27, నవంబర్ 2025, గురువారం

ఎర్రి బాగులు నాన్న కథ!

  "ఆయన సింహం లాంటోడే "..

 ఎర్రి బాగులు నాన్న కథ! 


సింహం !

అడవికి రారాజు !

మగ సింహం ... సింహాల గుంపుకు {pride } రక్షకుడు . 

మిగతా గుంపుల సింహాల నుంచి తన కుటుంబాన్ని కాపాడుతుంది . 

సింహమంటే అడవిలో భయపడని జంతువుండదు .

సింహం ... ఠీవి , రాజసం,  డాబు,  దర్పం అన్నీ ఒక వయసు వరకే !

"వాడు కుక్క చావు చచ్చాడు "అంటారు .

 అంటే కుక్క..  చివరి రోజులు దయనీయంగా ఉంటాయని అర్థం .

మీకు తెలుసా ?

సింహం చివరి రోజులు ఇంతకన్నా దయనీయం .

జింక లాంటి  గడ్డిమేసే జంతువుల పని ఒక విధంగా హ్యాపీ . 

ముసలి  వయసు వచ్చినా ... లేవలేక పోయినా చుట్టూరా గడ్డి ఉంటుంది .

 కడుపు నింపు కోవచ్చు .

"ముసలి జింక పరుగెత్త లేదు . పులి,  సింహం లాంటి వాటికి ఆహారమయిపోతుంది!"  అనుకొంటున్నారా ?

ఆగండి.. ఆ పాయింట్ కొస్తా!


వృద్ధ సింహం !

పళ్ళు బలహీనం .. కండరాలు బలహీనం !

వేటాడ లేదు . 


ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు .

" నీ పని అయిపొయింది .. నువ్వు చేసేది ఏమీ లేదు .. పెత్తనం చాలు .. ఇక దయ చెయ్యి .. "అని ఆ గుంపులో నాయకత్వం కోసం తహతహ  లాడుతున్న యువ మగసింహాలు వృద్ధ సింహాన్ని బయటకు గెంటేస్తాయి .

నిన్నటి రాజసమే .. తన పెత్తనమే .. అంటే పురుషాధిక్యతే ..  నేడు తన పాలిట శాపం అయ్యింది . 

అధికారం పోయింది. 

కుటుంబం దూరం అయ్యింది . 

శరీరం సహకరించదు . 

వేటాడే శక్తి లేదు .

ఒంటరి జీవితం .

 నిన్నటి దాక జగమంత కుటుంబం .. నేడు ఏకాకి జీవితం .


"వృద్ధ జింక పైకి సింహాలు  పులులు  వచ్చి చంపుతాయి" అన్నారు కదా ?

అది హ్యాపీ ఎండింగ్ ! 

గొంతు కొరికి చంపడం వల్ల రెండు నిముషాల్లో ప్రాణం పోతుంది .


అడవికి రారాజు ..  సింహం చావు... ఎలా ఉంటుందో తెలుసా ?

వేటాడితే కానీ కడుపు నిండదు . 

వేటాడే ఓపిక లేదు .

 ఆకలి తో నీరసించి లేవ లేక పడుకొనుంటే...  హైనాలు  దాడి    చేస్తాయి .

 లైవ్ గా ...  పీక్కు  తింటాయి . 

ప్రాణం పోదు .. వెనుక నుంచి  హైనాలు .. కండరాల్ని పీక్కుని తింటున్నాయి . 

విపరీతమయిన నొప్పి...  బాధ .. 

నిన్నటి దాక తాను లేస్తే జంతువులు ఆమడ దూరం పారిపోయేవి . ఇప్పుడు బతికుండగానే పీక్కుని తింటున్నాయి .

భరించలేని టార్చర్ . ... వెనుక వైపు .. పక్క వైపు .. కండరాలు పోతున్నాయి . 

వెధవ ప్రాణం  పోదు .

 ప్రాణం పోవడం...  ఎంతటి బ్లెస్సింగ్ ! 

అరగంట ... గంట...  టార్చర్...  తరువాత .. చివరకు ఎండింగ్ . పెయిన్ ఫుల్ ఎండింగ్ . 

అడవికి రాజు లైఫ్ .. డెత్ ఇది . 


 రాజుల ప్రాణాలు ఇలాగే పోతాయేమో .. యుద్ధ భూమిలో  .. శత్రువుల చేతికి చిక్కితే .... అయ్యో పాపం !

జనాల సింపతికి కూడా నోచుకోకుండా పోయారు .. .. 

చేసిన పాపాలకు శిక్ష అనుకోవాలా ? 

 బూమిపైనే నరకం చవి చూసి అసువులు బాసిన వారెందరో  ! 

"ఒకే వైపే చూడు .. రెండో వైపు చూడకు" అని సమాజం .   


 .. పాపం... నాన్న   సింహంలాంటోడే !

తాగుబోతు .. పెళ్ళాన్ని కొట్టే టైపు..  నాన్నల గురించి కాదు . 

అలాంటి వారు శాడిస్ట్ లు .


పురుషాధిక్య సమాజానికి చెందిన.. సగటు నాన్న కథ .. వ్యధ ..  గుండెతో చదవండి . 


ఉద్యోగం .. వ్యాపారం .. సంపాదన . .. కుటుంబానికి తానే పెద్దదిక్కు .


బాధ కలిగితే అమ్మ ఏడుస్తుంది . 

ఎంతో కొంత మేర ఉపశమనం పొందుతుంది ...  కన్నబిడ్డల సానుభూతిని కూడా !


నాన్న  ఏడవడు. 

"ఏడ్చే మగాడ్ని నమ్మకూడదు " అంటుంది పురుషాధిక్య సమాజం   .

 బేలతనం చూపడం అంటే ఎంత నామోషీ !

అందుకే నాన్న ఏడవడు. 

బాధల్ని ఎవరికీ చెప్పుకోడు. 

"మగాడికి బాధలేంట్రా?" అంటుంది సమాజం . 

అందుకే కష్టాన్ని గుండెలో దాచుకొంటాడు . 

ఎర్రి గుండె .. 

ఎంతని భరిస్తుంది ?   

అందుకే ఎప్పుడో పుసిక్కున ఆగిపోతుంది . 

నాన్నలకే పక్షవాతమొస్తుంది .

అమ్మలకు రావాలని కాదు . 

నాన్నలకే ఎందుకొస్తుంది ?అని సమాజం అడగదు. తెలుసుకోదు . పవర్ ఉన్నోడికి సానుభూతి దక్కదు . 


"నాన్న ముక్కోపి .. అమ్మ ప్రేమకు ప్రతి రూపం"

 . సగటు కుటుంబం లో పిల్లల ఆలోచన ఇది .

 తాను ఎవరి కోసం కష్టపడుతున్నాడో వారి ప్రేమ కూడా పొందలేని దోర్భగ్యం ..నాన్నది ! 


అమ్మ అడిగితే ఇస్తుంది . 

నాన్న .. ఎవరూ అడగక పోయినా ఇస్తాడు .

నిన్నటి పురుషాధిక్య సమాజం లో అన్నీ తానై కుటుంబానికి సర్వం  సమకూర్చేవాడు . 

ఏడిస్తే    ఒంటి   నీరు వృధా అయిపోతుందని దాన్ని కూడా చెమట నీరుగా మార్చి ... రేయి పగలు ఖర్చు పెట్టి ... బతుకు బండికి ఇంధనం సమకూర్చిన వాడు నాన్న . 

అమ్మను కు ప్రేమ  దక్కింది.. కృతజ్ఞత చిక్కింది . 

మరి పిచ్చి నాన్నకో ?? 


నిన్నటి నాన్న లు ఎంతో కొంత అదృష్టవంతులు .

 వృద్ధాప్యం లో ఉమ్మడి కుటుంబం ఉండేది . 


మరి నేటి నాన్నలు ?


నేటి నాన్న { 50 - 70 }:


పాపం సింహం బతుకు . 


వృద్ధాప్యం మీదబడిన...

 1. అమ్మ వింటేజ్ కారు .

 2. నాన్న స్క్రాప్ .


పట్టణంలో..  అమెరికా లో..  కొడుకులు..  కూతుళ్లు ..

"ఇంట్లో అమ్మ ఉంటే ఎంత హాయి .

వంట పని .. ఇంటి పని .. పిల్లల పని .. ఇద్దరు ముగ్గురు పని మనుషులు...  ఉన్నటు లెక్క .. 

అమ్మకు ఆహ్వానం " 


ఫ్లైట్ ఎక్కి అమెరికా కు పోయిన నాన్న నెలలో తిరిగొస్తాడు . 

అమ్మ ఆరు నెలలయినా అక్కడ హ్యాపీ గా ఉండిపోతుంది .


తప్పు పిల్లలది కాదు .. నాన్నదే ..    పురుషాదిక్యదే!   !


పెళ్లయిన కొత్తలో పెళ్ళాం పై పెత్తనం చేసేవాడు .

    "తాను  చెప్పినట్టే వినాలి . తనకు సపర్యలు చెయ్యాలి .

ఆడది ..   తన ఇంటికొచ్చింది .. తనపై ఆధారపడి బతుకుతోంది .. తానే రాజు .. తానే మాస్టర్ "అని అనుకునేవాడు .

ప్రకృతి ధర్మమో ...  కాలం   తెచ్చిన మార్పో!

యాభై అరవై కి వచ్చేటప్పటికి పెళ్ళాం లేకుండా నిముషం కూడా బతక లేని స్థితికి వచ్చేస్తాడు .. నాన్న .


వంట పనితో ... ఇంటి పని తో ఇల్లే స్వర్గం గా బతికింది అమ్మ . 

బోర్ ఫీల్ కాకుండా బతికేస్తుంది ఆమ్మ. 

బోర్ అనేది ఆమె డిక్షనరీ లో లేదు . 

ఆమె పనికి రిటైర్మెంట్ లేదు . 

చేసినత కాలం చేసినంత పని . 

పురుషుడు ఎంతటి అమాయకుడు .. అరవై ఏళ్లకు ఊడి పోయే ఉద్యోగాన్ని చూసి ఎంత మురిసి పోయాడు...   మిడిసి పడ్డాడు ?!! 


 లాక్ డౌన్ కాలం లో అత్యంత సఫర్ అయినవాడు నాన్న . 

ఇది ఎవరూ అర్థం చేసుకోలేక పోయిన కోణం .


 రిటైర్ అయిన నాన్న బతుకు దయనీయం .

 నిన్నటి దాక ఆఫీస్ లో తన డాబు ...  దర్పం . 

రోజంతా బిజీ . 

ఇప్పుడు పట్టించుకొనే వారు లేరు .

 రోజు గడవదు . 

పెళ్లానికేమి.!. హ్యాపీగా కాలం గడిపేస్తుంది .

తనకు నిన్నటి రోజుల విలువ లేదు అని గ్రహించడమే పెద్ద మానసిక పోటు. 

చిన్న ఉద్యోగస్తుడైతే ఫరవాలేదు . 

పెద్ద ఉద్యోగం చేసి రిటైర్ అయినవాళ్లు సంగతి ?

ఎంత చెట్టుకు అంత తుఫాను పోటు ! 


నిన్నటి దాక  అప్పోయింట్మెంట్ కోసం ఎంతో మంది ఎదురు చూసే వారు . ఇప్పుడు ఇంట్లో బోర్ కొట్టి ఫోన్ చేస్తే ఫోన్ తీయడం లేదు . ఒక్కో సారి బ్లాక్ చేస్తున్నారు . 


హత విధి!  పురుషాధిక్య నాన్న కు ఎంతటి సైకలాజికల్ దెబ్బ !


తప్పు నీదే ! 

అరవై దాటాక కూడా .. కండలు ఉడిగి..  ఆదాయం అడుగంటాక కూడా ఇంకా నీ పెత్తనం ఏంటి ముసలోడా ?

నిన్నటి దాక .. చేసావ్ . సరే ..

 పెళ్ళాం వెర్రి బాగులది .

ఇప్పుడు కూతురు ఇంటికి పోయి పెత్తనం చేస్తానంటే కుదురుతుందా ?

కూతురుకి నువ్వంటే అమిత ప్రేమ . 

కానీ ఆమెకో కుటుంబం ఉంది. ... నీలాగా కాకపోయినా ఎంతో కొంత పురుషాధిక్యత కలిగిన అల్లుడు ఉన్నాడు అక్కడ . పైగా కూతురికి జాబ్ .. అర్థం చేసుకోలేవు . ఇమడ లేవు . నెల తిరక్క ముందే ఇండియా కొచ్చేస్తావ్ .


కూతురు దగ్గరయినా నెల ఉంటావు .

 కొడుకు అయితే వారమే !

కొడుకు .. నీ ప్రతి రూపం మరి ...  బిజీ . 

కోడలు . వేరే ఇంటి బిడ్డ !


పోనీ ఒకటి చెప్పు !

కూతురో,  కొడుకో,  అల్లుడో,  కోడలో.. జాలి చూపితే సహిస్తావా ?

నరనరాల్లో పురుషాధిక్యత . 

dominant  నేచర్ ! 


ఏంటేంటి ?

నీ పెళ్ళాం నీ పై   ఆధార  పడి బతికిందా ?

బళ్ళు...  ఎప్ప్పుడో ఓడలయినాయి.. ఎర్రోడా ! 

 

ఇప్పుడు పెళ్ళాం లేకుండా నిముషం బతకలేవు .

 తిట్టడం కోసమయినా ఆమె ఉండాలి . 

మంచి నీళ్లు ఇవ్వడం మొదలు .. ప్లేట్ లో   అన్నం  పెట్టె దాక ఆమె ఉండాల్సిందే .

 అరే పిచ్చోడా .. ఆమెకు     ముట్లు  ఉడిగాక..   ఆమెకు నువ్వు .. నీకు తెలియకుండానే అమ్మ స్థానం ఇచ్చేసావ్ .

 అవును ఇప్పుడు నీ భార్య నీకు అమ్మ .

 వృద్ధాప్యం లో నువ్వు చంటి   పిల్లాడు  అయిపోయావు .


నీ నరనరాల్లో పురుషాధిక్యత...  నీకు తెలియకుండా ఎంత కరుడు కట్టుకొని పోయిదంటే..." నువ్వు లేకుండా నేను బతకలేను .. నువ్వు పొతే నేను నటుడు రంగనాథ్ అయిపోతాను" అని చెప్పలేని స్థితి నీది .

ఆమెకు   ఇదేమైనా కొత్తా?

ఎప్పుడో నీ కోసం .. తన పుట్టింటిని వదలి వచ్చింది .

 కొత్త ప్లేస్ లో కొత్త వాతావరణం లో ఇమిడి పోవడం ఆమెకు అప్పుడే అబ్బింది . 

ఇల్లే ఆమెకు ప్రపంచం . 

హ్యాపీ గా కూతురు ఇంట్లో కొడుకు ఇంట్లో సెటిల్  అయ్యిపోతుంది .

నువ్వు లేకుండా ఆమె బతకగలదు. 

ఆమె లేకుండా నువ్వు బతకలేవు .

ఇంకేమి పిండాకూడు మగపెత్తనం ? 

ముళ్ల కిరీటం ! 


 గతంలోనే బతకాలి అనేది నీ కోరిక . 

టైం ఫ్రీజ్ అయిపోవాలంటే ఎలా ముసలోడా ?

నీ సొంత ఇంట్లోనే ఉండాలి . పెళ్ళాం చేత సపర్యలు చేయించుకోవాలి . దాని పై పెత్తనం చెయ్యాలి ..అంటే ఎలా ?

కాలం మారింది . 

ఆమె మారింది .

 నీకు మాత్రం అడ్పాటేషన్ skills  రాదు . 

పురుషాధిక్యత రానివ్వదు. 


నువ్వు సింహం లాంటోడే .

 అలాగే పెత్తనం చేస్తూ బతికావ్ .

 ఇప్పుడు ముసలి సింహం లాగే నీ బతుకు . 

ఎమోషనల్ బ్రేక్ డౌన్ . 

కూతురు ఇంట్లో ఉండలేవు .. కొడుకు ఇంట్లో ఉండలేవు .. వృద్ధాశ్రమానికి పోలేవు .. అదొక నామోషీ ..

 ఇన్నాళ్లు నిన్ను అర్థం చేసుకొన్న నీ భార్య .. పాపం ఆమె మాత్రం ఎన్ని రోజులు భరిస్తుంది .?

కొడుకుతో కూతురితో బతకొద్దా? 

మనవళ్లు మానవరాండ్రు .. నీ దగ్గరికి వస్తే అయిదు నిమషాలు.. ఆమెతో అయితే రోజంతా గడుపుతారు . 

అందరికీ దూరం  అయ్యావు .

 గతాన్ని తిరిగి తేలేవు.. 

వర్తమానాన్ని ఒప్పుకోలేవు. 

ఏమి బతుకు రా సామీ !


అంతేలే .. నువ్వేమి చేయగలవు ?? 

కాలం మారింది . ఉమ్మడి కుటుంబాలు పోయాయి . 


అమెరికా లో ... ఆస్ట్రేలియా లో పిలల్లు .   వాళ్ళ  బతుకులు వాళ్ళు బతకొద్దా ?

ఊళ్ళో నుంచి ఉద్యోగం కోసం నువ్వు ఆ రోజుల్లో టౌన్ కు రాలేదా ?


 బాధ ను గుండెల్లో దాచుకోకయ్యా!

"అమ్మా.. తల్లీ.. పురుషాధిక్యత  ముళ్ల  కిరీటం .. నాన్నను అర్థం చేసుకున్నోరు లేరు ".. అని  చెప్పు ..

"  పురుషాధిక్యత వద్దు రా..  నా బంగారు తండ్రి" అని కొడుక్కి కూడా చెప్పు .. 

డీప్ స్టేట్ గాళ్ళు పురుషాధిక్యత పేరు చెప్పి పెళ్లిళ్లు కాకుండా యువజనం బ్రెయిన్ వాష్ చేస్తున్నారు .


 సింహం అడవికి రారాజే .


 తన దర్పం .. దాష్టీకాలకి అది...  ఇదే జన్మలో కష్టాలు అనుభవించి కుక్క చావు .. కాదు కాదు .. సింహం చావు చస్తుంది .

 సింహాన్ని అర్థం చేసుకొన్న సమాజం ... నాన్న ను అర్థం చేసుకోదు. పురుషాధిక్య నాన్న చచ్చిపోయాడు . 

మిగిలిన వాళ్ళు కూడా చచ్చి పోతారు . 

బాధ కరమయిన చివరి రోజులు అనుభవించి పోతారు . 

అర్థం చేసుకోండి తల్లులూ .. ఈ సింహం  బతుకొద్దు తండ్రులూ!


చివరిగా ఒక మాట !

అమ్మా.. కొంతమంది మహిళలు పురుషాధిక్యత కింద నలిగి పోయిన మాట వాస్తవం . 

మీ బతుకులో .. మీ భర్త తాగుబోతు .. తిరుగుపోతు అయివుండొచ్చు . వాడిని భరించల్లేక మీరు దూరం జరిగి హాయిగా బతుకుతుండవచ్చు . అక్కడి దాక మీకు హాట్స్ ఆఫ్ .

 కానీ సోషల్ మీడియా దొరికిందని మీకు    కాలక్షేపం   కోసమో .. ఫెమినిస్ట్ అని పేరు కోసమో ..

...  మొత్తం పురుష జాతి పై విషం చల్లుతూ పోస్ట్ లు పెట్టి యువత మనస్సు కకావికలం చెయ్యొద్దు ...

...  సమాజం అనే నౌకకు చిల్లి పెట్టొద్దు . 

మీ నాన్న మగాడే . మీ కొడుకు మగాడే .

స్త్రీ.. పురుషుడు కలిస్తేనే జీవితం . సమాజం .

పచ్చటి కాపురాల్లో నిప్పులు పొయ్యొద్దు .

కామెంట్‌లు లేవు: