8, అక్టోబర్ 2020, గురువారం

*సౌందర్య లహరి**

 **దశిక రాము**


**సౌందర్య లహరి**


**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి భాష్యం**


తొమ్మిది, పది శ్లోకాల ఉపోద్ఘాతం - మొదటి భాగం


(షట్చక్రముల ప్రస్తావన ఉన్న శ్లోకాలు రాబోతున్నందున దానికి ఉపోద్ఘాతంగా మహాస్వామి వారి ఉపదేశమిది)


ఈ రోజుల్లో చాలామంది కుండలినీ యోగ దీక్షనిస్తామని శిక్షణాశిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. పుచ్చుకొనేవారు ఎగబడుతున్నారు. తమకు కుండలినీ ప్రచోదన కలిగిందనీ, తాము మహాయోగులమనీ తమకుతామే ప్రచారం చేసుకొనేవారూ ఉన్నారు. ఉదయ సూర్యుని అరుణ ప్రకాశంతో మిలమిలలాడిపోయే ఆ తల్లి వీరందరికీ నిజంగా సంపూర్ణంగా ఆవిష్కృతమయి ఉంటే మాటలకందని మహదానంద స్థితిలో ఉండిపోయేవారు. మనందరిలోనూ శివశక్తి నాలుగింట మూడువంతులు నిద్రాణమై ఉంటే ఈ యోగులమని చెప్పుకొనే వారి విషయంలో మనకంటే కొంచెం మేరకు జాగృతమై ఉండి ఉండవచ్చు. కుండలిని కదిలితేనే నడినెత్తిన ప్రకంపనలు, భ్రూమధ్యంలో ఏకాగ్రత వంటివి సిద్ధిస్తాయి. అయితే దానికి కుండలిని తన గమ్యం చేరిందని అర్థంకాదు. తీవ్ర యోగాచరణ వలన కుండలిని తన స్వస్థానం నుండి స్వల్పంగా పైకి లేచి మళ్ళీ యథాస్థానం లోనికి ప్రవేశిస్తుంది.


ప్రతి అణువులోనూ అనంతమయిన శక్తి నిక్షిప్తమయి ఉండి తగినె పద్ధతిలో విస్ఫోటనం జరిపినపుడు అనంతమైన శక్తిని విడుదల చేస్తుందనీ, దానిని సక్రమమైన పద్దతిలో ఉపయోగించి మానవ కల్యాణానికి ఉపయోగించుకోవచ్చనీ, దారిమళ్ళిస్తే ప్రపంచ నాశనానికి కారణమవుతుందనీ అణుశస్త్రం చెబుతోంది కదా! అలాగే ప్రతి వ్యక్తిలోనూ అనంతమైన పరబ్రహ్మ శక్తి కుండలినీ రూపంగా నిక్షిప్తమైయున్నది. మనవంటి సాధారణ మానవులలో ఆ శక్తి నిద్రాణమై ఉంటుంది. మనం కష్టతమమైన యోగసాధన చేస్తే – ఆ శక్తి కొన్ని చక్రముల ద్వారా పైకి వెళుతూ చివరకు పరాశక్తిగా జాగృతమవుతుంది. అటువంటి జాగృతమయిన పరాశక్తి పరబ్రహ్మలో లీనమయిపోతుంది. కుండలినీ శక్తి ఒక్కొక్క చక్రమును దాటినపుడు సాధకునికి కొన్ని సిద్ధులు కలుగుతాయి. ఆ సిద్ధుల వ్యామోహంలో తనకు అత్యంతికమైన ఫలం సిద్ధించిందనే అపోహతో సాధన ఆపివేయరాదు. ఇదీ కుండలినీ యోగసారం. మనం ఇంతమాత్రం ఎఱిగి ఉంటే చాలు. అది కూడా ఎందుకంటే – ఈ దేశంలో పుట్టిన తరువాత మన పరంపరాగతమైన మహచ్ఛాస్త్రములు గురించి ప్రాధమికమైన అవగాహన ఉండాలనే! కుండలిని సరియైన పథం నుండి మరలినపుడు ఫలితాలు ప్రమాద భరితంగా ఉంటాయి. మతిస్తిమితం కూడా తప్పవచ్చు. సాధకులు ఈ విషయం అత్యంత జాగరూకతతో గుర్తించాలి.


ఈ ప్రపంచంలో మాయ అనేకరకాలు. ఆ మాయ నుండి బయటపడడానికి అనేక పద్ధతులు. కుండలినీ యోగపు తుదిగమ్యం అన్నిరకములైన మాయలను అధిగమించి పరమాత్మలో లీనమవడమనేది నిస్సందేహమైన విషయం. అయితే ఆ త్రోవలో అంబిక విరాట్ శ్శక్తిని సందర్శించవచ్చు. సాధకునికి కూడా శక్తులు సిద్ధిస్తాయి. అయితే ఈ యోగంలో అంబిక ఎంతో మాయను మేళవించింది. సాధకుడు అత్యంత సులభంగా ఆ మాయలో పడిపోవచ్చు. ఆమె ఎందుకలా చేసిందో మనమెలా చెప్పగలం ? ఒక పంట ఊరికే నేలపై విత్తులు జల్లినంతనే మొలచి పంటకొస్తుంది. కొన్ని పంటలు సరియైన నేల, వాతావరణము వెతికి అటువంటి పరిస్థితులలోనే పండించాల్సి ఉంటుంది. ఎందుకంటే, అది అంబిక లీల. ఆమె కుండలినీ యోగాన్ని అత్యంత కష్టసాధ్యమైన యోగంగా నిర్దేశించింది.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

సేకరణ

కామెంట్‌లు లేవు: