21, ఏప్రిల్ 2025, సోమవారం

అష్టాదశ శక్తిపీఠాలు*

 🕉🕉🕉🛐🛐🕉🕉🕉🕉

*అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాలు*

    *వాటి కథనాలు క్లుప్తంగా !*

    *(క్రిందటి భాగం తరువాయి)*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*క్రిందటి భాగంలో 13 శక్తి పీఠాల వరకు తెలుసుకొన్నాం. ఈరోజు మిగిలిన 5 శక్తి పీఠాల గురించి తెలుసుకుందాం.*


*14. మాధవేశ్వరి: అమ్మవారి కుడిచేతి నాలుగువేళ్లు ప్రయాగ(అలహాబాద్‌) ప్రాంతంలో పడినట్టు చెబుతారు. సతీదేవి వేళ్లు పడిన ఈ ప్రదేశంలో కట్టిన ఈ ఆలయంలో విగ్రహం ఉండదు. నాలుగుదిక్కులా సమానంగా ఉన్న ఒక పీఠం మాత్రం ఉంటుంది. దానిపై ఒక వస్త్రాన్ని హుండీలాగా వేలాడదీసి కింద ఉయ్యాల కడతారు. భక్తులు అక్కడే దీపారాధనలు చేసి అమ్మవారిని కొలిచినట్టు తృప్తిచెందుతారు. తాము తెచ్చే కానుకలను వూయలలో ఉంచుతారు. స్థానికులు ఈ అమ్మవారిని అలోపీదేవిగా కొలుస్తారు.*


*15. సరస్వతి: కాశ్మీర్‌లోని నేటి ముజఫరాబాద్‌కు ఇంచుమించు 150కి.మీ. దూరంలో ఒక శక్తిపీఠం ఉండేదని చెబుతారు. ఇక్కడ అమ్మవారి కుడిచేయి పడిందని చెబుతారు. ప్రస్తుతం అక్కడ ఒక శిథిల ఆలయం తప్ప మరేమీ లేదు. ఒకప్పుడు శంకరాచార్యులవారు ఈ అమ్మవారిని దర్శించి అర్చించారని శంకరవిజయకావ్యం ద్వారా తెలుస్తోంది.*


*16. వైష్ణవీదేవి: అమ్మవారి నాలుక హిమాచల్‌ప్రదేశ్‌లోని కాంగ్రా ప్రాంతంలో పడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు జ్వాలాముఖి. ఈ క్షేత్రంలో కూడా విగ్రహం ఉండదు. భూమిలోంచి వచ్చే సహజవాయువుల జ్వాలనే అమ్మవారి శక్తిగా భావిస్తారు భక్తులు. ఆ జ్వాలలు అవమానభారానికి గురైన సతీదేవి ఆగ్రహానికీ శక్తికీ సంకేతమని విశ్వసిస్తారు భక్తులు*. 


*మరికొందరు... 'జ్వాలాయాం వైష్ణవీదేవి' అంటే అది ఈ గుడి కాదనీ జమ్మూలోని వైష్ణోదేవి ఆలయమనీ చెబుతారు.*


*17. మంగళగౌరి: సతీదేవి శరీరభాగాల్లో స్తనాలు పడినట్టుగా చెప్పే ప్రదేశం గయ. అమ్మవారు మంగళగౌరీదేవి. స్థలపురాణానికి తగ్గట్టుగానే వక్షోజాలను పోలిన నిర్మాణాన్ని మాంగళ్యగౌరిగా పూజిస్తారు భక్తులు.*


*18. విశాలాక్షి: సతీదేవి మణికర్ణిక(చెవి కుండలం) కాశీలోని విశ్వేశ్వరుడి ఆలయ సమీపంలో పడిందనీ అక్కడే అమ్మవారు విశాలాక్షిగా అవతరించిందనీ స్థలపురాణం. కాశీ విశాలాక్షి ఆలయంలో రెండు విగ్రహాలుంటాయి. ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. వెనుకభాగంలో చిన్నగా కనిపించే విగ్రహమే అసలైనది. ఆ దేవిని ఆది విశాలాక్షిగా అర్చిస్తారు భక్తులు. శివుడి వైభవాన్ని కళ్లు పెద్దవి చేసి మరీ ఆశ్చర్యంగా చూసిన దేవి కాబట్టి విశాలాక్షి అని పేరు వచ్చిందని ప్రతీతి.*


*అమ్మవారి శక్తి పీఠాలు వెనుక ఉన్న వృత్తాంతం:*


*ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది. ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో భస్మమైంది.*


*విషయం తెలుసుకున్న శివుడు వీరభద్రుణ్ని సృష్టించి దక్షయాగాన్ని ధ్వంసం చేశాడు. సతీదేవి పార్థివదేహాన్ని భుజాన వేసుకుని ప్రళయతాండవం చేశాడు. ఉగ్రశివుణ్ని శాంతింపజేసేందుకు చక్రప్రయోగం చేసి , సతీదేవి శరీరాన్ని ఖండించాడు విష్ణువు. ఆ శరీర భాగాలు పడిన ప్రాంతాలే అష్టాదశ శక్తి పీఠాలు అయ్యాయి. ఇదీ అమ్మవారి శక్తి పీఠాలు, వాటి వెనుక ఉన్న వృత్తాంతం.*

🛐🛐🛐🛐🛐🛐🕉️🕉️🛐

కామెంట్‌లు లేవు: