21, ఏప్రిల్ 2025, సోమవారం

తిరుమల సర్వస్వం -215*

 *తిరుమల సర్వస్వం -215*

 *ఫల, పుష్ప ప్రదర్శ-3* 


 తితిదే ఉద్యానవన విభాగం శ్రీవారికి తిరుమల లోని ఇతర ఆలయాలకు కావలసిన పుష్పాలను సరఫరా చేయడంతో పాటుగా; తిరుమలకు విచ్చేసిన భక్తులకు ఆహ్లాదాన్ని కూడా అందిస్తోంది. ప్రతి ఉద్యానవనమూ ఒక నందనవనమే. ఆయా ఉద్యానవనాలను ప్రతి ఒక్కరూ తనివితీరా చూసి ఆనందించవచ్చు. 


 ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా పాపనాశనం మార్గంలో ఉన్న కళ్యాణవేదిక వద్ద తి.తి.దే. వారి ఆధ్వర్యంలో *'ఫల-పుష్ప ప్రదర్శన'* ఏర్పాటు చేయబడుతుంది. దేశ, విదేశాల నుండి తెప్పించిన అరుదైన పుష్ప జాతులను ఇక్కడ ప్రదర్శిస్తారు. ఏదో ఒక పౌరాణిక ఘట్టాన్ని ఇతివృత్తంగా తీసుకొని, పువ్వులను సృజనాత్మకత ఉట్టిపడేలా అమర్చి, ఆ ఘట్టాన్ని సజీవంగా ఆవిష్కరిస్తారు. క్రితం బ్రహ్మోత్సవాల్లో నీలాదేవి, శ్రీవేంకటేశ్వరుడి నుదుటికి తన కేశాలను అతికిస్తున్న దృశ్యం సాకారం చేయబడింది. ఇంతే కాకుండా తండ్రి జమదగ్ని ఆదేశం మేరకు క్షత్రియసంహారం కావిస్తున్న పరశురాముడు, యాచకుని రూపంలో సీతమ్మను అపహరించి వెడలుతున్న రావణుణ్ణి అడ్డగిస్తున్న జటాయువు, అశోకవనంలో శోకతప్తయై ఉన్న సీతమ్మకు నమస్కరించుకుంటున్న ఆంజనేయుడు, బకాసురునితో తలపడుతున్న భీమసేనుడు, చెట్టుచాటు నుంచి వాలిపై బాణప్రహారం చేస్తున్న శ్రీరాముడు వంటి పదునాలుగు పౌరాణిక పాత్రలకు కూడా జీవం పోశారు. పశ్చిమబెంగాల్ నుండి వచ్చిన ఇరవైమంది కళాకారుల ద్వారా సృష్టించబడ్డ అత్తివరదరాజస్వామి ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


 గత కొద్ది సంవత్సరాల నుంచి మైసూర్ కు చెందిన గౌరీ, నీలాంబిక అనే ఇద్దరు అక్కచెల్లెళ్ళు సైకతశిల్పాన్ని అత్యంత సృజనాత్మకంగా తీర్చిదిద్దుతున్నారు. క్రితం సారి బ్రహ్మోత్సవాల్లో వీరిరువురూ రెండురోజులు శ్రమించి, మూడు టన్నుల ఇసుక, అనేక రంగుల నుపయోగించి, 'గరుత్మంతునిపై విహరిస్తున్న శ్రీమహావిష్ణువు' యొక్క సైకతశిల్పాన్ని సాక్షాత్కరింప జేసి భక్తుల మనసును దోచుకున్నారు.


 *కొండపై పూలు ధరించరాదు..* 

3  'పుష్పమండపం' గా వ్యవహరించబడే తిరుమల క్షేత్రంలో, పువ్వులన్నీ స్వామివారికే చెందాలి. అందుచేత, భక్తులెవ్వరూ కొండపై పూలు ధరించరాదు. కొండపై జరిగే వివాహాలలో కూడా పువ్వులతో చేసిన మాలలు వాడటం పూర్తిగా నిషిద్ధం.


 శ్రీవారికి కైంకర్యం చేయబడ్డ పువ్వుల నైర్మల్యాన్ని భక్తులకు ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం కూడా తిరుమలలో లేదు. వెయ్యేళ్ళక్రితం రామానుజుల వారు చేసిన కట్టడిననుసరించి, పూజా నైర్మల్యాన్ని ఈ మధ్యకాలం వరకూ సంపంగి ప్రదక్షిణమార్గానికి ఉత్తరదిశలో ఉన్న, నేడు 'పూలబావి' గా పిలువబడే, సాక్షాత్తూ భూదేవిచే నిర్మించబడ్డ 'భూతీర్థం' లో విసర్జించే వారు. అయితే ఎప్పటికప్పుడు పెరుగుతున్న భక్తులు, ఉత్సవాల కారణంగా పూజానైర్మల్యాలు కూడా అధికమవ్వడంతో ఇప్పుడు వాటిని తిరుమల సానువుల్లో, ఎవరూ తొక్కేందుకు అవకాశం లేని నిర్జనప్రాంతంలో వదులుతున్నారు. సంవత్సరంలో ఒకసారి తిరుచానూరులో జరిగే కార్తీకమాస బ్రహ్మోత్సవాల చివరి రోజున మాత్రం శ్రీవారి పూజానైర్మల్యాలను పద్మావతీ అమ్మవారికి కానుకగా సకల లాంఛనాలతో పంపుతారు.


 *పద్మావతీ ఉద్యానవనం* 


 పద్మావతి అమ్మవారి ఆలయం మాడవీధిని ఆనుకొని 'పద్మావతి ఉద్యానవనం' ఉంది. ఇందులో కూడా కనులకు ఇంపుగా ఉండే మందార, చేమంతి, బంతి, సన్నజాజులు, కాగడామల్లెలు వంటి రకరకాల పూలమొక్కలు, కొన్ని అరుదైన వృక్షజాతులు పెంచబడుతున్నాయి. సువిశాల ప్రాంగణంలో ఉండే ఈ ఉద్యానవనంలో చూడచక్కనైన కోనేరును కూడా చూడవచ్చు. ఈ మధ్యనే ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారా ఒక వినూత్నమైన ప్రదర్శనకు తి.తి.దే. శ్రీకారం చుట్టింది. ఉద్యానవనం లోని కుడ్యాలపై పద్మావతీ పరిణయం లోని విశేషాలన్నింటిని వేరు వేరుగా, క్యూ ఆర్ సంకేతంతో సహా, చిత్రీకరించారు. 'పద్మావతి పరిణయం' యాప్‌ను మన చరవాణిలో డౌన్లోడ్ చేసుకుని, శబ్దగ్రహణయంత్రాలను (ఇయర్ ఫోన్స్) మన చెవులకు అనుసంధానించుకుని, ఆయా చిత్రాలపై ఉన్న క్యూ ఆర్ సంకేతాన్ని చరవాణి ద్వారా స్కాన్ చేస్తే; ఆ చిత్రంలో ఉన్న లఘు చలనచిత్రాన్ని, దృశ్య-శ్రవణ మాధ్యమాల ద్వారా చూడవచ్చు. అత్యద్భుతమైన, వినూత్నమైన ఈ ప్రయోగానికి భక్తుల నుండి ఎంతగానో ఆదరణ లభిస్తోంది.


 పుష్పాలకు అధిదేవత యైన 'పుల్లుని' ఆశీస్సులతో, శ్రీవేంకటేశ్వరుని కృపాకటాక్షాలతో, తి.తి.దే. ఉద్యానవనశాఖ మరింతగా రాణించి, ప్రపంచ ఉద్యానవనరంగంలోనే అగ్రగామిగా వెలుగొందాలని ఆ దేవదేవుణ్ణి వేడుకుందాం.


[ రేపటి భాగంలో ... *శ్రీ వేంకటేశ్వర వస్తుప్రదర్శన శాల (మ్యూజియం)* గురించి తెలుసుకుందాం]


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: