14, సెప్టెంబర్ 2020, సోమవారం

శ్రీ అన్నమాచార్య చరితము

శ్రీ అన్నమాచార్య చరితము

                ----- ప్రశస్థి ------

శ్రీ వెంకటేశ్వరు స్థిరభక్తి ధ్యానించు
             హరికీర్తనాచార్యు డన్నమయ్య
నేతలౌ రాజుల నిరసించి బ్రతికిన
         హరికీర్తనాచార్యు డన్నమయ్య
సర్వ జీవుల యందు సమత జూపిన యట్టి
         హరికీర్తనాచార్యు డన్నమయ్య
పూటకో పాటతో పూజయోనర్చిన
          హరికీర్తనాచార్యు డన్నమయ్య
విశ్వకర్తగు శ్రీమహావిష్ణు దేవు 
నందకాంశంబు నందున నరయ బుట్టి
వేల హరికీర్తనంబుల నిలను బలికి
సన్ను తొందెను జగతిలో నన్నమయ్య

          -------. చరితము ---------

పరగ హూణ పదవ శతాబ్దంబు నందు
కాశి యందున తీవ్రమౌ కఱవు వచ్చె
పండితులు కొంద ఱచ్చోట నుండ లేక
వలస వచ్చిరి దక్షిణ వైపు నకును

వారణాసి నుండి వచ్చిన వారిలో
నందవరము నకును కొందఱేగి
యందు స్థిరత నుండి 'నందవరీకు' లై
పెంపు పొందినారు పేరుగాంచి

నారాయణయ్యను నందవరీకుడు
          కాపురంబుండె నా గ్రామమందు
బాల్యంబు నందునా బాలున కెందుకో
          చదువు లబ్బకనుండె సక్రమముగ
గురువులు పెట్టెడి గురుహింస వలనను
           విపరీత మైనట్టి విసుగుబుట్టె
బహు విరక్తియు బుట్టి బ్రతుకన్న యతనికి
           చావంగ దలచెను చదువు నొదలి
అంత చింతలమ్మ యను గ్రామదేవత
మందిరంబు చెంత మహినియున్న
పుట్ట లోన చెయ్యి పెట్టెనాతం డంత
సర్ప కాటు తోడ చచ్చు టకును 

అంత టమ్మవారు యద్భుత మహిమతో
కరుణ తోడ నతని గావ నెంచి
బాలు నెదుట తాను ప్రత్యక్ష మయ్యును
పరమ వత్స లతతొ బలికె నిట్లు

"సాహసం బేల నీకిట్లు చచ్చుటకును
కలత చెందకు బాలక కలదు శుభము
తప్పకను నీదు మూడవతరము నందు
బాలుడుదయించు శ్రీహరి భావమందు "

కామెంట్‌లు లేవు: