🕉️. *🔔మహాభారతం చదువుతున్నప్పుడు ఒక అనుమానం కలుగుతుంది. కురువంశంలో కోడలిగా అడుగుపెట్టిన ఒక్క మహిళైనా సుఖ పడిందా?*
*🔔. సత్యవతీ* *ముందుగా సత్యవతీ దేవితో ప్రారంభిద్దాం. ఒక బెస్తవారింట పెరుగుతూ గంగా నదిని గడవేసి పడవ నడుపుతూ దాటించే శ్రామికురాలు. కురువంశ చక్రవర్తి అయినా శంతన మహారాజు ఆమెను వలచాడు. ఆమె తండ్రి దాశరాజు సత్యవతి కుమారులకే రాజ్యం సంక్రమించే షరతు మీదనే వివాహానికి అంగీకరించాడు. ఆమెకు ఇద్దరు కుమారులు కలిగారు. మొదటివాడు వివాహం కాకుండానే మరణించాడు. రెండవవాడు వివాహమైన కొంతకాలానికి మరణించాడు. ఎంత దుర్భరమైన పరిస్థితి?*
*నిజానికి సత్యవతి బెస్తవారింట పుట్టలేదు. ఆమె తండ్రి ఉపరిచరవసువు ఒక శాపగ్రస్త అప్సరస ద్వారా కన్న కుమార్తె ఆమె. కారణమేమైనా ఆమెను బెస్తవారింట పెంపకానికి ఇచ్చేశాడు. రాజకుమార్తెగా జీవించవలసిన ఆమె మత్స్యకారుల ఇంట్లో పెరిగింది. ఒక మహారాజు భార్య అయినప్పటికీ ఆమె జీవితంలో సుఖసంతోషాలు లేవు. కొడుకులిద్దరూ మరణించారు. ఏ స్త్రీకైనా అంతకన్నా పెద్ద కష్టం ఉంటుందా?*
*అయినప్పటికీ రాజ్యం కోసం కోడళ్లకు నియోగం ద్వారా సంతానం కలిగేలా చేసింది. ఆ సంతానంలో ఒకరు గుడ్డివాడు, మరి ఒకడు పాండు రోగంతో పుట్టాడు. సత్యవతీ దేవి జీవితంలో సుఖమన్నమాట ఉన్నదా?*
*🔔అంబిక, అంబాలిక*
*ఇక రెండవ తరంలోని కోడళ్ళు అంబిక, అంబాలిక. భర్త చిన్న వయసులోనే మరణించాడు. అత్తగారి ఆజ్ఞను అనుసరించి నియోగం ద్వారా పిల్లలను కనవలసి వచ్చింది. సంతానం అనుగ్రహించేది ఎవరో కూడా వారికి తెలియదు. వ్యాస మహర్షిని చూసి వారు భయపడటంలో ఆశ్చర్యమేమున్నది? కలిగిన సంతానమిద్దరూ వికలాంగులు.*
*🔔గాంధారి, కుంతి, మాద్రి.*
*మూడవ తరంలో ఆ ఇంటి అడుగుపెట్టిన కోడళ్ళు గాంధారి, కుంతి, మాద్రి.*
*భర్త మరణానికి తానే కారణమని నమ్మిన మాద్రి చిన్న వయసులోనే సహగమనం చేసింది. తన పిల్లలను, సవతి పిల్లలను కుంతి పెంచవలసి వచ్చింది. హాయిగా పుట్టింట్లో ఉండి ఆమె పిల్లలను పెంచలేదు. తన అత్తవారింటనే ఉంది. అన్ని రకాల అవమానాలను భరించింది. చివరకు కొడుకులు బిచ్చమెత్తుకుని బతుకుతున్నా కూడా ఆమె చూడవలసి వచ్చింది. ఆ పైన కొన్నాళ్లు వారికి రాజ్యాధికారం ఉంది. ఆ తరువాత అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. ఆ సమయంలో ఆమె అంతఃపురంలో కాకుండా విదురుడింట ఉండవలసి వచ్చింది. కుంతి జీవితంలో సుఖం అన్న మాట ఉన్నదా?*
*గాంధారి మాత్రం ఏం సుఖపడింది?*
*తాను వివాహం చేసుకోబోయేది ఒక అంధుడని కూడా ఆమెకు తెలియదు. భర్తతో సమంగా ఆమె కూడా అంధత్వాన్ని అనుభవించింది. కుమారుల మరణాన్ని చూసింది. అల్లుడి చావును చూసింది. ఆమె పిల్లలను సరిగా పెంచలేదు అని ఈనాడు ఎవరైనా అనవచ్చు కానీ పెంపకానికీ, గుణగణాలకీ సంబంధం ఉన్నదా?*
*కుంతి గురించి చెప్పేటప్పుడు ఎంతసేపూ ఆమె కర్ణుడికి చేసిన అన్యాయం గురించే మాట్లాడుతారు.*
*ఆమె తన చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడింది?*
*వృష్ణివంశస్థుడు అయిన శూరసేనుడి కుమార్తెగా జన్మించిన ఆమె చిన్న వయసులోనే కుంతి భధ్రుడికి దత్తతగా వెళ్ళింది. దూర్వాసుడిచ్చిన వరాన్ని బాల్య చాపల్యంతో పరీక్షించపోయి కర్ణుడికి తల్లి అయింది. ఆమె పెంపకానికి వెళ్లకుండా సొంత తల్లిదండ్రుల దగ్గరే ఉంటే వారికి విషయం చెప్పుకోగలిగేదేమో. ఈ సంగతి ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించి ఉంటారా?*
*నాలుగవ తరంలో ఆ ఇంట అడుగుపెట్టిన ద్రౌపది జీవితంలో కష్టాలను పడడమే కాక లెక్కపెట్టలేనన్ని అవమానాలను అనుభవించింది.*
*నిండు సభలో వస్త్రాపహరణం, పతిత అన్న తిట్లు, నా ఊళ్ళో కూర్చో అన్న సైగ. ఎంత అవమానం అయినప్పటికీ ఆమె ధృతరాష్ట్రుని తన భర్తల బంధవిముక్తిని కోరింది కానీ తన విషయంలో ఏమీ అడగలేదు. అయినా 12 ఏళ్లు అరణ్యంలో ఉండాల్సి వచ్చింది. 13వ ఏట దాసీవృత్తి చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో కూడా కీచకుడు వంటి వారు ఆమెను మోహించి నానారభస చేశారు. అన్నీ పూర్తి అయి కురుక్షేత్ర సంగ్రామంలో భర్తలు నెగ్గే సమయానికి ఆమె కుమారులను కోల్పోయింది.*
*అర్జునుడికి మరో భార్య అయిన సుభద్రకు అదే పరిస్థితి. ఏకైక కుమారుడు మరణించాడు. అర్జునుడి మరో భార్య ఉలూపి కుమారుడు మరణించాడు. కౌరవుల భార్యలందరూ భర్తలను కోల్పోయి నిస్సహాయంగా మిగిలారు.*
*ఇక చివరగా చెప్పుకోవాల్సింది ఉత్తర గురించి.*
*ఆమెను అభిమన్యుడు వివాహం చేసుకున్నాడు. భర్త సమక్షంలో కొన్ని రోజులు మాత్రమే గడిచి ఉంటాయి. శ్రీకృష్ణ పరమాత్మ దయవల్ల ఆమె కుమారుడు మిగిలాడు. అంతకుమించి ఆనందమన్నది ఆమెకు తెలియదు.*
*కురువంశం మొత్తానికి ఒకే ఒక్క ఆడపడుచు దుశ్శల.*
*ఆమె గాంధారి, ధృతరాష్ట్రుల కుమార్తె. సైంధవునితో వివాహమైంది. అటువంటి పరమ దుర్మార్గుడుతో ఆమె కాపురం ఎలా ఉండి ఉంటుందో ఊహించవచ్చు. అతడు ద్రౌపదీ దేవిని ఎత్తుకొని పోయే ప్రయత్నం చేసాడు. భీమార్జునులు అతనిని బంధించి వెనక్కి తీసుకురాగా చెల్లెలు జీవితం సుఖంగా ఉండాలన్న కోరికతో ధర్మరాజు అతనిని క్షమించి వదిలిపెట్టాడు. కానీ తనకు జరిగిన అవమానం మరిచిపోని సైంధవుడు అభిమన్యుడి చావుకి పరోక్షంగా కారకుడు అయ్యాడు. అర్జునుడి చేతిలో మరణించాడు.*
*కురుక్షేత్ర సంగ్రామం తరువాత దుశ్శల కుమారుడు సురథుడు రాజయ్యాడు. అశ్వమేధ యాగం జరుగుతున్న సమయంలో అర్జునుడు సింధు దేశానికి రాగా సురథుడు భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు దుశ్శల తన మనవడిని తీసుకుని రణ రంగానికి వచ్చి అర్జునునికి తన కష్టం చెప్పుకుంది. అర్జునుడు ఆ చిన్న పిల్లవాడిని సింధు రాజ్యానికి రాజుగా ప్రకటించాడు.*
*దుశ్శల జీవితంలో సుఖం కానీ శాంతి కానీ ఉన్నాయని ఎవరికైనా అనిపిస్తుందా?*
*కురువంశంలో అడుగుపెట్టిన కోడళ్లు అయితేనేమి, ఆ ఇంటి పుట్టిన ఏకైక కుమార్తె దుశ్శల అయితే ఏమి సుఖము అన్నమాట ఎరుగరు.*
*ఇదంతా ఏదో కురువంశంలో మాత్రమే ఆడవాళ్లు కష్టపడ్డారని చెప్పడానికి కాదు.*
*ఏ స్త్రీ అయినా కష్టం వచ్చినప్పుడు "నాకే ఇలా అయింది ఏమిటి?" అని దుఃఖించకుండా ఉండడానికి మాత్రమే.*
స్వస్తి
🔔🔔🔔🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి