24, సెప్టెంబర్ 2020, గురువారం

విశ్వనాథ విప్లవం!

 విశ్వనాథ విప్లవం! కృష్ణశాస్త్రి అరుణతార!


TWO RARE POEMS - TWO PURE POETS

---------------------------------------------------------------


విశ్వనాథ సత్యనారాయణ మహోన్నత కావ్యకర్త. 

సత్సాంప్రదాయంతో కలిసి నడిచిన కవి. 

అమోఘ రచనా ప్రావీణ్యానికి ఆయనొక కొండగుర్తు. 


శక్తిమంతమైన ఆ బండి ముందుకి నడవదు. 

ఆధునిక నాగరికతని సుతరామూ అంగీకరించదు. 

తిరోగమనమే పురోగమనమని 

ఎలుగెత్తి చాటుతుంది. 


వేదకాలంలోకి వెళదాం .. వెనక్కి నడవండి - అంటారు విశ్వనాథ. అలాంటి పురాతన, సనాతన కవి 'విప్లవం' అంటూ ఒక వచన గీతం రాశారు.


దేవులపల్లి కృష్ణశాస్త్రి అయితే ఏకంగా 'అరుణతార' అంటూ ఓ కవిత రాశారు. ఈ రెండు అరుదైన కవితలూ ఎవరైనా పంపగలరా? అని నేనొక వ్యాసంలో అడిగాను. కవీ, జర్నలిస్టు రావూరి ప్రసాద్ ఆ రెంటినీ నాకు వెంటనే పంపాడు. 


మరి విశ్వనాథ, శ్రీశ్రీని మహాకవి అన్న 'భారతి' వ్యాసం దొరుకుతుందా? అని అడిగాను. అదీ పంపారు రావూరి ప్రసాద్. 1977లో హైదరాబాద్ 

'ఈనాడు'లో మేమిద్దరం కలిసి పనిచేశాం. 

Thank You RAVURI PRASAD.


 విశ్వనాథలోనూ ఒక ఆధునికుడు దాగి వున్నాడు. 

కోకిలమ్మ పదాలు ఎంత షోగ్గా రాశాడో... 


'ఆంధ్రప్రశస్తి'లో కూడా ఈ మాటలు చూడండి. 

విమల కృష్ణానదీ సైకతముల యందు 

కోకిలపు పాట పిచ్చుకగూళ్లు కట్టి

నేర్చుకొన్నవి పూర్ణిమా నిశల యందు 

అక్షరజ్ఞాన మెరుగదో ఆంధ్రజాతి!


'రామాయణ కల్పవృక్షం' రాసిన విశ్వనాథతో సుతరామూ, సుతసీతా, సుత లక్ష్మణా అంగీకరించని, ఆయన చెప్పిన ఒక్క మాటనీ ఒప్పుకోని నాటిమేటి సంపాదకుడు 

నార్ల వెంకటేశ్వరరావు -

అతడు ఆంధ్రుడై పుట్టటం తెలుగువారి అదృష్టం 

ఆధునికుల వైపు రాకపోవడం మన దురదృష్టం - అన్నారు. 


శ్రీశ్రీ 'మహాప్రస్థానం'లోని 'ఆనందం అర్ణవమైతే' 

కవిత విని విశ్వనాథ పరవశించిపోయారు. 

 'ఆనందం అర్ణవమైతే

అనురాగం అంబరమైతే 

అని శ్రీశ్రీ రాస్తే.. అద్భుతమైన కవిత్వం - అని అభినందించారు. 

అంతేనా, నాటి సాహిత్య పత్రిక 'భారతి'లో 'హేతువాద యుగం' పేరిట వ్యాసం కూడా రాశారు విశ్వనాథ సత్యనారాయణ.

అది ఇలా నడిపించారాయన. 


             'హేతువాద యుగం' 


"ఆనందం అర్ణవమైతే / అనురాగం అంబరమైతే -

అనురాగపుటంచులు చూస్తాం,

ఆనందపు లోతులు తీస్తాం "


గిరి : అహో, ఏమి గీతం. ఎంత సొగసుగా ఉంది. కవిత్వాన్ని వడబోసినట్లుందే. 

ఎవరయ్యా ఈ పాట రాసింది?


హరి : ఈ పాట వ్రాసినతని పేరు శ్రీరంగం శ్రీనివాసరావు.


గిరి : ఈ క్రొత్త కవుల్లో ఇంతటి మహాకవులుంటారా?


హరి : అట్టే మాటాడితే ఈ క్రొత్త కవుల్లో ఒక్కడే మహాకవి. అతని పేరు శ్రీశ్రీ.


గిరి : అయితే శ్రీశ్రీ వంటి నవ్యకవిలో కూడా అలంకారాలుంటాయంటావా?


హరి : అయ్యో! ఉన్నదే అతని కవిత్వంలో. శబ్దాలంకారాలని ఉంటవి. ఒకదాని పేరు వృత్యనుప్రాసము. ఈ వృత్యనుప్రాసము యొక్క ప్రాబల్యమే శ్రీశ్రీ కవిత్వంలోని మొదటి సొగసు. అంత్యప్రాస కూడా ఒక శబ్దాలంకారం. అది లేకపోతే వీళ్ల నడక లేదుగా. శ్రీశ్రీ చంద్రవంకను చూచి కాళ్లు తెగిన ఒంటరి ఒంటెలాగ ఉందన్నాడు. ఇది ఉపమాలంకారం. ఎట్లాంటిది? 'మృచ్ఛకటికం' లో నీటిలో మునిగి ఏనుగు ఎత్తిన రెండు దంతముల వలె చంద్రవంక వున్నదన్నాడే 

అంత గొప్ప ఉపమానం. 


గిరి : అయితే శ్రీశ్రీ మహారథి, అతిరథుడు అన్నమాట. అతనిననుసరించిన వాళ్లెవరైనా ఉన్నారా?


హరి : అందరూ అతనిననుసరించిన వాళ్లే. 


గిరి : ఇంతకూ ఈ యుగపురుషుడెవరంటావు ?


హరి : ఎవరేమిటోయి పిచ్చివాడా. ఈ గీతం ఎవడు వ్రాశాడో వాడు. 


గిరి : ఎవడు వ్రాశాడు? 


హరి : నేను చెప్పను. గీతం విను. 


" మరో ప్రపంచం, మరో ప్రపంచం, 

మరో ప్రపంచం పిలిచింది !

పదండి ముందుకు, పదండి త్రోసుకు ! 

పోదాం పోదాం పైపైకి ! "


విశ్వనాథ సత్యనారాయణ : 'భారతి', జూన్ 1962


*** *** ***


శ్రీశ్రీ గనక మరో దేశంలో పుట్టివున్నట్లయితే, నోబెల్ ప్రైజ్ పొందివుండేవాడు - అని బందరు సాహిత్య పరిషత్ కవితా గోష్టిలో విశ్వనాథ సత్యనారాయణ అన్నారని నార్ల చిరంజీవి ఒక వ్యాసంలో రాశారు. 


అలాగే, 'కవితా ఓ కవితా'... కవిత చదివిన శ్రీశ్రీని 

ఒక సభలో విశ్వనాథ ఆనందబాష్పాలతో ఆలింగనం చేసుకున్న విషయమూ అందరికీ తెలిసిందేగా!


ఇలా హేతువాద యుగమూ, నవ్యకవితా విశ్వనాథ వారిని ఏ తెలతెలవారుజామునో పలకరించాయేమో!


'విప్లవం' అంటూ విశ్వనాథ రాసిన 

వచన కవిత ఇదే... 


విప్లవం 


హిమాలయమ్ములు 

గుహాముఖమ్ముల 

తెలియని యేవో ప్రళయరావములు ధ్వనించి 

దద్దటిల్లెడు!


భగీరథాత్మజ

సభంగ తనువై 

ఎదో తనతడి యిగురుబెట్టు నెండగొట్టి 

ఆవటిల్లెడు


ధరిత్రియంతయు 

ఎదో కలతపడి 

తన మనస్సు త్రోవలు రహదార్లు లేక 

గుడుసు వడియెడు!


ఏది చూచినా

తుపానులో 

విరిగిపోవుచున్న కెరటములై 

అటోఇటో అన్నట్లున్నది 


- విశ్వనాథ సత్యనారాయణ           

'జ్వాల' పత్రిక - 1941


*** *** ***


ఇది చూడండి... కవిసామ్రాట్ విశ్వనాథ

అసంపూర్ణ ఆత్మకథ నుంచి...


అజ్ఞానమనే ఆలోచన లేకుండుట


ఒక జీవిత రహస్యమును విచారణ చేసినచో దానిని వేదాంతమనుట మన దేశంలో పరిపాటియై పోయినది. పెరిగినాము. కొంత ధనము వచ్చినది. కొంత ధనము పోయినది. కొన్ని సుఖముల ననుభవించినాము. కొన్ని దుఃఖములు పొందినాము. ఎప్పుడునూ ధనం రావలయునన్న ఆశయే. ధనము, కీర్తి, స్త్రీ, ఆస్తి, యుద్యోగము, పలుకుబడి, మన మాట చెలామణి యగుట - యెప్పటికప్పుడు మనమే గొప్ప వారమన్నట్లు జరుగుట - ఆరోగ్యము, బంధువులు సుఖముగా నుండుట, జన్మయెత్తిన తరువాత వీనిని గురించియే యాలోచన. ఇంకొక దాని గురించి లేదు. చేయకూడదు. చేసినచో వేదాంతము. వాడొక వెర్రి వాని కింద లెక్క. 

"జాతస్య మరణం ధృవమ్" ఇది యందరకును తెలిసినట్లుండును. నిజము తెలియదు. పైకి అందరము చచ్చిపోవుదుమందురే కాని వ్రేళ్ళు పాతుకుని, కొమ్మలు వేసి మింటి కొనలు తాకుదుమన్న యూహయే అజ్ఞానము చేత నావరింపబడిన బుద్ధిలో నుండును. అజ్ఞానమనగా ఆలోచన లేకుండుట.


దీన్ని modern thought అనే అనాలి కదా!


*** *** ***


దేవులపల్లి కృష్ణశాస్త్రి రాసిన 

ఈ విప్లవ గీతం చూడండి.


అరుణారుణ తార


యుగయుగాల పీడకలలు - సొగయజేయు సంకెలలు

తెగనివికావోయి - మ్రోల ధగధగా స్వతంత్ర విభా 

తాకాశము నొసట పొడుచు అరుణారుణ తార 


అంతులేని ద్వేషము, విషరోషము, స్వార్థము, మోసము 

పంతగించి నిలువున ఆవంతయేని ; శాంత విభా 

తాకాశము నొసట పొడుచు అరుణారుణ తార!


ముందుగలదు మన జాతికి ముక్తి, అమర జీవరక్తి!

క్రిందువెనుక గనక నడుపుడందరు, అభ్యుదయ విభా 

తాకాశము నొసట పొడుచు అరుణారుణ తార!


ఆకాశము నొసట పొడుచు అరుణారుణ తార

ఏకాకి నిశీధి నొడుచు తరుణ కాంతిధార!

జయపతాక యువపతాక 

విజదాపక వెడలు నౌక 


- దేవులపల్లి కృష్ణశాస్త్రి, 'మహతి'


"ఆకులందున అణిగిమణిగీ 

కవితకోకిల కూయవలెనోయ్ .." అన్న కవి అరుణ పతాకాన్ని ఎగరేయటం ఒక చరిత్రాత్మక సన్నివేశం. 


కృష్ణశాస్త్రి గారు అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షునిగా కూడా వున్నారు. రెండో ప్రపంచ యుద్ధం, భారత స్వాతంత్య్ర పోరాటం ఈ ఇద్దరు మహాకవుల్నీ ప్రభావితం చేశాయి. 


పైగా ఆ శ్రీశ్రీ ఒకడూ...! 'గర్జించు రష్యా, గాండ్రించు రష్యా, పర్జన్య శంఖం పూరించు రష్యా'.. అంటూ. 


'కనబడలేదా మరో ప్రపంచపు 

అగ్నికిరీటపు ధగధగలు!

హోమజ్వాలల భుగభుగలు!

ఎర్రబావుటా నిగనిగలు! ..

హేండ్ గ్రెనేడ్స్ లాగా పేలుతాయి కదా ఈ అక్షరాలు!

*

ఒక 40 ఏళ్ల క్రితం కావొచ్చు, విశాఖపట్నంలో తెలుగు సాహిత్యం పై ఒక సెమినార్ జరిగింది. కొర్లపాటి శ్రీరామ్మూర్తి దాన్ని నిర్వహించారు. 

ఆ సభలో, మహానుభావుడు దివాకర్ల వెంకటావధాని మాట్లాడుతూ , "కాలానికి కత్తులవంతెన" అనే సమాసాన్ని గత 500 ఏళ్లలో ఎవ్వరూ ప్రయోగించలేదు. అలాగే "తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?" అని ప్రశ్నించినవాళ్లూ గతంలో ఎవ్వరూ లేరు" - అని చెప్పారు. 

*

ఎందుకో, విశ్వనాథని శ్రీశ్రీ తిట్టినట్టు - 

"కాగితప్పడవలు, చాదస్తపు గొడవలు"

అనాలని నాకు అనిపించడం లేదు. 


- Taadi Prakash 97045 41559


Two giants - Krishna Sastry, Viswanatha

కామెంట్‌లు లేవు: