21, ఏప్రిల్ 2025, సోమవారం

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

            *(108వ రోజు)*

   *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం*

*బలరామకృష్ణులు - మధురకు రాక* - *కుబ్జ కేళివిలాసం*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*కంసుని ధనుః యాగం ఆహ్వానాన్ని అందుకుని బలరామకృష్ణులు మధురాపురం చేరుకున్నారు. ఇద్దరికీ సరదాగా పురవీధులు తిరగాలనిపించింది. తిరగసాగారు. ఓ సాలెవాణ్ణి చూశారప్పుడు. అతడు చిత్రవిచిత్రంగా వస్త్రాలు నేస్తున్నాడు. బాగున్నాయవి. చూడముచ్చటనిపించాయి. నిలిచారక్కడ. తన ఎదురుగా నిలిచిన బలరామకృష్ణులను అవతారపురుషులని గ్రహించాడు నేతగాడు. చేతులెత్తి నమస్కరించాడు. యథాశక్తి వారిని పూజించాడు. తను నేసిన చిత్ర విచిత్ర వస్త్రాలు కట్టబెట్టి, అలంకారాలు చేశాడు వారికి. చూసి ఆనందించసాగాడు. అతని భక్తిని మెచ్చుకున్నాడు కృష్ణుడు. అష్టైశ్వర్యాలూ, ఆయురారోగ్యాలూ ప్రసాదించాడతనికి.*


*అక్కణ్ణించి నిష్క్రమించారు. ముందుకు నడిచారు. పూలమాలలు అల్లే సుదాముడి ఇంటి ముంగిట నిలిచారు. సుదాముడు గొప్ప భక్తుడు. బలరామకృష్ణులు ఇంటి ముంగిట నిలిచిన మరుక్షణం వారిని గుర్తించాడతను. లోనికి ఆహ్వానించాడు. పూజించాడు వారిని. స్వయంగా అల్లిన పూలమాలలు బలరామకృష్ణుల మెళ్ళో వేసి, తనివితీరా చూసి పొంగిపోయాడు. సాష్టాంగపడ్డాడు వారికి. కృష్ణుడు అతని భక్తిని మెచ్చుకున్నాడు.‘‘వరం కోరుకో’’ అన్నాడు.*


*‘‘నీ పట్ల నిరంతరభక్తిని ప్రసాదించు, చాలు.’’ అన్నాడు సుదాముడు.*


*‘‘సిరిసంపదలక్కర్లేదా?’’ అడిగాడు కృష్ణుడు.*


*‘‘అక్కర్లేదు’’ అన్నాడు సుదాముడు.*


*కళ్ళుమూసుకుని కృష్ణనామజపం చేయసాగాడు. అతని భక్తి కృష్ణుణ్ణి ముగ్ధుణ్ణి చేసింది. సిరిసంపదలు సహా భగవద్భక్తిని కూడా ప్రసాదించాడతనికి.*


*కుబ్జ::~*


*కంసుని అంతఃపురదాసిలలో కుబ్జ ఒకతె! ఆమె కురూపి. పుట్టుకతోనే అందవికారంగా పుట్టిందామె. శరీరం మూడు వంకరలు తిరిగి ఉంటుంది. ‘త్రివక్ర’ అని కూడా పిలుస్తారామెను. త్రివక్ర కనిపిస్తే చాలు, అంతా అసహ్యించుకుంటారు.* *దూరదూరంగా తొలగిపోతారు. పిలిచినా పలకరు. పలకరిస్తే కసురుకుంటారు. కంసునికి కావాల్సిన గంధం మొదలయిన లేపనాలు తయారు చేసి అందించడం ఆమె పని. ఆ లేపనాలు ఎంత సుగంధభరితమో, అవి పూసుకుంటే శరీరసుఖం ఎంతటి తీవ్రస్థాయిలో ఉంటుందో ఊహించుకోగలదామె. ఊహకే పరిమితం కుబ్జ. ఇంతవరకు ఆమెకు ఆ సుఖం తెలియదు. అంతా దాని గురించి మాట్లాడుకుంటుంటే విని చాటుగా కన్నీరు కార్చేది కుబ్జ.*


*‘‘దేవుడా! నేనే పాపం చేశాను? నన్ను ఎందుకిలా పుట్టించావు? ఏ సుఖానికీ నోచుకోని ఈ బతుకు ఎందుకు?’’ అనేది. ఆత్మహత్యకు ప్రయత్నించి అంతలోనే మానుకుంది కూడా.*


*సుదాముని కటాక్షించి వెళ్తున్న బలరామకృష్ణులకు దారిలో కుబ్జ కనిపించింది. ఆమె చేతిలో గంధం మొదలయిన మైపూతల పాత్రలు ఉన్నాయి. సువాసనలు వెదజల్లుతున్నాయవి. ఆ సువాసనలకు ఆమెను సమీపించారు బలరామకృష్ణులు. ఎవరన్నట్టుగా వారిని చూసింది కుబ్జ. నువ్వు మాకు తెలుసు! అలాగే మేమెవరో నీకు తెలుసు అన్నట్టుగా చూశారు వారు.*


*‘‘కుబ్జ’’ పిలిచాడు కృష్ణుడు. ఆ పిలుపే మధురం. వయ్యారాలు పోయింది కుబ్జ.*


*‘‘ఎవరు నువ్వు? ఈ పాత్రలలో ఏమిటిదంతా? ఈ సుగంధాలు ఎక్కడికి?’’ అడిగాడు కృష్ణుడు. సిగ్గుల మొగ్గయింది కుబ్జ. కృష్ణుడితో మాట్లాడేందుకు పెదవులు విడివడడం లేదు. ఏమిటిది? ఎందుకిలా అనుకుంటూ బలంగా పెదవులెత్తి పలికిందిలా.*


*‘‘నేను దాసిని. కంసుని అంతఃపురంలో పని చేస్తున్నాను. నన్ను అంతా త్రివక్ర అంటారు. ఇవన్నీ మైపూతలు, కంస మహారాజు కోసం తీసుకుని వెళ్తున్నాను.’’ అన్నది కుబ్జ.*


*‘‘సుగంధభరితమయిన ఈ మైపూతలు మాక్కొంచెం ఈయరాదూ?’’ అడిగాడు కృష్ణుడు. అడిగిందే ఆలస్యం అందజూపింది కుబ్జ.*


*‘‘ఈ పూతలకు మీరే అర్హులు. తీసుకోండయ్యా.’’ అంది. తీసుకున్నారు బలరామకృష్ణులు. పూతలు పూసుకున్నారు. బంగారానికి తావి అబ్బినట్టుగా అవతారపురుషులయిన బలరామకృష్ణులు మైపూతలతో మరింతగా మెరసిపోయారు. సూర్యునిలా తెల్లగా, చంద్రునిలా చల్లగా వెలిగిపోతున్న కృష్ణుణ్ణి కన్నార్పకుండా చూడసాగింది కుబ్జ. తనని కుబ్జ గమనిస్తున్నదని తెలుసుకుని, మెల్లమెల్లగా కళ్ళెత్తి ఆమెను చూశాడు కృష్ణుడు. తనని కృష్ణుడు గమనించాడని తెలుసుకుని, సనసన్నగా కళ్ళు దించుకుంది కుబ్జ.*


*సెలవివార నవ్వుకోసాగింది. ఆమెను కరుణించాడు కృష్ణుడు. కటాక్షించేందుకు సిద్ధమయ్యాడు.‘‘కుబ్జ’’ పిలిచాడు. వేణునాదంలా వినవచ్చింది ఆ పిలుపు. నిలువెల్లా కదలిపోయిందామె. వంగలేక వంగలేక వంగి కృష్ణుని పాదాలను స్పృశించింది కుబ్జ. కళ్ళకద్దుకుంది వాటిని. అప్పుడు కృష్ణుడు ఆమె ముంగాళ్ళను తొక్కిపట్టి, కుడిచేతి చూపుడు వేలుని చుబకం మీద నుంచి లేవనెత్తాడామెను. అతనలా లేవనెత్తుతోంటే ఎముకలు పటపటమని శబ్దం చేస్తూ సర్దుకున్నాయి. ముద్దలు ముద్దలుగా గడ్డలుగా ఉన్న మాంసం కిందు మీదులయింది. శరీరం అంతా సమంగా పరుచుకుంది. చర్మం సరిదిద్దుకుంది. వికారాలన్నీ పోయాయి. విచిత్రంగా కుబ్జ అందగత్తెగా మారిపోయింది. కటిప్రదేశం, వక్షస్థలం, కంఠం...ఈ మూడుచోట్లా కుబ్జదేహం వంకరలు తిరిగి ఉండేది. ఆ వంకరలన్నీ పోయి ఇప్పుడవి వయ్యారాలు అయ్యాయి. దేవకన్యలా వెలిగిపోసాగింది కుబ్జ. తనని తాను చూసుకుంది. ఆశ్చర్యపోయింది. కృష్ణుని కళ్ళలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. పొంగిపోయింది. ఈ అందాలభరిణె ఎవరనుకుంది. ఇంకెవరు? తనే ననుకుంది. తన్మయత్వం చెందింది. కృష్ణుని పాదాలను ఆశ్రయించింది. కన్నీటితోనూ, కృతజ్ఞతతోనూ ఆ పాదాలను పరిశుభ్రం చేసింది. భుజాలు పట్టి లేవనెత్తాడామెను కృష్ణుడు. చిరునవ్వుతో చూశాడామెను. సన్నగా వణకిపోతూ ఇలా అంది కుబ్జ.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: