24, సెప్టెంబర్ 2020, గురువారం

శ్రీమహారాజ్ఞి

 Sri Lalitha Paraabhattarika Naama Vaibhavam -- 7 by Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu


‘’


‘శ్రీమహారాజ్ఞి’ – లలితా సహస్రనామస్తోత్రములో రెండవనామము. మహారాజు అనగా పరిపాలకుడు. అమ్మవారిని మహారాజ్ఞి అని స్త్రీ వాచకములో చెపుతున్నారు. ఆమె బ్రహ్మమై పరిపాలకురాలిగా నిర్వహణ చేస్తున్నది. ఉపనిషత్తునుండి వచ్చినమాట – ‘ఏనజాతాని జీవంతి’ – ఈ పుట్టినవి అన్నీ అమ్మవారి దయవలన బ్రతుకుతున్నాయి. పరిపాలన చేస్తున్న ఆమె మహారాజ్ఞి. మహారాజు అయినా మహారాజ్ఞి అయినా పాలితులు, పాలకులని వారికి ప్రధానమైన రెండులక్షణములు ఉంటాయి. పాలితులు అనగా పాలింపబడేవారు. పాలకులు అనగా పరిపాలించేవారు. మహారాజ్ఞి శబ్దము చేత ఒక విషయము తెలుస్తుంది. కేవలము సంక్షేమము కోసమే పరిపాలన చెయ్యరు. ప్రభుత్వముకూడా తప్పు చేసిన వాళ్ళను దండిస్తుంది - శిక్షిస్తుంది. ఆ శిక్షలు వెయ్యడములోకూడా దయతోనే ఉంటుంది. మహారాజ్ఞి అమ్మవారు ఎవరిని ఉద్ధరించాలో, ఎవరు భగవంతుని పట్ల భక్తిభావము కలిగి ఉన్నారో, ఎవరు భగవంతుడు చెప్పిన సూత్రముల ప్రకారము జీవితము గడుపుతున్నారో వారిని వృద్ధిలోకి తీసుకు వస్తుంది. మహారాజ్ఞిగా అమ్మవారు రక్షణ చేస్తుంది, శిక్షలు వేస్తుంది. చిన్నకోరికనుంచి మోక్షమనే స్థితి వరకు ఉన్న హద్దులు దాటించి ఏ హద్దులో ఉన్నవాళ్ళకి ఆ హద్దులలో ఆ స్థాయిని బట్టి కోరికలు తీర్చకలిగిన సమస్తశక్తులు కేంద్రీకృత మైన అమ్మ పరిపాలకురాలిగా కూర్చుని అనుగ్రహిస్తే శ్రీమహారాజ్ఞి. తనని తాను గుర్తెరిగి ఆత్మస్వరూపముగా నిలబడటానికి ఒక తెర అడ్డుపడుతున్నది. దానిని అమ్మవారే తీసి నిజస్వరూపముతో జ్ఞానిగా, ఆత్మరూపిగా, ఇక్కడే మోక్షము పొందడానికి కావలసిన స్థితిని, జ్ఞానమును, శక్తిని కృపచేస్తుంది. ‘జపో జల్ప శ్శిల్ప సకలమపి ముద్రావిరచనా’ - సౌందర్యలహరిలో శంకరాచార్యులవారు అంటారు. అమ్మవారి దర్శనమునకు ఎక్కడకు వెళ్ళాలి? ఆవిడ మన శరీరములోనే ఉన్నది. చెయ్యి కదిపితే అమ్మవారు కదుపుతున్నది. మాట్లాడితే అమ్మవారు మాట్లాడిస్తున్నది. ఉపాసన చేస్తున్నవారు ఇది గమనించి చెయ్యి కదిపితే వారు ముద్రలు పట్టినట్టే. తెలుసుకుని మాట్లాడితే అన్నీ అమ్మవారి స్తోత్రములే. శరీరమును ఆవహించి ముప్పదిమూడు కోట్లమంది దేవతలు ఉంటారు. వారికి శరీరమునుంచి హవిస్సు అందుతూ ఉంటుంది. శరీరము ఒక దేవాలయము దానిని పవిత్రముగా ఉంచడము నేర్పారు. అమ్మవారు శరీరములో అనేకమైన చోట్ల ఉంటుంది. బొడ్డులో చిటికిన వేలు పెట్టి పైకి బొటన వేలు ఎక్కడ తగులుతుందో అక్కడ వంగిన కమలము ఉంటుంది. దాని మొగ్గ చివర అగ్నిహోత్రము ఉంటుంది. వడ్లగింజ పైన ఉన్నంత చిన్న మొనలో ఆ ప్రకాశము వెలుగుతూ ఉంటుంది. ఆ ప్రకాశము శరీరములో ఉన్న దేవతలందరికీ కూడా తిన్న ఆహారము పచనము చేసి యజ్ఞవేదిలోకి హవిస్సు వేసినట్లుగా పడేట్లు చేస్తుంది. అందుకే తినే ముందు స్వాహాకారము చెపుతారు. లోపల పుచ్చుకున్న పదార్ధమును చిన్న అగ్నిహోత్రములా ఉన్న అమ్మవారు జీర్ణము చేసి ప్రధానదేవతకు నైవేద్యమయిన తరవాత ఉప దేవాలయములోకి అందినట్టు మిగిలిన దేవతలకు అందేట్లుగా చేస్తుంది. ప్రధాన దేవతయిన అమ్మవారు శరీరములోనే ఉండి పరిపాలన చేస్తున్నది. ఇంద్రియములకు పుష్టి ఇస్తున్నది. 

యాదేవీ సర్వ భూతేషు బుద్ధి రూపేణ సంస్థితా|

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః ||

ఆ తల్లి బుద్ధి రూపములో ఉన్నది. ఈ మాట అనవచ్చునా ! అనకూడదా ! అని ఆలోచించకుండా మాట్లాడితే కొన్ని సందర్భములలో ఉపద్రవములు కలుగుతాయి. బుద్ధిని నిశ్చయాత్మకముగా ఉంచి వృద్ధికలిగించే తల్లికి నమస్కారము.  

యా దేవీ సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

ఆ తల్లి నిద్రరూపములో ఉండకపోతే ఎవరూ సుఖ శాంతులతో ఉండరు. నిద్రపట్టకపోతే ఆకలి వెయ్యదు. ప్రశాంతముగా ఉండరు. 

యా దేవీ సర్వభూతేషు క్షుధా రూపేణసంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

ఆహారము తీసుకోకపోతే తల్లి మనసు లేపి అన్నము తినమని ఆకలి రూపములో ఆదేశిస్తున్నది. 

యా దేవీ సర్వభూతేషు చ్ఛాయారూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

మనిషికి నీడ కనపడకపోతే ఇంక ఆరునెలల్లో వెళ్లిపోతాడని గుర్తు. 

యా దేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

యా దేవీ సర్వభూతేషు తృష్ణా రూపేణసంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః ||

మహానుభావులు మూడేసిమాట్లు మాలో ఇన్నిరూపములుగా ఉండి కదుపుతున్నది నువ్వే తల్లి అంటూ రెండుచేతులూ ఎత్తి నమస్కరిస్తున్నారు. 

  యా దేవీ సర్వభూతేషు క్షాంతి రూపేణ సంస్థితా |   

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః  

యా దేవీ సర్వభూతేషు జాతిరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః   

యా దేవీ సర్వభూతేషు లజ్జా రూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః   

యా దేవీ సర్వభూతేషు శాంతిరూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః   

యా దేవీ సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః    

యా దేవీ సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః   

యా దేవీ సర్వభూతేషు వృత్తిరూపేణ సంస్థితా |

 నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః    

యా దేవీ సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థితా |     

 నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః    

 యా దేవీ సర్వభూతేషు దయారూపేణ సంస్థితా |   

 నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై  

యా దేవీ సర్వభూతేషు తుష్టిరూపేణ సంస్థితా |       

 నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః    

యా దేవీ సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థితా |

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమోనమః 

చండీయాగము చేస్తే ఈ మంత్రములతో అమ్మవారికి హవిస్సు ఇస్తారు. ఇవన్నీ అమ్మవారి అనుగ్రహముతో సరయిన దిశయందు ప్రచోదనము జరగాలని కోరుకుంటాము. శ్రీమహారాజ్ఞి నిరంతరము మంచివైపు కదుపుతు పరిపాలన చేస్తున్నది. ఎవరు తమకి ఉన్న శక్తిని సద్వినియోగము చెయ్యడము కోసమే పాటు పడతారో వారిని అమ్మవారు కీర్తిరూపములో ప్రకాశింపచేసి అనుగ్రహిస్తే వారు కీర్తిమంతులు అవుతారు. అహంకార పరిత్యాగము ఈ నామము బాగా ఉపయుక్తము అవుతుంది. ఏ విభూతి వలన ఏదిచేసినా, ఏ కదలికయినా ఆవిడ అనుగ్రహముతో కదిలింది. పై పట్టు అమ్మవారిదయి ఉండాలి. పట్టుకున్నప్పుడు సడలిపోకుండా లోపలిపట్టు గట్టిపడినంత కాలము పైకి ఎక్కడము జరుగుతూనే ఉంటుంది. దీనిని జాగ్రత్తగా తెలుసుకోగలగడమే శ్రీమహారాజ్ఞి అన్న నామమునకు ప్రధానమైన అర్థము. 


https://www.facebook.com/ChagantiGuruvuGariFollowersUnofficialPage

కామెంట్‌లు లేవు: