21, ఏప్రిల్ 2025, సోమవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*


*353 వ రోజు*


*ధర్మరాజు ద్రోణుని వధించమని సైన్యాలను పురికొల్పుట*


వ్యాసుడు వెళ్ళిన తరువాత ధర్మరాజు మనసును కుదుటపరచుకుని ధృష్టద్యుమ్నుడితో " భీముడు ద్రోణుడితో యుద్ధం చేస్తున్నాడు. ఇక మీదట నీవు ద్రోణుడితో యుద్ధము చెయ్యి. నీవు ద్రోణుడిని చంపడానికే పుట్టావు. శిఖండిని పాంచాల సైన్యాలను వెంట తీసుకుని ద్రోణుడిని ఎదిరించు " అని చెప్పి మిగిలిన వారిని చూసి చూసి " విరాటరాజా ! ద్రుపద మహారాజా! సాత్యకీ ! నకుల సహదేవులారా! ఉపపాండవులారా! మన ముందున్న ఏకైక లక్ష్యం ద్రోణ వధ. పార్ధుని నాయకత్వంలో మీరంతా ద్రోణుడిని ఎదుర్కొనండి " అన్నాడు. అప్పటికే ఇరుపక్షముల సేనలు ఒక పగలు ఒకరాత్రి యుద్ధం చేసి అలసి పోయాయి. నిద్రమత్తులో క్షణం ఒక యుగంగాఊవస్థ పడుతున్నారు. నిద్ర మత్తులో తూలుతున్నారు. ఇది గమనించిన అర్జునుడు ఇరుపక్షముల యోధులను ఉద్దేశించి " సైనికులారా! మీరంతా బాగా అలసి పోయి ఉన్నారు. నిద్రావస్థతో జోగుతున్నారు. కనుక మీరంతా కొంతసేపు నిద్రపొండి. మరొక ఝాములో చంద్రోదయం ఔతుంది. చంద్రుడు వచ్చిన తరువాత వెన్నెల వెలుగులో మన్ము తిరిగి యుద్ధము చేస్తాము " అన్నాడు. ఈ సూచనకు ఇరుపక్షముల సైనికులు సంతోషంగా అంగీకరించారు. కౌరవ సైనికులు సహితము అర్జునుడి దయాగుణానికి శ్లాఘించారు. సైనికులంతా ఎక్కడి వారక్కడే నిద్రకు ఉపక్రమించారు. అలా నిద్రిస్తుండగా చంద్రోదయం అయింది. పండు వెన్నెల కాయగానే పాండవ కౌరవ సేనలు నిద్ర మేల్కొని యుద్ధానికి సిద్ధం అయ్యాయి.


*సుయోధనుడు ద్రోణుని నిందించుట*


సుయోధనుడు ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళి " ఆచార్యా ! నీవు చాలా గొప్పవాడవు, మహావీరుడవ నీముందు నిలువగలవారెవరు లేరు. కాని నీవు నీ శిష్యులైన పాండవులను చంపక వదిలి పెట్టడం నా దురదృష్టం కాక మరేమిటి ? " అన్నాడు. ఆ మాటలకు ద్రోణుడు కోపించి " సుయోధనా ! నీ ఉద్దేశం నేను పాండవులను నా శిష్యులని వదిలి వేస్తున్నాననే కదా ! ఖాండవ వన దహన సమయంలో అర్జునుడు అగ్నిదేవునికి సాయంగా ఉన్నప్పుడు. ఇంద్రుడు నా శిష్యుడనే అతడిని వదిలి వేసాడా ? నాడు ఘోషయాత్రా సమయాన చిత్రసేనుడు నిన్ను బంధీగా పట్టుకున్న సమయాన నీ కొరకు యుద్ధము చేసిన అర్జునుడిని చిత్రసేనుడు నా శిష్యుడనే వదిలాడా? కాలకేయులనే రాక్షసులు అర్జునుడు నా శిష్యుడనే అతడి చేతిలో మరణించారా ? అర్జునుడి పరాక్రమం తెలిసీ నన్ను నిందించడం తగదు " అన్నాడు. సుయోధనుడు " ఆచార్యా ! మీరు అవకాశం వచ్చినప్పుడల్లా అర్జునుడిని పొగుడుతూనే ఉన్నారు. మీరు అలాగే చేస్తూ పాండవులను అర్జునుడిని నాకు వదలండి. నేను కర్ణ, దుశ్శాసన, శకుని సాయంతో పాండవులను అంత మొందిస్తాను. మీరు మీకిష్టమైన వారితో యుద్ధము చేయండి " అన్నాడు. ఆ మాటలకు ద్రోణుడు నవ్వి " సుయోధనా ! అలాగే మీరు అర్జునిడి ని ఎదుర్కొనండి మీరే గెలుస్తారేమో ! నాకు మాత్రం అర్జునుడి చేతిలో మరణించే భయం పోగొట్టావు అంతే చాలు " అన్నాడు.


*ద్రోణుడు పాంచాల సేనను ఎదుర్కొనుట*


తరువాత ద్రోణుడు పాంచాల సైన్యాంతో యుద్ధం చెయ్యడానికి వెళ్ళాడు. అప్పటికే తెల్లవారు ఝాము అయింది. సుయోధనుడు, కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని ఒక్కసారిగా అర్జునుడిని ఎదుర్కొని అతడి మీద శరవర్షం కురిపించారు. మహా వీరుడైన ద్రోణుడు అతిరధ మహారధులతో యుద్ధం చేయక తమలాంటి సామాన్య సైనికులుతో యుద్ధం చెయ్యడమేమిటని పాంచాల సైనికులు ఆశ్చర్య పోతున్నారు. అంతటి మహావీరునితో యుద్ధము చేసి చచ్చినా పరవాలేదని కొందరు అతడిని ఎదుర్కొంటున్నారు. ఇంతలో విరాటరాజు, ద్రుపదుడు, అతడి మనుమలు, కేకయ రాజులు తమ సైన్యాలతో ద్రోణుడిని ఎదుర్కొన్నారు. ద్రోణుడు తన వాడి అయిన బాణాలతో పాంచాల మత్స్య సేనలను హతమార్చడమే కాక ద్రుపదుని మనుమలను ముగ్గురిని హతమార్చాడు. కేకయ రాజుల తలలను పండ్లు రాల్చినట్లు నేమీద పడ వేసాడు. అది చూసి విరాటుడు, ద్రుపదుడు వీరావేశంతో ద్రోణుడిని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు వారిద్దరినీ అమిత పరాక్రమంతో ఎదుర్కొని వారిద్దరినీ చెరి ఒక బాణంతో నేల కూల్చాడు. తన తండ్రి మరణం కళ్ళారా చూసిన ధృష్టద్యుమ్నుడు " నేను కనుక ద్రోణుడిని చంపకపోతే నా కులాచారాన్ని ధర్మాలను తప్పిన వాడిని ఔతాను. అని ఘోర ప్రత్నిజ్ఞ చేసి పాంచాల సేనను తీసుకుని ద్రోణుడిని ఎదుర్కొన్నాడు. అది చూసి సుయోధనుడు కర్ణుడితో వచ్చి ధృష్టద్యుమ్నుడిని అడ్డుకున్నాడు. అంతలో భీమసేనుడు వచ్చి ధృష్టద్యుమ్నుడికి తోడుగా ద్రోణుడిని ఎదుర్కొన్నాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: