21, ఏప్రిల్ 2025, సోమవారం

శ్రీమద్ భాగవతం*

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

            *(107వ రోజు)*

   *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం*

*బలరామకృష్ణులు - మధురకు రాక*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*నీ కోరిక తప్పకుండా తీరుస్తాను, అయితే ఇప్పుడు కాదు, త్వరలో. ముందు నేను వచ్చిన పని చక్కబెట్టనీ.’’ అన్నాడు కృష్ణుడు. సరేనన్నాడు అక్రూరుడు. శలవు తీసుకున్నాడు. నిష్క్రమించాడక్కణ్ణుంచి. కంసుణ్ణి సందర్శించాడు. బలరామకృష్ణుల్ని వెంటబెట్టుకుని వచ్చానని చెప్పాడతనికి. కుట్ర ఫలించినందుకు సంతోషించాడు కంసుడు.*


*రజకుని రగడ:-*


*బలరామకృష్ణులు మధురపురానికి రావడం అదే మొదటిసారి. ఆ కారణంగా చాలా సంతోషంగా ఉన్నారిద్దరూ. పైగా తమ తల్లిదండ్రులు, మేనమామ కలగసిన ఊరు. ఆ నేలతో తెలియని అనుబంధం ఉన్నదనిపించింది. పురవీధులు తిరగాలనిపించింది. బయల్దేరారిద్దరూ. మధుర ఎంతో బాగుంది. వైభవంగా ఉంది. ఎటు చూసినా ఐశ్వర్యం కనిపించసాగింది. ఒకరి చేయి ఒకరు పట్టుకుని తిరుగుతున్న బలరామకృష్ణుల్ని చూసి, మధురాపురవాసులు వారెవరో ఇట్టే గుర్తించగలిగారు. బలరామకృష్ణుల్ని చూసి జన్మ తరించందనుకున్నారు. మహదానందం చెందారు. భక్తితో నమస్కరించారు. పూలూ, గంధాక్షితలూ చల్లి పూజించారు. కంసునికి రోజులు దగ్గరపడ్డాయి. అందుకే బలరామకృష్ణులు వేంచేశారనుకున్నారు యోగులు.*


*తిరుగుతూ తిరుగుతూ ఓ మలుపు దగ్గరకు చేరుకున్నారు బలరామకృష్ణులు. అక్కడ వారికి ఓ రజకుడు కనిపించాడు. కంసుని బట్టలుతికేవాడతను. మహారాజూ, అతని పరివారం ధరించేందుకు రకరకాల రంగు రంగుల దుస్తులు ఉన్నాయి అతని దగ్గర. చలువజేసి, చక్కగా మడతలుబెట్టి ఉన్నాయి. వాటిని ధరించాలనిపించింది బలరామకృష్ణులకు. గోకులంలో పెరిగారు. ఆలమందలను కాచుకుంటూ తిరిగారు. ఎన్నడూ అలాంటి వస్త్రాలు ధరించలేదు. సరదాపడ్డారిద్దరూ.*


*‘‘ఇదిగో నీ దగ్గర బలే మంచి మంచి దుస్తులు ఉన్నాయి. మేము వాటిని ధరించాలనుకుంటున్నాం. ఓ రెండు జతలివ్వు.’’ అడిగారు.సమాధానంగా పగలబడి నవ్వాడు రజకుడు.*


*కంసునిలాగే వాడు కూడా దుష్టుడు. మదాంధుడు. బలరామకృష్ణులను అవమానించాడతను*


*‘గోవులు కాచుకునే మీకు రాజదుస్తులు కావాలా? తప్పు తప్పు. తప్పుకోండి.’’ అన్నాడు.‘*


*‘ఈ దుస్తులు కంసమహారాజే ధరించాలి. వీటిని ధరించే అర్హత, అందం, చందం అతనికే ఉన్నాయి.’’ అన్నాడు.*


*ఆ మాటలకి కృష్ణుడికి కోపం వచ్చింది. రజకుణ్ణి కోపంగా చూశాడతను. పిడికిలి బిగించి, రజకుని గుండెలో గట్టిగా ఒక్క పోటు పొడిచాడు. దెబ్బకి వాడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.*


*అది చూశారు సాటి రజకులు. ప్రాణభయంతో పరుగందుకున్నారు. పారిపోతున్న రజకుల్ని కేకేసి మరింతగా బెదిరించి, తర్వాత తీరిగ్గా రాజదుస్తులు అందుకున్నారు బలరామకృష్ణులు. నచ్చిన వాటిని ధరించారు. కొన్ని దుస్తుల్ని వెన్నంటి వచ్చిన గోపాలురకు బహూకరించారు.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: