21, ఏప్రిల్ 2025, సోమవారం

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

            *(110వ రోజు)*

   *(క్రిందటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం*

*బలరామకృష్ణులు - మధురకు రాక* - *కంసుడు - మృత్యు సూచనలు* 

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*అద్దంలోకి చూసుకుంటూ మైపూతలు పూసుకుంటుంటే అద్దంలో తన తల కనిపించలేదు. మొండమే కనిపించింది. అలా కనిపిస్తే మృత్యువు దగ్గరపడినట్టే.*


*దీపం, సూర్యుడు, చంద్రుడు రెండు రెండుగా కనిపించాయి. అలా కనిపించకూడదు. కనిపిస్తే మరణం ఆసన్నమయినట్టే!*


*పాదప్రక్షాళన చేసుకుని భోజనానికి వస్తూ తడికాళ్ళ ముద్రలను అప్రయత్నంగా చూశాడు. లేవు. నేల మీద కాలిముద్రలు లేవంటే ఎంతోకాలం బతకరంటారు.* 


*చెవిరంధ్రాల్లో వేళ్ళు పెట్టుకుంటే గమ్మతయిన ఘోష వినవస్తుంది. చెవిలో వేళ్ళు పెట్టుకుంటే అలా వినరావడం లేదు. వినరాలేదంటే చావుకి దగ్గరపడినట్టే!*


*శవాన్ని కౌగలించుకున్నట్టు, గాడిదనూ, దున్నపోతునూ ఎక్కి ఊరేగుతున్నట్టు, తైలంతో తలంటుకున్నట్టు, దిసమొలతో తిరుగుతున్నట్టు తరచూ కలలు వస్తున్నాయి. ఆ కలలకు అర్థం మృత్యువు.*


*చెట్లు బంగారురంగులో కనిపించకూడదు. ఉద్యానవనంలోని చెట్లన్నీ అలాగే కనిపిస్తున్నాయి. ఆకుల దగ్గర్నుంచీ అంతా సువర్ణమయంగా కనిపిస్తోంది. కనిపించిందంటే చావు మూడిందనే అంటారు.*


*చావు తనని సమీపిస్తోంది. పొదివిపట్టుకునేందుకు దీర్ఘబాహువులు చాస్తోంది. తాను అందకూడదు. అందకుండా పరుగెత్తాలి. పరిగెత్తాడు కంసుడు. తల్పం మీద నుంచి ఎప్పుడు దిగాడో తెలియదు. ఎటు నుంచి ఎటు పరిగెత్తాడో తెలియదు. అంతఃపురం ఆఖరి వసారాను చేరుకున్నాడతను. దాటితే కందకం. పడితే మొసళ్ళకు ఆహారమయిపోతాడు. కాని పడలేదు. నిలదొక్కుకున్నాడు కంసుడు. బాధతో, భయంతో నిస్త్రాణంగా అక్కడి గోడకి చేరగిలబడ్డాడు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: