16, సెప్టెంబర్ 2020, బుధవారం

అద్దాల గది.

ప్రదీప్ తన గురువుగారి దగ్గరకు వెళ్ళాడు.
“గురువుగారూ ! నేను ఈ మధ్య ఒక విషయం గమనించానండీ ! నా దగ్గర పనిచేసే వాళ్ళూ, ఇంట్లో పిల్లలూ, భార్యా ఒక్కరేమిటి ఈ ప్రపంచంలో అందరూ స్వార్ధపరులైపోయారండీ ! ఒక్కరూ నిజాయతీగా ఉండడం లేదు” అన్నాడు.

గురువుగారు చిరునవ్వు నవ్వి ఒక కధ చెప్పారు .......

“ఒక చిన్న ఊరు ఉంది. ఆ ఊరిలో ఒక పెద్ద భవంతి ఉంది. అందులో ఒక గదిలో 1000 అద్దాలు ఉన్నాయి.
ఒక చిన్న పాప ఆ గదిలోకి వెళ్ళేది. ఆమెకు ఆ గదిలో తనలాగే ఉన్న అనేక మంది పిల్లలు కనబడ్డారు. వాళ్ళతో ఆడుకుంటూ తనను తాను మరిచిపోయేది. ఆమెకు అది ఒక ఆనందదాయకమైన నిత్యకృత్యం అయ్యింది.
ఆమె అనుకునేది ఈ ప్రపంచంలో ఆ గది అత్యంత ఆనందకరమైన ప్రదేశం అని.

ఆ గదికి ఒక రోజు ఇంకొక వ్యక్తి వెళ్ళాడు. అతడు చాలా విచారంగా, కోపంగా, డిప్రెషన్ తో ఉన్నాడు. అతడికి ఆ గదిలోకి వెళ్ళగానే అదే భావాలతో ఉన్న అనేక మంది కనబడ్డారు. వాళ్ళ ముఖాలు కోపంగా కనిపిస్తున్నాయి అతడికి.
అతడికి ఆ ప్రతిబింబాలను చూడగానే భయం వేసింది. చెయ్యి ఎత్తి కొట్టాలి అనుకున్నాడు. అప్రయత్నంగా చెయ్యి పైకి లేచింది. చుట్టూ 1000 చేతులు తన మీదకు లేచాయి. భయం వేసింది.
అతడు అనుకున్నాడు “ఈ ప్రపంచం లో అత్యంత భయంకరమైన ప్రదేశం ఇది” అని.

బాబూ ! ప్రదీప్ ! ఈ ప్రపంచం కూడా అలాగే అద్దాల గది.
నువ్వు ఈ ప్రపంచాన్ని
ఏ భావంతో చూస్తే అలాగే కనిపిస్తుంది.

నువ్వు నవ్వుతూ చూస్తే ప్రపంచం నీకు నవ్వునే చూపిస్తుంది.

నువ్వు ద్వేషంతో చూస్తే - నీకు ప్రపంచం ద్వేషాన్నే చూపిస్తుంది

నువ్వు ప్రేమను పంచు – ప్రపంచం నీకు ప్రేమను ఇస్తుంది.

*ఈ ప్రపంచం స్వర్గం - నువ్వు దేనిని ఇస్తావో అదే తిరిగి పొందుతావు*

💐🙏

కామెంట్‌లు లేవు: