☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*శ్రీమద్ భాగవతం*
*(109వ రోజు)*
*(క్రిందటి భాగం తరువాయి)*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*కృష్ణావతారం*
*బలరామకృష్ణులు - మధురకు రాక* - *కుబ్జ కేళివిలాసం*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*‘‘అందం ఇంత అందంగా ఉంటుందని నాకు తెలియదు. అలాగే నీ స్పర్శలో ఇంత సుఖం ఉన్నదని కూడా నాకు తెలియదు. ఈ అందం, ఈ సుఖం నాకు శాశ్వతం చెయ్యి. నా భర్తవు నువ్వే! నన్ను కరుణించు. నల్లనయ్యా నా ఇంటికి రావయ్యా, నను కూడి శయనించయ్యా.’’ కృష్ణుణ్ణి వేడుకుంది కుబ్జ.*
*‘‘తప్పకుండా వస్తాను.’’ అన్నాడు కృష్ణుడు.*
*‘‘నిజంగా’’ ఒళ్ళంతా కళ్ళు చేసుకుని కృష్ణుణ్ణి నఖశిఖపర్యంతం చూసింది కుబ్జ.‘‘నిజం. అయితే ఇప్పుడు కాదు. ఈ మధురాపురిలో నేను వచ్చిన పని కానీ. అది అయిన తర్వాత తప్పకుండా నీ దగ్గరకు వస్తాను. నిన్ను అలకరిస్తాను. ఆనందిద్దాం.’’ అన్నాడు కృష్ణుడు.*
*‘‘నీ కోసం వేచి ఉంటానయ్యా.’’ అని కృష్ణుణ్ణి పదేపదే చూస్తూ అక్కణ్ణుంచి పరుగందుకుంది కుబ్జ.క్షణం ఒక యుగంగా ఎన్ని యుగాలు కృష్ణుని కోసం వేచిందో! వేగిపోయిందో! ఆఖరికి కృష్ణుని కౌగిలిలో కరగిపోయింది కుబ్జ. కన్నీరయి అతని పాదాలనంటి తరలిపోయింది. కంసుని సంహరణానంతరం ఉద్ధవుని వెంట కృష్ణుడు, కుబ్జ ఇంటికి వెళ్ళాడు. గుమ్మంలో నిలిచిన కృష్ణుని చూసి నమ్మలేకపోయింది కుబ్జ. మాధవుడు మాట నిలబెట్టుకుంటాడా? అని అనుమానించింది.*
*నిలబెట్టుకుని, నిలిచాడు కృష్ణ పరమాత్మ ఎదురుగా. చేతులు జాచి ఆహ్వానించిందతన్ని. ప్రేమించి పూజించింది. ఆ రాత్రంతా కుబ్జను అనుభవించాడు కృష్ణుడు. రసరాజాన్ని అందించాడు. తర్వాతి కాలంలో శ్రీకృష్ణ కుబ్జలు ఓ కుమారుణ్ణి కన్నారు. అతని పేరు ఉపశ్లోకుడు.తనని ఆరాధిస్తే చాలు, భగవంతుడు అనంతసౌఖ్యాలు అందిస్తాడు. అందుకే ఈ కథ అంటారు పెద్దలు. త్రివక్రను, పరిచారికను, దాసిని ఉద్ధరించడం, ఆమె మనోరథం ఈడేర్చడం శ్రీకృష్ణుని ఉదాత్తగుణానికి ఓ ఉదాహరణ. ఆ దేవదేవుని సంస్కారానికి మచ్చుతునక*
*కంసుడు - కకావికలు*
*కుబ్జను కటాక్షించి బలరామకృష్ణులు వెనుదిరిగారు. ఉద్యానవనానికి రావాల్సి ఉంది. అయితే వారిద్దరూ అటుగా నడవలేదు. ధనుర్యాగం జరిగేదెక్కడో తెలుసుకున్నారు. నడిచారటుగా. కంసమహారాజుకి తమ ధైర్యస్థయిర్యాలు తెలియజెయ్యాలి. బలరామకృష్ణులంటే అతనికి వణకుపుట్టాలి. ఈ రాత్రి నిద్ర కరవవ్వాలతనికి అనుకున్నారు. ధనుర్యాగం జరిగే ప్రదేశానికి చేరుకున్నారు బలరామకృష్ణులు. చుట్టూచూశారు. అదో పెద్ద ఆయుధశాల. రకరకాల శస్త్రాస్త్రాలు ఉన్నాయక్కడ. వాటిని బలశాలురయిన భటులు కాపలా కాస్తున్నారు. వారు వారించినప్పటికీ బలరామకృష్ణులు వినలేదు. ఆయుధాలను పట్టి చూశారు. పెద్దధనుస్సు కనిపించింది కృష్ణునికి. వెళ్ళి దాన్ని స్పృశించాడు చూడచక్కగా ఉన్నది ధనుస్సు. ఇంద్రధనుస్సులా, శివధనుస్సులా వెలిగిపోతున్నది. అందుకున్నాడు దాన్ని. సునాయసంగా ఎత్తాడు. భటులది చూసి ఆశ్చర్యపోయారు. ఇంత వరకూ ఆ ధనుస్సును ఎత్తినవారు లేరు. కంసమహారాజుకూడా దానిని ఎత్తేందుకు ఎక్కుపెట్టేందుకు చాలా కష్టపడతాడు. అలాంటిది కృష్ణుడు ధనుస్సును అవలీలగా ఎత్తాడు. ఎత్తి దానికి నారిని బిగించబోయాడు. అంతే! ఫెళఫెళమంటూ విరిగిపోయింది ధనుస్సు.*
*అది చూసి భటులంతా బెదరిపోయారు. హాహాకారాలు చేశారు. ధనుస్సు విరిగిన ధ్వని అంతఃపురంలో ఉన్న కంసునికి వినవచ్చింది. అదిరిపడ్డాడతను. ధనుస్సును విరచినందుకు కృష్ణుని మీద భటులు దాడి చేశారు. కత్తులు ఝళిపించారు. ఆ పాపానికి అంతా ప్రాణాలు కోల్పోయారు. కృష్ణుని మీదకి కత్తి ఎత్తితే ప్రాణాలుపోతున్నాయని తెలుసుకున్నాడు కంసుడు. భయపడ్డాడు. అంతలోనే తేరుకుని, బలరామకృష్ణులను వధించి రమ్మని వారి మీదకి సైన్యాన్ని ఉసిగొల్పాడు. వందలాది మంది సైన్యం మూకుమ్మడిగా బలరామకృష్ణులను ఎదుర్కొంది. పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కంసుని సైన్యం ఒక్కరూ మిగల్లేదు. అంతా మరణించారు. బలరామకృష్ణుల శౌర్యపరాక్రమాలకు మధురాపురప్రజలు ఆశ్చర్యపోయారు. వేనోళ్ళ ప్రశంసించారు వారిని. అప్పటికి బాగా చీకటి పడింది. నందాది ప్రముఖులు ఆందోళన చెందుతారని, ఇక వెళ్ళక తప్పదని అప్పుడు ఉద్యానవనానికి బయల్దేరిద్దరూ. చేరుకున్నారక్కడకి. రాత్రి సుఖంగా నిద్రించారు. బలరామకృష్ణులు హాయిగా ఇక్కడ నిద్రపోతుంటే అక్కడ కంసుడికి నిద్రకరవయింది. కృష్ణుడు ధనుర్భంగం కావించడం, కావలి భటులనూ, సైన్యాన్నీ మట్టుబెట్టడం తలచుకుంటూ కంసుడు నిద్రకు దూరమయ్యాడు. భయాన్ని మించిన భూతం లేదు. అది పట్టుకుందంటే మనిషిని పీల్చి పిప్పి చేసి కాని వదలదు. ఇప్పుడది కంసుణ్ణి గట్టిగా పట్టుకుంది. ఊపిరాడనీయడం లేదతన్ని. బలరామకృష్ణులు తనని సంహరించేందుకే పుట్టారు. అనుమానం లేదనుకున్నాడతను. అయిపోయింది. తనిక ఎంతో కాలం బతకననుకున్నాడు. నీడలా తనని మృత్యువు వెంటాడుతోందనిపించింది. కంటి మీద కునుకు లేదు. లేచి కూర్చున్నాడు కంసుడు. తల్పానికి చేరబడి కళ్ళు మూసుకున్నాడు. ఆలోచించసాగాడు. గత కొద్దిరోజులుగా పొడగట్టిన దుర్నిమిత్తాలను నెమరువేసుకున్నాడు.*
*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*
*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి