8, అక్టోబర్ 2020, గురువారం

**అద్వైత వేదాంత పరిచయం**



2.1 వేదాలు :

  మొట్టమొదటి శాస్త్రాన్ని వేదాలు అంటారు. వేదాలే చాలా పెద్ద గ్రంధాలు. ఇరవయి వేల పైచిలుకు మంత్రాలున్నాయి వేదాల్లో. మనకి నాలుగు వేదాలున్నాయి.

1. ఋగ్వేదం 2. యజుర్వేదం 3. సామవేదం 4. అధర్వణవేదం

  ఋగ్వేదంలో ఋగ్‌మంత్రాలున్నాయి. అవి పద్యరూపంలో ఉన్నాయి. యజుర్వేదంలో యజుర్‌ మంత్రాలు గద్యరూపంలో ఉన్నాయి.సామవేదంలో సామ మంత్రాలు గీతరూపంలో ఉన్నాయి. భారతీయ సంగీతం సామవేదం నుంచి పుట్టింది. సామవేద పఠనాన్ని సామగానం అంటారు. అధర్వణ వేదాన్ని అధర్వ ఋషి, అంగీరస ఋషి దర్శించారు. అందుకని దీన్ని అధర్వణవేదం అని కూడా అంటారు.

వేదాలకి మాత్రమే మంత్రం అన్న పదం వాడతాము. మననాత్‌ త్రాయతే ఇతి మంత్ర:. మననం అంటే విశ్లేషణ. త్రాయతే అంటే విశ్లేషిస్తే అది రక్షిస్తుంది.మన సాంప్రదాయంలో కేవలం మంత్రాలని పఠించినా కూడా అది మనని రక్షిస్తుంది. వేదాలంటే జ్ఞానానికి మూలం. ‘విద్‌’ అనే ధాతువు నుంచి వచ్చింది వేదం. వేదం అంటే విజ్ఞాన ఖని.

వేదన సాధనత్వాత్‌ వేద:

ప్రమాణత్వాత్‌ వేద: 

  వేదాల రచయిత ఎవరు? వేదాలు అపౌరుషేయం. అంటే పురుషుడు (మనిషి) ఎవరూ రాయలేదు. అవి దేవుడే యిచ్చాడు. అంటే మనం రచయితతో మాట్లాడాలంటే దేవుడితో మాట్లాడాలి. దేవుడు మనిషికి ప్రత్యక్షంగా ఇవ్వలేదు. ఒక మాధ్యమం ద్వారా యిచ్చాడు.అది ఋషయ:(ఋషులు). దేవుడ్ని వార్తాప్రసారకేంద్రంగా తీసుకుంటే ఋషులని అది అందుకునే దూరదర్శన్‌గా తీసుకోవచ్చు.ఋషి పదం ఋష్‌ ` తెలుసుకోవటం నుంచి వచ్చింది. ఋషతి జానాతి ఇతి ఋషి:, సాధారణమైన మనసు అందుకోలేదు ఆ తరంగాలని. దూరదర్శన్‌ని ఏ ఛానెల్‌కి ట్యూన్‌ చేస్తే ఆఛానెల్‌వస్తుంది. అలాగే దేవుడు వేదబోధని సృష్టితోపాటు యిచ్చాడు. కాని ఋషులు మాత్రమే అది అందుకునే ప్రత్యేక స్థాయిలో ఉన్నారు.వాళ్ళకున్న పరమసత్వగుణం, విశేష ఉపాధులే దానికి కారణం.అలా ఎందరో ఋషులు మంత్రాలని అందుకున్నారు. మనం వేదమంత్రాన్ని పఠించేటప్పుడు, ఆ ఋషిని కృతజ్ఞతాపూర్వకంగా తలుస్తాము. రోజూ చేసే సంధ్యావందనంలో కూడా మూడు తలుస్తాము.

  సవిత్రయ ఋషి: విశ్వామిత్ర: (తలని ముట్టుకుంటాం ఋషిని తలుచుకుంటూ)

  నిచృద్‌ గాయత్రీ ఛంద: (నోటిని ముట్టుకుంటాం ఛందస్సుని తలుచుకుంటూ)

  సవిత దేవత: (మంత్రంలో వచ్చిన దేవిని తలుచుకుంటూ)

అంటే ఋషి, ఛంద:, దేవతా స్మరణం` మూడు తప్పనిసరిగా చేయాలి.

ఏదైనా వేదమంత్రం పఠించేముందు ఈ ఋషి ఈ మంత్రాన్ని అందుకున్నాడని అర్థం. అందుకే ఋషులని మంత్ర ద్రష్ట: అంటారు. ఋషులు మంత్రాన్ని అందుకున్నవాళ్ళు,వాళ్ళు రచించలేదు లేదా సృష్టించలేదు. వాటిని సృష్టించింది సృష్టికర్త పరమాత్మే.

    ‘యో బ్రహ్మాణం విదధాతి పూర్వం

    యో వై వేదాంశ్చ ప్రహిణోతి తస్మై.’

ఈ వేదాలు శబ్దరూపంలోనే అందుకోబడ్డాయి. అవి లిఖితపూర్వకంగా లేవు. అందుకే శిష్యులు విని నేర్చుకోవాలే తప్ప, రాసేది లేదు. అవి కర్ణపరంపరగా వచ్చాయి కాబట్టి వాటిని శృతి అని కూడా అంటారు.

    గురుసాక్షాత్‌ శ్రూయతే ఇతి శృతి:।

    గురు ఉపదేశేన శ్రూయతే ఇతి శృతి:॥

వినటం ద్వారా అందుకున్నది. దీన్ని వేదం అని, మంత్రం అనీ, శృతి అనీ అంటారు. అపౌరుషేయ ప్రమాణం అని కూడా అంటారు. అపౌరుషేయ అంటే మనిషి రచించని ప్రమాణం అంటే జ్ఞానం పొందే మార్గం. మన తక్కిన గ్రంధాలన్నీ వేదప్రమాణం మీదే ఆధారపడి ఉన్నాయి కాబట్టి మన సాంప్రదాయాన్ని వైదిక సాంప్రదాయం అనీ, మనని వైదికులనీ అంటారు. హిందువులం అన్న మాట తర్వాతెప్పుడో వచ్చింది.

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: