16, సెప్టెంబర్ 2020, బుధవారం

*ఓం పూర్ణమదః*

*ఓం పూర్ణమదః* *పూర్ణిమదం పూర్ణాత్* *పూర్ణముదచ్యతే*
*పూర్ణస్య పూర్ణమాదాయ* *పూర్ణమేవావ శిష్యతే*
*ఓం శాంతిః శాంతిః శాంతిః*

దేవుడు పరిపూర్ణుడు. ఇది (ఈ ప్రపంచం) పరిపూర్ణమైనది. పరిపూర్ణమైన భగవంతుడి నుండే పరిపూర్ణమైన ప్రపంచం పుట్టింది. పరిపూర్ణం నుండి పరిపూర్ణాన్ని తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణతే మిగిలి ఉంది.

వివరణ: పరిపూర్ణం నుండి పరిపూర్ణం ఎలాపుడుతుంది? తీసివేసిన తర్వాత కూడా పరిపూర్ణమే ఎలా మిగులుతుంది? అనే అనుమానాలు మనకు వస్తాయి. కొన్ని ఉదాహరణల ద్వారా దీనిని చూడవచ్చు. ఒక దీపం నుండి ఎన్ని దీపాలను వెలిగించినా మొదటి దీపము అలాగే మిగతా దీపాలు కూడా సంపూర్ణప్రకాశమే కలిగి ఉంటాయి. అలానే విద్యాదానం విషయం కూడా చెప్పుకోవచ్చు. ఇలానే భగవంతుని పరిపూర్ణతకు కూడా తీసివేయడం వలనో లేక ఇవ్వడం వలనో లోపం కలుగదు.

ఈ మంత్ర సారాంశం ఏమిటంటే దేవుడి నుండి ఉద్భవించడం వలన ఈ ప్రపంచం కూడా భగవంతుని అంశ లేక భగవంతునిచే నిండి ఉన్నదని.

వేదమంత్రాలన్నీ ఓం శాంతిః అంటూ ముగుస్తాయి. మూడు సార్లు శాంతి అని ఎందుకు ముగుస్తాయంటే నిత్యజీవితములోని మూడు ఆటంకాల నుండి బయటపడుటకు. ఆ మూడు ఏమంటే

1.ఆద్యాత్మికం: శారీరక, మానసిక అనారోగ్యాలు మొదలగునవి

 2.ఆదిభౌతికం: ఇతర జీవరాసులవలన, ఇతర మానవులవలన కలుగు బాధలు

 3.ఆధిదైవికం: ప్రకృతి వలన అంటే వరదలు, భూకంపాలు, పిడుగులు, అగ్ని ప్రమాదాలు మొదలగునవి.

ఈ మూడు రకాలైన బాధల నుండి తప్పించుకోవడానికి మూడు సార్లు శాంతి అని పలుకుతాము.

ఇదే శ్రుతి వాక్యం. ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకుంటే.....
జీవితమంతా ఇందులోనే దాగుంది. మోక్ష మార్గం ఇందులోనే దాగుంది.....
సమస్త సాధనాల సారం ఇందులోనే ఉంది.

0 + 0 = 0....
0 ౼ 0 = 0....

కానీ.....
0+1 = ఎంత అంటే.....
మనం వెంటనే 1 అని సమాధానం ఇస్తాం.....
ఇక్కడ సున్నా ...
ఒకటితో కలవగానే అది 1 గా మారిపోయింది.

0+2 =2.....
సున్నా 2 తో కలవగానే సున్న మాయమై.....
అది రెండుగా మారిపోయింది. అంటే.....
సున్న దేనితో కలిస్తే అదిగా మారిపోతూంది.

గాఢ నిద్రలో మనం పూర్ణమైన భగవంతుడిగా ఉంటాం. మనకప్పుడు ఏ భావోద్వేగాలు ఉండవు. ఎప్పుడైతే సున్నలాంటి మనం నిద్రలేవగానే ప్రకృతితో కలుస్తామో.....
మనం ప్రకృతే ఐపోతున్నాం.

మనం దేనితో కలుస్తామో.....
దానిగా మారిపోతున్నాం.....

బాగా గమనించు....
నీ ఎదురుగా ఒక వ్యక్తి ఉన్నాడు.....
అతడు గతంలో నీకు ఎంతగానో సహాయం చేసాడు....
ఆ వ్యక్తి ని చూడగానే.....
నీలో అతనిపట్ల ఆత్మీయత కలుగుతుంది. నువ్వూ అతనికి ఎలాగైనా సహాయం చెయ్యాలని ఆలోచిస్తావు.

ఒక వ్యక్తి నిన్ను ఎంతగానో బాధించాడు.....
అతను కనబడగానే నువ్వు కూడా అతన్ని ఎలాగైనా బాధించాలని ఆలోచిస్తావ్....

ఎదుటి వ్యక్తి ప్రేమతో వస్తే.....
నీకూ అతనిపట్ల ప్రేమ కలుగుతోంది.....

ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవిస్తే .....
నీకూ అతనిపట్ల గౌరవం కలుగుతుంది.....

అంటే.....
మనం ఎదుటి వ్యక్తిలోని ఏ గుణాన్నాయితే గమనిస్తున్నామో.....
మనం మనకు తెలీకుండానే ఆ గుణంతో కలిసిపోయి.....
ఆ గుణంగానే మారిపోతున్నాం.....

"మనం దేనితో కలుస్తున్నామో... అది గా మారిపోతున్నాం."

మనలో సున్న(0) లా ఉన్న పరమాత్మ తత్వం.....
ఎదుటి వ్యక్తీలోని కోపం తో కలవాగానే అది కోపంగా మారిపోయి మనకు కోపం వస్తుంది.

నువ్వు ప్రేమతో కలిస్తే ప్రేమగా.....
ద్వేషం తో కలిస్తే ద్వేషంగా..... మారిపోతావ్.

ఎదుటివారిలోని అహంకారాన్ని చూస్తే నీలో కూడా అహంకారం మొలుస్తుంది.

అందుకే.....
ప్రతి జీవిలోనూ.....
మనిషిలోనూ.....
పరమాత్మ ఉన్నాడని గ్రహించి......
ఆయనతో అనుసంధానం అవ్వు.

అంటే నీలోని పూర్ణాన్ని.....
ఎదుటి వ్యక్తీలోని పూర్ణంతో కలుపు.....
వచ్చేది పూర్ణమే.

ఎదుటి మనిషిని చూడగానే అతనిలోని దోషాలను గుర్తిస్తే.....
మనం అతనిలో దేన్ని ముందుగా చూస్తామో.....
మనం అదిగా మారిపోతామన్న
మహా సత్యాన్ని గమనించాలి.

అందుకే ఎలాంటి వారిలోనైనా.....
భగవంతుణ్ణి చూడగల్గి.....
ఆయనతో కలిస్తే....
మనం కూడా భగవత్ తత్వంగా మారిపోతాము.

సదా ఈ సృష్టిలోని ప్రతి వస్తువులోనూ పరమాణు స్వరూపంతో ఉన్న భగవంతునితో అనుసంధానమవుతూ..... ఉండాలి.
అంటే మంచి చెడు తటస్థ లక్షణాలో, అన్ని గుణాలలో, అన్ని ఆలోచనలలో, అన్ని అనుభూతులలో, అన్నీ మనోభావాలలో, అన్ని అనారోగ్య లక్షణాలలో, అన్ని అరోగ్య లక్షణాలలో, పూర్ణాన్ని అనుభూతి చెందాలన్నమాట.
ఇక్కడ పూర్ణం లేదా భగవంతుడు అంటే నిరాకారం, వ్యాపకం, నిశ్చలం, నిర్గుణం, సచ్చిదానంద స్వరూపం, ప్రశాంతత, తృప్తి, బ్రహ్మానందం.


హరిః ఓం తత్ సత్.

సేకరణ

కామెంట్‌లు లేవు: