24, సెప్టెంబర్ 2020, గురువారం

**మహాభారతము**

 **దశిక రాము**




నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


92 - అరణ్యపర్వం.


కలియుగాంతము, యుగాలపరిక్రమణల విధానం గురించి తన ప్రత్యక్ష అనుభవాలను ధర్మరాజాదులతో పంచుకున్న మార్కండేయమహర్షి, శ్రీకృష్ణుని సన్నిధిలో, ధర్మవ్యాధుడనే మహనీయుని గాధను యిలా వివరిస్తున్నాడు :


ఒకప్పుడు, కౌశికుడనే బ్రాహ్మణుడు వేదవేదాంగాలు అభ్యసించి, నిత్యమూ జప తపాదులు చేసుకుంటూ, వుదరపోషణార్ధం యాచనచేసుకుంటూ, నిర్మలమైన జీవితం గడుపుతూ వుండేవాడు. తన దినచర్యలో, ఒకనాడు చెట్టుక్రింద కూర్చుని అతడు వేదాధ్యయనం చేసుకుంటూ వుండగా, ఒక కొంగ అదే చెట్టుమీద సేదతీరుతూ, ఆయనపై రెట్టవేసింది.  


ఆ సంఘటనకు కోపించి కౌశికుడు, కళ్ళెర్ర చేసి, చెట్టు పైకిచూశాడు. అంతే ! ఆ కోపాగ్నిని తట్టుకోలేక, ఆకొంగ, చెట్టు పైనుండి దబ్బున క్రిందపడి చనిపోయింది. అది చూసి కౌశికుడు యెంతో పశ్చాత్త్తాపం చెంది, కోపం వలన ఇంత దుష్పరిణామాలు వున్నాయా ! అని చలించిపోయాడు. ఏ కోరికలు లేని తనలోనే ఇంతక్రోధం వుంటే, సామాన్యుల పరిస్థితి యేమిటి ? అనుకుంటూ, ప్రాయశ్చిత్త క్రియ చేసుకుని, భిక్షాటన సమయమైందని, భిక్షాపాత్ర పట్టుకుని, గ్రామంలోకి బయలుదేరి వెళ్ళాడు.


గ్రామంలో ఒక ఇంటిముందునిలబడి ' భవతీ భిక్షం దేహీ ' అంటూ భిక్ష అర్ధించాడు. ఆ ఇంటి గృహిణి, గృహశుద్ధికార్యక్రమంలో వుండి, ' వస్తున్నాను స్వామీ ! కొద్దిక్షణాలు ఆగమని ' చెప్పింది. అదేసమయానికి ఆమెభర్త యెంతో అలిసిపోయి, ఆకలితో యింటికివచ్చాడు. వెంటనే ఆయనకు మంచితీర్థం యిచ్చి, యెండలో వచ్చాడని తగు సపర్యలు చేసి, భోజనం వడ్డించి, ఆయన భోజనం చేసిన తరువాత, శయ్య యేర్పాటు చేసింది.   


ఇంతలో హఠాత్తుగా ఆమెకు గుమ్మం ముందు వున్న బ్రాహ్మణుడు గుర్తుకువచ్చి, ఆలశ్యమైనందుకు నొచ్చుకుంటూ, భిక్ష యివ్వడానికి బైటకువచ్చింది. ఎప్పటినుండో ఎదురు చూస్తున్న కౌశికుడు, యెర్రబారిన నేత్రాలతో రోషంగా, ముక్కుపుటాలు 

అదురుతుండగా, ' ఓ గృహిణీ ! ఏమి నీ వింత ప్రవర్తన ? బ్రహ్మణుడంటే అంత అగౌరవమా ! నీ యింటిముందు యాచకుడిగా నిలబడినాడని, చులకనా ! ఇది నీకు తగునా ? ' అని కోపంగా అడిగాడు. దానికి ఆమె యెంతో వినయంగా ' మహానుభావా ! నన్ను క్షమించండి. ఆకలితో వచ్చిన నా భర్తను సేవించి రావడంలో ఆలశ్యమైంది. పతిసేవకి మించిన ధర్మం వేరే యేమివున్నదని ఆయన సేవలో మీ పట్ల కొద్దిగా ఆలశ్యమైంది.' అని వినయంగా సమాధానమిచ్చింది.


ఆమె యిచ్చిన సమాధానంతో కౌశికుడు తృప్తి చెందక, ' గృహస్థాశ్రమంలో వుండి అతిధిని అవమానిస్తావా ? ఇంద్రాదులు ఆ సాహసం చెయ్యలేరు. మాలాంటి మహిమాన్వితులైన, విప్రులు తలుచుకుంటే, యీభూమండలాన్ని అగ్నికి ఆహుతి చెయ్యగలం. నీ ధర్మసూక్ష్మాలు నావద్ద చెప్పవద్దు. ' అని ఆమెను ఈసడించుకున్నాడు.


' నేను వున్నది వున్నట్లుగా చెప్పినా మీరు నాపై కోపిస్తున్నారు. మీ క్రోధాగ్నిలో పడి అసువులు బాయడానికి నేనేమీ చెట్టుమీద కొంగను కాదు. నాకు నా పతిదేవుడే ముఖ్యం. నేను నీవు చదివిన ధర్మశాస్త్రాలు చదివి వుండకపోవచ్చు. కానీ, నాగృహిణీ ధర్మం నాకు నేర్పింది యిదే. ' అని గట్టిగా సమాధానం యిచ్చి కౌశికుని నివ్వెరపర్చింది.


' బ్రాహ్మణోత్తమా ! క్రోధమోహాలను జయించినవాడే బ్రాహ్మణుడు. సత్యమునే యెల్లప్పుడూ పలికేవాడు, గురువును గౌరవించేవారు, అహింస ఆచరించేవాడు, ఇంద్రియాలను జయించినవాడు, యధాశక్తి దానధర్మాలు చెయ్యగలిగినవాడు, ఉదారహృదయుడు, ఎవరో అతడే నిజమైన బ్రాహ్మణుడు. నీలో యిన్ని గుణాలు వున్నా,క్రోధము వదలలేక పోయావు. అసలుధర్మము నీకు తెలియదు. '


' నీకు నిజమైన ధర్మ జ్ఞానము తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటే, మిథిలానగరంలో ధర్మవ్యాధుడు అనే మహనీయుడిని కలువగలవు. అతడు నీకు నిజమైన ధర్మం అంటే యేమిటో చెబుతాడు. నీతో నేను అధిక ప్రసంగం చేశాను అనుకుంటే నన్నుక్షమించు. ' అని రెండుచేతులతో నమస్క రించి ఆగృహిణి, కౌశికుని భిక్షతో సత్కరించింది.  


ఆమె చెప్పిన మాటలు వినగానే, కౌశికుడికి నోటమాట రాలేదు. నెమ్మదిగా తాను చేసిన తప్పు తెలుసుకుని, ' అమ్మా ! నా అజ్ఞానం పొర తొలగించావు. నా క్రోధస్వభావం, యిప్పుడే నశించింది. నా క్షేమం గురించి నీవు చెప్పిన మాటలు నా మాతృమూర్తి చెప్పినట్లుగా భావించి, యిప్పుడే మిథిలానగరానికి బయలు దేరుతాను, నీకు శుభమగు గాక. ' అని కౌశికుడు ఆమె యిచ్చిన భిక్ష స్వీకరించి, తేలికబడిన మనస్సుతో అక్కడనుంచి కదిలాడు. 


తన ప్రవర్తనకు తానే సిగ్గుపడుతూ, మిథిలానగరం వైపు బయలుదేరాడు, కౌశికుడు. మిరుమిట్లు గొలుపుతున్న మిథిలానగర అందాలు చూసుకుంటూ, ధర్మవ్యాధుని గురించి వాకబుచేసుకుంటూ, మాంసాన్ని కోసి శుభ్రం చేసి అమ్మే దుకాణానికి చేరుకున్నాడు. అదే ధర్మవ్యాధుడు పనిచేసే స్థానం అని తెలుసుకుని, దూరం నుండి అతనిని చూసి, ఆ వాసన భరించలేక, దగ్గరకు పోలేక, అల్లంతదూరంలో నిలబడిపోయాడు కౌశికుడు.  


ధర్మవ్యాధుడు కూడా కౌశికుని చూసి, తనదుకాణం వదిలి కౌశికుని సమీపించి, ' స్వామీ ! మీరు వాకబు చేస్తున్న ధర్మవ్యాధుడను నేనే ! ఆ పతివ్రతా శిరోమణి మిమ్ములను పంపింది నా దగ్గరకే ! ' అని చేతులు కట్టుకుని నిలబడ్డాడు.


ఆ గృహిణి తాను కొంగను దహింపజేసిన వైనం యెలా చెప్పిందో, యీధర్మవ్యాధుడు తనను గృహిణి పంపిన విషయం యెలా చెప్పగలిగాడో ! అని విపరీతంగా ఆశ్చర్యపోతూ నిరుత్తరుడై ధర్మవ్యాధుని వైపు చూస్తున్నాడు కౌశికుడు.


స్వస్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

🙏🙏🙏

సేకరణ

**ధర్మము-సంస్కృతి*

🙏🙏🙏


**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: