14, సెప్టెంబర్ 2020, సోమవారం

పండిట్ జస్రాజ్ గారి కచేరీ

🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹
ఇంగ్లాండ్ లోని బర్మింగ్ హాంలో పండిట్ జస్రాజ్ గారి కచేరీ జరుగుతోంది. విశాలమైన మైదాన ప్రాంగణంలో ప్రకృతి ఒడిలో జరుగుతున్న కార్యక్రమం అది. శ్రోతలంతా కుర్చీలపై కాక, క్రింద కూర్చొని, వినే విధంగా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ముందుగా 'మంగళం భగవాన్ విష్ణుం' అనే నామావళితో ఆరంభించి, భక్తి తొణికిసలాడే విధంగా, అడానా రాగంలో 'మాతా కాళికా' భజన్ పాడుతున్నారు జస్రాజ్ గారు.
శ్రోతలలో ఎక్కువభాగం భారతీయులే ఉన్నారు. అయితే, కొద్దిమందే వచ్చినా, బ్రిటిష్ వారు మఠం వేసుకొని, శ్రద్ధగా గానం వింటుండగా, భారతీయ శ్రోతలు తమ ప్రక్కనే చెప్పులు విడిచి కొందరు, బూట్లతో కాళ్లు బారజాపి, పాదాలు వేదిక వైపు పెట్టి కొందరు కూర్చోవటం జస్రాజ్ గారి దృష్టిలో పడింది. వెంటనే పాట ఆపి, హిందీలో ఇలా అన్నారు" మన సంగీతం భగవత్సంబంధమైనది. పాడేవారూ, వినేవారూ కూడా భగవదర్చనలో భాగస్వాములమని భావించాలి. అలాచేస్తే, ఈ సంగీతం,మనలను దైవం దగ్గరకు చేరుస్తుంది. అయితే, అర్చన సమయంలో మనం కొన్ని నియమాలు పాటించాలి కదా! అవి ఇక్కడా పాటించాలి. ఆసక్తి లేనివారు ఇక్కడ కూర్చోనక్కర లేదు. దయచేసి మీ పాదరక్షలు బయటవిడిచి వచ్చి, కుదురుగా నాదార్చనలో పాల్గొనదలచిన వారే ఇక్కడ ఉండండి".
క్రమంగా శ్రోతలలో ఒక్కొక్కరూ లేచి, ఆవిధంగా చేశారు. విముఖులు అక్కడినుండి మెల్లిగా జారుకున్నారు.
మూడున్నర గంటలపాటు జరిగిన ఆనాటి కార్యక్రమం, నిజమైన శ్రోతలకు బ్రహ్మానందాన్ని కలిగించింది.

*మోదుమూడి సుధాకర్* .
(Modumudi Sudhakar)

కామెంట్‌లు లేవు: