16, సెప్టెంబర్ 2020, బుధవారం

రామాయణమ్...63..64

రాముడొచ్చాడని తనకు తెలిపిన సుమంత్రునితో రాణులకు కూడా కబురుచేయించాడు దశరథుడు ! .
.
దశరథుడి రాణులందరూ కౌసల్యతో కలిసి వచ్చారు .
.
దశరథుడి భవన ప్రాంగణం మూడువందల యాభయిమంది రాణులతో ,ఆయన మంత్రులతో కిక్కిరిసి ఉన్నది.రాణులందరూ వచ్చిన తరువాత రాముని ప్రవేశపెట్టమన్నాడు దశరథుడు.
.
రాముడు అల్లంతదూరంనుండే తండ్రికి నమస్కారం చేసుకుంటూ వస్తున్నాడు. కొడుకును చూడగనే ఆపుకుంటున్న దుఃఖం ఒక్కసారిగా కట్టలు తెగింది . ఎదురువెళుతూ వెళుతూ దుఃఖభారంతో కూలబడిపోతున్నాడు ,లేవలేక పోతున్నాడు.
.
చప్పున వచ్చి ఆయన పడకుండా చెరోవైపు పట్టుకున్నారు రామలక్ష్మణులు.
.
మూర్ఛపోయిన తండ్రికి పరిచర్యలు చేశారిరువురూ ! తేరుకున్నపిదప దశరథుడు ,రామా నన్ను చంపివేసి అయినా సరే నీ రాజ్యము నీవు దక్కించుకో నాయనా ! అంటూ ఏడ్వసాగాడు ..
.
ఏమాత్రము మనో వైకల్యము లేని రాముడు ! తండ్రీ ! పదునాలుగేండ్లు ఎంతసేపు ! మరల తిరిగివచ్చి నీ పదములపైవ్రాలనా ! నీవు చక్రవర్తివి !ఇలా బేలకావలదు !
లోకం నిన్ను అసత్యవాది అని అనటం నేను భరించలేను తండ్రీ! .
.
నీవిచ్చిన మాటను చెల్లించటం నా కర్తవ్యము కాదా ! అసలు అదే నా కర్తవ్యము ! నా ధర్మము! ..
.
రాముడి మాటలకు దశరథుడు మారుమాటాడలేక నాయనా పోనీ ఈ ఒక్కరాత్రి ఉండిపోరా ! నీకిష్టమయినవన్నీ అనుభవించి వెళ్ళరా తండ్రీ అని దీనంగా బ్రతిమిలాడాడు. ! .కైకను దూషించాడు.
.
లోపల ఇంత విషము దాచుకొన్న ఈ స్త్రీ నేడు దానిని బయల్పరచినది .నివురుగప్పిన నిప్పు అని నా కిన్నినాళ్ళు తెలవలేదురా రామా!
.
తండ్రీ ఈ రోజు నీవిచ్చే ఈ భోగాలనుభవిస్తాను ,కానీ రేపటినుండీఎవరిస్తారు?.
.
 కోరికలన్నింటినీ విడిచి ఇప్పుడే అడవికి బయలుదేరతాను అనుమతించండి అని దోసిలి ఒగ్గి నిలుచున్న కొడుకును గాఢంగా కౌగలించుకొని మరల మూర్ఛితుడయ్యాడు దశరథుడు.
.
ఈ వ్యధలకు కారణమైన కైకను చూసి పట్టరాని కోపమొచ్చింది సారధి సుమంత్రునకు.
.
కైకమ్మా ! ఏ ఆడుదీ చేయకూడని పనిచేశావు ,నీ భర్తను క్షోభపెడుతున్నావు .అంతటి దశరధమహారాజుకు ఇంతటి వేదనరగిలించావు ! నీవు కులఘ్నివి! రాముడులేని ఈ రాజ్యములో మేమెవరమూ నివసింపము, ఆయనతోటే వెళ్లిపోతాము .నీవే ఎవరూలేని మరుభూములను తలపించే అయోధ్యను నీ కొడుకుతో కలిసి ఏలుకో !
.
భూమి ఎందుకు బ్రద్దలుకాలేదో నాకు అర్ధం కావడంలేదు ! లోకమంతా నిన్ను ఛీత్కరిస్తున్నది !
.
అయినా ,ఆడపిల్లకు తల్లిబుద్ధులు వస్తాయంటారు .ఆ తల్లికడుపున పుట్టిన నీకు ఇంతకన్నా మంచి బుద్ధి ఎలా వస్తుందిలే!..
.
.వేప చెట్టునుండి మధురమైనతేనె వస్తుందా?
.
నీ తల్లిగూర్చి చెపుతాను విను అంటూ సుమంత్రుడు పలికాడు.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

రామాయణమ్.64
...
నా అహంకారము నాదే ! కట్టుకున్నవాడు కాటికిపోయినా ఫరవాలేదు.......ఇది నీ తల్లి బుద్ధి ! నీకూ అదే సంక్రమించినది.
.
ఒక మహాపురుషుడు నీ తండ్రికి ఒక వరమిచ్చాడు. ఆ వర ప్రభావమువల్ల నీ తండ్రి సకలప్రాణుల సంభాషణ అర్ధం చేసుకోగలడు. వరమిచ్చిన మహానుభావుడే ఇంకొక విషయము కూడా చెప్పాడు .తను విన్న సంభాషణ ఎవరికైనాసరే తెలియచేస్తే తనకు మరణం కలుగుతుంది ,సంభాషణ వినటం వరకే అధికారం కానీ విన్నదానిని బయటపెట్టరాదన్నమాట.
.
నీ తల్లీ తండ్రి ఏకాంతంగా ఉన్న సమయమది.మంచము మీద ప్రాకుతున్న" జృంభ" అనే చీమ మాటలాడింది.దాని అర్ధము తెలుసుకొన్న నీ తండ్రికి నవ్వువచ్చి బిగ్గరగా నవ్వాడు ..
.
ఆ నవ్వు తనను గురించే పరిహసిస్తూ నవ్వాడనకొని నీ తల్లి ఆ పరిహాసాన్ని సహించలేక కారణమడిగింది.
.
నిన్ను చూసి కాదులే ! చీమ బలే తమాషాగా మాట్లాడింది అందుకు నవ్వు వచ్చింది ,అని అన్నాడు నీ తండ్రి.
.
చీమ మాట్లాడిన మాటలు తనకు చెప్పమంది మీ అమ్మ ! చెబితే తనకు ప్రాణగండమున్నదికావున నీ తండ్రి నిరాకరించాడు !
.
అప్పుడు నీ తల్లి పట్టినపట్టు వీడక ....నీవు బ్రతికి తే నాకేమిటి చస్తే నాకేమిటి ? ఆ సంభాషణ నాకు నీవు చెప్పి తీరవలసిందే అని అహంకారపూరితంగా మాట్లాడింది..
.
నీ తల్లి మంకుపట్టు మానలేదు. మీ నాన్నకు ఏమిచేయాలో తోచక తనకు వరమిచ్చిన మహానుభావుడి సలహా కోరాడు.
ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పవద్దు ఏమైనా కానీ అని మరల చెప్పాడు.
.
స్త్రీ కి భర్తక్షేమము కన్న ముఖ్యమైనదేదీ లేదు ,భర్తకన్నా తన అహంకారమే ముఖ్యమనుకొన్న స్త్రీ నీ తల్లి ! అట్టి నీ తల్లిని మూర్ఖపు ప్రవర్తన వల్ల నీ తండ్రి తిరస్కరించాడు.తిరస్కరించి తను క్షేమంగా ఉన్నాడు
.
మరల నీవిపుడు దానిని పునారావృతము గావించుచున్నావు !
.
దశరథ మహారాజు ఏ దోషములూ లేని ఉత్తముడు ! నీ కోరిక ఆయనను క్షోభపెడుతున్నది.అది ఆయన పాలిటి మృత్యుపాశము. ఆయన ఇచ్చిన మాట ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకొన్నది ఆ పాశములు నీవు విసరినవే !
వాటిని వెనుకకు తీసుకో !
.
రాముడు అన్నదమ్ములలో జ్యేష్ఠుడు ,ఉదారుడు!
ఎంతటి క్లిష్టతరమైన కార్యములనయినా నిర్వహింపగల సమర్ధుడు.
స్వధర్మాన్ని కాపాడుకొనేవాడు
ప్రాణులను అందరినీ రక్షించేవాడు
మహాబలశాలి!
అటువంటి రామునికి పట్టాభిషేకము జరిగేటట్లుగా చూడు!
అనవసరమైన అపవాదులు ,చెడ్డపేర్లు మోయకమ్మా ! అని పలికి సుమంత్రుడు మరల నమస్కరిస్తూ నిలబడ్డాడు.
.
ఇంత పలికినా సుంతకూడా మార్పురాలేదు కైక ముఖకవళికలలో !
.
జనులేమనుకొన్న నాకేమి? నా పంతమే నాదిగానీ ! అన్నట్లుగా నిశ్చలంగా బెల్లంకొట్టిన రాయిలాగ నిలబడి ఉన్నది.
.
దశరథుడది చూసి దీర్ఘంగా నిశ్వసిస్తూ ,సుమంత్రా ! రాముని వెంట సకలసంభారాలు పంపించు,చతురంగబలాలు అతనిని అనుసరించనీ ! కోశాగారము సమస్తమూ రాముని వెంటే!
గీత,నృత్త,వాద్య బృందాలన్నీ రాముని తోటే వెళ్ళాలి .
సకల భోగవస్తువులన్నీ నా రాముడి వెంటే ఉండాలి ,వనవాసము పదునాలుగేండ్లు విహారయాత్రకావాలి వెంటనే ఏర్పాట్లుగావించు అని ఆజ్ఞాపించాడు.
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

.

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

.

కామెంట్‌లు లేవు: