16, సెప్టెంబర్ 2020, బుధవారం

పోలేలమ్మ వ్రతకధ

పోలేలమ్మ వ్రతకధ:- ఉజ్జయినీ మహంకాళి పట్టణమందు సోమయాజులు సోమిదేవమ్మ కలరు. ఆమెకు ఏడుగురు కుమారులు ఏడుగురు కోడండ్రు సిరిసంపత్తుతో తులతూగుచుండిరి. యేడుగురుకుమార్లు వేరుగా కాపురము చేయుచుండగా భాద్రపద మాసమందు కోడండ్రనందరిని పిలిపించి అమ్మాయి ఈ అమావాస్య పోలేలమ్మ ఆరోజున పోలేలమ్మ వ్రతము మీరందరు చెయ్యవలసిన దని ఆమె చెప్పగా కొడండ్రందరు ఈ వ్రతం ఏవిధంగా చేయ్యవలెను. మాకా సంగతి యావత్తు చెప్పవలసినదని కోరిరి.అమ్మాయి ఈ వ్రతము నేను చేసి మీ మగల ఏడుగురిని కంటిని ఈ ఐశ్వర్యము అందువల్లనే మనకు ప్రాప్తించినది కనుక ఆ దినమందు ఉదయమున లేచి ఇల్లు గడపలు పరిశుభ్ర ముగా చేసుకోని ముగ్గులు పెట్టుకొని స్నానము చేసికొని శుచిగా బియ్యమును నానబోసి పిండిదంపి కొబ్బరి కాయ ముక్కలు తరగి ఆరెద వండి కలగాయపులుసును అనగా ఏడు జాతుల ముక్కలు వేసి పులుసువండి ప్రదోషకాలమందు మహంకాళి కి పూజ గావించి ఏడుపుల్లగుమ్మడి ఆకుల లోని ఆరెద వుంచి భక్ష్యభోజ్యములు నివేదన చేసి కథ విని అక్షతలు వేసికొని ప్రసాదములు పుచ్చుకోవలెను. బహునిష్టగా నీవ్రతము విధిగా చెయ్య వలయునని చెప్పి పంపెను.. అమావాస్య నాటికి ఉదయమున సోమిదేవమ్మ ఏడుగురు కుమారుల ఇండ్లకును ఏడుమానికల బియ్యమును ఏడుకొబ్బరి కాయలును ఏడుసేర్ల బెల్లమును పంపించినది.. అత్తగారు నియమించిన ప్రకారము కోడండ్రులందరు మిక్కిలి శుచిగా ఈ వ్రతమును జరుగుచుండగా ఏడవకోడలు మాత్రము బియ్యము నానవేసి నానినవో లేదోయని కొంచెము నోటిలో వేసికొనెను.. అటుతరువాత పూజ వగైరాలు జరుపుకొనిరి.. తన పసిపిల్లలను తీసికొని కధవినవలెనని పిల్లవానిని తీసేసరికి చచ్చిపోయుండేను.. అంత హ!దైవమా!యేమి యీ గతిపెట్టితివని తల్లిదండ్రి దుఃఖపడి తలుపువేసి పిల్లవానిని భద్రపరచివచ్చి దుఃఖపడుచు ఇంటివద్దనుండిరి... ఉదయమున అత్తగారు కోడండ్ల ఇంటికి వచ్చి చూడగా అందరు కుమార్లు కోడండ్రు మహసంతోషముగా నుండిరి. కాని కడపటి కుమారుడు కోడలు మాత్రము విచారముగా నుండిరి... వారివలన సంగతి యావత్తు తెలిసికొని విచారించివెళ్ళెను.. అటులనే యేడు సంవత్సరములు భక్తిలేని పనులు చేసేసరికి యేడుగురు కుమారులు చనిపోయిరి. యేడవసంవత్సరంబున చనిపోయిన కుర్రవానిని శ్మశానమందు భద్రపరచి మన ఇల్లు ఎందుకు సంసారమెందుకని విసికి పోవుచుండగా విశేషముగా గాలి వర్షము వల్ల చీకాకుపడి ఉజ్జయినీ మహంకాళి ఆలయం చెంత నిలబడిరి.. లోపల మహంకాళి భక్తుల చేత ఇవ్వబడ్డ భక్ష్యభోజ్యములు దూతలు సహితము గా వినియెాగపరుచుచుండే సమయమున మాయుభయులు ఇట్లు చేరి వుండుటెరింగి దూతను పంపి లోపలికి తెప్పించి ఈ నడురేయుని మీరిట్లు వచ్చుట కేమికారణము అని అడుగగా వారి వర్తమానమంతయు సవిస్తరంగా మనవి చేసి కొనిరి.. అప్పుడా దేవి కనికరించి నీవు దుర్మార్గురాలవు నీవు భక్తి లేకుండా మనస్సు మెత్తనచెేసికొని కూడని పనులుచేస్తివి గనుక నీకీగతి సంభవించింది.ఆలువను నీయందు కనికరము కలిగినది కనుక యెక్కడెక్కడ యేడుగురిని పాతిపెట్టితివో యేడుగోతులు కనుపరచుమని బంగారుపడ్డల పల్లకినెక్కి దూతలు వెంటనడువ రుద్రభూమికి వెళ్లి యేడు గోతులమీద అక్షతలుచల్లి బంగారు కలశంతో జలము చల్లి వెండి బెత్తముతో నొకదెబ్బకొట్టగా యేడుగురు కొడుకులు ఆడేవాడొకడు యెగిరేవాడొకడు పాకేవాడొకడు అమ్మా ఆకలే అనే వాడొకడు, మువ్వలవాడొకడు గజ్జలవాడొకడు ఇట్లు యేడుగురు కొడుకులు సజీవులగుటజూచి తల్లితండ్రి చాలా ఆశ్చర్యమునుపొంది ఆమెను అనేకవిధముల స్తోత్రము చేసిరి.. దేవి వారిని జూచి ఇకనైనాను మహభక్తితో నీ వ్రతమును చేయమని ఆజ్ఞాపించి అంతర్ధానము పొందెను.. పిల్లలను వెంటబెట్టుకొని ఇంటికి వచ్చి పుల్లగుమ్మడి ఆకుల లోని ప్రసాదము యేడుగురుకిచ్చి పిమ్మట సశేషమును వారుభయులు తినిరి.. ఉదయమున లేచి అత్తగారు మాములు ప్రకారము యేడిండ్లకు వచ్చేటప్పటికి కడసారపు కోడలు కుమారుడు పిల్లలతో మహనందముగా నుండుట జూచి ఆశ్చర్యమునొంది జరిగిన సవిస్తరముగా వారివల్లవిని చాలా సంతోషించినది.గనుక వారు పట్టిన నోమునే నీవు పట్టినావు భక్తితప్పినా ఫలము తప్పరాదు...కధలోపమైనా వ్రతం లోపం కారాదు....

కామెంట్‌లు లేవు: