14, సెప్టెంబర్ 2020, సోమవారం

పద్యభారతీసంతతికి ప్రణామాలు.


శ్రీ సీతారామ కల్యాణం అనే గ్రంథంలో 218, 219 పద్యములు.
      స హత్వా రాక్షసాన్ సర్వాన్
      యజ్ఞఘ్నాన్ రఘునందనః।
      ఋషిభిః పూజిత స్తత్ర
      యథేంద్రో విజయే పురా॥-1.30.23
          ........................
      కృతార్థోఽస్మి మహాబాహో
      కృతం గురువచ స్త్వయా।
      సిద్ధాశ్రమ మిదం సత్యం
      కృతం రామ మహాయశః॥-1.30.25
అని విరచించిన వాల్మీకి మహర్షికి ప్రణామాలు.
       యజ్ఞం ఫలవంతంగా సమాప్త మయ్యేందుకు రఘురాముడు దైత్యులను సంహరించగా, దేవలోకంలో దేవతలు ఇంద్రుని ఏ విధంగా స్తుతిస్తారో ఆవిధంగా సిద్ధాశ్రమంలోని మునులు రాముని స్తుతించినారు. పరమానందమును పొందిన విశ్వామిత్ర మహర్షి “ఓ దశరథరామా! తండ్రిమాటను శిరసావహించి నాయజ్ఞమును చక్కగా రక్షించి విజయసిద్ధితో ప్రకాశిస్తూ ఉన్నావు. నా ఆశ్రమమునకు కృతార్థత సిద్ధించింది. ఇప్పుడు శాంతిధామంగా శ్రీమంతంగా ఉన్న ఈ సిద్ధాశ్రమం ఇక నామసార్థకతను కూడా పొందగలదు అని రాముని ప్రస్తుతించినాడు.
           ఈ విషయాన్ని ఈ పద్యములలో తెలియజేస్తూ ఉన్నాను.

*సవము* సమాప్తం బగుటకు
భువి దైత్యుల గూల్చె రామభూవిభు డతనిన్
గవులై పొగడిరి మౌనులు
దివి నింద్రు నుతించునట్టి దివిజుల మాడ్కిన్.{218}

రామున్ బల్కె మునీంద్రు డిట్లు “క్రతువున్ రక్షించినావయ్య! సం
క్షేమం బబ్బగఁ దండ్రిమాట వినుచున్ జెల్వొందినావయ్య! శ్రీ
ధామంబయ్యె మదాశ్రమంబును కృతార్థత్వంబుతో, నింక సు
శ్రీమంతంబుగ నామసార్థకత నీ సిద్ధాశ్రమం బొప్పెడిన్”.{219}
           రచన:-కోట రాజశేఖర్, కోవూరు, నెల్లూరు.

కామెంట్‌లు లేవు: