14, సెప్టెంబర్ 2020, సోమవారం

గీతా మకరందము

14-17-గీతా మకరందము
        గుణత్రయవిభాగయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అవతారిక - ఆ యా గుణములవలన కలుగు ఫలితములను తెలియజేయుచున్నారు -

సత్త్వాత్సఞ్జాయతే జ్ఞానం
రజసో లోభ ఏవ చ |
ప్రమాదమోహౌ తమసో
భవతోఽజ్ఞాన మేవ చ ||

తాత్పర్యము:- సత్త్వగుణమువలన జ్ఞానము, రజోగుణమువలన లోభము, తమోగుణమువలన అజాగ్రత (మఱపు) భ్రమ, అజ్ఞానము కలుగుచున్నవి.

వ్యాఖ్య:- తత్త్వము బాగుగ దృఢపడుటకొఱకై - ఉపాధ్యాయుడు విద్యార్థికి బోధించిన చందమున - భగవానుడు అర్జునునకు చెప్పినవిషయమునే వివిధరీతుల మఱల మఱల తెలియజెప్పుచున్నారు. లోభము, అజ్ఞానము మున్నగునవి దుఃఖప్రదములు కావున అవాంఛనీయములైనవి. కాబట్టి అవి వేనివలన కలుగునో, అట్టి రజోగుణ, తమోగుణములను దూరీకరించి జ్ఞానదాయకమగు సత్త్వగుణమునే విజ్ఞుడాశ్రయించ వలయును.
ప్రశ్న:- సత్త్వగుణమువలన నేమికలుగును?
ఉత్తరము:- జ్ఞానము.
ప్రశ్న:- రజోగుణమువలన నేమి కలుగును?
ఉత్తరము: - లోభము.
ప్రశ్న:- తమోగుణమువలన నేమి కలుగును?
ఉత్తరము:- అజాగ్రత్త (మఱపు), భ్రమ, అజ్ఞానము కలుగును.

కామెంట్‌లు లేవు: