*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*షష్టాశ్వాసం ప్రధమ భాగం*
*572 వ రోజు*
*ఆధ్యాత్మము ఆదిభౌతికము ఆది దైవతము*
ఇక ఆది భూతము, ఆది దైవతము, ఆధ్యాత్మము గురించి చెప్తున్నాను. మన శరీరంలోని పాదము, ఆపానము, జననేంద్రియము, చేతులు, నాలుక ఆధ్యాత్మము. అవి వరుసగా నడచుట, విసర్జించుట, సృష్టించుట, కార్యనిర్వహణ అనునవి అది భూతములు. వీటికి వరుసగా విష్ణువు, సూర్యుడు, ప్రజాపతి, ఇంద్రుడు అది దేవతలు. అలాగే కళ్ళు, నాలుక, ముక్కు, చర్మము, చెవి ఆధ్యాత్మములు. వాటి గుణములైన దృష్టి, రుచి, వాసనా, స్పర్శ, శబ్ధములు అధిభూతములు. వాటికి వరుసగా సూర్యుడు, వరుణుడు, భూమి, వాయువు, ఆకాశము అదిదేవతలు. మనసు ఆధ్యాత్మము, మనసు విషయాలను గ్రహించడం స్పందించడం అనేవి అది భూతములు. మనసుకు అదిదేవత చంద్రుడు. ఇది వేదప్రమాణము. బుద్ధి ఆధ్యాత్మము విషయ పరిజ్ఞానము, శాస్త్రపరిజ్ఞానము దానికి అధిభూతములు. బుద్ధికి క్షేత్రజ్ఞుడు అదిదైవతము. అహంకారము ఆధ్యాత్మము. బుద్ధికి అభిమానము, స్వాతిశయము అధి భూతము. దానికి అదిదేవత బ్రహ్మము.
*ప్రకృతి పురుషుడు*
ఇంక ప్రకృతి పురుషుడు గురించి వివరిస్తాను. ప్రకృతి తన ఇష్టం వచ్చిన విధంగా త్రిగుణాల ఆధారంగా అనేక రకములైన వికృతులను ఒక ఆటగా పెంపొందిస్తూ ఉంటుంది. ఒక దీపము అనేక దీపములు వెలిగిస్తున్నట్లు ఈ ప్రకృతి అనేక రూపములను ఆవిష్కరిస్తుంది. సంతోషము, ఆనందము, ఆరోగ్యము, కోపరహితమైన స్వభావం, మంచి నడవడి, పరిశుభ్రత, ప్రకాశవంతంగా ఉండటం, మనసు స్థిరంగా ఉండటం, అహింస, నీతి నియమము, సిగ్గు, శ్రద్ధ, సత్యము, శుచి, ఆచారము, కరుణ, లోభరహిత నడవడి, కామవాంఛలు, ఇతరుల మీద చాడీలు చెప్పని గుణం సత్వ గుణాలు. తగవులాడుట, అహంకారము, గర్వము, కామవాంఛలు, కోపము, నిర్ధయ, మాత్సర్యము, భోగలాలసత, దుఃఖము ఇవి రజోగుణ లక్షణాలు. సదా ఏడుపు, అధికమైన మోహంతో ఉండటము, ఎప్పుడూ తింటూ ఉండటం, అనవసరమైన వాదనకు దిగడం, మూర్ఖత్వం, ఒకరితో ఒకరికి కలహాలు పెట్టడం ఇవి తమోగుణ లక్షణాలు. జీవాత్మ ఈ గుణములకు అతీతుడు కాని జీవుడు అనేక రూపములతో కళంకితుడౌతున్నాడు. జీవుడు చైతన్య మూర్తి ప్రకృతి చైతన్య రహితమైనది. జీవుడి ప్రకాశంతో ఎప్పుడూ వెలుగుతున్నా జీవుడు ప్రకృతికి వశవర్తియై ఉంటాడు. జీవాత్మ తన నిజ స్థితిని తాను తెలుసుకోలేదు. జీవాత్మ ప్రకృతికి లోనై త్రిగుణాత్మకమైన కర్మలను ఆచరిస్తూ ఉంటుంది. సత్వగుణ ప్రధాన కర్మలను ఆచరించి స్వర్గ లోక ప్రాప్తి పొందుతూ ఉంటుంది. రజోగుణ ప్రధాన కర్మలను ఆచరించి మానవజన్మ ఎత్తుతుంది. తమోగుణ ప్రధానకర్మలను ఆచరించి రౌరవాది నరకములను పొందుతుంది. తనను తాను తెలుసుకున్న జీవుడు ఈ త్రిగుణములలో చిక్కు కొనక అంతర్ముఖుడై అక్షర రూపమైన ప్రబ్రహ్మ పదమును పొందుతాడు అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు.
*జీవుడు జీవాత్మ*
జనకుడు " మునివర్యా ! పురుషుడు చైతన్యవంతుడని ప్రకృతి జడమని చెప్పారు కదా దానిని వివరించండి " అని అడిగాడు. యాజ్ఞవల్క్యుడు " జనకమహారాజా ! సగుణము అగుణము కాదు. అగుణము సగుణము కాదు. త్రిగుణాత్మకము అవ్యక్త్యమైన ఈ ప్రకృతి చైతన్యవంతమైన జీవాత్మ స్థితి ఎలా పొందుతుంది. జీవాత్మ సహజ స్థితి తెలుసుకునే జ్ఞానం ప్రకృతకి లేదు. కాని పురుషుడికి ప్రకృతి దాని స్వభావము తెలుసు. కనుక ఈ ప్రకృతి అచేతనము. పురుషుడు చేతనత్వం కలవాడు. సదా ప్రకృతిలో విహరిస్తున్న పురుషుడికి దాని వికారములు అంటవు. ఇది ప్రకృతి పురుషుల సంబంధము. సదా నీటిలో ఉండే తామర రేకులకు నీరు అంటదు. అలాగే పురుషుడు ప్రకృతిలో లీనమై ఉన్నప్పటికీ ప్రకృతి వికారములు అంటవు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి