16, సెప్టెంబర్ 2020, బుధవారం

గీతా మకరందము

14-19-గీతా మకరందము
        గుణత్రయవిభాగయోగము

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.

అవతారిక - మోక్షమును బొందుటకు ఉపాయమును తెలియజేయుచున్నారు –

నాన్యం గుణేభ్యః కర్తారం
యదా ద్రష్టాఽనుపశ్యతి |
గుణేభ్యశ్చ పరం వేత్తి
మద్భావం సోఽధిగచ్చతి ||

తాత్పర్యము:- ఎప్పుడు వివేకవంతుడు (సత్త్వాది) గుణములకంటె నితరమును కర్తగా నెంచడో మఱియు తనను గుణములకంటె వేఱగువానినిగ దెలిసికొనుచున్నాడో, అపుడాతడు నాస్వరూపమును (మోక్షమును) బొందుచున్నాడు.

వ్యాఖ్య:- ఈశ్లోకము, రాబోవు శ్లోకము చాలముఖ్యములైనవి. విచారణాపరులగు సాధకులు ఈ భావములను, మఱల మఱల జ్ఞాపకమునకు తెచ్చుకొనవలెను. ఏలయనిన సంసారబంధవిముక్తికి, పరమాత్మస్వరూపప్రాప్తికి (మోక్షమునకు) రాజబాట యిచట తెలుపబడినది. జీవుడుచేయు సమస్తకర్మములకు త్రిగుణములే కర్త. అనగా త్రిగుణాత్మకమగు మనస్సే కర్త. ఆ త్రిగుణములే, ఆ మనస్సే దేహేంద్రియాదులచే కర్మలను చేయించుచున్నది. బంధమునొందునది ఆ మనస్సే; మోక్షమునొందునదియు అదియే. కర్త, భోక్త దానికంటె వేఱుగ నెవడునులేడు. ఆత్మమాత్రము సాక్షిగ వర్తించుచున్నది.
        కావున వివేకముచే జీవుడు తాను వాస్తవముగ గుణములకంటె వేఱుగానున్నాడనియు, గుణములకు, దేహేంద్రియాదులకు సాక్షియగు ఆత్మయే తాననియు, కావున ఆ యా కర్మలకు తాను కర్తకాదనియు ఎపుడు తెలిసికొనునో, అపుడే యాతడు ద్రష్టగ, దృగ్రూపుడుగ శేషించి పరమాత్మరూపమునే పొందుచున్నాడని యిట వచింపబడినది. కనుకనే ముందు ‘ద్రష్ట’ కావలెనని ఉద్భోధించుటకు కారణము. ‘ఓ జీవుడా! నీవు దృశ్యరూపములగు త్రిగుణములతో, మనస్సుతో, దేహేంద్రియములతో ఐక్యముకాకుము. వానికి సాక్షియగు ద్రష్టవు కమ్ము’ అని భగవానుడు కరుణతో బోధించుచున్నారు.
ఈ జగన్నాటకమందు మనస్సే, త్రిగుణములే కర్త. తాను నాటకమందు దీపము వలె వాని యన్ని క్రియలకు సాక్షియై వర్తించుచున్నాడు. తాను గుణములకు పరుడై వెలయుచున్నాడు. "సినిమా”యందు అధిష్ఠానమగు తెరగుడ్డవలె అన్నిటికిని ఆధారభూతుడై, సుఖదుఃఖములకు పరుడై, నిర్లేపముగా విలసిల్లుచున్నాడు. ఇదియే పరమసత్యము. ప్రపంచములోని సమస్తదుఃఖములకు కారణము ఈ గుణతాదాత్మ్యమే. అనగా జీవుడు గుణములతో, మనస్సుతో, దేహముతో నైక్యమై "నేను చేయుచున్నాను, నేను పుట్టుచున్నాను, నేను చచ్చుచున్నాను” ఇత్యాదిరూపమున కర్తృత్వము గలిగియుండుచున్నాడు. బంధమునకు కారణము ఈ కర్తృత్వమే అయియున్నది. దానిని వదలగొట్టిన మఱుక్షణమే జీవుడు భగవత్స్వరూపమును బొందుచున్నాడని శ్రీకృష్ణపరమాత్మ పలుకుచున్నారు.
     'మద్భావం సోఽధిగచ్ఛతి’ - అని తెలిపినందువలన, ఏ జీవుడు క్రియలన్నిటికిని గుణములే కర్తయనియు, తాను వాస్తవముగ ఆ గుణములకంటె వేఱుగనున్నాడనియు తెలిసికొనునో అతడు ఎవడైనను ఏ జాతికి జెందినప్పటికిని, స్త్రీయైనను, పురుషుడైనను ఆ క్షణముననే భగవానుని స్వరూపమును తప్పక బొందగలడని స్పష్టమగుచున్నది. కావున జీవుడు శివు డగుటకు, నరుడు నారాయణునిస్థితిని జెందుటకు, జనుడు జనార్దను డగుటకు ఇది చక్కటి ఉపాయము. మోక్షమున కిదియే చక్కని బాట; ఇక జీవుడు తాను అల్పుడని, దుర్బలుడని తలంపక తాను వాస్తవముగ నిరంజనుడని, మనస్సాక్షియని, గుణాతీతుడని, సాక్షాత్ భగవత్స్వరూపుడేయని నిశ్చయించి, ధైర్యోపేతుడై అట్టి వివేకమును బడయుటకు యత్నముగావింపవలెను.
    అధిగచ్ఛతి -- అను పదముచే బ్రహ్మైక్యమును అట్టివాడు తప్పక పొందగలడని భగవానుడు నొక్కిచెప్పినట్లైనది. కావున ముముక్షువులు భగవద్వాక్యమునందు విశ్వాసము గలిగి, పిరికితనమును పారద్రోలి, త్రిగుణములను తెగద్రుంచి గుణాతీత పరమాత్మరూపులై వెలయవలెను.
       ‘పశ్యతి' అని చెప్పక "అనుపశ్యతి” - అని చెప్పుటవలన - 'తాను కర్తకాద’ను ఈ భావమును మఱల మఱల చింతన జేసి దృఢపఱచుకొనవలెనని భావము.
అయితే భగవానుడు తెలిపిన ఈ సత్యములను బహుజాగ్రతగ అర్థము చేసికొనవలసియుండును. ఏలయనిన కొందఱు అవివేకులు "ఇంద్రియములు ఏమిచేసినను, ఏమి అనుభవించినను నాకేమియు సంబంధములేదు" అను ఈ వాక్యమును విపరీతముగ అర్థముచేసికొని ఇంద్రియములచే నిషిద్ధకార్యములకు గడంగి దుఃఖరూప సంసార అఖాతములో పడిపోవుచున్నారు. అట్టి శుష్కవేదాంతులవచనముల నెవరును విశ్వసింపరాదు. తమోగుణ, రజోగుణములను దాటినవాడు, లేక తనను, వానికంటె వేఱుగ దలంచువాడు మఱల తద్గుణసంబంధములైన నీచకార్యములం దెన్నటికిని ప్రవృత్తుడుకాడని ముమ్మాటికిని ఎఱుగవలెను.

ప్రశ్న:- తానుచేయు సమస్తకార్యములకు వాస్తవముగ కర్తయెవరు?
ఉత్తరము: - త్రిగుణములు ( త్రిగుణాత్మకమగు మనస్సు).
ప్రశ్న:- మనుజుడు తాను వాస్తవముగ నెట్టివాడు?
ఉత్తరము:- అకర్త, సర్వసాక్షి, నిర్గుణుడు.
ప్రశ్న:- ఈ ప్రకారమెఱిగినందువలన కలుగు ఫలితమేమి?
ఉత్తరము:- ఎపుడు జీవుడు తాను గుణములకంటె వేఱని, అకర్తయని యెఱుగునో, ఆ క్షణముననే యతడు భగవత్స్వరూపమును (మద్భావమ్) లెస్సగ బడయుచున్నాడు; ముక్తినొందుచున్నాడు.
ప్రశ్న:- దీనిని బట్టి మోక్షమునకు, భగవదైక్యమునకు ఉపాయమేమియని తేలుచున్నది?
ఉత్తరము:- 'త్రిగుణములే కర్త, తాను అకర్త’ యని భావించి, జీవుడు గుణములకంటె వేఱుగ తనను ఎఱుగుటయే మోక్షోపాయము.

కామెంట్‌లు లేవు: