16-22-గీతా మకరందము
దైవాసురసంపద్విభాగయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అవతారిక - కామాదులను తొలగించుకొనువాడు పరమశ్రేయమును బొందునని సెలవిచ్చుచున్నారు -
ఏతైర్విముక్తః కౌన్తేయ !
తమోద్వారై స్త్రిభిర్నరః |
ఆచరత్యాత్మన శ్శ్రేయః
తతో యాతి పరాంగతిమ్ ||
తాత్పర్యము:- ఓ అర్జునా! (కామక్రోధలోభములనునట్టి) ఈ మూడు నరకద్వారముల నుండి బాగుగ విడువబడిన మనుజుడు తనకు హితమును గావించుకొనుచున్నాడు. అందువలన సర్వోత్కృష్టమగు మోక్షగతిని పొందుచున్నాడు.
వ్యాఖ్య:- కామ, క్రోధ, లోభములను ఈ మూడు దుష్టగుణము లున్నంతవఱుకును ఎవడును వృద్ధికిరాలేడు. హితమును బొందలేడు. తనకు మేలొనర్చుకొనలేడు. అందుచేత మొట్టమొదట వానిని తొలగించివేయవలెననియు, అపుడు మాత్రమే మానవుడు తనకు శ్రేయము నొనగూర్చుకొని సర్వోత్తమమగు మోక్షపదవిని బడయగలడనియు భగవాను డిచట బోధించుచున్నారు. సూర్యచంద్రులు రాహువునుండి విడువబడినట్లున్ను, గజేంద్రుడు మొసలిబారినుండి విడుదల బొందినట్లును, బంధితుడు కారాగృహమునుండి విముక్తుడైనట్లును జీవుడీ దుష్టత్రయము యొక్క బంధమునుండి విడుదలను బొందవలెను. "ముక్తః” అని చెప్పక "విముక్తః" అని చెప్పుటవలన వానినుండి పూర్తిగ విడుదల జెందవలెనని, వానిజాడ ఏమాత్రము హృదయకోశమున నుండరాదని భావము. మఱియు అవి ‘తమోద్వారము' లని పేర్కొనబడుటవలన, ఆ కామాదులు అజ్ఞానరూపములే యనియు, అంధకార బంధురములనియు, ప్రకాశ అభావరూపములనియు, నరకహేతువులనియు స్పష్టమగుచున్నది. అవి తమోద్వారములగుటచే, అవి కలవాడు "చీకటియింటి" లో కాపురము పెట్టిన చందముననే యుండును. అనగా దుఃఖములనే యనుభవించును.
"ఆచరత్యాత్మనః శ్రేయః” - ఆ కామాదులున్నంతవఱకు ఎవరును తనకు శ్రేయమును గలుగజేసికొనజాలరు. ఆత్మోద్ధరణము గావించుకొనజాలరు. తానెవరు? జగత్తేమి? అని విచారింపజాలరు. అనగా వాసనాక్షయము కానంతవఱకు ఆత్మజ్ఞానము పూర్ణముగ ఉదయించనేరదనియు, ఆత్మానుభూతి లెస్సగ కలుగదనియు అర్థము. కామాదులు వదలిపోయినపుడే అట్టి జ్ఞానము బాగుగ సంప్రాప్తము కాగలదని ఈ శ్లోకముద్వారా తెలియుచున్నది.
కాబట్టి సాధకుడు ప్రప్రథమమున ఆ దుష్టత్రయమును పారద్రోలవలెను.
"పరాంగతిమ్" - అని చెప్పుటచే మోక్షము అన్ని పదములకంటెను, అన్ని గతులకంటెను సర్వోత్కృష్టమైనదని తెలియుచున్నది. మఱియు కామాదులున్న స్థితి అత్యంతనికృష్టమైనదనియు దీనివలన ధ్వనించుచున్నది.
ప్రశ్న:- కామాదు లెట్టివి?
ఉత్తరము:- అవి నరకద్వారములు.
ప్రశ్న:- మోక్షమను హితమునకై ఎవడు యత్నించును?
ఉత్తరము:- ఆ కామాదులనుండి లెస్సగ విముక్తుడైనవాడు.
ప్రశ్న:- అట్లు యత్నించుటవలన నతనికి కలుగు ఫలితమేమి?
ఉత్తరము:- అతడు మోక్షమును బడయగలడు.
ప్రశ్న:- మోక్షపద మెట్టిది?
ఉత్తరము:- అన్నిటికంటెను సర్వోత్తమమైనగతి (పరాంగతిమ్).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి