🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*జగద్గురు ఆదిశంకరాచార్యులు*
*విరచిత*
*”శివానందలహరి”*
*రోజూ ఒక శ్లోకం*
*తాత్పర్యం, ఆడియోతో*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
*"జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"*
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉
*తనమనస్సనే పంచకల్యాణి గుఱ్ఱాన్ని ఎక్కి హాయిగా సంచరింపుమని శంకరులు శివుని ఈ శ్లోకంలో కోరారు.*
*శ్లోకం : 75*
*కల్యాణినం సరసచిత్ర గతిం సవేగం*
*సర్వేంగితజ్ఞ మనఘం ధ్రువలక్షణాఢ్యమ్*
*చేతస్తురంగ మధిరుహ్య చర స్మరారే !*
*నేతసమస్త జగతాం! వృషభాధిరూఢ!!"*
*తాత్పర్యము :~*
*ಓ సకల జగత్తునకూ నాయకుడైన పరమేశ్వరా ! నీకు వాహనము ఎద్దు కదా! అంతకన్నా గుఱ్ఱము బాగుంటుంది కదా !ఇదిగో చూడు . ఇప్పుడు నామనస్సొక గుఱ్ఱముగా వుంది. దీనినెక్కి నీవు చక్కగా స్వారీ చెయ్యి. ఇది కల్యాణీ గుఱ్ఱము . యజమానికి శుభసూచకములైన లక్షణాలు దీనికున్నాయి. ఇది సరసమైనది.* *అనురాగము చూపిస్తూ పోతుంది. దీని పోకడలు అనేక విధములుగా ఉంటాయి. కదం మొదలైన నడకలు అన్నీ ఇది నడుస్తుంది. మిగుల వేగంగా పోతుంది. యజమాని ఇంగితాన్ని గమనించి నడచుకుంటుంది. ఏ దోషాలూ లేవు. దీనికి స్థిరమైన లక్షణాలు ఉన్నాయి. అందువల్ల ఇది నీకు వాహనంగా యుక్తమైనది (నిత్యమూ నా మనసులో నీ స్మరణ కలిగేటట్లు అనుగ్రహింపుమని భావం ).*
*వివరణ :~*
*సామాన్యముగా అందరూ దేవుణ్ణి ఏదో ఒకటి కావాలని అడుగుతూ ఉంటారు. కానీ ఆయనకు ఏదీ ఇస్తానని ముందుకు రారు. అదీ కాక సమస్త జగత్తులకూ అధినాయకుడైన పరమేశ్వరుడికి ఇవ్వడానికి తమ దగ్గర ఏముంటుందని అనుకుంటారు. కానీ శంకరులు ఈశ్వరుడికి తనమనస్సనే తురగాన్ని ఇస్తానని ముందుకొచ్చారు. తన మనసు అనే తురంగాన్ని వాహనంగా స్వీకరింపుమని శివుణ్ణి కోరారు.*
*ఈశ్వరా! నీవు విశ్వ సామ్రాజ్యాధి నేతవు. నీవు భక్తరక్షణ కోసం ఎక్కడికైనా వెళ్ళవలసి వస్తుంది. నీకున్న వాహనం ఒక ముసలి ఎద్దు. అది నిన్నెక్కించుకుని వేగంగా తిరుగ లేదుకదా! కాబట్టి నామనస్సనే గుఱ్ఱాన్ని నీకు వాహనంగా ఇస్తాను. స్వీకరించు*. *ఎద్దు కన్నా గుఱ్ఱము వేగంగా పరుగెడుతుంది. కాబట్టి నా మనస్సనే గుఱ్ఱాన్ని ఎక్కి నీపనులు చక్కబెట్టుకో ప్రభూ! అన్నారు శంకరులు.*
*మనస్సు మంచి గుఱ్ఱము వంటిది. గుఱ్ఱములలో ఉత్తమమైనది పంచకల్యాణి. పంచకల్యాణి గుఱ్ఱమునకు ఐదు శుభలక్షణాలుంటాయి.* 1) ముఖము 2) గుండె 3) వీపు 4) రెండు పార్శ్వములు మొత్తము ఐదు.*
*మనస్సునకు కూడా మంగళకర లక్షణాలయిన 1)ఈశ్వరుని దర్శించడం 2) ఈశ్వరుని కథలు వినడం 3) ఈశ్వర ప్రసాదాన్ని తినడం 4) ఈశ్వర లింగాన్ని స్పృశించడం 5) ఈశ్వరునికి అలంకరించిన పుష్పాన్ని ఆఘ్రాణింౘడం వంటి పనులు చేసే పంచ జ్ఞానేంద్రియాలు ఉంటాయి.*
*పంచ కల్యాణి గుఱ్ఱము సరస చిత్ర గతులు కలది. అది యజమానియందనురాగము కలిగి అస్కందితం, ధౌరితకం, రేచితం, వల్గితం, ప్లుతం మొదలయిన విచిత్రములయిన గమనాలతో సాగిపోతుంది.*
*మనస్సు కూడా నానా విధములయిన పోకడలు కలది. మనస్సు కూడా సరస విచిత్ర గతులు కలదే.*
*ఇక పంచకల్యాణి గుఱ్ఱము "సవేగం" అంటే వేగంగా పోతుంది. మనోవేగం అంటారుకదా! మనం సంకల్పించిన చోటుకి మనస్సు తక్షణం పోతుంది.*
*గుఱ్ఱము సర్వేంగితజ్ఞము పంచకల్యాణి గుఱ్ఱము యజమాని మనోభావం గుర్తిస్తూ నడుస్తుంది. కాగా మనస్సు అందరి అభిప్రాయాలనూ గుర్తించగలిగినట్టిది.*
*గుఱ్ఱము "అనఘం" అనగా దోషము లేనిది. మనస్సు
పాపరహితము. పుణ్యప్రదమైనది. గుఱ్ఱము "ధ్రువలక్షణాఢ్యమ్". అనగా ధ్రువమనే మంచి సుడిని కలిగి యుంటుంది. మనస్సు స్థిరత్వము అనగా అనగా ఈశ్వర సాన్నిధ్య ప్రాప్తి విషయంలో మంచి పట్టుదల కలిగి యుంటుంది.*
*ఈవిధంగా తన మనస్సునకు ఉత్తమ అశ్వ లక్షణాలు అన్నీ ఉన్నాయనీ దానిని వాహనంగా స్వీకరించి విహరింపుమనీ శివుని శంకరులు కోరారు. అంటే సదా తన మనస్సులో మెదలుతూ ఉండమని శంకరులు ఈశ్వరుణ్ణి కోరారని మనం గ్రహించాలి.*
*(తరువాయి శ్లోకం రేపు అధ్యయనం చేద్దాం.)*
*ఓం నమఃశివాయ।*
*నమః పార్వతీ పతయే హర హర మహాదేవ॥*
☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️
*క్రొత్తగా నేర్చుకుంటున్న వారికి ఉపయుక్తంగా ఉంటుందని పై శ్లోకం ఆడియో దిగువనీయబడింది. వినండి*👇
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి