యాక్షుని చంపినందుకు బ్రహ్మాది దేవతలూ, మునులూ తనను కొనియాడుతున్న సంస్తుతులకు యజ్ఞవరాహమూర్తి అయిన విష్ణువు మనస్సులో ఎంతో సంతోషించి సంపూర్ణ మంగళోత్సవం ఒప్పే విధంగా అందరినీ దయాదృష్టితో చూస్తూ..వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఆ మహోత్సవానికి సూచకంగా దేవదుందుభులు అమోఘంగా మ్రోగాయి. భూమిపైన పూలవాన కురిసింది. అంతటా హోమకుండాలు అగ్నులతో తేజరిల్లాయి. సూర్యమండలం, చంద్రమండలం సహజ కాంతులతో ప్రకాశించాయి. అని బ్రహ్మదేవుడు దేవతలకు చెప్పినటువంటి ఈ పవిత్ర చరిత్రను మైత్రేయుడు విదురునికి వివరించిన విధానాన్ని....

శుకయోగి​ పరీక్షిత్తుకు మంచిమనస్సుతో వినిపించాడని సూతుడు శౌనకాది మునులకు చక్కగా తెలియచెప్పాడు.ఈ విధంగా మైత్రేయుడు చెప్పగా విని విదురుడు సంతోషించాడు” అని...పాపాలను తొలగించే ఈ చరిత్రను విన్న, చదివిన లోకులకు విశేషకీర్తీ, విష్ణుపాదాలపై భక్తీ, ఇహపర సుఖాలూ తప్పక లభిస్తాయి”. అని చెప్పి మళ్ళీ సూతుడు మహర్షులతో ఇట్లా అన్నాడు. “ఆ విధంగా హిరణ్యాక్షుని కథ విన్న పరీక్షిత్తు శుకమహర్షిని చూచి “మునీంద్రా! హిరణ్యాక్షుడు చచ్చిన తరువాత లోకం సమస్థితిని పొందిన సంగతిని చెప్పు. స్వాయంభువ మనువును సృష్టించిన తర్వాత బ్రహ్మ పశుపక్ష్యాది జంతువులను సృష్టించడానికి ఎన్ని మార్గాలను కల్పించాడు? భాగవతోత్తముడైన విదురుడు శ్రీకృష్ణునకు అపకారం చేయ దలచిన దుష్టులైన ధృతరాష్ట్రుని కొడుకులను విడిచిపెట్టి, తన తండ్రియైన వేదవ్యాసునితో సమానుడై, వాక్కూ కర్మా సమస్తమూ శ్రీకృష్ణునిపై చేర్చి భగవద్భక్తులను సేవిస్తూ, పుణ్యతీర్థాలను సేవించడం వల్ల మనోవికాసం పొంది, పాపాలను పోగొట్టుకొని మైత్రేయ మహామునిని ఏమని ప్రశ్నించాడు? అవి అన్నీ తెలియజేయండి” అని అడిగిన రాజుతో శుకమహర్షి ఇలా అన్నాడు. పవిత్రమైన మనస్సుగల ఆ విదురుడు మైత్రేయుణ్ణి చూచి ఎంతో సంతోషంతో ఇట్లా అన్నాడు. “చాతుర్యం కల మనస్సు కల ఓ మహర్షీ! సమస్తసృష్టికీ కర్త అయిన బ్రహ్మ ప్రజాసృష్టి కోసం ముందుగా ప్రజాపతులను సృష్టించి, ఆ తర్వాత ఇంకా ఏమి సృష్టించాలనుకున్నాడు? ముందుగా సృష్టించిన మరీచి మొదలగు మునులు బ్రహ్మదేవుని ఆదేశానుసారం లోకాల నన్నిటినీ ఎలా సృష్టించారు? కీర్తివంతులైన ఆ ప్రజాపతులు భార్యలతో ఉన్నప్పుడు ఏమేమి సృష్టించారు? భార్యలను ఎడబాసిన తర్వాత ఏం సృష్టించారు?దయామయ హృదయా! బుధులచే పొగడబడే ఓ మహర్షీ! వాళ్ళంతా కలిసికట్టుగా తమలో తాము సమైక్యమై ఏమేమి సృష్టించారు? నాకు వివరంగా చెప్పు”

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: