8, అక్టోబర్ 2020, గురువారం

రామానుజాచార్య

 




రామానుజాచార్య : వెయ్యేళ్ల కిందటే భవిష్యత్ భారతావనికి దారిచూపిన ఆధ్యాత్మిక సుగంధం 

భారతీయ తత్త్వ చింతననూ, ఆధ్యాత్మిక జీవన విధానాన్నీ విశేషంగా ప్రభావితం చేసిన త్రిమతాచార్యులలో భగవద్రామానుజులు ద్వితీయుడు. విశిష్టాద్వైత సంప్రదాయాన్ని అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రచారంలోకి తీసుకురావడమే కాదు.. ఆర్తి, ఆసక్తి కలిగిన వారందరూ మంత్రాలకూ, మంత్రార్దాలకూ అర్హులేనని ఉపదేశం చేశారు. భగవన్నామాన్ని ఉచ్చరించడానికి వివక్షకు తావులేదని, ఎలాంటి ఆంక్షలూ, ఆటంకాలూ లేవనీ, పంచములూ ఆలయ ప్రవేశార్హులనీ గుర్తించి ఆదరించారు. వారికి మంత్రోపదేశం గావించి, ఆలయ ప్రవేశాలను కల్పించడం ద్వారా ఆధ్యాత్మిక సామ్యవాదాన్ని ఆచరణ పూర్వకంగా చూపారు.


శ్రీ రామానుజుల దృక్పథం, వారి కాలానికి మాత్రమే పరిమితం కాదు.. సమాజం ఆర్ధిక సామాజిక రాజకీయ, మతపరమైన ఉద్రిక్తతల మధ్య, అస్థిరత్వంతో, అపనమ్మకంతో కొట్టుమిట్టాడుతున్న ప్రతి కాలం లోనూ, శ్రీమద్రామానుజుల జీవితం, తాత్త్విక చింతన, ఆచరణ యోగ్యం. ఆధ్యాత్మిక స్థిరత్వం సాధించటానికి ఆ బోధనలు ప్రయోజనాత్మకమైన దిశా నిర్దేశం చేస్తాయి.


రామానుజులు క్రీస్తు శకం 1017 సంవత్సరంలో చెన్నై పట్టణానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీపెరంబుదూరు (భూతపురి)లో జన్మించారు. శాలివాహన శకం ప్రకారం 930 సంవత్సరం అవుతుంది. పింగళ నామ సంవత్సరం, చైత్ర మాసం.. శుక్లపక్షం పంచమి తిథి, బృహస్పతి వారం, ఆరుద్ర నక్షత్రం, కర్కాటక లగ్నంలో రామానుజులు జన్మించారు. దాదాపు 123 ఏళ్లు జీవించిన రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రచారానికి విశేష కృషి చేశారు.


రామానుజులు అనగానే మనకు వైష్ణవులు గుర్తుకు వస్తారు.. వెయ్యేళ్ల కిందట ఆదిశంకరుల జయంతికి ఒక్క రోజు తరువాత జన్మించిన ఆయన శంకరుల అద్వైతాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లేందుకు అవతరించారు. అంతే కాదు, అద్వైతం అంతా ఒక్కటేనని చెబితే … రామానుజులు ఆ ఒక్కటీ శ్రీమహావిష్ణువే అని నొక్కి చెప్పారు. అందుకే, ఆయన వాదాన్ని విశిష్టాద్వైతం అంటారు.


తమ కాలంలో ప్రబలిపోయిన ఆచారకాండని ఖండించేందుకు ఆది శంకరులు వేదాంత ఆధారంగా అద్వైతం ప్రచారం చేశారు. కానీ, రామానుజుల కాలం నాటికి బౌద్ధ, జైన మతాల నుంచి హిందూ మతం ఒత్తిడి ఎదుర్కొంది. అంతే కాదు, ఇస్లాం, క్రైస్తవ మతాలు కూడా దేశంలోకి రాబోతున్నాయి. అటువంటి సమయంలో రామానుజులు నిరాకార పరబ్రహ్మాన్ని ఉపాసించే అద్వైతం బదులు మూర్తి రూపంలో విష్ణువును పూజించే విశిష్టాద్వైతం ముందుకు తెచ్చారు.


రామానుజాచార్యులు పుట్టుకతో తమిళ బ్రాహ్మణుడైనా మనుషులందరూ సమానమని నమ్మిన ఆదర్శవాది. ఆ కాలంలో నారాయణ అష్టాక్షరి మంత్రం కూడా పరమ రహస్యంగా వుండేది. కొందరికే పరిమితమైన అష్టాక్షరీ ముక్తి మంత్రాన్ని తిరుకొట్టియూర్ ఆలయం గోపురం పైకి ఎక్కి అందరికీ వినిపించారు. ఈ మంత్రం బహిరంగంగా ప్రకటిస్తే నరకానికి వెళ్తారనే వాదనలను తోసి పుచ్చి.. తాను నరకానికి వెళ్లినా పర్వాలేదు, ఈ మంత్రోపదేశం పొందిన వారికి ముక్తి లభిస్తే చాలని ఆయన భావించారు. ఇలా సమ భావన, సహజీవన, సమతా భావాలను ఆనాడే ఆయన ప్రతిపాదించారు.


హిందూ మతంలో ఎన్నో గొప్ప సంస్కరణలకు ఆద్యుడయ్యారు. ఆర్య సమాజం స్థాపించిన దయానంద్ సరస్వతి రామానుజుల తరహాలోనే గాయత్రీ మంత్రాన్ని అన్ని కులాలు, మతాల వారికి ఉపదేశించారు. ఇదే తరువాతి కాలంలో ఎందరో అవతార పురుషులు నమ్మి ఆచరించిన భక్తి ఉద్యమానికి మూలమైంది. భారతీయ సమాజంలో విషంలా పాకిన కులాల సంస్కృతికి వ్యతిరేకంగా భక్తి ఉద్యమం పని చేసింది. స్వతంత్ర పోరాటానికి కూడా అది మేలు చేసింది. అలా వెయ్యేళ్ల కిందటే రామానుజులు భవిష్యత్ భారతావనికి కావాల్సిన ప్రబోధాల్ని సమాజానికి అందించారు.


ఉత్తరాదిన ఆర్యావర్తంలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు లాంటి అవతార పురుషులు జన్మించి ధర్మ రక్షణ చేశారని పురాణాలు చెబుతున్నాయి. అదే ధర్మ రక్షణ దక్షిణాదిలో ఆదిశంకరులు, రామానుజులు, మధ్వాచార్యులు జ్ఞాన మార్గంలో చేశారు. రాముడు, కృష్ణుడు రాక్షస సంహారం చేస్తే ఆదిశంకర, రామానుజ, మధ్వాచార్యులు రాక్షస ప్రవవృత్తుల్నీ, రాక్షస ఆచారాల్ని అంతం చేశారు. ఈ కోవలో హిందూ మతానికి పటిష్టమైన ఆలయ వ్యవస్థని అందించిన భగవద్ రామానుజులు ప్రాతః స్మరణీయులు!


ఆయన చేసిన కృషి వల్లే ప్రపంచ ప్రఖ్యాత తిరుమల శ్రీవారి ఆలయంతో సహా ఎన్నో నేటికీ దేదీప్యమానంగా వెలుగుతున్నాయి. ఆ మహాత్ముడు ఏర్పాటు చేసిన నియమాలే ఆయా ఆలయాల్ని ఎన్ని విదేశీ దండయాత్రలు జరిగినా చెక్కుచెదరకుండా కాపాడాయి. అందుకే, వెయ్యేళ్లైనా ఆ మహాభాగవతుడి ప్రభావం చెక్కుచెదరటం లేదు!


🙏🕉🙏🕉🙏🕉🙏🕉🙏

కామెంట్‌లు లేవు: