14, సెప్టెంబర్ 2020, సోమవారం

బ్రాహ్మణ పూజారులపై మమతా బెనర్జీ వరాల జల్లు

*బ్రాహ్మణ పూజారులపై మమతా బెనర్జీ వరాల జల్లు*
   పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బ్రాహ్మణ పూజారులపై వరాల జల్లు కురిపించారు. పూజారులకు నెలకు రూ. 1000 అలవెన్స్, 8 వేల మందికిపైగా పేద సనాతన బ్రాహ్మణ పూజారులకు ఉచిత ఇళ్లు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మమత ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది.



ఇంతకుముందు తాము సనాతన బ్రాహ్మణులకు అకాడమీ స్థాపించేందుకు కోలాఘాట్‌ వద్ద భూమిని అందించినట్టు మమత గుర్తు చేశారు. బ్రాహ్మణ శాఖలో చాలామంది ఆర్థికంగా బలహీనంగా ఉన్నారని పేర్కొన్నారు. కాబట్టి వారికి నెలకు రూ. 1000 ఇవ్వడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద ఉచితంగా ఇళ్లు కట్టి ఇస్తామని మమత హామీ ఇచ్చారు.



హిందీ దివస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన మమత ప్రభుత్వం అన్ని భాషలను గౌరవిస్తామన్నారు. ఇక్కడ భాషాపరమైన భేదాలేవీ లేవని సీఎం స్పష్టం చేశారు. ‘‘మేం అన్ని భాషలను గౌరవిస్తాం. కొత్తగా హిందీ అకాడమీని ప్రారంభించాలని నిర్ణయించాం. అలాగే, దళిత సాహిత్య అకాడమీని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం’’ అని మమత పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు: