14, సెప్టెంబర్ 2020, సోమవారం

శ్రీ బాల త్రిపుర సుందరి దేవి

*🌼🌿త్రిపురాంతకం శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అమ్మ వారి దేవాలయం, ప్రకాశం జిల్లా🌼🌿*

త్రిపురాంతకం బాల త్రిపుర సుందరీ దేవి, పార్వతీ సహిత త్రిపురాంతకేశ్వరుల నివాస భూమి త్రిపురాంతకం. స్వామి వారు కొండ ఎగువన ఉంటారు. అమ్మ వారు కొండ దిగువ భాగాన ఉండి భక్తులను కటాక్షిస్తారు…అమ్మ వారు చిదగ్ని గుండం నుండి ఆవిర్భవించారు.జపమాల పుస్తకాన్ని ధరించి శ్వేతకమలాన్ని అధిష్టించి అమ్మవారు చిన్న రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారిని దర్శించినంతనే దేవీ ఉపాసన సిద్ధి లభిస్తుంది. ప్రశాంతతకు మారుపేరుగా, ప్రకృతి అందాలకు నెలవుగా మారిన ఈ పుణ్యక్షేత్రం శ్రీశైల క్షేత్రానికి తూర్పు ద్వారంగా విరాజిల్లుతుంది…


శివుడు కొలువు దీరిన అతి పురాతన ప్రదేశం ఈ త్రిపురాంతకం. శ్రీశైలం కంటే అతి పురాతనమైన మహా శైవ ధామం. పరమశివుడు శ్రీశైలం వెళుతూ ఇచ్చట నడయాడాడు. అందుకే త్రిపురాంతకం శ్రీశైలానికి ప్రధాన ద్వారం అయింది.అమ్మ వారి గర్భాలయం, పంచముఖ స్వయంభుజాల లింగం,మేరు చక్రం మధ్యగల జలలింగం పై, అభిషేకం చేయబడ్డ జలం భూ చక్రపీఠము గుండా క్రిందకు జారి పాతాళచక్రము మధ్య రాసాలింగం పై పడటం ఒక అద్భుత దృశ్యం ఇది చూసి తీరాలి.


స్వామి వారు శ్రీ చక్ర ఆకార నిర్మిత ఆలయంలో దర్శనమిస్తారు. పుణ్య క్షేత్ర అభివృద్ధికి చోళ,రాష్ట్ర కూట,విజయనగర సామ్రాజ్య దీశులు విశిష్ట కృషి చేశారు. గర్భాలయానికి ఆగ్నేయదిశలో నాగారేశ్వరస్వామి, దక్షిణ భాగంలో అపరాధేశ్వరస్వామి ఉన్నారు. కాశీ, ఉజ్జయిని తరువాత అమ్మవారికి ఇష్టమైన కదంబ వృక్షాలు ఉన్న ఆలయం. ఈ కదంబ వృక్షాలు కాశీలో తప్ప మరెక్కడా కనపడవు.

నైరుతి దిశలో ఆగస్త్యమహార్షి చే నిర్మించబడిన ఒక బిల మార్గం ఉంది. ఈ బిలము గుండా మునులు, తాపసులు, కాశీ,రామేశ్వరం, శ్రీశైలంకు ప్రయాణించే వారని ప్రతీతి.కానీ అది ప్రస్తుతం రాళ్లతో, విరిగిపోయిన దూలములతొ మూసుకుపోయి ఉంది. ఆలయానికి చుట్టూ కోటికి పైగా శివలింగాలు, శతాధిక జలాశయాలు ఉన్నాయని పూర్వీకులు చెబుతారు…
ప్రతి పౌర్ణమి రాత్రి కొన్ని వందల మంది భక్తులు ఇక్కడ నిద్ర చేసి వేకువజామునే అమ్మవారిని దర్శించుకొని అమ్మ వారి కృప కి పాత్రులవుతారు

*ఎక్కడ ఉంది, ఎలా వెళ్ళాలి*

శ్రీ బాల త్రిపురసుందరి దేవి దేవాలయం ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం లో ఉంది.ప్రకాశం జిల్లా మార్కాపురానికి 40 కి. మీ. ఒంగోలు కి 93 కి.మీ కర్నూలు – గుంటూరు రహదారిలోని ఉన్న వినుకొండకు 35 కి. మీ.యర్రగొండపాలెంకు 19 కి. మీ. దూరంలో ఉంది. ఇక్కడికి ముఖ్యమైన ప్రాంతాల నుండి ఆర్టీసీ బస్సు సదుపాయం కలదు..

కామెంట్‌లు లేవు: